రక్షకుడు, రాజు వస్తాడని పాత ఒడంబడికలో ఉన్న వాగ్దానాల గురించి ఈ జ్ఞానులకు కొంత తెలిసి ఉండాలి (యెషయా 9:6-7 మొ।।). క్రీ.పూ. 6 వ శతాబ్దంలో జరిగిన బబులోను చెర తరువాత పశ్చిమాసియా అనేక దేశాల్లో నివసించిన యూదుల మూలంగా ఈ సంగతి ఈ జ్ఞానులకు తెలిసి ఉండవచ్చు. ఎస్తేరు, దానియేలు పుస్తకాలు చూడండి. దానియేలు 9:25-27 లోని భవిష్యద్వాక్కులు ఆధారంగా వీరు క్రీస్తు జన్మించే కాలాన్ని లెక్కగట్టి ఉండగలిగేవారు. వీరు చూచిన నక్షత్రం ఏమిటో అది క్రీస్తు జననాన్ని ప్రకటిస్తూ ఉన్నదని వీరికి ఎలా నమ్మకం కుదిరిందో మనకు తెలియదు. ఆ నక్షత్రం ఈ సందర్భం కోసమే దేవుడు సృష్టించిన ఒక ఆకాశ గోళమనీ, అది క్రీస్తు తార అని దేవుడు తన ఆత్మద్వారా ఈ జ్ఞానుల్లో నమ్మకం పుట్టించాడనీ ఈ నోట్స్ రచయిత నమ్మకం. వ 12 నోట్స్ చూడండి. వీరు కేవలం క్రీస్తును చూచేందుకూ, తమ కుతూహలాన్ని తీర్చుకునేందుకూ, ఆయన్ను గురించి వేదాంత చర్చలు జరిపేందుకూ వచ్చినవారు కాదు, ఆయన ఎదుట వంగి నమస్కారం చేసి ఆయన్ను ఆరాధించేందుకు వచ్చారు.