Daniel - దానియేలు 1 | View All

1. యూదారాజగు యెహోయాకీము ఏలుబడిలో మూడవ సంవత్సరమున బబులోనురాజగు నెబుకద్నెజరు యెరూషలేముమీదికి వచ్చి దాని ముట్టడివేయగా

యిర్మియా 25:1 ను బట్టి ఇది యెహోయాకీం పరిపాలనలో నాలుగో సంవత్సరం అని తెలుస్తున్నది. దానికీ దీనికీ కనిపిస్తున్న తేడాను ఈ విధంగా వివరించవచ్చు – బబులోను లెక్కింపు ప్రకారం ఒక రాజు సింహాసనం ఎక్కిన తరువాత వచ్చే కొత్త సంవత్సరం మొదటి రోజునుంచి అతని పరిపాలన కాలం లెక్కగట్టారు. ఇస్రాయేల్‌లోనైతే ఒక రాజు గద్దెనెక్కిన సంవత్సరం కూడా ఒక సంవత్సరంగా పరిగణించారు. ఇక్కడ కనిపించే సంవత్సరం క్రీ.పూ. 605.

2. ప్రభువు యూదారాజగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను, ఆ రాజుచేతి కప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశము లోని తన దేవతాలయమునకు తీసికొనిపోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను.

1 దినవృత్తాంతములు 36:5-7. దానియేలును ఆ సంవత్సరమే బబులోనుకు తీసుకువెళ్ళారు. యెహెజ్కేలును ఎనిమిదేళ్ళ తరువాత తీసుకువెళ్ళారు.

3. రాజు అష్పెనజు అను తన నపుంసకుల యధిపతిని పిలిపించి అతనికీలాగు ఆజ్ఞాపించెను ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై, లోపములేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును గలిగి,

అందరిలోకీ బుద్ధిమంతులు, చురుకైనవారే ఎన్నికయ్యారు. దేవుడు ఎన్నుకునే విధానం ఎంత వేరుగా ఉంది! – 1 కోరింథీయులకు 1:26-29. అయితే రాజాజ్ఞలో దేవుని సదుద్దేశం ఒకటి ఇమిడి ఉంది. ఏమంటే దేవుడు దానియేలును బబులోనులో అత్యున్నత స్థానానికి, అంటే రాజు తరువాత రాజంతటి ఔన్నత్యానికి హెచ్చించాలని నిశ్చయించాడు.

4. తత్వజ్ఞానము తెలిసినవారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి, కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము.

5. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండియు తాను పానముచేయు ద్రాక్షారసములో నుండియు అనుదిన భాగము వారికి నియమించి, మూడు సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన యెదుట నిలువబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను.

“ఆహారంలో నుంచి”– రాజు అనుగ్రహానికి సూచన (దేవుడు తన విశ్వాసుల పట్ల కూడా ఇదే చేస్తాడు – కీర్తనల గ్రంథము 23:5; యెషయా 25:6; లూకా 14:16; ప్రకటన గ్రంథం 19:7).

6. యూదులలోనుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలోనుండిరి.

దానియేలు అంటే “దేవుడు నా న్యాయాధికారి” అని అర్థం. హనన్యా అంటే “యెహోవా దయామయుడు (హీబ్రూలో “యా” శబ్దం యెహోవా అనే అర్థాన్ని ఇస్తుంది). మిషాయేలు అంటే “దేవునితో సమానం ఎవరు”? అజరయా అంటే “యెహోవా ఆదుకొంటాడు”. వారికియ్యబడిన కొత్త పేర్లన్ని ఆయా బబులోను దేవతలకు సంబంధించినవి. బేల్ (లేక బెల్‌) అంటే బబులోను భాషలో ప్రభువు అని అర్థం – ఇతడు బబులోనువారి దేవుడు మరోదాక్ (యిర్మియా 50:2). షద్రకు అంటే “రక్ (వారి సూర్యదేవత) ప్రేరణ” అని గానీ “అకు (వారి చంద్రదేవత) ఆజ్ఞ” అని గానీ అర్థం వస్తుంది. మేషాక్ అంటే “షాక్ (అంటే శుక్రుడు అనే గ్రహం) భక్తుడు” అని గానీ “అకు వంటివాడెవడు” అని గానీ అర్థం వస్తుంది. అబేద్‌నెగో అంటే “నెగో సేవకుడు” (నెగో అంటే నెబో – బబులోనువారి అనేకమంది దేవుళ్ళలో ఒకడు – యెషయా 46:1). ఇలా పేర్లు మార్చడం మనకు సూచిస్తున్నదేమంటే ఆ అధిపతి అభిప్రాయంలో ఇస్రాయేల్‌వారి దేవుడైన యెహోవాకంటే బబులోను దేవుళ్ళే ఎక్కువ బలప్రభావాలు గలవారు.

7. నపుంసకుల యధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలునకు మేషాకనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేళ్లు పెట్టెను.

8. రాజు భుజించు భోజనమును పానముచేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండ సెలవిమ్మని నపుంసకుల యధిపతిని వేడు కొనగా

ఈ ఆహారం, ద్రాక్షమద్యం అపవిత్ర పరచేవని దానియేలు ఎందువల్ల భావించాడంటే వాటిని విగ్రహాలకు ముందుగా అర్పించి తీసుకువచ్చారు. అంతేగాక బబులోనువారు ఇస్రాయేల్‌కు దేవుడిచ్చిన చట్టాల ప్రకారం ఆ మాంసాన్ని సిద్ధం చేసేవారు కాదు (లేవీయకాండము 11:4-20; ద్వితీయోపదేశకాండము 12:23-24). దానియేలు కుర్రాడు, మాతృభూమికి దూరంగా ఉన్నవాడు. దేవునికి కోపం తెప్పించడమా? రాజుకు కోపం తెప్పించడమా? ఈ సమస్య అతనికి ఎదురైంది. ఏమైతేనేం రాజుకే కోపం కలిగితే కలగనియ్యి అని అచంచలమైన ధైర్యంతో నిర్ణయించుకున్నాడు. శారీరికమైన సౌకర్యాలు, భద్రత కంటే అతనికి పవిత్రతే ముఖ్యం. క్రైస్తవులు ఒక్కోసారి ఇతరులు కోపం తెచ్చుకుంటారేమోననీ, లేక తమ స్థానానికీ భద్రతకూ భంగం కలుగుతుందేమోననీ పాపం చెయ్యడానికి సిద్ధపడతారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే వారి జీవితాలకు మార్గదర్శిగా ఉండేది దేవుని పట్ల భయభక్తులు కాదు.

9. దేవుడు నపుంసకుల యధిపతి దృష్టికి దానియేలు నకు కృపాకటాక్షమునొంద ననుగ్రహించెను గనుక నపుంసకుల యధిపతి దానియేలుతో ఇట్లనెను

“దేవుడు”– తనకోసం స్థిరంగా దృఢంగా ఎవరైతే నిలబడతారో వారి పక్షంగా దేవుడు పని చేస్తాడు. ఇది దానియేలు గ్రంథమంతటా కనిపిస్తుంది. యోసేపు విషయం కూడా చూడండి (ఆదికాండము 39:2-4; ఆదికాండము 39:20-23 మొ।।).

10. మీకు అన్నపానములను నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను; మీ ఈడు బాలుర ముఖముల కంటె మీ ముఖములు కృశించినట్లు ఆయనకు కనబడ నేల? అట్లయితే మీరు రాజుచేత నాకు ప్రాణాపాయము కలుగజేతురు.

దానియేలుకు దేవుడంటే భయభక్తులు. కానీ ఆ అధికారికి రాజంటే భయం.

11. నపుంసకుల యధిపతి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారిమీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లనెను.

దానియేలుకు తరువాతి కాలంలో ఖ్యాతినార్జించి పెట్టిన జ్ఞానం ఇప్పటినుంచే బయటపడుతూ ఉంది.

12. భోజనమునకు శాకధాన్యాదులను పానమునకు నీళ్లును నీ దాసులమగు మాకిప్పించి, దయచేసి పది దినములవరకు మమ్మును పరీక్షింపుము.
ప్రకటన గ్రంథం 2:10

13. పిమ్మట మా ముఖములను, రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మాయెడల జరిగింపుము.

14. అందుకతడు ఈ విషయములో వారి మాటకు సమ్మతించి పది దినములవరకు వారిని పరీక్షించెను.
ప్రకటన గ్రంథం 2:10

15. పది దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటె సౌందర్యముగాను కళగాను కనబడగా

ఇది దేవుని మూలంగానే జరిగింది.

16. రాజు వారికి నియమించిన భోజనమును పానముకొరకైన ద్రాక్షా రసమును ఆ నియామకుడు తీసివేసి, వారికి శాకధాన్యా దుల నిచ్చెను.

వారి విషయం చూచుకునే సేవకుడు వారికి అనుకూలంగా ప్రవర్తించేలా దేవుడు చేశాడు. ఆ విధంగా రాజ భోజనం తినాలన్న దుష్ట ప్రేరేపణ, అలా తినకపోతే శిక్షపడే ప్రమాదం తొలగిపోయినది. 1 కోరింథీయులకు 10:13 చూడండి.

17. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్రప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియదానియేలు సకల విధములగు దర్శనములను స్వప్నభావములను గ్రహించు తెలివిగలవాడై యుండెను.

“దేవుడు... ప్రసాదించాడు”– యోబు 32:8; యాకోబు 1:5; 2 పేతురు 3:15. దర్శనాలూ కలలూ మొదలైనవాటి భావం వివరించగల సామర్థ్యం దేవుడు దానియేలుకు ఇచ్చిన ఇతర తెలివితేటలు కాక ఒక ప్రత్యేకమైన వరం.

18. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలెనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల యధిపతి రాజు సముఖమున వారిని నిలువబెట్టెను.

19. రాజు వారితో మాటలాడగా వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వంటివారెవ రును కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి.

“సేవ”– దేవుడు వారిని తన సేవకు కూడా తయారు చేస్తున్నాడు.

20. రాజు వీరియొద్ద విచారణ చేయగా జ్ఞానవివేకముల సంబంధ మైన ప్రతివిషయములో వీరు తన రాజ్యమందంతటనుండు శకునగాండ్రకంటెను గారడీవిద్య గలవారందరికంటెను పది యంతలు శ్రేష్ఠులని తెలియబడెను.

ఇది కేవలం వారి జ్ఞానం, అభ్యాసం వల్ల కలిగినది కాదు. దేవుని అనుగ్రహమే.

21. ఈ దానియేలు కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమువరకు జీవించెను.

క్రీ. పూ. 539. అంటే కోరెషు చక్రవర్తి యూదులు తమ స్వదేశానికి తిరిగివెళ్ళిపోవచ్చునని ప్రకటన జారీ చేసినప్పుడు దానియేలు ఇంకా బ్రతికే ఉన్నాడన్న మాట.Shortcut Links
దానియేలు - Daniel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |