ఈ మాటలు పలుకుతున్నది ఎవరు? తేల్చి చెప్పడం కష్టం. 16వ వచనం వరకు యెహోవా పలుకులు ఉన్నాయి. 17లో మాట్లాడుతున్న వ్యక్తి తాను యెహోవా కోసం కనిపెడుతున్నానంటున్నాడు. యెషయా తన గురించి తానే మాట్లాడుతున్నాడా? 17 వ వచనం ఆఖరు భాగాన్నీ, 18వ వచనం మొదటి భాగాన్నీ హెబ్రీయులకు 2:12-13 లో యేసు ప్రభువును గురించి ఎత్తి రాశారు. అలాగైతే యెషయా ద్వారా ఈ మాటలన్నిటినీ పలుకుతున్నది రాబోయే అభిషిక్తుడా? లేక ఈ మాటలకు యెషయా రోజుల్లోనూ, క్రీస్తు వచ్చినప్పుడూ కూడా నెరవేరే రెండు విధాలైన నెరవేర్పులు ఉన్నాయా? పాత ఒడంబడికలో దేవుని సేవకులు పలికే వాక్కుల్లో తరచుగా ఈ రహస్యం ఉంది: వారి మాటలు ఒక్కోసారి వారిని గురించినవే అన్నట్లు కనిపిస్తాయి గాని వారినలా పలికించిన క్రీస్తు ఆత్మ వాటిని క్రీస్తును గురించి పలికించాడు. ఉదాహరణకు 16, 40, 41, 69, 72 మొదలైన కీర్తనలు చూడండి. ఈ మాటలు పలుకుతున్నదెవరన్న విషయం పై మూడు రకాల అభిప్రాయాలున్నాయి. కొందరు తండ్రియైన దేవుడంటారు. మరికొందరు అవతారమెత్తబోతున్న క్రీస్తు అంటారు. మరి కొందరు యెషయా అంటారు. ఎలా చూచినా అర్థం ఒకటే. యెషయా ద్వారా దేవుడు వెల్లడిస్తున్నదాన్ని విశ్వాసుల ప్రయోజనార్థం ఉంచి భద్రపరచాలి.