“నీనెవె”– ఆదికాండము 10:11; 2 రాజులు 19:36; నహూము 1—3 అధ్యాయాలు; జెఫన్యా 2:13; మత్తయి 12:41. నీనెవె అష్షూరువారి ప్రధాన నగరం, ఆ రోజుల్లో ప్రపంచంలోకెల్లా గొప్ప నగరం. ఒక పురాతన వృత్తాంతం ప్రకారం ఆ నగరం, దాని శివార్లు, అనుబంధ పట్టణాల చుట్టుకొలత దాదాపు 100 కి.మీ. ఉండేది. ఇస్రాయేల్‌లో యోనా స్వగ్రామం నుంచి నీనెవె దాదాపు 800 కి.మీ. దూరాన ఉంది.
“దానిలో ఉన్న చెడుతనం”– నహూము రోజుల్లో నీనెవె మదించి, హింసాత్మకంగా, క్రూరంగా, పూర్తిగా చెడిపోయి ఉంది (నహూము 1:11; నహూము 2:12-13; నహూము 3:1, నహూము 3:4, నహూము 3:16, నహూము 3:19). యోనా కాలంలో కూడా కొంతవరకు అలా ఉండి ఉండాలి – 3:8. అది ఇస్రాయేల్‌కు బద్దవిరోధి – యోనా కాలం తరువాత అది ఉత్తర రాజ్యాన్ని చితగ్గొట్టి దాని ప్రజను బందీలుగా తీసుకుపోయింది. 2 రాజులు 17:3-6 చూడండి. దేవుడు కొన్ని సార్లు తన సేవకులకు అతి కష్టమైన, చెయ్యడానికి ఏమాత్రం ఇష్టంలేని పనులను అప్పగిస్తుంటాడు. ఆ పనులను చెయ్యవలసిన అవసరం వారికి కనిపించకపోవచ్చు కూడా.