“చక్రాలు”– వీటి గురించి ఈ విషయాలను గమనించండి:
(1) చక్రాలు కదలికకు గుర్తు, కదలివెళ్ళే వాహనాన్ని సూచిస్తున్నాయి. కెరూబులతో ఉన్న ఈ చక్రాలు తమకు పైగా ఒక విశాలాన్నీ, ఒక సింహాసనాన్నీ మోసుకువెళ్తున్నట్టు కనిపిస్తున్నది (వ 22,26). 1 దినవృత్తాంతములు 28:18 లో కెరూబులను దేవుని మహిమా ప్రకాశం ఉన్న ఒడంబడిక పెట్టెకు వాహనంతో పోల్చడం గమనించదగ్గది. దానియేలు 7:9 కూడా చూడండి. ఒడంబడిక పెట్టె గురించి నోట్ నిర్గమకాండము 25:10-16.
(2) ఈ చక్రాలు ఒకదానిలో ఒకటి అమరినట్టుగా లేక ఒకదానినొకటి సమ విభజన చేస్తూవున్న చక్రాల్లా ఉన్నాయి. అయితే వాటి నిర్మాణ క్రమం ఇక్కడేమీ రాసిలేదు. బహుశా భూమిపై నిగూఢంగా, చిక్కులతో రహస్యాలతో కూడిన దేవుని చర్యలకు ఇవి సూచనగా ఉన్నాయేమో (యెషయా 55:8-9; రోమీయులకు 11:33). ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ వచనాలన్నీ దేవుని మహిమ ప్రకాశాన్ని వర్ణించేవి. సంగతులను దాచిపెట్టడం మహిమలో భాగం (సామెతలు 25:2).
(3) ఈ చక్రాలు కెరూబులతో, ఆత్మతో నిమిత్తం లేకుండా పని చెయ్యలేదు (వ 17,19,20,21). లోకంలో దేవుని తీరు తెన్నులు పరలోక జీవుల కార్యకలాపాలతో సన్నిహిత సంబంధం గలవి. అంతా కలిసి పరిపూర్ణమైన పొందికతో దేవుని మహిమకోసం పనిచేస్తాయి.
(4) కెరూబుల్లాగా చక్రాలకు కూడా అంచులు కళ్ళతో నిండివున్నాయి. ప్రపంచంలో, దాని చరిత్రలో దేవుడు కదలివెళ్ళే తీరు గ్రుడ్డిది కాదు. ఏ దిశలో వెళ్ళాలో, ఎప్పుడు ఎటువైపుకు దిశ మార్చాలో దేవునికి బాగా తెలుసు. విశ్వనాధుడైన దేవుడు హద్దు అదుపు లేకుండా నిర్దాక్షిణ్యంగా కదిలివెళ్తూ, వ్యక్తులనూ జనాలనూ దేశాలనూ తొక్కివేయడు. సింహాసనాసీనుడై ఉన్నవాడు ప్రేమామయుడు (1 యోహాను 4:8)