Daniel - దానియేలు 6 | View All

1. తన రాజ్యమంతటిపైన అధిపతులుగా ఉండుటకై నూట ఇరువదిమంది యధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను.

1. తన రాజ్యం అంతటినీ పరిపాలించేందుకు నూట ఇరవైమంది రాజ్యాధికారులను ఎంపిక చేయాలని దర్యావేషు తలంచాడు. అది మంచి ఆలోచన అను కొన్నాడు.

2. వారిపైన ముగ్గురిని ప్రధానులగా నియమించెను; ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగకుండునట్లు ఆ యధిపతులు తప్ప కుండ వీరికి లెక్కలు ఒప్పజెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను.

2. మరియు ఆ నూట ఇరవైమంది రాజ్యాధికారుల మీద ఆధిపత్యం గలవారుగా ముగ్గురిని ఎంపిక చేసాడు. ఆ ముగ్గురు ప్రధానులలో దానియేలు ఒకడు. ఎవ్వరూ తనను మోసగించ కూడదని ఆ ముగ్గురిపైన, మరి ఆ నూట ఇరవైమంది పైన దానియేల్ని అధికారిగా ఎంపిక చేశాడు. అందువల్ల తన రాజ్యంలో ఏమీ తాను నష్టపడేది ఉండదు.

3. ఈ దానియేలు అతిశ్రేష్ఠమైన బుద్ధిగలవాడై ప్రధానుల లోను అధిపతులలోను ప్రఖ్యాతి నొందియుండెను గనుక రాజ్యమంతటిమీద అతని నియమింపవలెనని రాజుద్దే శించెను.

3. రాజు దానియేలును మెచ్చు కొన్నాడు. తన మంచి ప్రవర్తన వల్లను, తన సామర్థ్యం వల్లను దానియేలుకు రాజు అలా చేయగలిగాడు. రాజు దానియేలు వశుడయ్యాడు. రాజ్యమంతతికీ దానియేలును పరిపాలకునిగా చెయ్యాలని తలంచాడు.

4. అందుకా ప్రధానులును అధిపతులును రాజ్య పాలన విషయములో దానియేలుమీద ఏదైన ఒక నింద మోపవలెనని యుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్థుడై యే నేరమైనను ఏ తప్పయినను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పయి నను లోపమైనను కనుగొనలేకపోయిరి.

4. కాని ఈ విషయాన్ని వినగానే ఇతర ప్రధానులు, రాజ్యధి కారులు అసూయ చెందారు. దానియేలులో తప్పుపట్టేందుకు వారు కారణాలు వెదకసాగారు. కనుక రాజ్యంగురించి దానియేలు చేసే పనుల్ని వారు గమనించ సాగారు. కాని దానియేలులో ఏ తప్పూ వారు కనుగొన లేకపోయారు. ప్రజలు విశ్వసించదగిన వ్యక్తి దానియేలు. అతను రాజుని మోసగించలేదు. కష్టించి పని చేసాడు.

5. అందుకా మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందేగాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొన లేమను కొనిరి.

5. చివరికి వారు, “దానియేలుపై తప్పు పట్టేందుకు తగిన కారణం మనమెన్నటికీ కనుగొనలేము. అందువల్ల అతని దేవునికి సంబంధించిన ధర్మం గురించి మనం ఫిర్యాదు చేసేందుకు ఏదో ఒకటి కనుగొనాలి” అని అనుకొన్నారు.

6. కాబట్టి ఆ ప్రధానులును అధిపతులును రాజు నొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి- రాజగు దర్యావేషూ, చిరంజీవివై యుందువుగాక.

6. అందువల్ల ఆ ఇద్దరు ప్రధానులు, రాజ్యాధికారులు ఒక బృందంగా రాజు వద్దకు వెళ్లి, “దర్యావేషు రాజు వర్ధిల్లాలి.

7. రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరును కూడి, రాజొక ఖండితమైన చట్టము స్థిరపరచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా ముప్పది దినములవరకు నీయొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవునియొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు; ఎవడైనను చేసినయెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, nయీ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి

7. ప్రధానులు, రాజ్యాధికారులు, ముఖ్యోద్యోగులు, సలహాదారులు, రాజ్యపాలకులు అందరూ ఒక విషయం సమ్మతించారు. రాజు ఈ చట్టం చెయ్యాలని, ఈ చట్టాన్ని ప్రతి వ్యక్తి పాటించాలని భావిస్తున్నాము. ఆ చట్టం ఇది: ఎవరైనా, రాజువైన నిన్ను తప్ప, వచ్చే ముఫ్పై రోజులదాకా, ఏ దేవున్నిగాని, వ్యక్తినిగాని ప్రార్థించినట్లయితే, ఆ వ్యక్తి సింహాల గుహలోకి త్రోసి వేయబడతాడు.

8. మాదీయులయొక్కయు పారసీకులయొక్కయు పద్ధతి ననుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దానిమీద సంతకము చేయుమని మనవిచేసిరి.

8. రాజా! ఆ చట్టం వ్రాసిన కాగితం మీద సంతకం పెట్టి ఈ విధంగా చట్టం మార్చరానిది, రద్దు చేయరానిది అని ప్రకటించాలి. ఎందుకంటే మాదీయుల మరియు పారసీకుల చట్టాలు మార్చరానివి లేక రద్దు చేయరానివి” అని చెప్పారు.

9. కాగా రాజగు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను.

9. అందువల్ల దర్యావేషు చట్టాన్ని చేసి కాగితంపై సంతకం పెట్టాడు.

10. ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసికొనినను అతడు తన యింటికి వెళ్లి, యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడియుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచువచ్చెను.

10. దానియేలు ప్రతిరోజూ మూడు సార్లు మోకరిల్లి దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉండేవాడు. ఈ క్రొత్త చట్టం గురించి దానియేలు విని, తన ఇంటికి వెళ్లి, తన ఇంటిమీద ఉన్న గదిలో యెరూషలేము వైపుగా తెరచివున్న కిటికీ వద్ద ఎప్పుడూ చేసే విధంగా, మోకరిల్లి దేవుణ్ణి ప్రార్థించాడు.

11. ఆ మనుష్యులు గుంపుకూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థనచేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి

11. అప్పుడు ఆ మనుష్యులు ఒక బృందంగా వెళ్లి దానియేలు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయన సహాయం కోరుతున్నట్లు వారు కనుగొన్నారు. అందువల్ల వారు బృందంగా రాజు వదకు వెళ్లి, రాజు చేసిన చట్టం గురించి వారతనితో మాట్లాడారు.

12. రాజు సముఖమునకు వచ్చి శాసనవిషయమును బట్టిరాజా, ముప్పది దినములవరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడును ప్రార్థన చేయకూడదు; ఎవడైన చేసినయెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా? అని మనవి చేయగా రాజుమాదీయులయొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిప్రకారము ఆ సంగతి స్థిరము; ఎవరును దాని రద్దుపరచజాలరనెను.

12. వారు, “దర్యావేషు రాజా, మీరొక చట్టం జారీ చేశారు. దాని ప్రకారం వచ్చే ముఫ్పై రోజుల్లో ఎవరైనా మిమ్మల్ని కాక ఇతర దేవుణ్ణి గాని వ్యక్తిని గాని ప్రార్థించినట్లయితే, అతను సింహాల గుహలోకి త్రోసి వేయబడతాడు. ఆ చట్టం మీద నీవు సంతకం చేశావు. అవును గదా” అని జ్ఞాపకం చేశారు. “అవును, నేను ఆ చట్టం మీద సంతకం చేసి మాదీయుల, పారసీకుల చట్టాలు రద్దు చేయరానివి లేక మార్చరానివి” అని ప్రకటించానని రాజు బదులు చెప్పాడు.

13. అందుకు వారుచెరపట్ట బడిన యూదులలోనున్న ఆ దానియేలు, నిన్నేగాని నీవు పుట్టించిన శాసనమునేగాని లక్ష్యపెట్టక, అనుదినము ముమ్మారు ప్రార్థనచేయుచు వచ్చుచున్నాడనిరి.

13. అప్పుడు ఆ మనుష్యులు రాజుతో, “యూదా నుంచి తీసుకొని రాబడిన బందీలలో దానియేలు అనబడే ఆ వ్యక్తి మీ మాటలపట్ల శ్రద్ధ వహించ లేదు. మీరు చేసిన చట్టాన్ని పాటించ లేదు. ప్రతిరోజూ అతనింకా మూడుసార్లు తన దేవుని స్తుతిస్తున్నాడు” అని చెప్పారు.

14. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి, దానియేలును రక్షింపవలెనని తన మనస్సు దృఢముచేసికొని, సూర్యుడస్తమించువరకు అతని విడిపించుటకు ప్రయత్నము చేసెను.

14. ఇది వినగానే రాజు చాలా విచారించి, దానియేలును రక్షించడానికి నిశ్చయించాడు. దానియేలును కాపాడేందుకు సూర్యాస్తమయం వరకు ఒక ఉపాయం కోసం రాజు ప్రయత్నించాడు, కాని ప్రయోజనం లేకపోయింది.

15. ఆ మనుష్యులు దీని చూచి రాజసన్నిధికి సందడిగా కూడి వచ్చిరాజా, రాజు స్థిరపరచిన యే శాసనము గాని తీర్మానము గాని యెవడును రద్దుపరచజాలడు; ఇది మాదీయులకును పారసీకులకును విధియని తమరు తెలిసి కొనవలెననిరి.

15. తర్వాత ఆ మనుష్యులు ఒక బృందంగా రాజు వద్దకు వెళ్లారు. “రాజా, గుర్తుంచుకో. మాదీయుల, పారసీకుల చట్టం చెబుతున్నదేమనగా, రాజు చేసిన చట్టాన్ని మార్చుటకు రద్దు చేయుటకు వీలులేదు” అని వారు చెప్పారు.

16. అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొనిపోయి సింహముల గుహలో పడద్రోసిరి; పడద్రోయగా రాజునీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను.

16. అందువల్ల రాజైన దర్యావేషు ఆజ్ఞ ప్రకారం దానియేలును తీసుకొని వచ్చి సింహాల గుహలోకి త్రోసివేశారు. రాజు దానియేలుతో ఇట్లన్నాడు: “నీవు నిరంతరం ఆరాధించే నీ దేవుడే నిన్ను రక్షిస్తాడని భావిస్తున్నాను.”

17. వారు ఒక రాయి తీసికొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాని మూసిరి; మరియదానియేలును గూర్చి రాజుయొక్క తీర్మానము మారునేమోయని, రాజు ముద్రను అతని యధికారుల ముద్రను వేసి దాని ముద్రించిరి.

17. ఒక పెద్ద బండను తీసుకువచ్చి, దానిని సింహాల గుహ యొక్క ద్వారం మీద ఉంచారు. తర్వాత రాజు తన ఉంగరంతోను, మరియు తన ఉద్యోగుల ఉంగరాలతోను ఆ బండమీద ముద్రలు వేశారు. ఎవ్వరూ బండను తొలగించి, దానియేలును సింహాల గుహనుంచి వెలుపలికి తీసుకు రాకూడదని ఇలా చేశారు.

18. అంతట రాజు తన నగరునకు వెళ్లి ఆ రాత్రి అంత ఉపవాసముండి నాట్యవాయిద్యములను జరుగ నియ్యలేదు; అతనికి నిద్రపట్టకపోయెను.

18. తర్వాత దర్యావేషు రాజు తన ఇంటికి మరలి పోయాడు. ఆ రాత్రి రాజు భోజనం చేయలేదు. ఎవ్వరూ ఆ రాత్రి తనకు వినోదాన్ని కలిగించకూడదని అదేశించాడు. ఆ రాత్రంతా రాజు నిద్ర పోలేదు.

19. తెల్లవారు జామున రాజు వేగిరమే లేచి సింహముల గుహదగ్గరకు త్వరపడిపోయెను.

19. ఆ మరునాటి ఉదయం రాజైన దర్యావేషు వెలుతురు వస్తూండగా సింహాల గుహవద్దకు పరుగెత్తుకు వెళ్లాడు.

20. అతడు గుహదగ్గరకు రాగానే, దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి జీవముగల దేవుని సేవ కుడవైన దానియేలూ, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా? అని యతనిని అడిగెను.

20. రాజు చింతాక్రాంతుడుగా సింహాల గుహవద్దకు వెళ్లి దానియేలును ఇలా పిలిచాడు: “సజీవుడగు దేవుని సేవకుడవైన దానియేలూ, నీవెప్పుడూ ఆరాధించే నీ దేవుడు నిన్ను సింహాల బారినుండి కాపాడగలిగెనా?”

21. అందుకు దానియేలురాజు చిరకాలము జీవించునుగాక.
2 తిమోతికి 4:17

21. “రాజా, నీవు చిరకాలము వర్ధిల్లాలి!

22. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి, సింహములు నాకు ఏహానియు చేయకుండ వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసినవాడను కాను గదా అనెను.
హెబ్రీయులకు 11:33

22. నా దేవుడు నన్ను రక్షించడానికి తన దూకను పంపి సింహాల నోళ్లను మూసివేశాడు. నా దేవునికి నేను కళంకరహితుణ్ణి అని తెలుసు, కనుకనే సింహాల నన్ను గాయపరచలేదు. రాజా, నీకెప్పుడూ నేను అన్యాయం చెయ్యలేదు”అని దానియేలు బదులు చెప్పాడు.

23. రాజు ఇందునుగూర్చి యతి సంతోషభరితుడై దానియేలును గుహలోనుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తిగలవాడైనందున అతనికి ఏ హానియు కలుగ లేదు.

23. దర్యావేషు రాజు చాలా సంతోషించాడు. సింహాల గుహనుండి దానియేలును పైకి తీయవలసిందిగా రాజు తన సేవకుల్ని ఆజ్ఞాపించాడు. వారు గుహనుండి దానియేలుని పైకి తీయగా, వారతని దేహంమీద ఎలాంటి గాయాన్ని చూడలేదు. దానియేలు తన దేవున్ని విశ్వసించిన కారణంగా, అతనికి సింహాలవల్ల ఎలాంటి హాని జరగలేదు.

24. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలుమీద నింద మోపిన ఆ మనుష్యులను వారు తోడుకొనివచ్చి సింహముల గుహలో పడద్రోసిరి, వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. వారా గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలైరి, సింహములు వారి యెముకలను సహితము పగులగొరికి పొడిచేసెను.

24. తర్వాత దానియేలుని సింహాల గుహకు పంపడానికి కారణమైన ఆ మనుష్యుల్ని తీసురురమ్మని రాజు ఆజ్ఞాపించాడు. సింహాల గుహలోకి ఆ మనుష్యులను, వారి భార్యలను, వారి సంతానాన్ని త్రోసివేయగా వారు సింహాల గుహ అడుగుభాగం తాకక ముందే సింహాలు వారి శరీరాలను కబళించి వారి ఎముకల్ని విరుగగొట్టాయి.

25. అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతట నివసించు సకలజనులకును రాష్ట్రములకును ఆ యా భాషలు మాట లాడువారికిని ఈలాగు వ్రాయించెను మీకు క్షేమాభి వృద్ధి కలుగునుగాక.

25. తర్వాత ప్రపంచమంతటా విభిన్న భాషలు మాట్లాడే ఆ మనుష్యులకందరికీ రాజైన దర్వావేషు ఈ క్రింది లేఖను వ్రాశాడు: అందురికి శుభమగు గాక!

26. నా సముఖమున నియమించిన దేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలుయొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకుచుండవలెను. ఆయనే జీవముగల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనముకానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టున కుండును.
1 పేతురు 1:23, ప్రకటన గ్రంథం 4:9-10

26. నేనిప్పుడు క్రొత్త చట్టం చేస్తున్నాను. నా రాజ్యంలో ఏ భాగంలో నివసించే వారికైనా ఇది వర్తిస్తుంది. మీరందరూ దానియేలు యొక్క దేవునికి భయపడి వణకాలి. దానియేలు దేవుడే సజీవుడు. ఆయన ఎప్పుడూ జీవిస్తాడు. ఆయన రాజ్యం ఎన్నటికీ నశించదు, ఆయన పరిపాలన అంతం కాదు.

27. ఆయన విడిపించువాడును రక్షించు వాడునైయుండి, పరమందును భూమిమీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోటనుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను.

27. దేవుడు ప్రజలకు సహాయం చేస్తాడు, రక్షిస్తాడు. ఆయన ఆశ్చర్యాలను, అద్భుతాలను పరలోక మందునూ, భూమి మీదనూ చేస్తాడు. దేవుడు దానియేలును సింహాలనుండి రక్షించాడు.

28. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరెషు ప్రభుత్వ కాలమందును వర్థిల్లెను.

28. అందువల్ల దర్యావేషు రాజుగా ఉన్న కాలంలోనూ, పారశీకుడైన కోరెషు రాజుగావున్న కాలంలోనూ దానియేలు అభివృద్ధి చెందాడు.Shortcut Links
దానియేలు - Daniel : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |