Jeremiah - యిర్మియా 44 | View All

1. మిగ్దోలులోగాని తహపనేసులోగాని నొపులోగాని పత్రోసులోగాని ఐగుప్తుదేశవాసము చేయుచున్న యూదులనందరినిగూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

1. యిర్మీయాకు యెహోవా నుండి ఒక సందేశం వచ్చింది. ఆ వర్తమానం ఈజిప్టులో నివసిస్తున్న యూదా వారందరి కొరకు ఉద్దేశించబడింది. ఈ వర్తమానం మిగ్దోలు, తహపనేసు, నొపు పట్టణాలలోను మరియు దక్షిణ ఈజిప్టులోను నివసిస్తున్న యూదా వారికై ఇవ్వబడింది. ఆ సందేశం ఇలా ఉంది:

2. నేను యెరూషలేము మీదికిని యూదా పట్టణములన్నిటి మీదికిని రప్పించిన కీడంతయు మీరు చూచుచునే యున్నారు.

2. ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయన యెహోవా ఇలా చెప్పుచున్నాడు, “యెరూషలేము నగరం మీదికి, యూదా పట్టణాలన్నిటి మీదికి నేను రప్పించిన భయంకర విపత్తులను మీరంతా చూశారు. ఆ పట్టణాలన్నీ ఈనాడు వట్టి రాళ్ల గుట్టల్లా వున్నాయి.

3. మీరైనను మీ పితరులైనను ఎరుగని అన్యదేవతలను అనుసరించుచు పూజించుచు వాటికి ధూపము వేయుచు వచ్చుటవలన వాటి నివాసులు తాము చేసికొనిన దోషముచేత నాకు కోపము పుట్టించిరి గనుక నేడు నివాసులులేకుండ అవి పాడుపడి యున్నవి గదా.

3. ప్రజలంతా పాపకార్యాలు చేయుటవల్లనే ఆ ప్రదేశాలన్నీ నాశనమయ్యాయి. ఆ ప్రజలు అన్యదేవతలకు బలులు అర్పించారు. అది నాకు కోపకారణమయ్యింది! గతంలో మీ ప్రజలు మీ పూర్వీకులు ఆ అన్యదేవతలను ఎరుగరు; ఆరాధించలేదు.

4. మరియు నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరిని మీయొద్దకు పంపుచు, నాకసహ్యమైన యీ హేయకార్యమును మీరు చేయకుండుడి అని నేను చెప్పుచువచ్చితిని గాని

4. ఆ ప్రజల వద్దకు నా ప్రవక్తలను అనేక పర్యాయాలు పంపి యున్నాను. ఆ ప్రవక్తలు నా సేవకులు. ఆ ప్రవక్తలు నా సందేశాన్ని ప్రజలకు చెప్పారు. ‘మీరీ భయంకరమైన పని చేయవద్దు. విగ్రహారాధన విషయమై మిమ్మల్ని నేను అసహ్యించు కుంటున్నట్లు’ వారు ప్రజలకు చెప్పారు.

5. వారు అలకింపక పోయిరి, అన్యదేవతలకు ధూపార్పణముచేయుట మానకపోయిరి, తమ దుర్మార్గతను విడువకపోయిరి చెవి యొగ్గకపోయిరి.

5. కాని ఆ ప్రజలు నా ప్రవక్తల మాట వినలేదు. ప్రజలసలు ప్రవక్తలను లక్ష్యపెట్టనేలేదు. ఆ ప్రజలు దుష్ట కార్యాలు చేయటం మానలేదు. అన్యదేవతలకు బలులు అర్పించటం వారు మానలేదు.

6. కావున నా ఉగ్రతయు నా కోపమును కుమ్మరింపబడి, యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను రగులుకొనెను, గనుక నేడున్నట్లుగా అవి పాడై యెడారి ఆయెను.

6. కావున వారి మీద నా కోపాన్నీ చూపించాను. యూదా పట్టణాలను, యోరూషలేము నగర వీధులను నేను శిక్షించాను. ఈనాడు అవి వున్నట్లుగా యోరూషలేము నగరాన్ని, యూదా పట్టణాలను పట్టి రాళ్ల గుట్టల్లా నా కోపం మార్చివేసింది.”

7. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యెహోవా ఈలాగు అజ్ఞ ఇచ్చుచున్నాడు ఏమియు శేషములేకుండ స్త్రీ పురుషులును శిశువులును చంటి బిడ్డలును యూదా మధ్య నుండ కుండ నిర్మూలము చేయబడునట్లుగా మీరేల ఈ గొప్ప తప్పిదమును మీకు విరోధముగా చేసికొనుచున్నారు?

7. ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా యిలా చెపుతున్నాడు, “విగ్రహారాధన చేస్తూ మిమ్మల్ని మీరు ఎందుకు బాధపెట్టుకుంటున్నారు? యూదా కుంటుంబం నుంచి పురుషులను, స్త్రీలను మరియు పిల్లలను, పసికందులను వేరు చేస్తున్నారు. ఆ విధంగా యూదా వంశంలో ఎవ్వరూ మిగలకుండా మీరు చేసుకుంటున్నారు.

8. మీకుమీరే సమూలనాశనము తెచ్చుకొనునట్లును, భూమి మీదనున్న జనములన్నిటిలో మీరు దూషణపాలై తిరస్కరింపబడునట్లును, మీరు కాపురముండుటకు పోయిన ఐగుప్తులో అన్యదేవతలకు ధూపార్పణము చేయుదురు. మీరేల యీలాగున చేయుచు మీ చేతిక్రియలచేత నాకు కోపము పుట్టించుచున్నారు?

8. విగ్రహాలను తయారు చేస్తూ మీరెందుకు నాకు కోపం కల్గించ దల్చుకున్నారు? ఇప్పుడు మీరు ఈజిప్టులో ఉన్నారు. మళ్లీ మీరిప్పుడు ఈజిప్టుకు చెందిన బూటకపు దేవతలకు బలులు సమర్పిస్తూ నాకు కోపం కల్గిస్తూ ఉన్నారు. మీకై మీరే మిమ్మల్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. కేవలం అది మీ తప్పే. ఇతర దేశాలవారు మిమ్మల్ని గూర్చి చెడుగా మాట్లాడతారు. ఈ భూమి మీద వున్న రాజ్యాలన్నీ మిమ్మల్ని హేళన చేస్తాయి.

9. వారు యూదాదేశములోను యెరూషలేము వీధుల లోను జరిగించిన క్రియలను అనగా మీ పితరులు చేసిన చెడుతనమును యూదా రాజులు చేసిన చెడుతనమును వారి భార్యలు చేసిన చెడుతనమును, మీమట్టుకు మీరు చేసిన చెడుతనమును మీ భార్యలు చేసిన చెడుతనమును మరచి పోతిరా?

9. మీ పూర్వీకులు చేసిన చెడుకార్యాలను మీరు మర్చిపోయారా? యూదా రాజులు, రాణులు చేసిన క్రూర కార్యాలు మీరు మర్చిపోయారా? మీరు, మీ భార్యలు కలసి యూదాలోను మరియు యెరూషలేము నగర వీధులలోను చేసిన చెడుకార్యాలు మర్చిపోయారా?

10. నేటివరకు వారు దీనమనస్సు ధరింపకున్నారు, భయము నొందకున్నారు, నేను మీకును మీ పితరులకును నియమించిన ధర్మశాస్త్రము నైనను కట్టడలనైనను అనుసరింపకయే యున్నారు.

10. ఈనాటికీ యూదా ప్రజలు తమ్ము తాము తగ్గించు కోలేదు. నాపట్ల గౌరవ భావమేమీ చూపలేదు. ఆ ప్రజలు నా బోధనలను అనుసరించలేదు. మీకు, మీ పితరులకు యిచ్చిన ధర్మశాస్త్రాన్ని వారు పాటించలేదు.”

11. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీకు కీడు చేయునట్లు,

11. కావున ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు, “మీకు భయంకరమైన విపత్తులు కలుగజేయటానికి నేను నిశ్చయించాను. యూదా వంశాన్నంతా నాశనం చేస్తాను!

12. అనగా యూదావారినందరిని నిర్మూలము చేయునట్లు, నేను మీకు అభిముఖుడనగుదును; ఐగుప్తు దేశములో కాపురముందుమని అచ్చటికి వెళ్ల నిశ్చయించుకొను యూదాశేషులను నేను తోడుకొని పోవుదును, వారందరు ఐగుప్తు దేశములోనే నశించెదరు; అల్పులేమి ఘనులేమి వారందరు కూలుదురు, ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను నశింతురు, ఖడ్గముచేతనైనను క్షామము చేతనైనను వారు చత్తురు, శాపాస్పదమును భీతి పుట్టించు వారుగాను దూషణపాలుగాను తిరస్కారము నొందిన వారుగాను ఉందురు.

12. యూదాలో బహు తక్కువమంది మిగిలారు. వారిక్కడ ఈజిప్టుకు వచ్చియున్నారు. కాని యూదా వంశంలో మిగిలిన ఆ కొద్దిమందినీ నేను నాశనం చేస్తాను. వారు కత్తివాతబడిగాని, ఆకలితోగాని చనిపోతారు. ఇతర దేశాలవారు వీరిని గురించి చెడుగా చెప్పుకునేలా వీరు తయారవుతారు. వీరికీ జరిగిన సంఘటనలను తలుచుకొని ఇతర దేశాలవారు భయభ్రాంతులవుతారు. ఆ ప్రజలు శాపానికి మారు పేరవుతారు. ఆ యూదా ప్రజలను ఇతర దేశీయులు అవమానపర్చుతారు.

13. యెరూషలేము నివాసులను నేనే లాగు శిక్షించితినో ఆలాగే ఐగుప్తుదేశములో నివసించు వీరిని ఖడ్గముచేతగాని క్షామముచేతగాని తెగులుచేతగాని శిక్షించెదను.

13. ఈజిప్టులో నివసించటానికి వచ్చిన వారిని నేను శిక్షిస్తాను. వారిని శిక్షించటానికి నేను కత్తిని, క్షామాన్ని, భయంకర రోగాలను వినియోగిస్తాను. యెరూషలేము నగరాన్ని శిక్షించిన విధంగానే ఆ ప్రజలను కూడ నేను శిక్షిస్తాను.

14. కావున తాము మరలి వచ్చి యూదాదేశములో కాపురముండవలెనన్న మక్కువచేత ఐగుప్తులో ఆగుటకై అక్కడికి వెళ్లు యూదా వారిలోని శేషము ఎవరును తప్పించుకొనరు, శేషమేమియు ఉండదు, పారి పోవువారు గాక మరి ఎవరును తిరిగిరారు.

14. యూదాలో బతికి బయటపడి ఈజిప్టులో నివసిస్తున్న కొద్ది మందిలో ఏ ఒక్కడూ నా శిక్షను తప్పించుకోలేడు. యూదాకు తిరిగి రావటానికి ఒక్కడు కూడా మిగలడు. వారు యూదాకు తిరిగివచ్చి మరల అక్కడ నివసించాలని కోరుకుంటారు. బహుశః తప్పించుకున్న బహు కొద్దిమంది తప్ప, వారిలో ఒక్కడు కూడ యెరూషలేముకు తిరిగి వెళ్లడు.”

15. అప్పుడు తమ భార్యలు అన్యదేవతలకు ధూపము వేయుదురని యెరిగియున్న పురుషులందరును, అక్కడ నిలిచియున్న స్త్రీలును,

15. ఈజిప్టులో నివసిస్తున్న చాలా మంది యూదా స్త్రీలు అన్యదేవతలను ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తున్నారు. అది వారి భర్తలకు తెలుసు. అయినా వారు వారిని వారించలేదు. ఆ ప్రజలు పెద్ద గుంపుగా కలుసుకొన్నారు. వారిలో దక్షిణ ఈజిప్టులో నివసిస్తున్న యూదా ప్రజలున్నారు. అన్యదేవతలకు నైవేద్యాలు అర్పిస్తున్న స్త్రీల భర్తలు యిర్మీయాతో ఇలా అన్నారు:

16. మహా సమాజముగా కూడిన వారును ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరును యిర్మీయాకు ఈలాగు ప్రత్యుత్తర మిచ్చిరి యెహోవా నామమునుబట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేమంగీకరింపము,

16. “నీవు మాకు చెపుతున్న యెహోవా సందేశాన్ని మేము వినం.

17. మేము నీతో చెప్పిన సంగతులన్నిటిని నిశ్చయముగా నెరవేర్చ బోవుచున్నాము; మేమును మా పితరులును మా రాజులును మా యధిపతులును యూదా పట్టణములలోను యెరూషలేము వీధుల లోను చేసినట్లే ఆకాశరాణికి ధూపము వేయుదుము, ఆమెకు పానార్పణములు అర్పింతుము; ఏలయనగా మేము ఆలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను, మేము క్షేమముగానే యుంటిమి, యే కీడును మాకు కలుగలేదు.

17. ఆకాశ రాణికి ధూప నైవేద్యాలు సమర్పిస్తామని మేము మొక్కుకున్నాము. మేము మొక్కుకున్న విధంగా అంతా చేస్తాము. ఆమెకు పూజలో బలులు అర్పించి, పానార్పణ సమర్పిస్తాము. గతంలో మేమలా చేశాం. గతకాలంలో మా పూర్వీకులు, మా రాజులు, మా అధికారులు అలా చేశారు. యూదా పట్టణాలలోను, యెరూషలేము నగర వీధులలోను మేమంతా అలా చేశాం. ఆకాశ రాణిని మేము ఆరాధించినపుడు మాకు పుష్కలంగా ఆహారం దొరికింది. మాకు విజయం చేకూరింది. మాకు ఏ కీడూ సంభవించలేదు.

18. మేము ఆకాశరాణికి ధూపము వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటినుండి సమస్తము మాకు తక్కువైనది, మేము ఖడ్గముచేతను క్షామముచేతను క్షీణించుచున్నాము.

18. కాని మేము ఆకాశ రాణికి పానీయాలు సమర్పించటం మానివేశాం. ఆమె పూజలో ఇవన్నీ మేము చేయటం మానినప్పటి నుండి మాకు అనేక సమస్యలు వచ్చాయి. మా ప్రజలు కత్తులచేత, ఆకలిచేత చంపబడ్డారు.”

19. మేము ఆకాశ రాణికి ధూపము వేయగాను, ఆమెకు పానార్పణములు అర్పింపగాను, మా పురుషుల సెలవులేకుండ ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా? ఆమెకు పానార్పణములు పోయుచున్నామా? అని వారు చెప్పగా

19. తరువాత స్త్రీలు మాట్లాడారు . వారు యిర్మీయాతో యిలా చెప్పారు, “మేము ఏమి చేస్తున్నామో మా భర్తలకు తెలుసు. ఆకాశ రాణికి ధూప నైవేద్యాలు అర్పించుటకు మా భర్తల అనుమతి పొందాము. వారి అనుమతితోనే మేము ఆమెకు పానీయాలు వారబోశాము. ఆమె ప్రతిరూపంగా మేము కుడుములు చేయటం కూడ మా భర్తలకు తెలుసు.”

20. యిర్మీయా ఆ స్త్రీ పురుషులందరితో, అనగా తనకు అట్లు ప్రత్యుత్తర మిచ్చిన ప్రజలందరితో ఇట్లనెను

20. పిమ్మట యిర్మీయా ఆ స్త్రీ పురుషులతో మాట్లాడాడు. ఈ విషయాలన్నీ చెప్పిన ఆ ప్రజలతో అతడు మాట్లాడినాడు.

21. యూదాపట్టణముల లోను యెరూషలేము వీధులలోను మీరును మీ పితరులును మీ రాజులును మీ యధిపతులును దేశప్రజలును ధూపము వేసిన సంగతి యెహోవా జ్ఞాపకముచేసికొనలేదా? అదే గదా ఆయన మనస్సునకు వచ్చెను.

21. ఆ ప్రజలతో యిర్మీయా ఇలా అన్నాడు: “యూదా పట్టణాలలోను, యెరూషలేము నగరంలోను మీరు ఈ దేవతలకు చేసిన బలి అర్పణలు యెహోవా గుర్తుపెట్టుకున్నాడు. మీరు, మీ పితరులు, మీ రాజు, మీ అధికారులు మరియు దేశంలో ఇతర ప్రజలు ఆ పనులు చేశారు. మీరు చేసిన పనిని యెహోవా గుర్తుపెట్టుకొని దానిని గురించి ఆలోచన చేశాడు.

22. యెహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు హేయకృత్యములను ఎంచి యికను సహింపలేకపోయెను గనుక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను ఎడారిగాను శాపాస్పదముగాను నిర్జనము గాను ఆయన చేసెను.

22. తరువాత యెహోవా మీపట్ల ఎంతమాత్రం ఓర్పు వహించ లేకపోయాడు. మీరు చేసిన భయంకరమైన పనులను యెహోవా అసహ్యించుకున్నాడు. అందువల్ల యెహోవా మీ దేశాన్ని వట్టి ఎడారిగా మార్చి వేశాడు. అక్కడ ఇప్పుడు ఎవ్వడూ నివసించడు. అన్యులు ఆ రాజ్యాన్ని గురించి చెడ్డగా చెప్పుకుంటారు.

23. యెహోవా మాట వినక, ఆయన ధర్మశాస్త్రమునుబట్టియు కట్టడలనుబట్టియు ఆయన తనకు సాక్ష్యార్థముగా ఇచ్చిన ఆజ్ఞనుబట్టియు నడువక, మీరు ధూపమువేయుచు యెహోవాకు విరోధముగా పాపము చేసితిరి గనుకనే నేడున్నట్లుగా ఈ కీడు మీకు సంభవించెను.

23. అన్య దేవతలకు మీరు బలులు అర్పించిన కారణంగా మీకు కష్టాలన్నీ వచ్చాయి. మీరు యెహోవా పట్ల పాపం చేశారు. మీరు యెహోవాకు విధేయులై వుండలేదు. మీకు అందజేసిన ఆయన ఆదేశాలనుగాని, ఆయన నిర్దేశించిన న్యాయసూత్రాలను గాని మీరు అనుసరించలేదు. దేవుని ఒడంబడికలో మీ బాధ్యతను మీరు విస్మరించారు.”

24. మరియయిర్మీయా ప్రజలనందరిని స్త్రీలనందరిని చూచి వారితో ఇట్లనెను ఐగుప్తులోనున్న సమస్తమైన యూదులారా, యెహోవా మాట వినుడి.

24. తరువాత ప్రజలందరినీ ఉద్దేశించి యిర్మీయా ఇలా చెప్పాడు: “ఇప్పుడు ఈజిప్టులో ఉన్న యూదా ప్రజలారా, యెహోవా వాక్కు వినండి:

25. ఇశ్రాయేలు దేవుడును, సైన్యములకధిపతియునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఆకాశరాణికి ధూపము వేయుదు మనియు, ఆమెకు పానార్పణములు అర్పింతుమనియు, మేము మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను నిశ్చయముగా నెరవేర్చుదుమనియు మీరును మీ భార్యలును మీ నోటితో పలికి మీ చేతులతో నెరవేర్చుచున్నారే; నిజముగానే మీ మ్రొక్కుబళ్లను మీరు మ్రొక్కుదురు, నిజముగానే మీ మ్రొక్కులను మీరు నెరవేర్తురు.

25. ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా చెప్తున్నాడు, ‘మీరు మరియు మీ భార్యలు ఏమి చేస్తామని చెప్పినారో అది చేశారు. ఆకాశ రాణికి “మేము మొక్కుకున్న బలులు అర్పిస్తాము, పానీయాలు వారపోస్తాము” అని మీరన్నారు. అయితే అలాగే చేయండి. మీమాట ప్రకారం మీరు చేస్తామన్న పనులు చేయండి. మీ వాగ్దానాలను మీరు నిలబెట్టుకోండి.

26. కాబట్టి ఐగుప్తులో నివసించు సమస్తమైన యూదులారా, యెహోవామాటవినుడియెహోవా సెలవిచ్చునదేమనగా ప్రభువగు యెహోవా అను నేను నా జీవముతోడు ప్రమాణము చేయుచు, ఐగుప్తులో నివసించు యూదు లలో ఎవరును ఇకమీదట నా నామము నోట పలకరని నా ఘనమైన నామముతోడు నేను ప్రమాణము చేయు చున్నాను.

26. కాని, ఈజిప్టులో నివసిస్తున్న ఓ యూదా ప్రజలారా యెహోవా సందేశాన్ని వినండి: మహిమగల నా పేరు మీద ఈ ప్రమాణం చేస్తున్నాను: ఇప్పుడు ఈజిప్టులో నివసిస్తున్న యూదా వారిలో ఒక్కడు కూడ మరెన్నడూ నా పేరు మీద వాగ్దానాలు చేయడు. “నిత్యుడైన యెహోవా సాక్షిగా’ అని వారు చెప్పరు.

27. మేలు చేయుటకు కాక కీడుచేయుటకే నేను వారిని కనిపెట్టుచున్నాను; వారు ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను క్షీణించిపోవుచు, ఐగుప్తుదేశములోనున్న యూదావారందరు శేషములేకుండ చత్తురు.

27. “‘ఆ యూదా ప్రజలను నేను గమనిస్తున్నాను. కాని వారి సంక్షేమం కొరకు నేను వారిని గమనించటం లేదు. వారిని దెబ్బ కొట్టటానికే నేను కనిపెట్టుకునివున్నాను. ఈజిప్టులో వున్న యూదా వారు ఆకలితో మాడి చనిపోతారు. కత్తులతో నరకబడి చనిపోతారు. వారలా క్రమేపీ ఒకరి తరువాత ఒకరు అందరూ ముగిసేవరకు చనిపోతారు.

28. ఖడ్గము తప్పించుకొనువారు కొద్దిమందియై ఐగుప్తుదేశములో నుండి యూదాదేశమునకు తిరిగి వచ్చెదరు, అప్పడు ఐగుప్తుదేశములో కాపురముండుటకు వెళ్లిన యూదా వారిలో శేషము ఎవరి మాట నిలకడగా నుండునో, నాదో తమదో అది తెలిసికొందురు.

28. కొంతమంది యూదావారు కత్తివాతబడకుండా తప్పించుకుంటారు. వారు ఈజిప్టునుండి యూదాకు తిరిగి వస్తారు. అలా తప్పించుకోగలిగే యూదా వారు బహు తక్కువ మంది మాత్రమే. ఈజిప్టులో నివసించటానికి వచ్చి బ్రతికి బయటపడే ఆ బహు కొద్ది మంది యూదా వారు ఎవరి మాట నిజమవుతుందో తెలుసుకుంటారు. నా మాట నిజమయ్యినదో, వారి మాట నిజమయ్యినదో వారప్పుడు తెలుసుకుంటారు.

29. మీకు కీడు సంభవించు నట్లుగా నా మాటలు నిశ్చయముగా నిలుచునని మీకు తెలియబడుటకును, నేను ఈ స్థలమందు మిమ్మును శిక్షించు చున్నందుకును ఇది మీకు సూచనగా నుండును; ఇదే యెహోవా వాక్కు.

29. ఇక్కడ ఈజిప్టులో మిమ్మల్ని నేను శిక్షిస్తానని తెలిసేటందుకు ఒక నిదర్శనం ఇస్తాను.’ ఇదే యెహోవా వాక్కు. ‘అప్పుడు మిమ్మల్ని శిక్షిస్తానని నేను చేసిన ప్రమాణం నిజమవుతుందని మీకు నిశ్చయంగా తెలుస్తుంది.

30. అతనికి శత్రువై అతని ప్రాణమును తీయ జూచుచుండిన నెబుకద్రెజరను బబులోను రాజుచేతికి నేను యూదారాజైన సిద్కియాను అప్పగించినట్లు ఐగుప్తురాజైన ఫరోహొఫ్రను అతని శత్రువులై అతని ప్రాణమును తీయజూచువారి చేతికి అప్పగించెదను.

30. నేను చెప్పినది చేస్తాననేందుకు ఇది ఒక నిదర్శనం.’ యెహోవా ఇలా తెలియజేస్తున్నాడు: ‘ఫరొహొఫ్ర ఈజిప్టుకు రాజు. శత్రువులు అతనిని చంపజూస్తున్నారు ఫరోహొఫ్రను అతని శత్రువులకు నేనప్పగిస్తాను. సిద్కియా యూదా రాజు. సిద్కియా శత్రువు నెబుకద్నెజరు. సిద్కియాను నేనతని శత్రువుకు అప్పగించాను. అదే రీతిగా ఫరోహొఫ్రను నేనతని శత్రువుకు అప్పగిస్తాను.’ “



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Jeremiah - యిర్మియా 44 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ఈజిప్టులోని యూదులు విగ్రహారాధనలో కొనసాగుతున్నారు. (1-14) 
యూదా నాశనానికి దారితీసిన అతిక్రమణలను దేవుడు యూదు ప్రజలకు గుర్తుచేస్తాడు. పాపం యొక్క ప్రమాదం గురించి వ్యక్తులను హృదయపూర్వకంగా హెచ్చరించడం మన బాధ్యత: "దయచేసి, దాని నుండి దూరంగా ఉండండి!" మీరు దేవుని పట్ల గాఢమైన ప్రేమను కలిగి ఉంటే, దానిని నివారించండి, ఎందుకంటే అది ఆయనకు అవమానకరం. మీరు మీ స్వంత ఆత్మలను గౌరవిస్తే, స్పష్టంగా ఉండండి, ఎందుకంటే అది వారిపై వినాశనం కలిగిస్తుంది. ప్రలోభాల సమయంలో మీ మనస్సాక్షి మార్గదర్శకంగా ఉండనివ్వండి. దేవుడు కల్దీయుల దేశంలోకి పంపిన యూదులు దైవానుగ్రహంతో విగ్రహారాధన నుండి విముక్తి పొందారు. అయితే, ఇష్టపూర్వకంగా ఈజిప్షియన్ల దేశంలోకి ప్రవేశించిన వారు వారి విగ్రహారాధన పద్ధతులతో మరింత చిక్కుకుపోయారు. కారణం లేదా పిలుపు లేకుండా మనం నిర్లక్ష్యంగా ప్రలోభాలకు లోనైనప్పుడు, దాని పర్యవసానాలను మన స్వంతంగా ఎదుర్కొనేందుకు దేవుడు మాత్రమే అనుమతించాలి. మనం దేవుని చిత్తానికి విరుద్ధంగా వెళ్లాలని ఎంచుకుంటే, ఆయన దయతో ప్రతిస్పందిస్తాడు. వారికి అందించే మోక్షాన్ని విస్మరించడం వల్ల ప్రజలకు సంభవించే ఘోరమైన దురదృష్టాలు తరచుగా సంభవిస్తాయి.

వారు సంస్కరించడానికి నిరాకరిస్తారు. (15-19) 
ఈ సాహసోపేతమైన అతిక్రమణదారులు సాకులు చెప్పడానికి ప్రయత్నించరు; బదులుగా, వారు నిషిద్ధ చర్యలలో పాల్గొనడానికి తమ ఉద్దేశాన్ని ధైర్యంగా ప్రకటించారు. దేవుని ఆజ్ఞలను ధిక్కరించే వారు తరచుగా లోతైన అవిధేయతకు దిగుతున్నారు మరియు పాపం యొక్క మోసపూరితత వారి హృదయాలను కఠినతరం చేస్తుంది. ఇది తిరుగుబాటు హృదయానికి నిజమైన వ్యక్తీకరణ. వారి పాపపు మార్గాల నుండి వారిని దూరంగా నడిపించడానికి ఉద్దేశించిన ప్రతికూలతలు కూడా వారి తప్పులో వారిని మరింత బలపరచడానికి వక్రీకరించబడ్డాయి. మంచితనం వైపు ఒకరినొకరు ప్రేరేపించి, మోక్ష మార్గంలో ఒకరికొకరు సాయపడాల్సిన వ్యక్తులు ఒకరినొకరు పాపంలోకి ప్రోత్సహించడం, చివరికి ఒకరినొకరు అపరాధానికి గురి చేయడం విచారకర పరిస్థితి. విగ్రహారాధనను దైవారాధనతో కలపడం మరియు క్రీస్తు మధ్యవర్తిత్వాన్ని తిరస్కరించడం దేవుని కోపాన్ని రేకెత్తించే మరియు మానవజాతి నాశనానికి దారితీసే చర్యలు. ప్రతిమలను గౌరవించే లేదా సాధువులను, దేవదూతలను లేదా స్వర్గపు రాణితో సహా మరే ఇతర జీవులను గౌరవించే వారందరూ యూదుల విగ్రహారాధన పద్ధతుల నుండి పాఠాలను పాటించాలి.

యిర్మీయా వారిపై విధ్వంసాన్ని ఖండించాడు. (20-30)
మనకు ఎదురయ్యే ఏదైనా ప్రతికూలత ప్రభువుపై మనం చేసిన అతిక్రమాల పర్యవసానమే. కాబట్టి, మనం జీవితాన్ని భక్తితో సంప్రదించాలి మరియు పాపం చేయకుండా ఉండాలి. విగ్రహారాధనలో వారి స్థిరమైన పట్టుదలను బట్టి, దేవుడు వారికి శిక్షలు విధిస్తూనే ఉంటాడు. వారి మతపరమైన ఆచారాల అవశేషాలు ఆరిపోతాయి. భూసంబంధమైన మూలాధారాల నుండి మనం పొందే సౌకర్యాలు మరియు హామీలు, వాటి గుర్తించబడిన ప్రాముఖ్యతతో సంబంధం లేకుండా, మనం తక్కువ విశ్వసనీయమైనవిగా భావించినంత త్వరగా క్షీణించవచ్చు. అంతిమంగా, అన్ని విషయాలు దేవుని దైవిక రూపకల్పనకు లోబడి ఉంటాయి, మన ఆత్మాశ్రయ అవగాహనలకు కాదు. దైవిక దయను పొందాలనే మన స్థిరమైన ఆశలు మన పశ్చాత్తాపం మరియు విధేయతతో శాశ్వతంగా ముడిపడి ఉన్నాయి.



Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |