3. నరపుత్రుడా, యీ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమయెదుటనే పెట్టుకొని యున్నారు, వీరు నాయొద్ద ఏమైన విచారణచేయదగునా?
వారు ఎదురు చూచిన సందేశం వారికి రాలేదు. దేవుని దగ్గర విచారణ చేసే యోగ్యత వారికి లేదు. దేవుడు వారికి ఈ విషయం కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పాడు. వారు దేవుని మొదటి ఆజ్ఞను మీరుతూ ఉన్నారు. మరణ శిక్షే వారికి తగినది (నిర్గమకాండము 20:3-5; ద్వితీయోపదేశకాండము 13:6-18). అలాంటప్పుడు దేవుడు తమను దీవిస్తాడని వారెలా అనుకున్నారు? వారిపాపాలు రెండు ఇక్కడ కనిపిస్తున్నాయి. వారి హృదయంలోని విగ్రహాల గురించి ఇక్కడ 3 సార్లు వచ్చింది (వ 3,4,7). హృదయంలో విగ్రహాలను నిలుపుకోవడమే అన్ని రకాల విగ్రహ పూజకూ మూలం. అక్షరాలా బొమ్మలకు మొక్కడంతో సమానమైన, ప్రమాదకరమైన పాపం ఇది. చాలా మంది భక్తిపరుల్లాగా కనిపించేవారు తమ హృదయాల్లో దేవుని స్థానంలో వేరేదాన్ని నిలుపుకొని ఉండవచ్చు. అది డబ్బు కావచ్చు, సుఖభోగాలు కావచ్చు, పేరు ప్రతిష్ఠలు కావచ్చు, వేరొక వ్యక్తి కావచ్చు. మరేదైనా కావచ్చు, దానికే ప్రేమ, సేవ సమర్పిస్తూ ఉండవచ్చు. కొలొస్సయులకు 3:5 పోల్చి చూడండి. అందుకనే అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయాన్ని ఎంతో భద్రంగా కాపాడుకోవాలని దేవుని వాక్కు మనలను హెచ్చరిస్తున్నది (సామెతలు 4:23).