Ezekiel - యెహెఙ్కేలు 36 | View All

1. మరియు నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పర్వతములకు ఈ మాట ప్రవచింపుము ఇశ్రాయేలు పర్వతములారా, యెహోవా మాట ఆలకించుడి,

1. “నరపుత్రుడా, నా తరపున ఇశ్రాయేలు పర్వతాలతో మాట్లాడు. యెహోవా మాట ఆలకించమని ఇశ్రాయేలు పర్వతాలకు చెప్పు!

2. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఆహా ప్రాచీనములైన ఉన్నతస్థలములు మా స్వాస్థ్యములైనవని మిమ్మును గురించి శత్రువులు చెప్పుకొనిరి.

2. ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని వారికి తెలియజేయుము. శత్రువు నిన్ను గురించి చెడ్డ విషయాలు ప్రచారం చేశాడు. ‘ఆహా! ఆ పురాతన పర్వతాలు ఇక మనవే!”‘ అని వారు అనుకొన్నారు.

3. వచనమెత్తి ఈలాగు ప్రవచింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చున దేమనగాశేషించిన అన్యజనులకు మీరు స్వాధీనులగునట్లు గాను, నిందించువారిచేత జనుల దృష్టికి మీరు అపహాస్యా స్పదమగునట్లుగాను, నలుదిక్కుల మీ శత్రువులు మిమ్మను పట్టుకొన నాశించి మిమ్మును పాడుచేసియున్నారు.

3. “కావున ఇశ్రాయేలు పర్వతాలతో నా తరపున మాట్లాడుము. ప్రభువైన యెహోవా ఈ విషయాలు తెలుపుతున్నాడని వాటితో చెప్పుము. శత్రువు నిన్న నిర్మానుష్యం చేశాడు. అన్ని వైపుల నుండి నారు నిన్ను చితుకదొక్కారు. నిన్ను అన్యదేశాల పాలు చేయటం కొరకే వారా విధంగా చేశారు. పిమ్మట ప్రజలు నీగురించి గుసుగుసలు మొదలు పెట్టారు.”

4. కాగా ఇశ్రాయేలు పర్వతములారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువగు యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడుశేషించిన అన్యజనులకు అపహాస్యాస్ప దమై దోపుడు సొమ్ముగా విడువబడిన పర్వతములతోను కొండలతోను వాగులతోను లోయలతోను పాడైన స్థల ములతోను నిర్జనమైన పట్టణములతోను

4. కావున ఇశ్రాయేలు పర్వతములారా, ప్రభువైన యెహోవా సందేశాన్ని వినండి! ప్రభువైన యెహోవా దీనిని పర్వతాలకు, కొండలకు, నదులకు, లోయలకు, శిథిలాలకు మరియు పాడుబడిన నగరాలకు చెపుతున్నాడు, నీ చుట్టూ ఉన్న దేశాల వారిచే నీవు దోచుకోబడి, ఎగతాళి చేయబడ్డావు.

5. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా సంతుష్టహృదయులై నా దేశమును హీనముగా చూచి దోపుడు సొమ్ముగా ఉండుటకై తమకు అది స్వాస్థ్యమని దాని స్వాధీనపరచు కొనిన ఎదోమీయులనందరిని బట్టియు, శేషించిన అన్య జనులనుబట్టియు నారోషాగ్నితో యథార్థముగా మాట ఇచ్చియున్నాను.

5. “నా తీవ్రమైన భావాలను ఇప్పుడు నిజంగా వ్యక్తం చేస్తున్నాను! ఎదోము, తదితర దేశాలు నా కోపాన్ని చవి చూసేలా చేస్తాను. ఎదోమీయులు నా భూమిని తమ స్వంతం చేసుకున్నారు. వాళ్ళు బాగా సంతోషంగా అనుభవించారు. వారా విధంగా సంతోషంతో ఉన్నప్పుడు ఈ భూమిని ఎలా అసహ్యించు కొనేవారో తెలిపారు. వారు ఈ భూమిని నాశనం చేసి దాన్ని స్వాధీన పరచుకోదలిచారు.”

6. కాబట్టి ఇశ్రాయేలు దేశమునుగూర్చి ప్రవచనమెత్తి, పర్వతములతోను కొండలతోను వాగుల తోను లోయలతోను ఈ మాట తెలియజెప్పుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీరు అన్య జనులవలన అవమానము నొందితిరి గనుక రోషముతోను కోపముతోను నేను మాట ఇచ్చియున్నాను.

6. కావున నా ప్రభువైన యెహోవా ఇశ్రాయేలు దేశమును గూర్చి ఈ విషయాలు చెపుతున్నాడు: “నా తరపున ఇశ్రాయేలు దేశ భూభాగంతో మాట్లాడు. పర్వతాలు, కొండలతోను, నదులతోను మరియు లోయలతోను మాట్లాడు. ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని ‘వారికి తెలియజేయుము. నా తీవ్రమైన భావాలను, కోపాన్ని వ్యక్తం చేస్తాను. నీవు ఆ ప్రజల నుండి అవమానాలను భరించావు గనుక నేను నా కోపాన్ని వ్యక్తం చేస్తాను.”‘

7. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగామీ చుట్టునున్న అన్య జనులు అవమానము నొందుదురని నేను ప్రమాణము చేయుచున్నాను.

7. నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “నీ చుట్టూ ఉన్న దేశాలు అవమానాలు భరించ వలసి ఉంటుందని నేను ప్రమాణం చేసి చెపుతున్నాను.

8. ఇశ్రాయేలు పర్వతములారా, యిక కొంతకాలమునకు ఇశ్రాయేలీయులగు నా జనులు వచ్చె దరు, మీరు చిగురుపెట్టి వారికొరకు మీ ఫలములు ఫలించుదురు.

8. “ఇశ్రాయేలు పర్వతములారా, నా ఇశ్రాయేలు ప్రజల కొరకు మీరు కొత్త చెట్లు పెంచి, పండ్లను పండిస్తారు. నా ప్రజలు వెంటనే తిరిగివస్తారు.

9. నేను మీ పక్షముననున్నాను, నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు.

9. నేను మీతో ఉన్నాను. నేను మీకు సహాయపడతాను. ప్రజలు నేలను దున్నుతారు. ప్రజలు మీలో విత్తనాలు నాటుతారు.

10. మీ మీద మానవ జాతిని, అనగా ఇశ్రాయేలీయులనందరిని, విస్తరింప జేసెదను, నా పట్టణములకు నివాసులు వత్తురు, పాడై పోయిన పట్టణములు మరల కట్టబడును.

10. మీమీద అనేకానేక మంది ప్రజలు నివసిస్తారు. ఇశ్రాయేలు వంశమంతా అక్కడ నివసిస్తుంది. నగరాలు మళ్లీ ప్రజలతో కళకళలాడుతాయి. నాశనం చేయబడిన స్థలాలన్నీ నూతనంగా నిర్మింపబడతాయి.

11. మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసెదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును, పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి, మునుపటికంటె అధికమైన మేలు మీకు కలుగజేసెదను, అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.

11. అనేక మంది ప్రజలను, జంతువులను నేను మీకిస్తాను. వారికి చాలా మంది పిల్లలు పుడతారు. పూర్వం మాదిరి ఇతరులు మీపై ఆదారపడి నివసించేలా మీకు సదుపాయం కలుగజేస్తాను. ముందుకంటె ఇప్పుడు మీరు ఇంకా బాగుండేటట్లు చేస్తాను. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.

12. మానవజాతిని, అనగా నా జనులగు ఇశ్రాయేలీయులను నేను మీలో సంచారము చేయించెదను, వారు నిన్ను స్వతంత్రించుకొందురు, మీరికమీదట వారిని పుత్రహీనులుగా చేయక వారికి స్వాస్థ్యమగుదురు.

12. అవును, నా ప్రజలైన, ఇశ్రాయేలీయులను ఈ భూమి వద్దకు నడిపిస్తాను. వారు మిమ్మల్ని వశపర్చుకుంటారు. మీరు వారి సొత్తు అవుతారు. మరెన్నడూ వారికి పిల్లలు లేకుండా మీరు చేయలేరు.”

13. ప్రభువగు యెహోవా సెలవిచ్చున దేమనగా దేశమా, నీవు మనుష్యులను భక్షించుదానవు, నీ జనులను పుత్రహీనులుగా చేయుదానవు అని జనులు నిన్నుగూర్చి చెప్పుచున్నారే.

13. నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఇశ్రాయేలు దేశమా! ప్రజలు నీవు చెడ్డపనులు చేశావని అంటారు. నీ ప్రజలను నీవే నాశనం చేశావని వారంటారు. నీవు పిల్లలను ఎత్తుకు పోయావని వారు చెపుతారు.

14. నీవు మనుష్యులను భక్షింపవు, ఇక నీ జనులను పుత్రహీనులుగా చేయవు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు

14. కాని నీవు ప్రజలను ఇక ఎంతమాత్రం నాశనం చేయవు. వారి పిల్లలను ఎంతమాత్రం నీవు తీసుకొనవు.” నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.

15. నిన్ను గూర్చి అన్య జనులు చేయు అపహాస్యము నీకిక వినబడకుండ చేసెదను, జనములవలన కలుగు అవమానము నీవికభరింపవు,నీవు నీ జనులను పుత్రహీనులగా చేయకయుందువు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

15. “అన్యదేశాలు ఇక ఎంతమాత్రం నిన్ను అవమానపర్చనివ్వను. వారిచే ఇక నీవు బాధించ బడవు. నీవు నీ పిల్లలను ఇకమీదట పోగొట్టుకోవు. “ నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

16. మరియయెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

16. పిమ్మట యెహోవా వాక్కు నావద్దకు వచ్చింది. ఆయన ఇలా అన్నాడు:

17. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశములో నివసించి, దుష్‌ప్రవర్తనచేతను దుష్‌క్రియలచేతను దానిని అపవిత్రపరచిరి, వారి ప్రవర్తన బహిష్టయైన స్త్రీయొక్క అపవిత్రతవలె నా దృష్టికి కనబడుచున్నది.

17. “నరపుత్రుడా, ఇశ్రాయేలు వంశం వారు తమ స్వంత భూమిలో నివసించారు. కాని వారు చేసిన చెడు పనులతో ఆ దేశాన్ని వారు మలినపర్చారు. వారు నా దృష్టిలో నెలసరి వచ్చే మైల రక్తర తో అపరిశుభ్రంగా ఉన్న స్త్రీలవలె ఉన్నారు.

18. కాబట్టి దేశములో వారు చేసిన నరహత్య విషయమైయును, విగ్రహములను పెట్టుకొని వారు దేశమును అపవిత్రపరచినదాని విషయమైయును నేను నా క్రోధమును వారిమీద కుమ్మరించి

18. ఆ రాజ్యంలో వారు ప్రజలను హత్యచేసి భూమిమీద రక్తం చిందించారు. వారి విగ్రహాలతో దేశాన్ని వారు మలినపర్చారు. అందుచే నేనెంత కోపంగా ఉన్నానో నేను వారికి చూపించాను.

19. వారి ప్రవర్తనను బట్టియు వారి క్రియలను బట్టియు వారిని శిక్షించి, నేను అన్యజనులలోనికి వారిని వెళ్లగొట్టగా వారు ఆ యా దేశ ములకు చెదరి పోయిరి.

19. నేను వారిని వివిధ ప్రజల మధ్యకు చెదరగొట్టి అన్ని భూభాగాలలోకి పంపిన కారణంగా వారు ఆయా దేశాలలో ఉండి పోయారు. వారి వారి చెడు కార్యాలను అనసరించి నేను వారిని శిక్షించాను.

20. వారు తాము వెళ్లిన స్థలముల లోని జనులయొద్ద చేరగా ఆ జనులువీరు యెహోవా జనులే గదా, ఆయన దేశములోనుండి వచ్చినవారే గదా, అని చెప్పుటవలన నా పరిశుద్ధనామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీయులు కారణమైరి.
రోమీయులకు 2:24

20. వారు అన్యదేశాలకు వెళ్లారు. ఆయా దేశాలలో కూడ వారు నా మంచి పేరును పాడుచేశారు. ఎలాగనగా, ఆ దేశస్థులు కూడ వీరిని గురించి మాట్లాడారు. ‘యెహోవా ఎటువంటి దేవుడు? వీరు యెహోవా ప్రజలు. అయినా వీరు తమ దేశాన్ని వదిలి వచ్చారు’ అని వారన్నారు.

21. కాగా ఇశ్రాయేలీయులు పోయిన యెల్లచోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామము విషయమై చింతపడితిని.

21. “ఇశ్రాయేలు ప్రజలు నా పవిత్ర నామాన్ని పాడు చేశారు. నా పేరు విషయంలో నేను బాధపడ్డాను.

22. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటనచేయుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీచేత దూషణనొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవుదానిని చేయుదును.

22. కావున ప్రభువైన యెహావా ఈ విషయాలు చెపుతున్నాడని ఇశ్రాయేలు వంశానికి చెప్పు, ‘ఇశ్రాయేలు వంశీయులారా, మీరు వెళ్లిన ప్రతిచోటా నా పవిత్ర నామాన్ని పాడుచేశారు. దీనిని ఆపటానికి నేనేదైనా చేయదలిచాను. ఇశ్రాయేలూ, అది నేను నీ కొరకు మాత్రం చేయను. నా పవిత్ర నామం కొరకు నేను ఆ పని చేస్తాను.

23. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును, వారి యెదుట మీయందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని వారు తెలిసికొందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
మత్తయి 6:9

23. గొప్పదైన నా పేరు నిజంగా పవిత్రమైనదని నేను ఆ ప్రజలకు నిరూపిస్తాను. మీరు నా పేరును గౌరవించేటట్లు చేస్తాను. నా మంచి పేరును ఆ దేశాలలో మీరు పాడుచేశారు! కాని నేను పవిత్రుడనని మీకు నిరూపిస్తాను. అప్పుడు ఆ ప్రజలంతా నేనే యెహోవానని తెలుసుకుంటారు.”‘ నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

24. నేను అన్యజను లలోనుండి మిమ్మును తోడుకొని, ఆ యా దేశములలో నుండి సమకూర్చి, మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించెదను.

24. దేవుడు ఇలా అన్నాడు, “ఆయా రాజ్యాలనుండి మిమ్మల్ని బయటకు తీసి, ఒక్క చోటికి సమీకరించి మీ స్వంత దేశానికి తీసుకొనివస్తాను.

25. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, మీ విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను.
హెబ్రీయులకు 10:22

25. పిమ్మట మీ మీద పరిశుద్ధ జలాన్ని చల్లి మిమ్మల్ని పవిత్రులనుగా చేస్తాను. మీ మురికినంతటిని కడిగివేస్తాను. ఆ విగ్రహాలనుండి వచ్చిన మురికని నేను కడిగివేస్తాను.”

26. నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను.
2 కోరింథీయులకు 3:3

26. దేవుడు ఇలా అన్నాడు: “మీలో సరికొత్త ఆత్మను పెడతాను. మీ ఆలోచనా సరళి మార్చుతాను. మీ శరీరం నుండి రాతి గుండెను తొలగించి సున్నితమైన మానవ హృదయాన్ని ఇస్తాను.

27. నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించు వారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను.
1 థెస్సలొనీకయులకు 4:8

27. మీలో నా ఆత్మను ప్రవేశపెడతాను. మీరు నా కట్టడులను పాటించేలా మిమ్మల్ని నేను మార్చుతాను. మీరు నా ఆజ్ఞలను జాగ్రత్తగా పాటిస్తారు.

28. నేను మీ పితరుల కిచ్చిన దేశములో మీరు నివసించెదరు, మీరు నా జనులై యుందురు నేను మీ దేవుడనై యుందును.

28. పిమ్మట మీ పూర్వీకులకు నేనిచ్చిన దేశంలో మీరు నివసిస్తారు. మీరు నా ప్రజలవుతారు.నేను మీ దేవుడనవుతాను.”

29. మీ సకల మైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును, మీకు కరవురానియ్యక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును.

29. దేవుడు ఇలా చెప్పాడు: “నేను మిమ్మల్ని రక్షిస్తాను. మీరు మలినపడకుండా ఉంచుతాను. ధాన్యం (సమృద్ధిగా) పండేలా నేను ఆజ్ఞ ఇస్తాను. మీ మీదికి కరువును రప్పించను.

30. అన్యజనులలో కరవును గూర్చిన నింద మీరిక నొందకయుండునట్లు చెట్ల ఫలములను భూమిపంటను నేను విస్తరింపజేసెదను.

30. మీ చెట్ల నుండి ఫలసంపద పుష్కలంగా వచ్చేలా చేస్తాను. మీ పొలాలను బహుగా పండిస్తాను. అన్య దేశాలలో మరెన్నడూ మీరు ఆకలి బాధల అవమానాన్ని అనుభవించరు.

31. అప్పుడు మీరు మీ దుష్‌ ప్రవర్తనను మీరు చేసిన దుష్‌క్రియలను మనస్సునకు తెచ్చుకొని, మీ దోషములను బట్టియు హేయక్రియ లను బట్టియు మిమ్మును మీరు అసహ్యించుకొందురు.

31. మీరు చేసిన చెడు కార్యాలను మీరు గుర్తుకు తెచ్చుకుంటారు. మీరు చేసినవి మంచి పనులు కావని తెలుసుకునే జ్ఞానం మీకు కలుగుతుంది. మీరు చేసిన పాపాలకు, మీరు పాల్పడిన భయంకర కృత్యాలకు మిమ్మల్ని మీరే అసహ్యించుకుంటారు.”

32. మీ నిమిత్తము నేను ఈలాగున చేయుటలేదని తెలిసి కొనుడి; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇశ్రా యేలీయులారా, మీ ప్రవర్తననుగూర్చి చిన్నబోయి సిగ్గు పడుడి.

32. నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను, మీ మంచి కొరకు నేనీ పనులేవీ చేయటం లేదు! నా మంచి పేరు నిలుపుకోటానికే వాటిని నేను చేస్తున్నాను! కావున ఇశ్రాయేలు వంశమా, మీరు జీవించిన తీరుకు మీరు సిగ్గుపడి, కలత చెందాలి!”

33. మీ దోషములవలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మును నివసింప జేయునాడు పాడైపోయిన స్థలములు మరల కట్టబడును.

33. నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, “నేను మీ పాపాలను కడిగివేసే రోజున ప్రజలను మీ నగరాలకు తీసుకొని వస్తాను. పాడుబడ్డ నగరాలు తిరిగి నిర్మించబడతాయి.

34. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును.

34. బీడు భూములు సాగుచేయబడతాయి. అది దారిన పోయే వారికి కేవలం శిథిలాల గుట్టలా కన్పించదు.

35. పాడైన భూమి ఏదెను వనమువలె ఆయెననియు, పాడుగాను నిర్జనముగానున్న యీ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములు గలవాయెననియు జనులు చెప్పుదురు.

35. ‘గతంలో ఈ దేశం నాశనమయింది. అది ఇప్పుడు ఏదెను ఉద్యానవనంలా రూపు దిద్దుకున్నది. నగరాలు నాశనం చేయబడ్డాయి. అవి పాడుబడి నిర్మానుష్యమై నాయి. కాని ఇప్పుడవి రక్షిత నగరాలైనవి. వాటిలో ప్రజలు ఇప్పుడు నివసిస్తున్నారు అని వారు చెప్పుకుంటారు.”‘

36. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడ ననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడ ననియు మీ చుట్టు శేషించిన అన్యజనులు తెలిసి కొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చియున్నాను, నేను దాని నెరవేర్తును.

36. దేవుడు ఇలీ చెప్పాడు: “నీ చుట్టూ ఉన్న దేశాలు నేను యెహోవాననీ, ఆ పాడైపోయిన ప్రాంతాలను పునరుద్ధరించాననీ తెలుసుకుంటాయి. ఖాళీగా ఉన్న ఈ నేలలో నేను మొక్కలు నాటాను. నేనే యెహోవాను. నేనే ఈ విషయాలను చెప్పాను.అవి జరిగేలా చేస్తాను.”

37. ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలీయులకు నేను ఈలాగు చేయు విషయములో వారిని నాయొద్ద విచారణచేయనిత్తును, గొఱ్ఱెలు విస్తరించునట్లుగా నేను వారిని విస్తరింపజేసెదను.

37. నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, “ఇశ్రాయేలు వంశం వారు ఇలా జరిగేలా చేయమని నన్ను అడిగేలా కూడ చేస్తాను. వారి సంతానాన్ని బహుగా అభివృద్ధి చేస్తాను. వారు గొర్రెల మందల్లా విస్తరిస్తారు.

38. నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొనునట్లు ప్రతిష్ఠితములగు గొఱ్ఱెలంత విస్తారముగాను, నియామకదినములలో యెరూషలేమునకు వచ్చు గొఱ్ఱెలంత విస్తారముగాను వారి పట్టణములయందు మనుష్యులు గుంపులు గుంపులుగా విస్తరించునట్లు నేను చేసెదను.

38. యెరూషలేములో ప్రత్యేక పండుగల సందర్భంగా తేబడే గొర్రెల, మేకల మందల్లా ఆ ప్రజలు విస్తారంగా ఉంటారు. నగరాలు, పాడుబడిన ప్రాంతాలు తిరిగి జనసందోహాలతో కిటకిటలాడుతాయి. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.”Shortcut Links
యెహెఙ్కేలు - Ezekiel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |