19. అప్పుడు త్రోవప్రక్కను ఉన్న యొక అంజూరపుచెట్టును చూచి, దానియొద్దకు రాగా, దానియందు ఆకులు తప్ప మరేమియు కనబడలేదు గనుక దానిని చూచి–ఇకమీదట ఎన్నటికిని నీవు కాపు కాయ కుందువుగాక అని చెప్పెను; తక్షణమే ఆ అంజూరపుచెట్టు ఎండిపోయెను.
సాధారణంగా అంజూరుచెట్టుకు ఆకులతోబాటు కాయలు కూడా రావడం, లేక కొన్ని సార్లు ఆకులు పూర్తిగా రాకమునుపే కాయలు ఉండడం కద్దు. అంజూరు చెట్లకు ఆకులు, కాయలు ఉండే సమయం అప్పటికి ఇంకా రాకపోయినా ఒక చెట్టుకు నిండుగా ఆకులున్నాయంటే కాయలు కూడా ఉండి తీరాలి (మార్కు 11:13). అది ఏప్రిల్ నెల. సాధారణంగా పూర్తిగా ఆకులు, కాయలు జూన్ నాటికి గాని కనిపించవు. ఈ చెట్టు దారిన పోయేవారిని మోసగిస్తున్నది. తనకు లేనిది ఉన్నట్టుగా చెప్తున్నది. ఒక విధంగా చూస్తే అది ఇస్రాయేల్ జాతికీ, జెరుసలం నగరానికీ దృష్టాంతంగా ఉంది. లూకా 13:6-9 పోల్చి చూడండి. ఎంతో ఉందని చెప్పుకుంటూ, కొంచెమే ఫలించే ఏ వ్యక్తికైనా సంఘానికైనా కూడా ఇది సూచనగా ఉంది. కాయలు లేకుండా గుబురుగా ఆకులుంటే లాభం ఏముంది? కొన్ని సార్లు బైబిల్లో చెట్లు జాతులనూ వ్యక్తులనూ సూచిస్తాయి (మత్తయి 3:10; మత్తయి 7:16-20; కీర్తనల గ్రంథము 1:3; కీర్తనల గ్రంథము 37:35; కీర్తనల గ్రంథము 52:8; కీర్తనల గ్రంథము 92:12; యిర్మియా 11:16-17; యెహెఙ్కేలు 17:22-24). ఇక్కడ ఈ అంజూరు చెట్టు ఇస్రాయేల్కు సూచనగా ఉందని రాసిలేదు గానీ ఇది అసాధ్యం ఏమీ కాదు. ఇస్రాయేల్కు కూడా పుష్కలంగా ఆకులున్నాయి గానీ కాయలు లేవు, లేదా కొద్దిగా మాత్రమే ఉన్నాయి. వ 43; యెషయా 5:1-4 పోల్చిచూడండి.