Isaiah - యెషయా 8 | View All

1. మరియయెహోవా నీవు గొప్పపలక తీసికొని మహేరు షాలాల్‌, హాష్‌ బజ్‌1, అను మాటలు సామాన్య మైన అక్షరములతో దానిమీద వ్రాయుము.

“మహేర్ షాలాల్ హష్‌బజు”– అనే హీబ్రూ పదాలకు అర్థం “త్వరగా దోపిడీకి, వేగంగా కొల్లసొమ్ముకు వెళ్ళడం”. అష్షూరువారు సిరియానూ, ఉత్తర రాజ్యమైన ఇస్రాయేల్‌నూ ఓడించడానికి ఈ మాట సూచన (వ 4; యెషయా 5:26, యెషయా 5:30; యెషయా 7:16). నాయకులు, ప్రజలు దీన్ని గమనించేలా ఈ విధంగా ఉలిక్కిపడేలా చేసే రీతిలో దీన్ని చెప్పడం జరిగింది. ఈ సంభవాలు జరగకముందు యూదాలో ఇద్దరు ప్రముఖులు ఈ భవిష్యద్వాక్కును గురించి సాక్షులుగా ఉన్నారు.

2. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఊరియాను యెబెరెక్యాయు కుమారుడైన జెకర్యాను సాక్షులనుగా పెట్టెదనని నాతో చెప్పగా

3. నేను ప్రవక్త్రి యొద్దకు పోతిని; ఆమె గర్భవతియై కుమారుని కనగా యెహోవా అతనికి మహేరు షాలాల్‌ హాష్‌ బజ్‌2 అను పేరు పెట్టుము.

దేవుడు తనకు వెల్లడి చేసిన దానిని ప్రజల మనసుకు హత్తుకొనేలా చెప్పగలిగేందుకు యెషయా తన కొడుకుకు “మహేర్ షాలాల్ హష్‌బజు” అనే పేరు పెట్టాడు. ఇక్కడ యెషయా భార్యను ప్రవక్త్రి అనడం కనిపిస్తుంది. ఇది యెషయా 7:14 కు పాక్షిక నెరవేర్పు అని కొందరు విధ్వాంసుల నమ్మకం. అయితే ఇందుకు ఆధారాలేవీ లేవు.

4. ఈ బాలుడునాయనా అమ్మా అని అననేరక మునుపు అష్షూరురాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తికొని పోవుదురనెను.

“అష్షూరు”– 2 రాజులు 15:19 నోట్.

5. మరియయెహోవా ఇంకను నాతో ఈలాగు సెలవిచ్చెను

6. ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనునుబట్టియు రెమల్యా కుమారునిబట్టియు సంతోషించుచున్నారు.

“ఈ ప్రజలు”– యూదాలోని జెరుసలం ప్రజలు. “షిలోహు”– జెరుసలంలో ఉన్న అతి పెద్ద నీటి ఊట అయి ఉండవచ్చు. దేవుడు తన అనుగ్రహం చొప్పున వారికి ఇచ్చిన శాంతి భద్రతలకు ఇది చిహ్నం. యూదాపైకి దాని ఇద్దరు శత్రువులు అంటే ఇస్రాయేల్, సిరియా దండెత్తి వచ్చినప్పుడు దేవుని పై నమ్మకం పెట్టుకోక అష్షూరువారు తమను కాపాడాలని వారు చూశారు (2 రాజులు 16:7-9).

7. కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసునది విస్తార జలములను, అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారిమీదికి రప్పించును; అవి దాని కాలువలన్నిటిపైగా పొంగి ఒడ్డు లన్నిటిమీదను పొర్లి పారును.

తమను ఏ దేశమైతే ఆదుకుంటుందని యూదావారు ఆశించారో ఆ దేశాన్నే యూదావారి అపనమ్మకాన్నీ దుర్మార్గతనూ శిక్షించేందుకు దేవుడు వాడుకోవాలని నిశ్చయించాడు. భూమిని వరద నీళ్ళు కప్పినట్టు అష్షూరువారు యూదాపైకి వచ్చిపడుతారు.

8. అవి యూదా దేశములోనికి వచ్చి పొర్లి ప్రవహించును; అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలూ, పక్షి తన రెక్కలు విప్పునప్పటివలె దాని రెక్కల వ్యాప కము నీ దేశ వైశాల్య మంతటను వ్యాపించును.
మత్తయి 1:23

“మెడ”– అష్షూరు వరద యూదాను, జెరుసలంను పూర్తిగా ముంచివెయ్యదు. “నీళ్ళు” మెడలోతు వరకు మాత్రమే వస్తుంది. తలకు పైగా రాదు. అష్షూరువారు జెరుసలంను ముట్టడించారు గానీ కంగారు కంగారుగా మరలిపోయారు (యెషయా 37 అధ్యాయం చూడండి). “ఇమ్మానుయేలు”– యెషయా 7:14. ఇక్కడ ఇమ్మానుయేలు అంటే రాబోయే అభిషిక్తుడు, దేవుని కుమారుడు. దేవుడు మనకు తోడు అని భావం. యూదా ఆయన దేశం.

9. జనులారా, రేగుడి మీరు ఓడిపోవుదురు; దూరదేశస్థులారా, మీరందరు ఆలకించుడి మీరు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు.

ఈ మాటలను చెప్తున్నది యూదా శత్రువులతో “దేవుడు మాతో ఉన్నాడు” అనేందుకు హీబ్రూలో ఒక్క పదం సరిపోతుంది. ఆదికాండము 7:14; ఆదికాండము 8:8 లో ఉన్న ఇమ్మానుయేలు అనే పదం. దేవుడు మనతో ఉంటే, అభిషిక్తుడు మన పక్షాన ఉంటే, శత్రువులు మనలనేమి చెయ్యగలరు? కీర్తనల గ్రంథము 56:9; కీర్తనల గ్రంథము 118:6; యిర్మియా 20:11; రోమీయులకు 8:31-34; హెబ్రీయులకు 13:6 చూడండి.

10. ఆలోచన చేసికొనినను అది వ్యర్థమగును మాట పలికినను అది నిలువదు. దేవుడు మాతోనున్నాడు.
మత్తయి 1:23

11. ఈ జనులమార్గమున నడువకూడదని యెహోవా బహు బలముగా నాతో చెప్పియున్నాడు; నన్ను గద్దించి యీ మాట సెలవిచ్చెను

“బలీయమైన చెయ్యి”– అంటే తాను నియమించిన వానికి దేవుని సన్నిధి, సహకారం, ప్రేరణ తోడుగా ఉంటాయన్న మాట. యెహెఙ్కేలు 1:3; యెహెఙ్కేలు 3:14, యెహెఙ్కేలు 3:22; యెహెఙ్కేలు 37:1; యెహెఙ్కేలు 40:1. “అనుసరించకూడదని”– ప్రవాహంతో బాటు కొట్టుకు పోవడం తేలికే, ఎదిరించడమే దుర్లభం. అపనమ్మకస్థులైన దుష్ట తరంవారికి ఎదురు నిలవగలిగేందుకు యెషయాకు దేవుని బలిష్ఠమైన బాహువు అండ కావాలి.

12. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకొనకుడి వారు భయపడుదానికి భయపడకుడి దానివలన దిగులు పడకుడి.
1 పేతురు 3:14-15

దేవుడంటే భయభక్తులున్నవారు మనుషులకు భయపడనక్కర్లేదు. దేవునిపట్ల భయభక్తుల పై నోట్స్ చూడండి – ఆదికాండము 20:11; కీర్తనల గ్రంథము 34:11-14; కీర్తనల గ్రంథము 111:10; సామెతలు 1:7.

13. సైన్యములకధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడను కొనుడి మీరు భయపడవలసినవాడు ఆయనే, ఆయన కోసరమే దిగులుపడవలెను అప్పుడాయన మీకు పరిశుద్ధస్థలముగా నుండును.
1 పేతురు 3:14-15

14. అయితే ఆయన ఇశ్రాయేలుయొక్క రెండు కుటుంబ ములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండును
రోమీయులకు 9:32, మత్తయి 21:44, లూకా 2:34, 1 పేతురు 2:8

దేవునిపట్ల భయభక్తులు కలిగి ఆయనలో నమ్మకం పెట్టుకున్నవారికి ఆయన ఆశ్రయం. అలా చెయ్యనివారిని పతనానికీ, శత్రువులకూ ఆయన అప్పగిస్తాడు. ఈ వచనంలో కొంత భాగాన్ని క్రొత్త ఒడంబడిక గ్రంథంలో ఎత్తి రాశారు. రోమీయులకు 9:33; 1 పేతురు 2:8 చూడండి.

15. అనేకులు వాటికి తగిలి తొట్రిల్లుచు పడి కాళ్లు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు.
మత్తయి 21:44, లూకా 2:34, 1 పేతురు 2:8

16. ఈ ప్రమాణవాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యుల కప్పగింపుము.

ఈ మాటలు పలుకుతున్నది ఎవరు? తేల్చి చెప్పడం కష్టం. 16వ వచనం వరకు యెహోవా పలుకులు ఉన్నాయి. 17లో మాట్లాడుతున్న వ్యక్తి తాను యెహోవా కోసం కనిపెడుతున్నానంటున్నాడు. యెషయా తన గురించి తానే మాట్లాడుతున్నాడా? 17 వ వచనం ఆఖరు భాగాన్నీ, 18వ వచనం మొదటి భాగాన్నీ హెబ్రీయులకు 2:12-13 లో యేసు ప్రభువును గురించి ఎత్తి రాశారు. అలాగైతే యెషయా ద్వారా ఈ మాటలన్నిటినీ పలుకుతున్నది రాబోయే అభిషిక్తుడా? లేక ఈ మాటలకు యెషయా రోజుల్లోనూ, క్రీస్తు వచ్చినప్పుడూ కూడా నెరవేరే రెండు విధాలైన నెరవేర్పులు ఉన్నాయా? పాత ఒడంబడికలో దేవుని సేవకులు పలికే వాక్కుల్లో తరచుగా ఈ రహస్యం ఉంది: వారి మాటలు ఒక్కోసారి వారిని గురించినవే అన్నట్లు కనిపిస్తాయి గాని వారినలా పలికించిన క్రీస్తు ఆత్మ వాటిని క్రీస్తును గురించి పలికించాడు. ఉదాహరణకు 16, 40, 41, 69, 72 మొదలైన కీర్తనలు చూడండి. ఈ మాటలు పలుకుతున్నదెవరన్న విషయం పై మూడు రకాల అభిప్రాయాలున్నాయి. కొందరు తండ్రియైన దేవుడంటారు. మరికొందరు అవతారమెత్తబోతున్న క్రీస్తు అంటారు. మరి కొందరు యెషయా అంటారు. ఎలా చూచినా అర్థం ఒకటే. యెషయా ద్వారా దేవుడు వెల్లడిస్తున్నదాన్ని విశ్వాసుల ప్రయోజనార్థం ఉంచి భద్రపరచాలి.

17. యాకోబు వంశమునకు తన ముఖమును మరుగుచేసి కొను యెహోవాను నమ్ముకొను నేను ఎదురుచూచు చున్నాను ఆయనకొరకు నేను కనిపెట్టుచున్నాను.
హెబ్రీయులకు 2:13

“ముఖం కనబడకుండా”– కోపానికీ, ప్రతికూలతకూ గుర్తు (కీర్తనల గ్రంథము 13:1; కీర్తనల గ్రంథము 27:9; కీర్తనల గ్రంథము 30:7; కీర్తనల గ్రంథము 69:17; యెషయా 1:17).

18. ఇదిగో, నేనును, యెహోవా నా కిచ్చిన పిల్లలును, సీయోను కొండమీద నివసించు సైన్యముల కధిపతియగు యెహోవావలని సూచనలుగాను, మహత్కార్యములు గాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము.
హెబ్రీయులకు 2:13

ఈ మాటలు యెషయా, క్రీస్తు ఇద్దరి విషయంలోనూ సత్యమే. అయితే హెబ్రీయులకు 2:13 లో ఉన్నదాని ప్రకారం ముఖ్యంగా ఇది క్రీస్తుకే చెందినది. యెషయా 8:4; యెషయా 7:3 ను బట్టి యెషయాకు కూడా ఇది సంబంధించినదని భావించవచ్చు. అతని ఇద్దరు కుమారుల పేర్లు కూడా భవిష్యత్తులోని సంభవాలను సూచించేవే.

19. వారు మిమ్మును చూచికర్ణపిశాచిగలవారియొద్దకును కిచకిచలాడి గొణుగు మంత్రజ్ఞులయొద్దకును వెళ్లి విచారించు డని చెప్పునప్పుడు జనులు తమ దేవునియొద్దనే విచారింప వద్దా? సజీవులపక్షముగా చచ్చిన వారియొద్దకు వెళ్ల దగునా?
లూకా 24:5

చనిపోయినవారి ఆత్మలను సంప్రదింపజూచేవారి గుసగుసలకూ లోలోపల వారు చేసే వల్లింపులకూ, దేవుని వాక్కు అనే పవిత్రమైన మాటలకూ మధ్యగల తేడా ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కర్ణపిశాచం, బాణామతి తదితర అంశాల గురించి ద్వితీయోపదేశకాండము 18:9-15 చూడండి. బైబిల్లోని దేవుని వాక్కును మీరి పలికేవాడికి ఆత్మ సంబంధమైన వివేచన, గ్రహింపు లేవన్నమాట.

20. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచా రించుడి; ఈ వాక్యప్రకారము వారు బోధించనియెడల వారికి అరుణోదయము కలుగదు.

21. అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశసంచారము చేయుదురు. ఆకలి గొనుచు వారు కోపపడి తమ రాజు పేరను తమ దేవుని పేరను శాపములు పలుకుచు మీద చూతురు;

యెషయా కాలంలో దేశం మీదికి దేవుని తీర్పు రానుంది, భావికాలంలో లోకమంతటిపైకీ రానున్నది. దేవుడు వెల్లడించినదాన్ని నమ్మక దానికి లోబడనివారు ఇక్కడ వర్ణించిన భయంకర స్థితిలో పడిపోతారు.

22. భూమి తట్టు తేరి చూడగా బాధలును అంధకారమును దుస్సహ మైన వేదనయు కలుగును; వారు గాఢాంధకారములోనికి తోలివేయబడెదరు.
ప్రకటన గ్రంథం 16:10

“గాఢాంధకారం”– మత్తయి 22:13; మత్తయి 25:30; 2 పేతురు 2:17; యూదా 1:13. దేవుని వాక్కులోని వెలుగును నిరాకరించేవారికి గాఢాంధకారమనే శిక్ష పడుతుందని మరోసారి ఇక్కడ చూస్తున్నాం (మత్తయి 8:12; మత్తయి 22:13; మత్తయి 15:30; 2 పేతురు 2:4; యూదా 1:13). “త్రోసివేయడం”– ప్రకటన గ్రంథం 16:9, ప్రకటన గ్రంథం 16:11, ప్రకటన గ్రంథం 16:21 చూడండి.Shortcut Links
యెషయా - Isaiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |