Habakkuk - హబక్కూకు 1 | View All

1. ప్రవక్తయగు హబక్కూకునొద్దకు దర్శనరీతిగా వచ్చిన దేవోక్తి.

“దేవోక్తి”– సంఖ్యాకాండము 23:7; 2 సమూయేలు 23:1; యెషయా 13:1. పాత ఒడంబడికలోని నిజమైన ఇతర ప్రవక్తలందరి లాగానే హబక్కూకు ద్వారా దేవుని నుండి సత్యం వెల్లడి అయింది.

2. యెహోవా, నేను మొఱ్ఱపెట్టినను నీవెన్నాళ్లు ఆలకింప కుందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొఱ్ఱపెట్టినను నీవు రక్షింపక యున్నావు.

ప్రవక్తకు తన ప్రార్థనలకు జవాబు రాలేదు. తనను వేధించే సమస్యకు దేవుని నుండి ఎలాంటి వివరణా రాలేదు. మరి కొందరు పాత ఒడంబడిక విశ్వాసులు కూడా ఇలానే వాపోయారు – కీర్తనల గ్రంథము 6:3; కీర్తనల గ్రంథము 13:1-4; కీర్తనల గ్రంథము 74:10-11; కీర్తనల గ్రంథము 89:46-47; విలాపవాక్యములు 5:20.

3. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేల ఊరకయే చూచుచున్నావు? ఎక్కడ చూచినను నాశనమును బలా త్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి.

అతణ్ణి వేధించిన సమస్య ఇది – అతడు నివసిస్తున్న యూదాలో దుర్మార్గులు పైచేయిగా ఉండి న్యాయవంతులను నలగ్గొట్టిస్తున్నారు. అన్యాయం, దౌర్జన్యం, హింస సర్వత్రా కనిపిస్తున్నాయి. అయినా దేవునికేం బాధ లేనట్టు ప్రవక్తకు అనిపిస్తున్నది. ఆ పరిస్థితి సహించి ఊరుకొంటూ దాని గురించి ఏమీ చర్య తీసుకోవడం లేదన్నట్లు తోస్తున్నది. అనేకమందిని, బహుశా మనందరినీ ఏదో ఒక సమయంలో ఇదే సమస్య వేధించి ఉంటుంది (యోబు 24:1-2; కీర్తనల గ్రంథము 10:1-12; కీర్తనల గ్రంథము 13:1-2; కీర్తనల గ్రంథము 73:2-12; ప్రసంగి 3:16-17 చూడండి). దేవుడు ఈ విశ్వాన్నంతటినీ పరిపాలించే సర్వ శక్తిమంతుడు. నీతిన్యాయాలంటే ఆయనకు ఎంతో ఇష్టం. అయినప్పటికీ ఈ లోకంలో దుర్మార్గులు వర్ధిల్లుతున్నారు, మంచివారు బాధలు పడుతున్నారు, వారికి న్యాయం జరగడం లేదు. ఈ విషయంలో దేవుడు మెదలకుండా ఉన్నాడేమిటి?

4. అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయెను, న్యాయము ఎన్నడును జరుగకుండ మానిపోయెను, భక్తి హీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవుచున్నది.

5. అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమునొందుడి. మీ దినములలో నేనొక కార్యము జరిగింతును, ఆలాగు జరుగునని యొకడు మీకు తెలిపినను మీరతని నమ్మకయుందురు.
అపో. కార్యములు 13:41

ఈ వచనాల్లో దేవుడు హబక్కూకుకు జవాబిస్తున్నాడు. యూదాలోని భ్రష్టమైపోయిన స్థితి గురించి తాను చర్య తీసుకుంటానని మాట ఇస్తున్నాడు. యూదా రాజ్యాన్ని అంతమొందిస్తాననీ అందుకు సాధనంగా బబులోను సైన్యాన్ని ఉపయోగిస్తాననీ చెప్తున్నాడు. “నిర్ఘాంత పోండి”– యెషయా 29:9, యెషయా 29:14. దేవుడు లోకంలోని అన్ని జాతుల్లో యూదులను తన ప్రత్యేకమైన స్వంత ప్రజగా ఎన్నుకొన్నాడు – ద్వితీయోపదేశకాండము 10:15; కీర్తనల గ్రంథము 135:4. ఇస్రాయేల్ ఉత్తర రాజ్యాన్ని నాశనం చేసేందుకు దేవుడు అష్షూరువారిని వాడుకున్నప్పటికీ (2 రాజులు 17:5-6) యూదా ప్రజలు అలాంటిది తమకూ జరుగుతుందంటే నమ్మలేదు. “నమ్మేవారు కారు”– అపో. కార్యములు 13:41.

6. ఆలకించుడి, తమవికాని ఉనికిపట్టులను ఆక్రమించవలెనని భూదిగంతములవరకు సంచరించు ఉద్రేకముగల క్రూరులగు కల్దీయులను నేను రేపు చున్నాను.
ప్రకటన గ్రంథం 20:9

ఇక్కడ బబులోను గురించిన ఈ వర్ణనను బట్టి వారు బహు క్రూరులు, అహంకారులు, నిజ దేవుణ్ణి ఏ మాత్రం లెక్కచేయని విచ్చలవిడి జనమని అర్థం అవుతున్నది. “కల్దీయ దేశస్థులను”– యిర్మియా 21:4. బబులోను ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన రాజ్యమై అంతకుముందు గొప్ప రాజ్యమైన అష్షూరును క్రీ.పూ. 612–605ల మధ్య ఓడించింది. “పురికొలుపుతున్నాను”– 1 దినవృత్తాంతములు 5:26; 2 దినవృత్తాంతములు 21:16; యెషయా 13:17; యిర్మియా 51:1; ఆమోసు 6:14 పోల్చి చూడండి. ఏ జాతి అయినా ఈ భూమిపై అధికారానికి వచ్చిందంటే ఏకైక నిజ దేవుడే దాన్ని ఆ స్థానానికి హెచ్చించాడన్నమాట. ఏ జాతి అయినా బలహీనమై శిథిలావస్థలో పడిందంటే ఆయనే దాన్ని అణగద్రొక్కాడన్నమాట. దానియేలు 4:34-35; యెషయా 40:15, యెషయా 40:22-24; అపో. కార్యములు 17:26 పోల్చి చూడండి. “విశాల భూభాగాలు”– తమ దేశంతో సహా యూదావారికి తెలిసిన ప్రపంచ ప్రాంతాలన్నీ. తన ప్రజలను అణగ్గొట్టేందుకు దేవుడు ఆ ప్రజను వాడుకుంటాడు. యిర్మియా 51:10 చూడండి. యెషయా 10:5-6 పోల్చి చూడండి.

7. వారు ఘోరమైన భీకరజనముగా ఉన్నారు, వారు ప్రభుత్వ మును విధులను తమ యిచ్ఛవచ్చినట్లు ఏర్పరచుకొందురు.

8. వారి గుఱ్ఱ ములు చిరుతపులులకంటె వేగముగా పరుగులెత్తును, రాత్రి యందు తిరుగులాడు తోడేళ్లకంటెను అవి చురుకైనవి;వారి రౌతులు దూరమునుండి వచ్చి తటాలున జొరబడు దురు, ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చునట్లు వారు పరుగులెత్తి వత్తురు.

9. వెనుక చూడకుండ బలా త్కారము చేయుటకై వారు వత్తురు, ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టు కొందురు.

10. రాజు లను అపహాస్యము చేతురు, అధిపతులను హేళన చేతురు, ప్రాకారముగల దుర్గములన్నిటిని తృణీకరింతురు, మంటి దిబ్బవేసి వాటిని పట్టుకొందురు.

11. తమ బలమునే తమకు దేవతగా భావింతురు, గాలికొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవుచు అపరాధులగుదురు.

“వారికి దేవుడు”– దానియేలు 4:30; దానియేలు 11:38. బబులోను వారు తమ సైనిక శక్తినే దేవుడుగా భావించి పూజించినంత పని చేసేవారు.

12. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆదినుండి నీవున్నవాడవు కావా? మేము మరణమునొందము; యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించియున్నావు; ఆశ్రయ దుర్గమా, మమ్మును దండించుటకు వారిని పుట్టించితివి.

2-4 వచనాల్లో హబక్కూకు అడిగిన ప్రశ్నలకు దేవుడు జవాబిచ్చాడు గాని ప్రవక్తకు ఆ జవాబువల్ల తృప్తి కలగలేదు. దేవుడు ఏదో ఒకటి చెయ్యాలని కోరాడు గాని ఆయన చెయ్యదలచుకున్నది అతనికి సంతోషం కలిగించలేదు. జబ్బుకన్నా నివారణోపాయమే మరింత హానికరంగా ఉన్నట్టు అతనికి అనిపించింది. తన ప్రజలు చెడ్డవారని అతనికి తెలుసు గాని బబులోనువారు మరీ నీచులు (వ 13). ఇప్పుడు అతని ప్రశ్న ఏమిటంటే స్వంత ప్రజలను శిక్షించడానికి ఇలాంటి పవిత్ర దేవుడు అలాంటి దుర్మార్గ జనాన్ని ఎలా వాడుకుంటాడు? “నా పవిత్ర దేవా”– యెషయా 1:4; యెషయా 6:3; లేవీయకాండము 20:7. “ఆదినుంచి”– కీర్తనల గ్రంథము 90:2; నిర్గమకాండము 3:14. “మృతి”– కీర్తనల గ్రంథము 118:17. “ఆధారశిలా”– ద్వితీయోపదేశకాండము 32:4 నోట్. “దండన”– 6 వ వచనంలో యూదాను దండించేందుకు బబులోనువారిని పురికొలుపుతానని దేవుడు చెప్పిన మాటను ప్రవక్త అంగీకరించాడు.

13. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా; బాధించువారుచేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా; కపటులను నీవు చూచియు, దుర్మార్గులు తమకంటె ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు?

“చెడుతనం”– వ 3. యూదాలో చెడుతనం ఉన్నమాట నిజమే. అయితే బబులోనువారు యూదాను నాశనం చెయ్యడం ద్వారా మరింత ఎక్కువ చెడుతనం జరిగిస్తే దేవుడు దాన్ని సహించబోతున్నాడని ప్రవక్తకు అనిపించింది. దేవుడు చెడుగు చెయ్యలేడు కాబట్టి, అసలు దానివైపు తలెత్తి కూడా చూడడు కాబట్టి దుర్మార్గులైన బబులోనువారిని ఆయన వాడుకోవడం ఎలా సాధ్యం? “వంచకులను”– బబులోనువాళ్ళను. “తమకంటే”– యూదావారు చెడ్డవారు అయినప్పటికీ వారు బబులోనువారికంటే నయమే గదా అని ప్రవక్త అభిప్రాయం.

14. ఏలికలేని చేపలతోను ప్రాకు పురుగులతోను నీవు నరులను సమానులనుగా చేసితివి.

15. వాడు గాలమువేసి మానవుల నందరిని గుచ్చి లాగి యున్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు, వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులువేయుచున్నాడు.

ప్రవక్త బబులోనువారిని దౌర్జన్యపరులైన జాలరులుగా నిస్సహాయులైన ఇతర జాతులనూ ప్రజలనూ పట్టుకునేవారుగా వర్ణిస్తున్నాడు.

16. కావున వలవలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్న వని వాడు తన వలకు బలుల నర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపము వేయుచున్నాడు.

వ 11. “వల”– వారి సైనిక శక్తిని ఇది సూచిస్తున్నది. ఇతర దేశాలను కొల్లగొట్టి తాము సౌఖ్యాలతో బతికేందుకు అది తోడ్పడింది.

17. వాడు ఎల్లప్పుడును తన వలలోనుండి దిమ్మరించుచుండవలెనా? ఎప్పటికిని మానకుండ వాడు జనములను హతము చేయు చుండవలెనా?

ప్రవక్త మనసులో ఉన్న ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న ఇది. బబులోనువారి క్రూరత్వాలను దేవుడు సహిస్తూనే ఉంటాడా? వాటికి అడ్డుకట్టవేయడా?Shortcut Links
హబక్కూకు - Habakkuk : 1 | 2 | 3 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |