Leviticus - లేవీయకాండము 1 | View All

1. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడార ములోనుండి అతనికీలాగు సెలవిచ్చెను.

2. నీవు ఇశ్రా యేలీయులతో ఇట్లనుముమీలో ఎవరైనను యెహో వాకు బలి అర్పించునప్పుడు, గోవులమందలోనుండిగాని గొఱ్ఱెల మందలోనుండిగాని మేకల మందలోనుండిగాని దానిని తీసికొని రావలెను.

ఈ పుస్తకం మొదటి ఏడు అధ్యాయాల్లో 5 రకాల అర్పణలు గురించిన వివరణ ఉంది – హోమబలి, నైవేద్యం, శాంతిబలి, పాపాలకోసం బలి, అపరాధబలి. వీటిలో హోమబలి, నైవేద్యం, శాంతిబలి యెహోవాకు ఇంపైన పరిమళం అని రాసివుంది. మిగతా రెండూ ఇంపైనవి కావు. ఈ అయిదింటిలో ఏదీ పాపాలను పూర్తిగా తీసేసి, అర్పించిన వ్యక్తిని దేవుని సన్నిధిలో యోగ్యుడుగా, నిర్దోషిగా నిలబెట్టలేకపోయింది (హెబ్రీయులకు 10:1 హెబ్రీయులకు 10:4). ఈ అర్పణలను తేవడం ద్వారా ఒక వ్యక్తి పాపక్షమనూ దేవునితో సహవాసాన్నీ పొందాలన్న తన కోరికనూ తన నమ్మకాన్నీ ప్రదర్శించాడు. నమ్మిన వ్యక్తి తెచ్చిన అర్పణలను దేవుడు చూచి అతని పాపాలను కప్పివేసి అతణ్ణి క్షమించాడు. ఈ అర్పణలన్నీ దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తును సూచిస్తాయి. తనకు ముందూ, తరువాత కూడా జీవించిన తన ప్రజల పాపాలను తొలగించడం కోసం ఆయన బలి అర్పణ అయ్యాడు (యోహాను 1:29 యెషయా 53:7 ఎఫెసీయులకు 5:2 హెబ్రీయులకు 10:12 1 పేతురు 1:19 ప్రకటన గ్రంథం 5:6 ప్రకటన గ్రంథం 5:8 ప్రకటన గ్రంథం 5:9 ప్రకటన గ్రంథం 5:12) దేవుని సన్నిధికి తగినవారుగా మనుషులను చేసేది క్రీస్తు చేసిన ఒక్క అర్పణే (హెబ్రీయులకు 10:14 హెబ్రీయులకు 10:19-22). సిలువ మీద క్రీస్తు ఇచ్చిన ఒక్క అర్పణలోని ఐదు విషయాలకు ఈ పుస్తకంలో కనిపించే అయిదు రకాల అర్పణలు సూచనలు. ప్రతి అర్పణలోనూ సూచనలు లేక పోలికలు కనిపిస్తున్నాయి. వీటిలో కొన్ని స్పష్టంగా తెలుస్తున్నాయి. కొన్ని అస్పష్టంగానే ఉన్నాయి. వీటి అర్థాలేమై ఉండవచ్చో దేవుడు మాకు ఇచ్చిన జ్ఞానంప్రకారం ఇస్తున్నాం. చదివేవారు ప్రార్థనా పూర్వకంగా వాక్కులను సరిపోల్చుకుని ఎవరికి వారే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.

3. అతడు దహనబలిరూపముగా అర్పించునది గోవులలోనిదైనయెడల నిర్దోషమైన మగ దానిని తీసికొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వార మునకు దానిని తీసికొని రావలెను.

హోమబలి దేవుని పట్ల క్రీస్తు చూపిన సంపూర్ణ విధేయతకు సూచన. దేవుని పట్ల ఆయనకున్న ప్రేమ మూలంగా ఆయన ఇష్టపూర్వకంగా దేవునికి తనను తాను సమర్పించుకొన్నాడు (మత్తయి 26:39 యోహాను 6:38 యోహాను 10:11 యోహాను 10:17 యోహాను 10:18 హెబ్రీయులకు 10:5-7). ఈ హోమబలిని బలిపీఠం పై పూర్తిగా దహించారు. 13వ వచనం నోట్ చూడండి. “గోవు”– ఎదురు చెప్పకుండా పని చేసే స్వభావానికి సూచన అయి ఉండవచ్చు. ఇక్కడ తండ్రి అయిన దేవునికి విధేయుడైన క్రీస్తును ఇది సూచిస్తున్నది (ఫిలిప్పీయులకు 2:5-8). “లోపం లేని”– క్రీస్తుకు ఏ పాపమూ, లోపమూ లేని మానవ స్వభావం ఉంది. ఇది దాన్ని సూచిస్తున్నది. (లూకా 23:4 యోహాను 8:46 2 కోరింథీయులకు 1:5-21 హెబ్రీయులకు 4:15 హెబ్రీయులకు 7:26 1 పేతురు 1:19 1 పేతురు 2:22 1 యోహాను 3:5).

4. అతడు దహనబలిగా అర్పించు పశువు తలమీద తన చెయ్యినుంచవలెను; అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్ష ముగా అంగీకరింపబడును.

లేవీయకాండము 3:2 లేవీయకాండము 3:8 నిర్గమకాండము 29:10 నిర్గమకాండము 15:19 చేతులుంచడం అనేది బలి అర్పించేవాడి స్థానంలో ఆ బలి అంగీకారంగా ఉండేందుకు సూచనగా ఉంది. ఆ వ్యక్తి చావవలసి ఉండగా అతనికి బదులు ఆ పశువు చనిపోయింది. క్రీస్తు మనకు బదులుగా చనిపోయాడు (2 కోరింథీయులకు 5:14-15 గలతియులకు 2:20). ఆయన తలపైన మన చేతులుంచాలి. అంటే మన బలియాగమైన ఆయన్ను స్వీకరించాలి. అలా కానిపక్షంలో ఆయన తనను తాను అర్పించుకొన్న బలి మనలను రక్షించదు. “పాపాలను కప్పివేయడం”– లేవీయకాండము 4:20 లేవీయకాండము 4:26 లేవీయకాండము 4:31 లేవీయకాండము 16:6 లేవీయకాండము 16:16 లేవీయకాండము 16:30 లేవీయకాండము 16:34. నిర్గమకాండము 29:33 నోట్ చూడండి. బలిపీఠం క్రీస్తు మరణించిన సిలువకు సూచన. నిర్గమకాండము 27:1-8 నోట్ చూడండి.

5. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తరువాత యాజకులైన అహ రోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠముచుట్టు ఆ రక్తమును ప్రోక్షింపవలెను.

యాజుల గురించిన వివరణకోసం నిర్గమకాండము 28:1 నోట్ చూడండి. ఇక్కడ యాజులు, అర్పణ కూడా క్రీస్తుకు గుర్తు. తనను తాను అర్పణగా ఇచ్చే సందర్భంలో యాజి ధర్మం వహించినదీ క్రీస్తే. మత్తయి 26:26-28 యోహాను 6:51 హెబ్రీయులకు 7:26-27 హెబ్రీయులకు 9:11-14. పాత ఒడంబడిక బలుల్లో రక్తం అర్పణ విషయం ఎక్కడ వచ్చినా అది క్రీస్తు రక్తానికి సూచన (మత్తయి 26:28 రోమీయులకు 3:25 హెబ్రీయులకు 9:12 హెబ్రీయులకు 9:14 హెబ్రీయులకు 9:22).

6. అప్పుడతడు దహనబలిరూపమైన ఆ పశుచర్మమును ఒలిచి, దాని అవయవములను విడదీసిన తరువాత

లేవీయకాండము 7:8 నోట్ చూడండి.

7. యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠము మీద అగ్నియుంచి ఆ అగ్నిమీద కట్టెలను చక్కగా పేర్చవలెను.

లేవీయకాండము 6:8-13. నిప్పు దేవుని పవిత్రతకు గుర్తు. నిర్గమకాండము 3:2 నోట్.

8. అప్పుడు యాజకులైన అహరోను కుమా రులు ఆ అవయవ ములను తలను క్రొవ్వును బలిపీఠము మీదనున్న అగ్నిమీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను. దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలెను.

9. అది యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలియగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠముమీద దహింపవలెను.

“కడగాలి”– సంఖ్యాకాండము 15:8-10 సంఖ్యాకాండము 28:11-14. బైబిల్లో నీరు దేవుని పవిత్రాత్మకు, దేవుని వాక్కుకు గుర్తు. “పరిమళం”– లేవీయకాండము 8:21 నిర్గమకాండము 29:18-25 సంఖ్యాకాండము 15:3. ఇది దేవునికి ఇంపైన పరిమళం. ఎందుకంటే ఇది క్రీస్తు చూపిన పరిపూర్ణ విధేయత, సమర్పణలకు సూచన (ఎఫెసు 5:2). అర్పణగా ఉన్న క్రీస్తు కారణంగా దేవునికి కలిగిన ఆనందాన్ని పరిమళంగా ఉన్న ఈ అర్పణలు సూచిస్తున్నాయి. పరిమళం కాని అర్పణలు ఏవంటే పాపాలకోసమైన బలి, అపరాధ బలి. పాపుల స్థానంలో ఉన్న క్రీస్తును ఈ రెండు బలులూ సూచిస్తున్నాయి. అంటే క్రీస్తు మనకోసం పాపంగానూ (2 కోరింథీయులకు 5:21), శాపంగానూ (గలతియులకు 3:13) అయిన విషయాన్ని సూచిస్తున్నాయి. ఆ విధంగా క్రీస్తు తొలగించిన పాపం, అపరాధం, శాపం అంటే దేవునికి పరిమళంగా ఉండవు.

10. దహనబలిగా అతడు అర్పించునది గొఱ్ఱెలయొక్కగాని మేకలయొక్క గాని మందలోనిదైన యెడల అతడు నిర్దోష మైన మగదాని తీసికొని వచ్చి

“గొర్రె”– గొర్రెపిల్లగా బలి అయిన క్రీస్తు కనపరచిన సౌమ్యత, సాధుగుణాలను సూచిస్తున్నదేమో (యెషయా 53:7 మత్తయి 27:12-14). “మేక”– బైబిల్లో దేవుని ప్రజలను గొర్రెలుగానూ (కీర్తనల గ్రంథము 95:7 కీర్తనల గ్రంథము 100:3 యోహాను 10:7 యోహాను 10:11 యోహాను 10:14-16 యోహాను 21:16 హెబ్రీయులకు 13:20) పాపాత్ములను మేకలనుగానూ (మత్తయి 25:31-33 మత్తయి 25:41) చెప్పడం కనిపిస్తున్నది. హోమబలిగా మేకను అర్పించడం అంటే పాపులకు బదులుగా వారి స్థానంలో ఉండి ఆ పాపులు దేవునిపట్ల చూపవలసిన విధేయతను చూపిన క్రీస్తును సూచిస్తూ ఉండవచ్చు (యెషయా 53:12 లూకా 23:33).

11. బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. యాజకులగు అహరోను కుమారులు బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.

12. దాని అవయవములను దాని తలను క్రొవ్వును విడదీసిన తరువాత యాజకుడు బలిపీఠముమీద నున్న అగ్నిమీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను.

13. దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడుగవలెను. అప్పుడు యాజకుడు దానినంతయు తెచ్చి బలిపీఠముమీద దానిని దహింపవలెను. అది దహనబలి, అనగా యెహో వాకు ఇంపైన సువాసనగల హోమము.

కొన్ని ఇతర అర్పణలలాగా కాక దీన్ని బలిపీఠం మీద పూర్తిగా కాల్చేశారు. అయిదు అర్పణలలో ఇదొక్కటే యాజులు తినకూడనిది. పాపాలకోసం ఏ బలిరక్తాన్ని ప్రముఖ యాజి పవిత్ర స్థలంలోకి తీసుకుపోయాడో ఆ బలి మాంసం కూడా యాజులు తినకూడనిది. పాపాల కోసం ఇతర బలుల మాంసాన్నీ ఇతర అర్పణలనూ వీరు తినవచ్చు. (యాజులు తమ నిమిత్తం అర్పించిన వాటిని మాత్రం తినకూడదు.) హోమబలి మాత్రం కేవలం దేవుని కోసమే. అంటే క్రీస్తు బలియాగంలోని ఒక భాగం కేవలం దేవుని కోసం మాత్రమే అన్నమాట (యోహాను 8:29 యోహాను 17:4).

14. అతడు యెహోవాకు దహనబలిగా అర్పించునది పక్షి జాతిలోనిదైనయెడల తెల్ల గువ్వలలో నుండిగాని పావు రపు పిల్లలలో నుండిగాని తేవలెను.

పశువులనూ గొర్రెలనూ మేకలనూ తీసుకురాలేని పేదలు గువ్వలనూ పావురాలనూ తేవచ్చు (లేవీయకాండము 5:7 లేవీయకాండము 12:8). యేసు పుట్టుక సమయంలో మరియ, యోసేపులు అర్పించినది పావురాలనే. వీరు పేదలని ఇందువల్ల తెలుస్తున్నది (లూకా 2:22-24). బైబిల్లో గువ్వలకూ పావురాలకూ శోకంతోను, అమాయకత్వంతోను, నిష్కాపట్యంతోను సంబంధం ఉంది (యెషయా 38:14 యెషయా 59:11). ఇవి రెండూ బహుశా దుఃఖ భారాన్ని మోసే క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాయి (యెషయా 53:3 మత్తయి 23:37 హెబ్రీయులకు 5:7).

15. యాజకుడు బలి పీఠముదగ్గరకు దాని తీసికొనివచ్చి దాని తలను త్రుంచి బలిపీఠముమీద దాని దహింపవలెను, దాని రక్తమును బలి పీఠము ప్రక్కను పిండవలెను.

16. మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి బలి పీఠము తూర్పుదిక్కున బూడిదెను వేయుచోట దానిని పారవేయవలెను.

17. అతడు దాని రెక్కలసందున దాని చీల్చవలెను గాని అవయవ విభాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠముమీద, అనగా అగ్ని మీది కట్టెలపైని దానిని దహింపవలెను. అది దహనబలి, అనగా యెహో వాకు ఇంపైన సువాసనగల హోమము.

హోమబలి క్రీస్తుకు గుర్తుగా ఉన్నప్పటికీ, ఆయన్ను నమ్మినవారు ఎలా ఉండాలి, ఏమి చెయ్యాలి అన్న విషయాన్ని కూడా ఇది వెల్లడిస్తున్నది (రోమీయులకు 12:1-2).Shortcut Links
లేవీయకాండము - Leviticus : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |