Hosea - హోషేయ 9 | View All

1. ఇశ్రాయేలూ, అన్యజనులు సంతోషించునట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు; నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి, నీ కళ్లములన్నిటిమీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపుకూలిని ఆశించితివి.

“సంతోషించవద్దు”– దేవుని తీర్పు వారిపైకి విరుచుకు పడనుండగా సంతోషించడం మూర్ఖత్వం అవుతుంది. “వ్యభిచారిణి”– ఈ పుస్తకంలో మళ్ళీ మళ్ళీ కనిపించే అంశం ఇది (హోషేయ 1:2; హోషేయ 2:2; హోషేయ 3:1; హోషేయ 4:1, హోషేయ 4:10, హోషేయ 4:12, హోషేయ 4:15; హోషేయ 5:3-4).

2. కళ్ళములుగాని గానుగలు గాని వారికి ఆహారము నియ్యవు; క్రొత్త ద్రాక్షారసము లేకపోవును.

3. ఎఫ్రాయిమీయులు ఐగుప్తు నకు మరలుదురు, అష్షూరు దేశములో వారు అపవిత్ర మైన వాటిని తిందురు, యెహోవా దేశములో వారు నివసింపకూడదు.

ఇస్రాయేల్ దేశం “యెహోవా దేశం”– అక్కడ ఎవరు నివసించారో ఎవరు ఉండకూడదో ఆయనే ఎన్నుకుంటాడు. “ఈజిప్ట్”– హోషేయ 8:13. “అష్షూరు”– 2 రాజులు 17:3-6. “అశుద్ధమైన వాటిని”– లేవీ 11వ అధ్యాయం చూడండి.

4. యెహోవాకు ద్రాక్షారస పానార్పణమును వారర్పింపరు వారర్పించు బలులయందు ఆయన కిష్టములేదు, వారు ఆహారముగా పుచ్చుకొనునది ప్రలాపము చేయువారి ఆహారమువలెనగును, దాని భుజించు వారందరు అపవిత్రులగుదురు; తమ ఆహారము తమకే సరిపడును గాని అది యెహోవా మందిరములోనికిరాదు.

“శోకించే... అశుద్ధులౌతారు”– సంఖ్యాకాండము 19:14; ద్వితీయోపదేశకాండము 26:14; యిర్మియా 16:7. “ఆలయానికి”– అప్పుడు ఆలయం ఒక్కటే ఉంది. అది జెరుసలంలో ఉంది. వారు వెళ్ళనున్నది అక్కడికి కాదు.

5. నియామక దినములలోను యెహోవా పండుగ దినముల లోను మీరేమి చేతురు?

“నియామక ఉత్సవాలు”– లేవీ 23 అధ్యాయం.

6. లయము సంభవించినందున జనులు వెళ్లి పోయి యున్నారు; ఐగుప్తుదేశము వారికి కూడు స్థలముగా ఉండును; నొపు పట్టణమువారికి శ్మశాన భూమిగా నుండును; వెండిమయమైన వారి ప్రియవస్తువు లను దురదగొండ్లు ఆవరించును; ముండ్లకంప వారి నివాస స్థలములో పెరుగును.

“ఈజిప్ట్”– హోషేయ 8:13. ఉత్తర ఈజిప్ట్‌కు మెంఫెస్ రాజధాని. “ముండ్ల మొక్కలు”– హోషేయ 2:12; హోషేయ 5:9; హోషేయ 10:8.

7. శిక్షా దినములు వచ్చేయున్నవి; ప్రతికార దినములు వచ్చేయున్నవి; తాము చేసిన విస్తార మైన దోషమును తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియు, దురాత్మ ననుసరించిన వారు వెఱ్ఱివారనియు ఇశ్రాయేలువారు తెలిసికొందురు.
లూకా 21:22

“రానే వచ్చాయి”– హోషేయ 5:9; ద్వితీయోపదేశకాండము 32:35. “విరోధ భావం”– లేవీయకాండము 26:21, లేవీయకాండము 26:23, లేవీయకాండము 26:27. రోమీయులకు 8:7; యాకోబు 4:4; కీర్తనల గ్రంథము 51:4 పోల్చి చూడండి. “దైవావేశం వల్ల పలికేవాడు”– అంటే ప్రవక్తే. ఆదికాండము 20:7; 2 పేతురు 1:21 నోట్స్. దేవుని పక్షంగా మాట్లాడేవాళ్ళు తెలివితక్కువ వారనీ, పిచ్చివారనీ ఇస్రాయేల్‌ప్రజ భావించారు. 2 రాజులు 9:11; యిర్మియా 29:26-27; 1 కోరింథీయులకు 4:10.

8. ఎఫ్రాయిము నా దేవునియొద్దనుండి వచ్చు దర్శనములను కనిపెట్టును; ప్రవక్తలు తమ చర్యయంతటిలోను వేటకాని వలవంటివారై యున్నారు; వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు.

“ఎఫ్రాయిం”– హోషేయ 4:17 నోట్. ప్రజలను హెచ్చరించిన దేవుని నమ్మకమైన ప్రవక్తలందరికీ వలలు, పగ ఎదురయ్యాయి. యిర్మీయా జీవిత చరిత్రలో ఇది స్పష్టంగా కనిపించింది. “కావలివాడు”– యెషయా 56:10; యిర్మియా 6:17; యెహెఙ్కేలు 3:17; యెహెఙ్కేలు 33:2-8. ప్రవక్త “దేవునితో బాటు” కావలివాడన్న సంగతి గమనించండి. దేవుడు అందరికీ పైగా ఉన్న కావలివాడు.

9. గిబియాలో చెడుకార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గు లైరి; యెహోవా వారి దోషమును జ్ఞాపకము చేసికొను చున్నాడు, వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును.

“గిబియా”– న్యాయాధి 19–21 అధ్యాయాలు చూడండి. ఇస్రాయేల్ చరిత్ర అంతటిలోనూ వారు ఎక్కువగా చెడిపోయిన కాలం అదే. “మరవడు”– హోషేయ 7:2; హోషేయ 8:13; హోషేయ 13:12. “శిక్షిస్తాడు”– శిక్షించేందుకు దేవుడు అంత ఉత్సాహం చూపడు గాని న్యాయ విధి నెరవేరేందుకు అలా చెయ్యక తప్పదు (నిర్గమకాండము 34:6-7).

10. అరణ్యములో ద్రాక్షపండ్లు దొరికినట్లు ఇశ్రాయేలువారు నాకు దొరికిరి; చిగురుపెట్టు కాలమందు అంజూరపు చెట్టుమీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు బయల్పెయోరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొనిరి; తాము మోహించినదానివలెనే వారు హేయులైరి.

“కనుక్కొన్నప్పుడు”– ఈజిప్ట్ నుండి బయటికి వచ్చినప్పుడు ఒక జాతిగా ఇస్రాయేల్‌వారి ఆరంభాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వారిని తన ప్రజగా చేసుకోవడంలో ఆయన ఆనందించాడు. “బేల్ పెయోరు”– సంఖ్యాకాండము 25:1-5. హేయమైన, నీచమైన విగ్రహాన్ని పూజించేలా దిగజారారు (బయల్ గురించి నోట్ న్యాయాధిపతులు 2:11). అవినీతిపరుడైన ఒక “దేవుణ్ణి” సేవిస్తూ తామే అవినీతిపరులయ్యారు.

11. ఎఫ్రాయిముయొక్క కీర్తి పక్షివలె ఎగిరి పోవును; జననమైనను, గర్భముతో ఉండుటయైనను, గర్భము ధరించుటయైనను వారికుండదు.

ఇస్రాయేల్ సంఖ్యలోను శక్తిలోను సంపదలోనూ క్షీణిస్తుంది.

12. వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరును లేకుండ అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసెదను; నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును.

“నా ముఖం త్రిప్పినప్పుడు”– హోషేయ 5:15. ఏ ప్రజలకైనా సంభవించే ఆపదల్లో ఇది అతి భయంకరమైనది. “బాధ తప్పదు”– హోషేయ 7:13.

13. లోయలో స్థాపింపబడిన తూరువంటి స్థానముగా నుండుటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకొంటిని; అయితే నరహంతకుల కప్పగించుటకై అది దాని పిల్లలను బయటికి తెచ్చును.

“తూరు”– యెహెఙ్కేలు 27:1-25 చూడండి. “సంహారానికి”– దాని పాపాల మూలంగా ఇస్రాయేల్‌కు దాని పిల్లల సంహారం ప్రాప్తిస్తుంది. అందుకు బాధ్యత దానిదే అవుతుంది.

14. యెహోవా, వారికి ప్రతికారము చేయుము; వారికి నీవేమి ప్రతికారము చేయుదువు? వారి స్త్రీలను గొడ్రాండ్రు గాను ఎండు రొమ్ములు గల వారినిగాను చేయుము.

ఇప్పటిదాకా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు హోషేయ మాట్లాడుతున్నాడు. ఇలాంటి ప్రార్థనల గురించి కీర్తనల గ్రంథము 35:8 నోట్ చూడండి.

15. వారి చెడుతనమంతయు గిల్గాలులో కనబడుచున్నది; అచ్చటనే నేను వారికి విరోధినైతిని, వారి దుష్టక్రియలను బట్టి వారి నికను ప్రేమింపక నా మందిరములోనుండి వారిని వెలివేతును; వారి యధిపతులందరును తిరుగుబాటు చేయువారు.

మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు. “గిల్గాల్”– హోషేయ 4:15. అది విగ్రహ పూజా కేంద్రం. “అసహ్యించుకొన్నాను”– ఇస్రాయేల్ ప్రజ తనను విడిచి నిజం కాని దేవుళ్ళను పూజిస్తే సరిగ్గా ఇదే జరుగుతుందని దేవుడు చెప్పాడు (లేవీయకాండము 26:30). మలాకీ 1:3 దగ్గర నోట్. కీర్తనల గ్రంథము 5:5; కీర్తనల గ్రంథము 45:7; సామెతలు 6:16 పోల్చిచూడండి. “ప్రేమతో చూడను”– హోషేయ 1:6.

16. ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమియ్యరు. వారు పిల్లలు కనినను వారి గర్భనిధిలోనుండివచ్చు సొత్తును నేను నాశనము చేసెదను.

“ఫలం రాదు”– హోషేయ 10:1; యూదా 1:12.

17. వారు నా దేవుని మాటల నాలకించలేదు గనుక ఆయన వారిని విసర్జించెను. వారు దేశము విడిచి అన్యజనులలో తిరుగుదురు.

మళ్ళీ హోషేయ మాట్లాడుతున్నాడు. “త్రోసివేశాడు”– 2 రాజులు 17:15, 2 రాజులు 17:20; యిర్మియా 6:30. “తిరుగుతూ”– యూదుల చరిత్రలో చాలా భాగం ఇదే జరిగింది.Shortcut Links
హోషేయ - Hosea : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |