Jeremiah - యిర్మియా 49 | View All

1. అమ్మోనీయులనుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇశ్రాయేలునకు కుమారులు లేరా? అతనికి వారసుడు లేకపోయెనా? మల్కోము గాదును ఎందుకు స్వతంత్రించుకొనును? అతని ప్రజలు దాని పట్టణములలో ఎందుకు నివసింతురు?

1. ఈ వర్తమానం అమ్మోనీయులను గురించినది. యెహోవా ఇలా చెపుతున్నాడు, “అమ్మోను ప్రజలారా, ఇశ్రాయేలు ప్రజలకు పిల్లలు లేరని మీరు అనుకొంటున్నారా? తల్లి తండ్రులు చనిపోతే భూమిని స్వతంత్రించుకొనుటకు అక్కడ పిల్లలు లేరని మీరనుకొంటున్నారా? బహుశః అందువల్లనే మల్కోము గాదు రాజ్యాన్ని తీసికొన్నాడా?”

2. కాగా యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు రాగల దినములలో నేను అమ్మోనీయుల పట్టణమగు రబ్బా మీదికి వచ్చు యుద్ధము యొక్క ధ్వని వినబడజేసెదను; అది పాడుదిబ్బయగును, దాని ఉపపురములు అగ్నిచేత కాల్చబడును, దాని వారసులకు ఇశ్రాయేలీయులు వారసులగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

2. యెహోవా ఇలా చెపుతున్నాడు, “రబ్బోతు అమ్మోను ప్రజలు యుద్ధనాదాలు వినే సమయం వస్తుంది. రబ్బోతు - అమ్మోను నాశనమవుతుంది. అది కూలిపోయిన భవనాలతో నిండిన ఒక కొండలా ఉంటుంది. దాని చట్టూ ఉన్న పట్టణాలు తగులబడతాయి. ఆ జనం ఇశ్రాయేలీయులను తమ రాజ్యాన్ని వదిలి పొమ్మని వత్తిడి చేశారు. కాని తర్వాత ఇశ్రాయేలు ప్రజలు తిరిగి వారిని దేశం వదిలి పొమ్మని బలవంతం చేస్తారు.” మరియు వారు భూమిని వారి స్వంతము చేసుకుంటారు. యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

3. హెష్బోనూ, అంగ లార్చుము, హాయి పాడాయెను, మల్కోమును అతని యాజకులును అతని యధిపతులును చెరలోనికి పోవు చున్నారు; రబ్బా నివాసినులారా, కేకలువేయుడి, గోనెపట్ట కట్టుకొనుడి, మీరు అంగలార్చి కంచెలలో ఇటు అటు తిరుగులాడుడి.

3. “హెష్బోను ప్రజలారా, విలపించండి! ఎందువల్లనంటే, హాయి పట్టణం పాడైపోయింది. రబ్బోతు - అమ్మోను మహిళల్లారా, విలపించండి! విషాద సూచకంగా మీరు నారబట్టలు ధరించి శోకించండి. రక్షణ కొరకు నగరానికి పరుగెత్తండి. ఎందువల్లనంటే, శత్రువు మీ మీదికి వస్తున్నాడు. వారు మల్కోము దైవాన్ని తీసికొనిపోతారు. వారు మల్కోము యాజకులను, అధికారులను చెరపట్టుతారు.

4. విశ్వాసఘాతకురాలా నా యొద్దకు ఎవడును రాలేడని నీ ధనమునే ఆశ్రయముగా చేసికొన్నదానా,

4. నీవు నీ బలాన్ని గురించి గొప్పలు చెప్పుకుంటావు. కాని నీవు నీ బలాన్ని కోల్పోతున్నావు. నీ డబ్బు నిన్ను రక్షిస్తుందని నీవు నమ్మావు. నిన్ను ఎదిరించటానికి ఏ ఒక్కడూ కనీసం ఆలోచన కూడా చేయడని నీవనుకున్నావు.”

5. నీ లోయలో జలములు ప్రవహించు చున్నవని, నీవేల నీ లోయలనుగూర్చి యతిశయించు చున్నావు? ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

5. కాని సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెప్పుచున్నాడు, “ నలుమూలల నుండి నేను మీకు కష్టాలు తెచ్చిపెడతాను. మీరంతా పారిపోతారు. మిమ్మల్నందరినీ మరల ఎవ్వరూ కూడదీయలేరు.”

6. నేను నీ చుట్టునున్న వారందరివలన నీకు భయము పుట్టించు చున్నాను; మీరందరు శత్రువుని కెదురుగా తరుమబడు దురు, పారిపోవువారిని సమకూర్చు వాడొకడును లేక పోవును, అటుతరువాత చెరలోనున్న అమ్మోనీయులను నేను రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు.

6. “అమ్మోనీయులు బందీలుగా కొనిపోబడతారు. కాని అమ్మోనీయులను నేను వెనుకకు తీసికొనివచ్చే సమయం వస్తుంది.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.

7. సైన్యములకధిపతియగు యెహోవా ఎదోమునుగూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు తేమానులో జ్ఞానమిక నేమియులేదా? వివేకులకు ఇక ఆలోచన లేకపోయెనా? వారి జ్ఞానము వ్యర్థమాయెనా?

7. ఈ వర్తమానం ఎదోమును గురించినది. సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు, “తేమాను పట్టణంలో జ్ఞానం ఏమాత్రం లేదా? ఎదోములోని జ్ఞానులు మంచి సలహా ఇవ్వలేక పోతున్నారా? వారి జ్ఞానాన్ని వారు కోల్పోయారా?

8. ఏశావును విమర్శించుచు నేనతనికి కష్టకాలము రప్పించుచున్నాను; దదానీయు లారా, పారిపోవుడి వెనుకకు మళ్లుడి బహులోతున దాగు కొనుడి.

8. దదానులో నివసించే ప్రజలారా, పారిపోండి! దాగుకోండి! ఎందుకంటే, నేను ఏశావును తాను చేసిన చెడ్డ పనులు కారణంగా శిక్షిస్తాను.

9. ద్రాక్షపండ్లు ఏరువారు నీయొద్దకు వచ్చిన యెడల వారు పరిగెలను విడువరా? రాత్రి దొంగలు వచ్చినయెడల తమకు చాలునంత దొరుకువరకు నష్టము చేయుదురు గదా?

9. మీ ద్రాక్ష తీగల నుండి పనివారు వారికి కావలసినన్ని ద్రాక్షకాయలను కోస్తారు. అయినా వారు కొన్ని కాయలను చెట్లపై వదిలివేస్తారు. రాత్రిళ్లు దొంగలు వచ్చినా వారికి కావలసిన పరిమాణంలోనే తీసికొనిపోతారు.

10. నేను ఏశావును దిగంబరినిగా చేయు చున్నాను, అతడు దాగియుండకుండునట్లు నేనతని మరుగు స్థలమును బయలుపరచుచున్నాను, అతని సంతానమును అతని స్వజాతివారును అతని పొరుగువారును నాశన మగు చున్నారు, అతడును లేకపోవును.

10. కాని ఏశావు నుండి నేను అంతా తీసికుంటాను. అతడు దాచుకొనే స్థలాలన్నింటినీ నేను కనుగొంటాను. అతడు నానుండి ఏమీయు దాచలేడు. అతని పిల్లలు, బంధువులు, పొరుగువారు అంత చనిపోతారు.

11. అనాధులగు నీ పిల్లలను విడువుము, నేను వారిని సంరక్షించెదను, నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయింపవలెను.
1 తిమోతికి 5:5

11. అతని పిల్లల పట్ల శ్రద్ధ తీసికొనటానికి ఎవ్వరూ మిగలరు. అతని విధవరాండ్రు ఒంటరిగా విడువబడుతారు (యెహోవానైన) నేను మాత్రమే మీ అనాధుల ప్రాణాల్ని కాపాడుతాను. మరియు మీ విధవరాండ్రు నామీద నమ్మకముంచుతారు.”

12. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు న్యాయముచేత ఆ పాత్రలోనిది త్రాగను రానివారు నిశ్చయముగా దానిలోనిది త్రాగుచున్నారే, నీవుమాత్రము బొత్తిగా శిక్ష నొందకపోవుదువా? శిక్ష తప్పించుకొనక నీవు నిశ్చయముగా త్రాగుదువు.

12. యెహోవా ఇంకా ఇలా చెపుతున్నాడు: “కొంతమంది మనుష్యులు శిక్షకు అర్హులు కారు. అయినా వారు బాధ అనుభవించారు. కాని ఎదోమూ, నీవు శిక్షకు పాత్రుడవు. కావున నీవు నిజంగా శిక్షింపబడతావు. అర్హమైన నీ శిక్షను నీవు తప్పించుకొనలేవు. నీవు దండించబడతావు.”

13. బొస్రా పాడుగాను అపహాస్యాస్పదముగాను ఎడారి గాను శాపవచనముగాను ఉండుననియు, దాని పట్టణము లన్నియు ఎన్నటెన్నటికి పాడుగానుండుననియు నా తోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెల విచ్చుచున్నాడు.

13. యెహోవా చెపుతున్నాడు, “నా స్వయం శక్తితో నేనీ ప్రమాణం చేస్తున్నాను, బొస్రా నగరం నాశనమవుతుందని నిశ్చయంగా చెపుతున్నాను. ఆ నగరం పాడుబడి రాళ్లగుట్టలా మారిపోతుంది. ఇతర నగరాలకు ప్రజలు కీడు జరగాలని కోరుకున్నప్పుడు ఈ నగరానికి సంభవించినట్లు జరగాలని దీనిని ఉదహరిస్తారు. ప్రజలా నగరాన్ని అవమానపరుస్తారు. బొస్రా చుట్టుపట్లవున్న పట్టణాలన్నీ శాశ్వతంగా శిథిలాలైపోతాయి.”

14. యెహోవా యొద్దనుండి నాకు వర్త మానము వచ్చెను; జనముల యొద్దకు దూత పంపబడి యున్నాడు, కూడికొని ఆమెమీదికి రండి యుద్ధమునకు లేచి రండి.

14. యెహోవా నుండి నేనొక సందేశం విన్నాను, దేశాలకు యెహోవా ఒక దూతను పంపాడు. ఆ సందేశం ఇలా వుంది, “మీ సైన్యాలను సమకూర్చుకోండి! యుద్ధానికి సిద్ధపడండీ. ఎదోము దేశం మీదికి కదలి వెళ్లండి!

15. జనములలో అల్పునిగాను మనుష్యులలో నీచునిగాను నేను నిన్ను చేయుచున్నాను.

15. “ఏదోమూ, నేను నీ ప్రాముఖ్యతను, ఘనతను తగ్గించివేస్తాను. ప్రతివాడూ నిన్ను అసహ్యించుకుంటాడు.

16. నీవు భీకరుడవు; కొండసందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరచుకొనువాడా, నీ హృదయగర్వము నిన్ను మోసపుచ్చెను, నీవు పక్షిరాజువలె నీ గూటిని ఉన్నత స్థలములో కట్టుకొనినను అక్కడనుండి నిన్ను క్రింద పడద్రోసెదను; ఇదే యెహోవా వాక్కు.

16. ఎదోమా, నీవు ఇతర దేశాలను బెదరగొట్టావు. అందువల్ల నీవు గొప్పవాడివనుకున్నావు. కాని నీవు మోసపోయావు. నీ గర్వం నిన్ను మోసగించింది. ఎదోమూ, నీవు ఎత్తయిన కొండలపై నివసిస్తున్నావు. పెద్ద బండలు, కొండలు రక్షణ కల్గించే ప్రదేశాలలో నీవు నివసిస్తున్నావు. గద్ద గూటిలా నీ ఇంటిని ఎంత ఉన్నతమైన స్థలంలో కట్టుకున్నా నేను నిన్ను పట్టుకుంటాను. అక్కడినుండి నేను నిన్ను కిందికి దింపుతాను,” ఈ విషయాలు యెహోవా చెప్పాడు.

17. ఎదోము పాడైపోవును, దాని మార్గమున నడుచువారు ఆశ్చర్యపడి దాని యిడుమలన్నియు చూచి వేళాకోళము చేయుదురు.

17. “ఎదోము నాశనం చేయబడుతుంది. నాశనమయిన నగరాన్ని చూచి ప్రజలు విస్మయం చెంది ఆశ్చర్యంతో ఈల వేస్తారు. నాశనమయిన నగరాలను చూచి ప్రజలు ధిగ్భ్రాంతి చెంది సంభ్రమాశ్చర్య పడతారు.

18. సొదొమయు గొమొఱ్ఱాయు వాటి సమీప పట్టణములును పడగొట్టబడిన తరువాత వాటిలో ఎవడును కాపురముండక పోయినట్లు ఏ మనుష్యుడును అక్కడ కాపురముండడు, ఏ నరుడును దానిలో బసచేయడు.

18. సొదొమ, గొమొర్రా నగరాలు, వాటి పరిసర పట్టణాల్లా ఎదోము కూడ నాశనం చేయబడుతుంది. అక్కడ ఎవ్వరూ నివసించరు. “ ఈ విషయాలు యెహోవా చెప్పాడు.

19. చిరకాలము నిలుచు నివాసమును పట్టుకొనవలెనని శత్రువులు యొర్దాను ప్రవాహములో నుండి సింహమువలె వచ్చుచున్నారు, నిమిషములోనే నేను వారిని దాని యొద్దనుండి తోలివేయుదును, నేనెవని నేర్పరతునో వానిని దానిమీద నియమించెదను; నన్ను పోలియున్న వాడై నాకు ఆక్షేపణ కలుగచేయువాడేడి? నన్ను ఎదిరింప గల కాపరియేడి?

19. “యొర్దాను నది దగ్గర దట్టమైన పొదలనుండి కొన్నాసార్లు సింహం వస్తూ ఉంటుంది. పొలాల్లో ప్రజలు మందవేసిన గొర్రెల మీదికి, పశువుల మీదికి వెళుతుంది. నేను ఆ సింహంలాంటివాణ్ణి! నేను ఎదోము మీదికి వెళతాను. నేనా ప్రజలను బెదరగొడతాను. వారిని పారిపోయేలా నేను చేస్తాను. వారి యువకులలో ఎవ్వడూ నన్ను ఆపలేడు. నాలా మరెవ్వడూ లేడు! నన్నెవ్వరూ ఎదిరించలేరు. వారి గొర్రెల కాపరులలో (నాయకులు) ఏ ఒక్కడూ నన్నెదిరించి నిలువలేడు.”

20. ఎదోమునుగూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి. తేమాను నివాసులనుగూర్చి ఆయన ఉద్దేశించినదాని వినుడి. నిశ్చయముగా మందలో అల్పులైన వారిని శత్రువులు లాగుదురు, నిశ్చయముగా వారి నివాస స్థలము వారినిబట్టి ఆశ్చర్యపడును.

20. కావున ఎదోముకు వ్యతిరేకంగా యెహోవా వేసిన పధకాన్ని వినండి. తేమాను వాసులకు యెహోవా ఏమి చేయ నిశ్చయించినది వినండి ఎదోము మంద (ప్రజలు)లో నుండి చిన్నవాటినన్నిటినీ శత్రువు ఈడ్చుకుపోతాడు. ఎదోము పచ్చిక బయళ్లు వారు చేసిన దాన్ని బట్టి ఆశ్చర్యపోతాయి.

21. వారు పడిపోగా అఖండమైన ధ్వని పుట్టెను; భూమి దానికి దద్దరిల్లుచున్నది, అంగలార్పు ఘోషయు ఎఱ్ఱసముద్రము దనుక వినబడెను.

21. ఎదోము పతనంతో పుట్టిన శబ్దానికి భూమి కంపిస్తుంది. వారి ఆక్రందన ఎర్ర సముద్రంవరకు ప్రతిధ్వనిస్తుంది.

22. శత్రువు పక్షిరాజువలె లేచి యెగిరి బొస్రామీద పడవలె నని తన రెక్కలు విప్పుకొనుచున్నాడు; ఆ దినమున ఎదోము బలాఢ్యుల హృదయములు ప్రసవించు స్త్రీ హృదయమువలె ఉండును.

22. దూసుకువచ్చి తనను తన్నుకుపోయే జంతువుపై తిరుగుతూ ఎగిరే గద్దలా యెహోవా ఉంటాడు. బొస్రా నగరంపై తన రెక్కలు విప్పుతున్న గద్దవలె యెహోవా ఉన్నాడు. ఆ సమయంలో ఎదోము సైనికులు మిక్కిలిగా బెదరిపోతారు. ప్రసవ వేదన పడుతున్న స్త్రీవలె వారు భయాందోళనలతో ఆక్రందిస్తారు.

23. దమస్కును గూర్చిన వాక్కు. హమాతును అర్పాదును దుర్వార్త విని సిగ్గు పడు చున్నవి అవి పరవశములాయెను సముద్రముమీద విచారము కలదుదానికి నెమ్మదిలేదు.

23. ఈ వర్తమానము దమస్కు నగరాన్ని గురించి నది: “హమాతు, అర్పాదు పట్టణాలు భయపడ్డాయి. దుర్వార్త వినటంవల్ల అవి భయపడ్డాయి. వారు అధైర్యపడ్డారు. వారు వ్యాకులపడి బెదిరారు.

24. దమస్కు బలహీనమాయెను. పారిపోవలెనని అది వెనుకతీయుచున్నది వణకు దానిని పట్టెను ప్రసవించు స్త్రీని పట్టునట్లు ప్రయాసవేదనలు దానిని పట్టెను.

24. దమస్కు నగరం బలహీనమయ్యింది. ప్రజలు పారిపోవాలనుకుంటున్నారు. ప్రజలకు దిగులు పట్టుకున్నది. ప్రసవ స్త్రీ లా ప్రజలు బాధ, వేదన అనుభవిస్తున్నారు.

25. ప్రసిద్ధిగల పట్టణము బొత్తిగా విడువబడెను నాకు ఆనందమునిచ్చు పట్టణము బొత్తిగా విడువ బడెను.

25. “దమస్కు సుఖసంతోషాలున్న ఒక నగరం. ప్రజలింకా ఆ ‘వేడుక నగరాన్ని’ వదిలి పెట్టలేదు.

26. ఆమె ¸యౌవనులు ఆమె వీధులలో కూలుదురు ఆ దినమున యోధులందరు మౌనులైయుందురు ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు.

26. అందువల్ల యువకులు ఆ నగరంలోని కూడలి స్థలాలలో చనిపోతారు. ఆ సమయంలో దాని సైనికులందరూ చంపబడతారు.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయారు చెప్పినాడు.

27. నేను దమస్కు ప్రాకారములో అగ్ని రాజబెట్టెదను అది బెన్హదదు నగరులను కాల్చివేయును.

27. “దమస్కు గోడలన్నిటికీ నేను నిప్పు పెడతాను. బెన్హదదు బలమైన కోటలను అది పూర్తిగా కాల్చివేస్తుంది.”

28. బబులోనురాజైన నెబుకద్రెజరు కొట్టిన కేదారును గూర్చియు హాసోరు రాజ్యములనుగూర్చియు యెహోవా సెల విచ్చినమాట లేచి కేదారునకు వెళ్లుడి తూర్పుదేశస్థులను దోచు కొనుడి.

28. ఈ వర్తమానం కేదారు వంశస్తులను గూర్చియు, మరియు హాసోరు పాలకులను గురించినది. బబులోను రాజైన నెబుకద్నెజరు వారిని ఓడించారు. యెహోవా ఇలా చెపుతున్నాడు, “కేదారు వంశీయుల మీదికి మీరు దండెత్తి వెళ్లండి. తూర్పునవున్న ప్రజలను నాశనం చేయండి.

29. వారి గుడారములను గొఱ్ఱెల మందలను శత్రువులు కొనిపోవుదురు తెరలను ఉపకరణములను ఒంటెలను వారు పట్టు కొందురు నఖముఖాల భయమని వారు దానిమీద చాటింతురు

29. వారి గుడారాలు, గొర్రెల మందలు తీసికొని పోబడతాయి. వారి గుడారంతో పాటు వారి వస్తువులన్నీ తీసికొనిపోబడతాయి. వారి శత్రువు ఒంటెలను పట్టుకుపోతాడు. ‘ఎటు చూచినా భయం, భయం’ అని మనుష్యులు కేకలు పెడతారు.

30. హాసోరు నివాసులారా, బబులోనురాజైన నెబుకద్రెజరు మీమీదికి రావలెనని ఆలోచన చేయుచున్నాడు మీమీద పడవలెనను ఉద్దేశముతో ఉన్నాడు యెహోవా వాక్కు ఇదే పారిపోవుడి బహులోతున వెళ్లుడి అగాధస్థలములలో దాగుడి

30. త్వరగా పారిపొండి! హాసోరు ప్రజలారా, దాగటానికి మంచి స్థలం చూడండి.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చింది “నెబుకద్నెజరు నీవు వ్యతిరేకంగా పధకం పన్నాడు. నిన్ను ఓడించటానికి అతడు ఒక తెలివైన పథకాన్ని ఆలోచించాడు.

31. మీరు లేచి ఒంటరిగా నివసించుచు గుమ్మములు పెట్టకయు గడియలు అమర్చకయు నిశ్చింతగాను క్షేమముగాను నివసించు జనముమీద పడుడి.

31. “నిశ్చంతగావున్న దేశం ఒకటున్నది. దాన్ని ఎవ్వరూ ఓడించరని ఆ రాజ్యానికి ధీమా. ఆ దేశ రక్షణకు ద్వారాలుగాని, చుట్టూ కంచెగాని ఏమీ లేవు. వారు ఒంటరిగా నివసిస్తారు. ‘ఆ రాజ్యాన్ని ఎదుర్కోండి!’ అని యెహోవా అంటున్నాడు.

32. వారి ఒంటెలు దోపుడుసొమ్ముగా ఉండును వారి పశువులమందలు కొల్లసొమ్ముగా ఉండును గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొనువారిని నఖముఖాల చెదరగొట్టుచున్నాను నలుదిక్కులనుండి ఉపద్రవమును వారిమీదికి రప్పించుచున్నాను ఇదే యెహోవా వాక్కు,

32. వారి ఒంటెలను, విస్తారమైన పశుసంపదను శత్రువు దొంగిలిస్తాడు. శత్రువు వారి పెద్ద మందలను దొంగిలిస్తాడు. చెంపలు కత్తిరించుకునే వారిని భూమి నలుదిక్కులకు పంపివేస్తాను. అన్నివైపుల నుండి వారి మీదికి మహా విపత్తులను తీసికొని వస్తాను.” ఈ సమాచారం యెహోవా నుండి వచ్చినది.

33. హాసోరు చిరకాలము పాడై నక్కలకు నివాస స్థలముగా ఉండును అక్కడ ఏ మనుష్యుడును కాపురముండడు ఏ నరుడును దానిలో బసచేయడు.

33. “హాసోరు రాజ్యం గుంటనక్కలకు నివాసమవుతుంది. అది శాశ్వతంగా వట్టి ఎడారిగా మారిపోతుంది. అక్కడ మనుష్యులెవ్వరూ నివసించరు. ఆ స్థలంలో ఏ ఒక్కడూ నివాసంచేయడు.”

34. యూదారాజైన సిద్కియా యేలుబడి ఆరంభములో యెహోవా వాక్కు ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమై ఏలామునుగూర్చి

34. యూదా రాజైన సిద్కియా పరిపాలనారంభంలో, ప్రవక్తయైన యిర్మీయా ఒక సందేశాన్ని యెహోవా నుండి అందుకున్నాడు. ఆ సందేశం ఏలాము దేశానికి సంబంధించినది.

35. ఈలాగు సెలవిచ్చెనుసైన్యములకధిపతి యగు యెహోవా సెలవిచ్చినదేమనగానేను ఏలాము యొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరుచు చున్నాను.

35. సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు, “ఏలాము యొక్క ధనుస్సును నేను త్వరలో విరచివేస్తాను. విల్లే ఏలాము యొక్క బలమైన ఆయుధం.

36. నలుదిశలనుండి నాలుగు వాయువులను ఏలాముమీదికి రప్పించి, నలుదిక్కులనుండి వచ్చువాయు వులవెంట వారిని చెదరగొట్టుదును, వెలివేయబడిన ఏలాము వారు ప్రవేశింపని దేశమేదియు నుండదు.
ప్రకటన గ్రంథం 7:1

36. నాలుగు ప్రచండ వాయువులను ఏలాము మీదికి రప్పిస్తాను. ఆకాశపు నాలుగు మూలల నుండి వాటిని రప్పిసాను. భూమి మీదకు గాలి వీచే నలుమూలలకు ఏలాము ప్రజలను నేను చెదరగొడతాను. ఏలాము ప్రజలు ప్రతి దేశానికి బందీలుగా కొనిపోబడతారు.

37. మరియు వారి శత్రువులయెదుటను వారి ప్రాణము తీయజూచు వారియెదుటను ఏలామును భయపడ జేయుదును, నా కోపాగ్నిచేత కీడును వారి మీదికి నేను రప్పించుదును, వారిని నిర్మూలము చేయువరకు వారివెంట ఖడ్గము పంపు చున్నాను; ఇదే యెహోవా వాక్కు.

37. వారి శత్రువులు చూస్తూవుండగా ఏలామును తునాతునకలు చేస్తాను. వారిని చంపజూచేవారి సమక్షంలో ఏలామును భయపెడతాను. వారికి మహా విపత్తులను తెచ్చిపెడతాను. నేనెంత కోపంగా ఉన్నానో నేను వారికి చూపిస్తాను.” ఈ సమాచారం యెహోవా నుండి వచ్చినది. “ఏలామును వెంటాడటానికి నేను కత్తిని పంపుతాను. నేను వారందరినీ చంపేవరకు కత్తి వారిని తరుముతుంది.

38. నా సింహాసనమును అచ్చటనే స్థాపించి ఏలాములో నుండి రాజును అధిపతులను నాశనముచేయుదును; ఇదే యెహోవా వాక్కు.

38. నా సింహాసనం ప్రతిష్ఠించి నేనే అదుపుదారుడనని నిరూపిస్తాను. దాని రాజును, రాజ్యాధికారులను నేను నాశనం చేస్తాను.” ఇదే యెహోవా సందేశం.

39. అయితే కాలాంతమున చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరల రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు.

39. “కాని ఏలామును వెనక్కు తీసుకొని వచ్చి వారికి మంచి సంభవించేటట్లుగా చేస్తాను.” ఈ సమాచారం యెహోవా నుండి వచ్చినది.Shortcut Links
యిర్మియా - Jeremiah : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |