Matthew - మత్తయి సువార్త 2 | View All

1. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి

బేత్‌లెహేం జెరుసలంకు దక్షిణంగా దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న ఊరు. అది దావీదురాజు స్వగ్రామం. ఇది పాత ఒడంబడికలో చాలా సార్లు కనిపిస్తున్నది (ఆదికాండము 35:19; రూతు 1:19; 1 సమూయేలు 16:4; మీకా 5:2). యేసు ఇక్కడ జన్మించాలంటే యోసేపు మరియలు దాదాపు 120 కిలోమీటర్లు ఉత్తరాన ఉన్న నజరేతు నుంచి (లూకా 2:4) బేత్‌లెహేంకు ప్రయాణం చెయ్యాలి. “హేరోదు”– క్రొత్త ఒడంబడికలో కొందరు హేరోదులు ఉన్నారు. వారంతా ఒకరికొకరు బంధువులే. వారంతా ఈ హేరోదు సంతతివారే. ఇతణ్ణి కొన్ని సార్లు “మహా హేరోదు” అన్నారు. ఇతడు యూదుడు కాదు, ఎదోంవాడు (ఎదోంవాళ్ళు ఏశావు సంతానం – ఆదికాండము 25:25, ఆదికాండము 25:30). రోమ్ చక్రవర్తి ఇతణ్ణి యూదా ప్రదేశానికి రాజుగా నియమించాడు.

2. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి
సంఖ్యాకాండము 24:17

రక్షకుడు, రాజు వస్తాడని పాత ఒడంబడికలో ఉన్న వాగ్దానాల గురించి ఈ జ్ఞానులకు కొంత తెలిసి ఉండాలి (యెషయా 9:6-7 మొ।।). క్రీ.పూ. 6 వ శతాబ్దంలో జరిగిన బబులోను చెర తరువాత పశ్చిమాసియా అనేక దేశాల్లో నివసించిన యూదుల మూలంగా ఈ సంగతి ఈ జ్ఞానులకు తెలిసి ఉండవచ్చు. ఎస్తేరు, దానియేలు పుస్తకాలు చూడండి. దానియేలు 9:25-27 లోని భవిష్యద్వాక్కులు ఆధారంగా వీరు క్రీస్తు జన్మించే కాలాన్ని లెక్కగట్టి ఉండగలిగేవారు. వీరు చూచిన నక్షత్రం ఏమిటో అది క్రీస్తు జననాన్ని ప్రకటిస్తూ ఉన్నదని వీరికి ఎలా నమ్మకం కుదిరిందో మనకు తెలియదు. ఆ నక్షత్రం ఈ సందర్భం కోసమే దేవుడు సృష్టించిన ఒక ఆకాశ గోళమనీ, అది క్రీస్తు తార అని దేవుడు తన ఆత్మద్వారా ఈ జ్ఞానుల్లో నమ్మకం పుట్టించాడనీ ఈ నోట్స్ రచయిత నమ్మకం. వ 12 నోట్స్ చూడండి. వీరు కేవలం క్రీస్తును చూచేందుకూ, తమ కుతూహలాన్ని తీర్చుకునేందుకూ, ఆయన్ను గురించి వేదాంత చర్చలు జరిపేందుకూ వచ్చినవారు కాదు, ఆయన ఎదుట వంగి నమస్కారం చేసి ఆయన్ను ఆరాధించేందుకు వచ్చారు.

3. హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడ యెరూషలేము వారందరును కలవరపడిరి.

బేత్‌లెహేంకు 8 కిలోమీటర్ల దూరాన ఉన్న జెరుసలం ప్రజలకు, రాజుకు తెలియని సత్యాన్ని దేవుడు చాలా దూరాన ఉన్న జ్ఞానులకు వెల్లడి చేశాడు. ఆ శుభవార్త విని సంతోషించవలసింది పోయి కంగారుపడడం ఆధ్యాత్మికంగా జెరుసలంవారి భ్రష్ట స్థితిని తెలియజేస్తున్నది. అభిషిక్తుని రాకకు వారు సిద్ధంగా లేరు.

4. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమకూర్చిక్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను.

యాజుల గురించి నోట్ నిర్గమకాండము 28:1. ప్రముఖ యాజులు ఆలయంలో ఆరాధనలు, బలులు నిర్వహించేవారు, యూదులకు మతాధికారులు. ధర్మశాస్త్రం అంటే సీనాయి పర్వతం దగ్గర దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రమని కొన్ని సార్లు అర్థమిస్తుంది. ఇది నిర్గమకాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు ఈ నాలుగు గ్రంథాల్లో రాసి ఉన్నది. మరి కొన్ని సార్లు ధర్మశాస్త్రం పాత ఒడంబడికలో ఉన్న దేవుని ఉపదేశమంతా అని కూడా అర్థం వస్తుంది.

5. అందుకు వారు యూదయ బేత్లెహేములోనే; ఏలయనగా యూదయదేశపు బేత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైనదానవు కావు;ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోనుండి వచ్చును అని ప్రవక్తద్వారా వ్రాయబడియున్నదనిరి.

క్రీస్తు జన్మానికి 700 సంవత్సరాల క్రితమే ఆయన జన్మించబోయే స్థలాన్ని ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్న ఈ అద్భుతమైన భవిష్యద్వాక్కు మీకా 5:2 లో ఉంది. ఓ సంగతి గమనించండి – ఈ మతాధికారులకు, పండితులకు అభిషిక్తుడు వస్తాడనీ ఆయన జన్మస్థానం ఫలానా చోటు అనీ తెలుసు గాని ఆయన్ను చూచేందుకు గానీ ఆయన్ను గౌరవించేందుకూ ఆరాధించేందుకూ గానీ ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. మనుషులకు తెలిసినదాన్ని బట్టి వారు దేవుని దృష్టికి అంగీకారం కారు. వారి హృదయ స్థితే అతి ప్రాముఖ్యం.

6. అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి,
2 సమూయేలు 5:2, 1 దినవృత్తాంతములు 11:2, మీకా 5:2

7. ఆ నక్షత్రము కనబడిన కాలము వారిచేత పరిష్కారముగా తెలిసికొని

8. మీరు వెళ్లి, ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే, నేనును వచ్చి,ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బేత్లెహేమునకు పంపెను.

హేరోదు ఉద్దేశం చెడ్డది (వ 13,16). అయితే అతడు తన హృదయంలోని దుష్టత్వాన్ని దొంగభక్తి ముసుగుతో కప్పుకున్నాడు. అప్పటినుండి ఇలాంటివాళ్ళు అనేకమంది ఉన్నారు.

9. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పుదేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను.

ఈ నక్షత్రం చేసినట్టుగా ఏ నక్షత్రం గానీ గ్రహం గానీ దానంతట అదే చేయడం అసాధ్యం. ఇది దేవుని పని. అన్ని కాలాల్లోనూ క్రీస్తును వెదికి, ఆయన్ను తెలుసుకొని ఆరాధించగోరే వారిని దేవుడే నేరుగా ఏ పొరపాటూ లేకుండా వారి గమ్యానికి నడిపిస్తాడు.

10. వారు ఆ నక్షత్రమును చూచి, అత్యానందభరితులై యింటిలోనికి వచ్చి,

11. తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి.
కీర్తనల గ్రంథము 72:10-11, కీర్తనల గ్రంథము 72:15, యెషయా 60:6

“ఇంట్లోకి”– యేసుప్రభువు తాను జన్మించిన పశువుల శాలలో ఇప్పుడు లేడు (లూకా 2:7). ఆయన జన్మించి చాలా నెలలు గడిచిపోయి ఉంటాయి. “ఆరాధించారు”– వారు ఆరాధించిందెవరినో చూడండి – యేసు తల్లి మరియను కాదు, యేసుప్రభువునే. వారు కానుకలు అర్పించింది ఆయనకే, మరియకు కాదు. “ఆరాధించారు”– దేవుడు క్రీస్తును ఆరాధించేందుకు ఈ మనుషుల్ని తీసుకురావడం మనకో సత్యాన్ని తెలియజేస్తున్నది. అదేమిటంటే క్రీస్తు దేవుడు. ఏకైక దేవుడు మాత్రమే ఆరాధనకు పాత్రుడు (మత్తయి 4:10 చూడండి). క్రీస్తు దేవుడని చూపించే ఇతర రిఫరెన్సులు ఫిలిప్పీయులకు 2:6;లూకా 2:11 నోట్స్‌లో ఉన్నాయి.

12. తరువాత హేరోదునొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్లిరి.

“కలలో”– ఆదికాండము 15:12-13; ఆదికాండము 20:3; సంఖ్యాకాండము 12:6; దానియేలు 7:1; అపో. కార్యములు 2:17. ఈ జ్ఞానులు బేత్‌లెహేం వచ్చిన తరువాత దేవుడు వారికి సత్యాన్ని వెల్లడించడం చూస్తూ ఉంటే వారు ఆ ప్రయాణం ఆరంభించక ముందు కూడా ఆయన ఇలాగే చేశాడనుకోవడం తప్పు కాదనిపిస్తున్నది (వ 2).

13. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్న మందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి, నేను నీతో తెలియజెప్పువరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పెను.

తన సింహాసనానికి పోటీదారుడెవరూ ఉండకూడదని హేరోదు పట్టుదల. జ్ఞానులేమో యూదుల రాజు గురించి మాట్లాడారు (వ 2). తన అధికారానికి అడ్డు వస్తారనుకుంటే తన స్వంత కొడుకులనే చంపించే రకం హేరోదు. హేరోదు దుష్ట సంకల్పం వెనుక దేవునికీ మనిషికీ ఆగర్భ శత్రువైన సైతానే ఉన్నాడు. అభిషిక్తుణ్ణి మట్టుపెట్టి తద్వారా ఆయన మనుషులకు పాపవిముక్తి, రక్షణ తేనివ్వకుండా నిరోధించే ప్రయత్నం సైతానుది. అయితే తన సంకల్పాలనెలా నెరవేర్చుకోవాలో దేవునికి తెలుసు. ఎలాంటి లోపం లేకుండా ఆ విధంగా ఆయన చేస్తాడు (యెషయా 46:9-10; రోమీయులకు 11:33-36).

14. అప్పుడతడు లేచి, రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని,

15. ఐగుప్తునకు వెళ్లి ఐగుప్తులోనుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్తద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చ బడునట్లు హేరోదు మరణమువరకు అక్కడనుండెను.
హోషేయ 11:1

పాత ఒడంబడిక ప్రవక్తల ద్వారా మాట్లాడినది దేవుడేనని మరో సారి నొక్కి చెప్పడం చూస్తున్నాం (మత్తయి 1:22). హోషేయ 11:1 నోట్ చూడండి.

16. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని, తాను జ్ఞానులవలన వివర ముగా తెలిసికొనిన కాలమునుబట్టి, బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను, రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల మగపిల్లల నందరిని వధించెను.

జ్ఞానులు సందర్శించిన సమయానికి యేసు జన్మించి చాలా నెలలై ఉండవచ్చని ఈ వచనం తెలియజేస్తున్నది. ఆయన్ను చంపడం విషయంలో పొరపాటు లేకుండా చేసేందుకు రెండేళ్ళలోపు వయస్సున్న పిల్లలందర్నీ చంపించడం అవసరమని హేరోదు భావించాడు.

17. అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహారోదనధ్వనియు కలిగెను

18. రాహేలు తన పిల్లలవిషయమై యేడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక యుండెను అని ప్రవక్తయైన యిర్మీయాద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను.
యిర్మియా 31:15

19. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై

20. నీవు లేచి, శిశువును తల్లిని తోడుకొని, ఇశ్రాయేలు దేశమునకు వెళ్లుము;
నిర్గమకాండము 4:19

21. శిశువు ప్రాణము తీయజూచు చుండినవారు చనిపోయిరని చెప్పెను. అప్పుడతడు లేచి, శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను.

22. అయితే అర్కెలాయు తన తండ్రియైన హేరోదునకు ప్రతిగా యూదయదేశము

23. ఏలుచున్నాడని విని, అక్కడికి వెళ్ల వెరచి, స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవాడై గలిలయ ప్రాంతములకు వెళ్లి, నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పినమాట నెరవేరునట్లు (ఈలాగు జరిగెను.)
న్యాయాధిపతులు 13:5-7, యెషయా 11:1, యెషయా 53:2

యోసేపు, మరియల స్వగ్రామం నజరేతు (లూకా 2:39). అది చిన్నది, ఏ ప్రాధాన్యత లేని ఊరు (యోహాను 1:45-46). నజరేయుడంటే నజరేతు ఊరివాడు. ఆ ఊరు ఏమాత్రం పేరు ప్రఖ్యాతులు లేనిది కాబట్టి ఏమీ ప్రాధాన్యత లేని అనామకుణ్ణి ఈ పేరుతో పిలవడం వాడుక అయింది. క్రీస్తును మనుషులు తిరస్కరిస్తారు అని చెప్పిన ప్రవక్తల వాక్కుల్లోని అర్థాన్ని ఇలా నజరేయుడు అని ఆయన్ను పిలవడం మూలంగా నెరవేరింది. కీర్తనల గ్రంథము 22:6; యెషయా 53:3. కొందరు పండితులు నజరేయుడు అనే మాటను కొమ్మ అనే అర్థాన్నిచ్చే హీబ్రూ పదం “నెజర్”కు జోడించారు. ఇది అభిషిక్తునికి ఉన్న పేర్లలో ఒకటి (యెషయా 11:1; మొ।।). నజరేయుడు అంటే నాజీరు వ్రతం అవలంబించినవాడు (సంఖ్యా 6వ అధ్యాయం) అనే అర్థం రాదు. యేసు నాజీరు వ్రతం పూనలేదు.Shortcut Links
మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |