Amos - ఆమోసు 1 | View All

1. యూదారాజైన ఉజ్జియా దినములలోను, ఇశ్రాయేలు రాజగు యెహోయాషు కుమారుడైన యరొబాము దిన ములలోను, భూకంపము కలుగుటకు రెండు సంవత్సరములు ముందు, ఇశ్రాయేలీయులనుగూర్చి తెకోవలోని పసుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము.

“తెకోవ”– బెత్‌లెహేంకు పది కిలోమీటర్లు దక్షిణంగా ఉన్న గ్రామం. “కాపరులలో”– ఏ మత సంస్థకూ ఆమోసు నాయకుడు కాదు (ఆమోసు 7:14-15). తరచుగా దేవుడు సాధారణమైన వ్యాపకాల్లో ఉండే వారినే తన పరిచర్య కోసం సేవకులుగా పిలుస్తాడు (న్యాయాధిపతులు 6:11-14; కీర్తనల గ్రంథము 78:70-71; మత్తయి 4:18-22; మత్తయి 9:9). “వెల్లడి అయిన”– అంటే ఏం మాట్లాడాలో దేవుడు అతనికి తెలియజేశాడన్న మాట. యెషయా 1:1; హోషేయ 1:1; యోవేలు 1:1 పోల్చి చూడండి. “ఉజ్జియా”– 2 రాజులు 14:21;2 దినవృత్తాంతములు 26:23. ఉజ్జియా క్రీ. పూ. 792–740లో రాజ్యమేలాడు. “యరొబాం”– 2 రాజులు 14:23. ఇతడు రెండో యరొబాం. క్రీ.పూ. 793–75లో ఏలాడు.

2. అతడు ప్రకటించినదేమనగా యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములోనుండి తన స్వరము వినబడజేయుచున్నాడు; కాపరులు సంచరించు మేతభూములు దుఃఖించుచున్నవి, కర్మెలు శిఖరము ఎండి పోవుచున్నది.

దేవుడు భూమిపై తనకు ప్రత్యేక నివాసంగా చేసుకున్నది జెరుసలం నగరాన్నే. ఆయన ఆలయం అక్కడుంది. కీర్తనల గ్రంథము 43:3; కీర్తనల గ్రంథము 68:16; కీర్తనల గ్రంథము 132:13-14 చూడండి. “గర్జిస్తూ”– యిర్మియా 25:30 పోల్చి చూడండి. దేవుడు కోపంతో లేచి పాపాత్ములపై తన తీర్పును వినిపిస్తున్నాడని ఈ మాటలు తెలియజేస్తున్నాయి. ఈ పుస్తకంలో ఉండేది ఎక్కువ భాగం ఈ గర్జనలు, ఉరుములే. “వాడిపోతూ...ఎండిపోతూ”– ఇస్రాయేల్ దేశంలో గొప్ప కరవు రాబోతున్నదని ఈ మాటలు సూచిస్తున్నాయి.

3. యెహోవా సెలవిచ్చునదేమనగా దమస్కు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్ప కుండ దాని శిక్షింతును; ఏలయనగా దాని జనులు పంట దుళ్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి.

దమస్కు ఆ కాలంలో, ఇప్పుడు కూడా, సిరియా రాజధాని. దాన్ని గురించి ఇతర భవిష్యద్వాక్కులు యెషయా 17:1; యిర్మియా 49:23-27. “యెహోవా చెప్పేదేమంటే”– ఆమోసు తన స్వంత మాటలు కాదు గాని పలకమని దేవుడు తనకిచ్చిన మాటలనే పలుకుతున్నాడు. యిర్మియా 1:9-10; 2 పేతురు 2:21 చూడండి. “అపరాధాలు”– లోకంలో ఏమి జరుగుతున్నదీ దేవుడు చూస్తూనే ఉన్నాడు. సరైన సమయంలో జాతులపైకీ నగరాల పైకీ వ్యక్తులపైకీ శిక్షను పంపుతాడు. ఇక్కడ జాతికి చెందే పాపాలగురించీ జాతికి వచ్చే శిక్షను గురించీ మాట్లాడుతున్నాడు. “గిలాదు”– యొర్దానుకు తూర్పున ఇస్రాయేల్‌కు చెందిన ప్రాంతం. సిరియా ఆ పట్టణాన్ని ఆక్రమించుకుని అక్కడున్న ఇస్రాయేల్‌వారి పట్ల క్రూరంగా ప్రవర్తించింది. దేవుని ప్రజలకు విరోధంగా సిరియావాళ్ళు చేసిన పాపాలకు వారు శిక్ష అనుభవించాలి.

4. నేను హజాయేలు మందిరములో అగ్ని వేసెదను; అది బెన్హదదు యొక్క నగరులను దహించివేయును;

హజాయేల్ క్రీ.పూ. 842–796 ప్రాంతంలో సిరియాకు రాజు, బెన్‌హదదు అతని కొడుకు క్రీ.పూ. 796–775లో ఏలాడు.

5. దమస్కుయొక్క అడ్డగడియలను విరిచెదను, ఆవెను లోయలోనున్న నివాసు లను నిర్మూలము చేతును, బెతేదేనులో ఉండకుండ రాజ దండము వహించినవానిని నిర్మూలము చేతును, సిరియనులు చెరపట్టబడి కీరు దేశమునకు కొనిపోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

“ద్వారాల...విరగ్గొట్టిస్తాను”– ఇది చేసేందుకు దేవుడు శత్రు సైన్యాలను పంపుతాడు. యెషయా 10:5-6 నోట్స్. “కీర్”– యెషయా 22:6. ప్రస్తుతం ఇరాన్ దేశంలో ఒక ప్రాంతంలో ఇది ఉండవచ్చు. ఆవెను లోయ, బేత్ ఏదెను బహుశా సిరియాలో ఎక్కడో ఉండవచ్చు. “ఆవెను” అంటే “చెడుతనం”.

6. యెహోవా సెలవిచ్చునదేమనగా గాజా మూడుసార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండ దాని శిక్షింతును; ఏలయనగా ఎదోము వారి కప్పగింపవలె నని తాము చెరపట్టినవారినందరిని కొనిపోయిరి.

“గాజా”– ఆదికాండము 10:19; 1 సమూయేలు 6:17; జెఫన్యా 2:4. ఇది ఫిలిష్తీయవాళ్ళ ముఖ్య పట్టణాలల్లో ఒకటి. మధ్యధరా సముద్ర తీరాన, యుదాకు పశ్చిమంగా ఉంది. “చాలామందిని”– బహుశా ఆ యూదా పట్టణాల్లో స్త్రీలను పిల్లలను కూడా బానిసలుగా అమ్మారు. ఈ క్రౌర్యానికి వారు శిక్ష పొందవలసిందే.

7. గాజా యొక్క ప్రాకారముమీద నేను అగ్ని వేసెదను, అది వారి నగరులను దహించివేయును;

8. అష్డోదులో నివాసులను నిర్మూలము చేతును, అష్కెలోనులో రాజదండము వహించిన వాడుండకుండ నిర్మూలముచేతును, ఇంకను శేషించియున్న ఫిలిష్తీయులును క్షయమగునట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.

ఫిలిష్తీయవారి మరి మూడు ముఖ్య పట్టణాలు. “నశించేవరకు”– ఫిలిష్తీయవారెవరూ ఈ రోజున లేరు. ఆ జాతి మొత్తం అంతరించిపోయింది.

9. యెహోవా సెలవిచ్చునదేమనగా తూరు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగా దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడినవారి నందరిని ఎదోమీయులకు అప్పగించిరి.
మత్తయి 11:21-22, లూకా 10:13-14

“తూరు”– ఈ నగరం గురించి ఇతర ప్రవచనాలు యెషయా 23:1-18; యెహెఙ్కేలు 26:1-9 యెహెఙ్కేలు 28:19. “బంధువులతో ఒడంబడిక”– 1 రాజులు 5:1, 1 రాజులు 5:12; 1 రాజులు 16:30-31. దీని పాపం కూడా మనుషులకు (బహుశా ఇస్రాయేల్‌వారిని) బానిసలుగా అమ్మివేయడమే.

10. నేను తూరు ప్రాకారములమీద అగ్ని వేసెదను, అది దాని నగరులను దహించివేయును.

11. యెహోవా సెలవిచ్చునదేమనగా ఎదోము మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ వానిని శిక్షింతును. ఏలయనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని యెడతెగని కోపముతో తనకు సహోదరులగువారిని మానక చీల్చుచు వచ్చెను.

“ఎదోం”– ఆదికాండము 25:23-30. ఈ దేశం యూదాకు ఆగ్నేయంగా ఉంది. దీన్ని గురించి ఇతర ప్రవచనాలు యెషయా 34:5-17; యిర్మియా 49:7-22; యెహెఙ్కేలు 25:12-14; ఓబద్యా గ్రంథం. “బంధువులను”– ఇస్రాయేల్ వారు యాకోబు సంతతి. ఎదోం వారు యాకోబు అన్న ఏశావు సంతతి. దేవుడు ఏ జాతిలోనైనా సరే ద్వేషం, క్రోధం, క్రౌర్యాలను చూచి వాటిని శిక్షిస్తాడు. ఎదోంలో తేమాను ఒక ప్రాంతం, బొస్రా ఎదోంలో ఒక ముఖ్య నగరం.

12. తేమానుమీద అగ్ని వేసెదను, అది బొస్రాయొక్క నగరులను దహించివేయును.

13. యెహోవా సెలవిచ్చునదేమనగా అమ్మోనీయులు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ వారిని శిక్షింతును; ఏలయనగా తమ సరి హద్దులను మరి విశాలము చేయదలచి, గిలాదులోని గర్భిణి స్త్రీల కడుపులను చీల్చిరి.

“అమ్మోను”– ఆదికాండము 19:38; యిర్మియా 49:1-6; యెహెఙ్కేలు 25:1-7; జెఫన్యా 2:8-9. ఇది ఇస్రాయేల్‌కు తూర్పున ఉంది. “సరిహద్దులను విశాలం చెయ్యాలని”– దేశాలు తమ కోసం మరింత భూమిని సంపాదించుకోవడానికి ఏమి చేస్తాయో గమనించండి. అయితే అందుకు వాటికి తగిన శిక్ష పడేలా దేవుడు చూస్తాడు. “గిలాదు”– వ 3.

14. రబ్బాయొక్క ప్రాకారము మీద నేను అగ్ని రాజబెట్టుదును; రణకేకలతోను, సుడి గాలి వీచునప్పుడు కలుగు ప్రళయమువలెను అది దాని నగరుల మీదికి వచ్చి వాటిని దహించివేయును.

అమ్మోనుకు దక్షిణంగా ఉన్న దేశం. దీన్ని అఘ్షారు వాళ్ళు ధ్వంసం చేశారు. ఇదే నేడు జోర్డాన్ రాజ్యానికి రాజధాని అమ్మాన్. యిర్మియా 49:6 పోల్చిచూడండి.

15. వారి రాజును అతని అధిపతులును అందరును చెరలోనికి కొని పోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.Shortcut Links
ఆమోసు - Amos : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |