వీటిని బట్టీ ఇంకా ఈ అధ్యాయంలోని మరి కొన్ని వచనాలను బట్టీ చూస్తే 9వ అధ్యాయంలో చెప్పినట్టు అహరోను, అతని కుమారులు తమ ధర్మవిధులను ఆరంభించిన ఆ పవిత్ర దినానే ఈ సంఘటన జరిగింది అనవచ్చు. నాదాబు, అబీహులు చేసిన పాపం ఏమిటో పూర్తిగా వివరించలేదు. వాళ్ళు తమ ధూపార్తుల్లో చట్ట విరుద్ధమైన నిప్పును ఉంచుకొని ధూపద్రవ్యాన్ని వేశారని మాత్రం ఉంది. లేవీయకాండము 16:12 ప్రకారం ధూపం వెయ్యడానికి ఉపయోగించవలసిన నిప్పు యెహోవా సన్నిధానంలో ఉన్న ఇత్తడి బలిపీఠం మీది నుంచే తీసుకోవాలి. (దీని అంతరార్థం ఏమంటే నిజమైన ప్రార్థన, ఆరాధనలకు యేసు క్రీస్తు సిలువ, ఆయన చేసిన బలి అర్పణలే మూలాధారం కావాలి.) మరి ఇక ఏ ఇతర నిప్పునూ ధూపం వెయ్యడానికి ఉపయోగించకూడదు. మనుషులు తమ పనులకోసం వాడుకొనే నిప్పును దేవుని సన్నిధిలో వాడకూడదు. ఈ విషయాన్ని లెక్కచేయక నాదాబు, అబీహులు తమ స్వంత ఉపయోగం కోసం వాడుకొనే నిప్పును ధూపం వెయ్యడం కోసం వాడారు. అంతేగాక ధూపం వెయ్యడం సాధారణంగా ప్రముఖయాజి పని (నిర్గమకాండము 30:7-9) గాని అతని కొడుకుల పని కాదు. ధూపం క్రీస్తు ప్రార్థనలకు గుర్తు (నిర్గమకాండము 30:6-9). నాదాబు అబీహులు ఎవరి ఆజ్ఞనూ పొందకుండా తమకు తాము కల్పించుకుని తమ తండ్రి హక్కును త్రోసిపుచ్చి ధూపం వెయ్యడానికి పూనుకున్నారు. తమ దుడుకుతనానికి తామే శిక్ష అనుభవించారు. ఈ సంఘటనలో మనం నేర్చుకోవలసిన కొన్ని ముఖ్య పాఠాలున్నాయి. ధూపం ప్రార్థనకు, ఆరాధనకు గుర్తు (కీర్తనల గ్రంథము 141:2 ప్రకటన గ్రంథం 8:3). దేవుణ్ణి ఆయన నియమించిన పద్ధతిప్రకారమే ఆరాధించాలి. మనిషికి ఎలా మంచిదని తోస్తే అలా ఆరాధించకూడదు (యోహాను 4:24 హెబ్రీయులకు 10:19-22). ఆరాధించవలసిన విధానాన్ని త్రొసిపుచ్చి వేరే రీతిగా ఆరాధించడం ఎంత ఘోర పాపమో దేవుడిక్కడ మనకు చూపిస్తున్నాడు. పాపమంతటికీ వ్యతిరేకంగా దేవుని పవిత్ర కోపం దహించివేసే అగ్నిలాగా మండుతూ ఉంది (2 థెస్సలొనీకయులకు 1:4-10 హెబ్రీయులకు 12:28-29 2 పేతురు 2:1-3 ప్రకటన గ్రంథం 20:15 సంఖ్యాకాండము 25:3).