Matthew - మత్తయి సువార్త 24 | View All

1. యేసు దేవాలయమునుండి బయలుదేరి వెళ్లుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి.

2. అందుకాయన మీరు ఇవన్నియు చూచుచున్నారు గదా; రాతిమీద రాయి యొకటియైనను ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.

మార్కు 13:2; లూకా 21:6. ఈ భవిష్యద్వాక్కు క్రీ.శ. 70లో నెరవేరింది. రోమ్ సైన్యాధిపతి టైటస్, అతని సైన్యాలు జెరుసలంనూ దేవాలయాన్నీ పూర్తిగా నేలమట్టం చేశాయి.

3. ఆయన ఒలీవల కొండమీద కూర్చుండియున్నప్పుడు శిష్యులాయనయొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా

శిష్యులు మూడు ప్రశ్నలు అడిగారు. తరువాత కనిపిస్తున్న మాటల్లో యేసు ఈ మూడు ప్రశ్నలకూ జవాబు ఇస్తున్నాడు. లూకా 21:7 క్రీస్తు రెండో రాకడ, యుగాంతం గురించిన ప్రశ్నలు లేవు (మార్కు 13:4 లో కూడా లేవు). లూకా 21:8-28 లో యేసు జెరుసలం పతనం గురించిన ప్రశ్నకు ఇచ్చిన జవాబులో ఈ యుగాంతం గురించి చెప్పినది చాలా తక్కువ. కానీ మత్తయిలో (ఈ రచయిత అభిప్రాయం ప్రకారం) ఈ యుగాంతం, తన రెండో రాకడ గురించిన ప్రశ్నలకు కూడా జవాబులున్నాయి. క్రీ.శ. 70లో జరిగిన సంభవాలు ఈ యుగాంతంలో జరిగే వాటిని కొన్నిటిని పోలివున్నాయి. ఆ పరిస్థితి ఒక రకంగా రాబోయే పరిస్థితికి నీడలాంటిది.

4. యేసు వారితో ఇట్లనెను ఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి.

క్రైస్తవులు ఈ హెచ్చరికను గనుక చెవిన పెట్టివుంటే ఈ యుగమంతట్లో ఇంతమంది పెడత్రోవ పట్టివుండేవాళ్ళే కాదు. మనుషుల్లో అత్యంత జ్ఞానవంతులు, నీతిమంతులు కూడా ఎంత తేలికగా మోసపోగలరో, అలాంటిది జరక్కుండా ఎంత జాగ్రత్తగా కాపాడుకోవలసిన అవసరం ఉందో యేసుకు తెలుసు. మత్తయి 7:15; రోమీయులకు 16:18; 1 కోరింథీయులకు 6:9; గలతియులకు 3:1; ఎఫెసీయులకు 5:6; కొలొస్సయులకు 2:4; 2 థెస్సలొనీకయులకు 2:3; యాకోబు 1:22; 1 యోహాను 1:8; ప్రకటన గ్రంథం 12:9; ప్రకటన గ్రంథం 20:8 పోల్చి చూడండి. ఆ శిష్యులకు (మనకు కూడా) ఈ యుగాంతంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కన్నా తాము మోసపోకుండా చూచుకోవడం మరింత ప్రాముఖ్యం.

5. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోస పరచెదరు.

క్రీ.శ. 70లో జెరుసలం వినాశనానికి ముందు పరిస్థితి ఇదే. ఈ యుగమంతటిలోనూ ఇదే జరిగింది. ముఖ్యంగా క్రీస్తు రెండో రాకడకు ముందు ఇది మరింతగా జరుగుతుంది.

6. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు; మీరు కలవరపడకుండ చూచుకొనుడి. ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు.
దానియేలు 2:28, దానియేలు 2:45

జెరుసలం పతనానికి ముందు ఇది జరిగింది. అప్పటినుంచి జరుగుతూనే ఉంది. బహుశా ఈ యుగానికి అంతం సమీపిస్తున్న కొద్దీ ఇలాంటివి మరింత తరచుగా జరుగుతాయని యేసుప్రభువు ఉద్దేశమేమో. ఇలాంటివి సంభవిస్తున్నప్పుడు ఊహించని వింతలేవో జరుగుతున్నట్టు క్రీస్తు శిష్యులు తత్తరపడకూడదు.

7. జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును.
2 దినవృత్తాంతములు 15:6, యెషయా 19:2

8. అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదన లకు ప్రారంభము.

“తొలిప్రసవ వేదనల్లాంటివి”అనే మాటలను గమనించండి. రాబోయే నూతన శకం (రోమీయులకు 8:22 పోల్చి చూడండి) ఈ యుగంలో అనేక బాధలు, వేదనల తరువాత ప్రవేశిస్తుంది. యుద్ధాలు, కరవులు, భూకంపాలు ఈ యుగాంతంలో కలిగే వేదనలకు ఆరంభాలు మాత్రమే.

9. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు.

మత్తయి 10:17, మత్తయి 10:22; మత్తయి 23:34; యోహాను 15:18-21; యోహాను 16:2, యోహాను 16:33. శిష్యులకు సౌఖ్యవంతమైన సుఖకరమైన జీవితం ఉంటుందని యేసుప్రభువు ఎన్నడూ మాటియ్యలేదు. అలానే శిష్యులు కూడా ఇతర విశ్వాసులకు ఇలాంటి ఆశ ఏదీ కల్పించలేదు (అపో. కార్యములు 14:22; 1 థెస్సలొనీకయులకు 3:3; 1 పేతురు 4:12). క్రీస్తును సిలువ వేసిన లోకం ఆయన జీవించినట్టుగా జీవిస్తూ ఆయన ఉపదేశించిన దాన్ని ఉపదేశిస్తూ ఉండేవాళ్ళను ఎలా ప్రేమిస్తుంది?

10. అనేకులు అభ్యంతరపడి, యొకనినొకడు అప్పగించి యొకనినొకడు ద్వేషింతురు.
దానియేలు 11:41

మనుషులు ఎలాంటివారో కష్టాలు బయట పెట్టినంత స్పష్టంగా మరేదీ బయట పెట్టదు. నిజమైన నమ్మకం ఉన్నవారిని కష్టాలు బలపరచి శుద్ధి చేస్తాయి. నమ్మకం లేకపోయినా ఉందని చెప్పుకునేవారికి నిజంగా అది లేదని వెల్లడి చేస్తాయి. ఎవరైనా ఎప్పుడైనా నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఎంత కష్టం వచ్చినా సరే దేవుని నిజ ప్రజలను ద్వేషించడం మొదలు పెట్టరు. “పడిపోతారు”– అంటే దేవుడు వెల్లడి చేసిన సత్యం నుంచి తొలగిపోతారు అని అర్థం. 1 తిమోతికి 4:1; 1 తిమోతికి 5:8 పోల్చి చూడండి.

11. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు;

అపో. కార్యములు 20:30; రోమీయులకు 16:17-18; 2 కోరింథీయులకు 11:13-15; 1 తిమోతికి 4:1; 2 తిమోతికి 4:3; 2 పేతురు 2:1; 1 యోహాను 2:18; 1 యోహాను 4:1. బయటినుంచి ప్రమాదాలు వాటిల్లుతాయి. అంతకంటే ఎక్కువ ప్రమాదం సంఘంలోనుంచే ముంచుకు వస్తుంది.

12. అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును.

సంఘానికి వెలుపలా లోపలా ఉన్న దుర్మార్గత క్రైస్తవులను చల్లారిపోయేలా చేస్తుంది. అంతంలో దేవునిపట్ల, సాటి మనుషులపట్ల ప్రేమ విషయంలో ఆసక్తి ఉన్నవారు కొద్దిమందే మిగులుతారు. అనేక సంఘాలు ఎఫెసు, లవొదికయ సంఘాల దారిన పోతాయి (ప్రకటన గ్రంథం 2:4; ప్రకటన గ్రంథం 3:15). ప్రేమ పోతే అంతా పోయినట్టేనని మనమెప్పుడూ గుర్తుంచుకోవాలి (1 కోరింథీయులకు 13:1-3).

13. అంతమువరకు సహించినవా డెవడో వాడే రక్షింపబడును.

మత్తయి 10:22. కొందరు అంతం వరకు సహిస్తారు కాబట్టి వారికి విముక్తి లభిస్తుంది అని ఇక్కడ రాసిలేదు. విముక్తి అనేదాన్ని ఎవరూ స్వయంగా సంపాదించుకోలేరు. పరిస్థితుల్ని స్థిరంగా సహించినందువల్ల దొరికే ప్రతిఫలం కాదు విముక్తి. సహించేవారు దేవుడిచ్చే విముక్తి వారిలో పనిచేస్తూ ఉంది కాబట్టి, ఆయన వారిని క్రీస్తులో నూతన సృష్టిగా చేశాడు కాబట్టి అలా నిలవగలుగుతారు (2 కోరింథీయులకు 5:17). అంతం వరకు వారు తమ నమ్మకాన్ని నిలబెట్టుకొనేలా ఆయన వారికి శక్తినిస్తాడు. యోహాను 10:28; యోహాను 17:11-15; రోమీయులకు 5:3-5, రోమీయులకు 5:9-10; రోమీయులకు 8:29-30; ఫిలిప్పీయులకు 1:6; హెబ్రీయులకు 10:35-39 చూడండి.

14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.

దేవుని రాజ్యం గురించి నోట్ మత్తయి 4:17. యేసు దేవుని రాజ్య శుభవార్త ప్రకటించాడు (మత్తయి 4:23; మత్తయి 9:35). మనుషుల మధ్య దేవుని పరిపాలనను ప్రకటిస్తూ మనుషుల్ని దేవునికి విధేయులై ఆయన రాజ్యంలో ప్రవేశించండని పిలుస్తూ ఉంది కాబట్టి అది శుభవార్త. క్రీస్తు రాయబారుల పరిచర్య అంతటిలో దేవుని రాజ్యం గురించి ప్రకటించడం, నేర్పించడం ప్రముఖ స్థానం వహించింది (అపో. కార్యములు 8:12; అపో. కార్యములు 20:25; అపో. కార్యములు 28:23, అపో. కార్యములు 28:31; రోమీయులకు 14:17; 1 కోరింథీయులకు 4:20; 1 కోరింథీయులకు 6:9; గలతియులకు 5:21; ఎఫెసీయులకు 5:5; కొలొస్సయులకు 1:12-13; కొలొస్సయులకు 4:11; 1 థెస్సలొనీకయులకు 2:12; 2 థెస్సలొనీకయులకు 1:5; 2 తిమోతికి 4:1; యాకోబు 2:5; 2 పేతురు 1:11; ప్రకటన గ్రంథం 1:6, ప్రకటన గ్రంథం 1:9). ఈ పని ఇంకా పూర్తి కాలేదు. ఈ లోకమంతటా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా కొన్ని ప్రదేశాలు, కొన్ని జాతులు శుభవార్త విననివి ఉన్నాయి. అన్ని జనాలూ విన్న తరువాత యుగాంతం వస్తుంది. జనాలు అంటే యూదేతర ప్రజలు అని అర్థం.

15. కాబట్టి ప్రవక్తయైన దానియేలుద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక
దానియేలు 9:27, దానియేలు 11:31, దానియేలు 12:11

క్రీస్తు శిష్యులకు పవిత్ర స్థలం అంటే జెరుసలంలో దేవాలయం అని మాత్రమే అర్థం అవుతుంది. “అసహ్యమైన వినాశకారి” గురించి దానియేలు 9:27; దానియేలు 11:31; దానియేలు 12:11 చూడండి. క్రీ.శ. 70లో రోమ్‌వారు దేవాలయాన్ని ధ్వంసం చేసినప్పుడు ఇది పూర్తిగా నెరవేరిందని కొందరు పండితుల అభిప్రాయం. అయితే ఇక్కడ యేసు చెప్పిన అసహ్యకరమైన వినాశకారి ఈ యుగాంతంతోను, ఆయన రెండో రాకడతోనూ సంబంధం ఉంది (వ 14, 29-31). రోమ్‌వారు చేసిన అసహ్యమైన వినాశం ఈ యుగాంతంలో రాబోయేదానికి ఛాయ, దృష్టాంతం మాత్రమే. 2 థెస్సలొనీకయులకు 2:3-12 పోల్చి చూడండి.

16. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను

క్రీ.శ. 70లో క్రైస్తవులు జెరుసలం వదిలి యొర్దాను అవతల ఉన్న కొండలకు పారిపోయారు. ఆ బాధకాలం ఎంత తీవ్రమైనదైనా ఈ యుగాంతంలో రాబోయే మహా బాధకాలం అప్పటి దానికన్నా మరింత తీవ్రంగా, భయంకరంగా ఉంటుంది (దానియేలు 12:1; ప్రకటన గ్రంథం 7:14; ప్రకటన గ్రంథం 13:15-17). వ 17,18ని బట్టి రాబోయే ఆ బాధలు హఠాత్తుగా వస్తాయని అర్థం అవుతున్నది. క్రీ.శ. 70లో అయితే రోమ్ సైన్యాధిపతి టైటస్ చాలా నెలలపాటు జెరుసలంను ముట్టడి వేశాడు. వ 20లో విశ్రాంతిదినం అన్న మాట ఉంది. రాబోయే మహా బాధకాలానికి కేంద్రం ఇస్రాయేల్ దేశం అనుకునేందుకు ఇది మరో ఆధారం. విశ్రాంతి దినాన యూదులు ప్రయాణం చెయ్యడానికి మత నాయకులు అనుమతి ఇచ్చిన దూరం ఒక కిలోమీటరు కన్న తక్కువ. రాబోయే కాలంలో ఇస్రాయేల్ దేశంలో విశ్రాంతి దినాన ప్రయాణ సౌకర్యాలేవీ ఉండకపోవచ్చు.

17. మిద్దెమీద ఉండువాడు తన యింటిలోనుండి ఏదైనను తీసికొని పోవుటకు దిగకూడదు;

18. పొలములో ఉండు వాడు, తన బట్టలు తీసికొని పోవుటకు ఇంటికి రాకూడదు.

19. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ.

20. అప్పుడు మహా శ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతిదినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి.

21. లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పు డును కలుగబోదు.
దానియేలు 12:1, యోవేలు 2:2

ఈ మహా బాధకాలం ఇంకా రావలసి ఉంది అని వ 29-31 బట్టి తేటతెల్లం అయింది. క్రీస్తు విశ్వాసులు ఈ యుగమంతటిలోనూ ఎదుర్కోవలసి వచ్చిన బాధలే (యోహాను 16:33; అపో. కార్యములు 14:22; 1 థెస్సలొనీకయులకు 3:3-4) ఈ మహా బాధకాలమేమో అని మనం అనుకోకూడదు.

22. ఆ దినములు తక్కువ చేయబడక పోయిన యెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచ బడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును.

ప్పుడు సైతాను, దుర్మార్గులు తాము చేయ దలచుకున్నదంతా చేయడానికి చాలినంత సమయం ఉండదు. దేవుడు తన ప్రత్యేక ప్రజ (ఆయన ఎన్నుకున్నవారు – వ 31) మేలుకోసం భూమిపై కాలాలను, కార్యాలనూ ఏర్పాటు చేయగలడని గమనించండి.

23. ఆ కాలమందు ఎవడైననుఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పినయెడల నమ్మ కుడి.

24. అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు.
ద్వితీయోపదేశకాండము 13:1

2 థెస్సలొనీకయులకు 2:9-11; ప్రకటన గ్రంథం 13:13; ప్రకటన గ్రంథం 16:14; ప్రకటన గ్రంథం 19:20. వింతలూ సూచకమైన అద్భుతాలూ మాత్రమే వాటిని చేసినవారు దేవునిచేత పంపబడినవారని రుజువు చేసేందుకు సరిపోవు. బైబిలుకు అనుగుణమైన సత్యాన్ని వారు బోధించకపోతే వారిలో సత్యం లేదు. వారి వింతలూ సూచకమైన అద్భుతాలూ మోసకరమైనవి (మత్తయి 7:22-23; అపో. కార్యములు 8:9-11; అపో. కార్యములు 13:6). దేవుడు ఎన్నుకున్నవారు క్రీస్తుకు చెందిన సత్యాన్ని చూచేందుకు తగిన జ్ఞానోదయం పొందినవారు (మత్తయి 11:27; 2 కోరింథీయులకు 4:6; ఎఫెసీయులకు 1:18, వాటి నోట్స్ కూడా చూడండి). అబద్ధ క్రీస్తుల మూలంగా వీరు మోసపోరు.

25. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పియున్నాను.

26. కాబట్టి ఎవరైననుఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్లకుడి ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి

27. మెరుపు తూర్పున పుట్టి పడమటివరకు ఏలాగు కనబడునో ఆలాగే మనుష్యకుమారుని రాకడయు నుండును.

మానవ పుత్రుడు గురించి నోట్ మత్తయి 8:20.

28. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును.

అబద్ధ ప్రవక్తలు, కపట క్రీస్తులను గురించి యేసు హెచ్చిరించిన వెంటనే (వ 24-26) ఈ మాటలు చెప్తున్నాడు, కాబట్టి అలాంటివారు ఒక జాతిపై, ఒక సమాజంపై లేక ఒక సంఘంపై దాని మరణం తరువాత పీక్కు తినేందుకు వాలే పక్షులను పోలి ఉంటారని ఈ గద్దలు సూచించవచ్చు. లేక మరో దేశం పైకి దేవుని తీర్పు మూలంగా వచ్చిపడే ఇతర రాజ్యాలై ఉండవచ్చు. యెషయా 46:11; యెహెఙ్కేలు 39:4 పోల్చి చూడండి. లేక క్రీస్తు తిరిగి వచ్చే సమయంలో భూరాజుల సైన్యాల వినాశం గురించి కావచ్చు (ప్రకటన గ్రంథం 19:17-18).

29. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింప బడును.
యెషయా 13:10, యెషయా 34:4, యెహెఙ్కేలు 32:7, యోవేలు 2:10, యోవేలు 2:31, యోవేలు 3:15, హగ్గయి 2:6, హగ్గయి 2:21

వ 21లో యేసు చెప్పిన మహా బాధకాలం క్రీ.శ. 70 నాటిది కాదనీ, ఈ యుగాంతంలో రాబోయేదేననీ ఈ తరువాతి వచనాలు రుజువు చేస్తున్నాయి. ఈ సూచనలు మహా బాధకాలం అయిపోయిన వెంటనే, ప్రభువు యొక్క భయంకరమైన మహా దినానికి ముందూ కనిపిస్తాయి (ప్రభువు దినం, లేక యెహోవా దినం దేవుడు ఈ లోకం దుర్మార్గతను బట్టి దాన్ని శిక్షించేందుకు లేవబోయే కాలం). మహా బాధకాలమూ, ఈ లోకంపై దేవుడు తన కోపాగ్ని కుమ్మరించే సమయమూ ఒక్కటే అనుకోవడం పొరపాటు (మహా బాధకాలం సైతాను, దుర్మార్గులు కలిగించే బాధలను సూచిస్తుంది). ఈ వచనాన్ని అపో. కార్యములు 2:19-20; ప్రకటన గ్రంథం 6:12-14 తో పోల్చి చూడండి. ప్రభు దినం గురించి నోట్స్ 1 థెస్సలొనీకయులకు 5:2; మొ।।. క్రీస్తు రెండో రాకడకు ముందు సూర్య చంద్ర నక్షత్రాలకు వింతైనవేవో జరుగుతాయి. ఇది మహా బాధకాలం తరువాతా, యెహోవా దినానికి ముందూ జరుగుతుంది.

30. అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు.
దానియేలు 7:13, దానియేలు 7:13-14, జెకర్యా 12:10, జెకర్యా 12:12

ప్రకటన గ్రంథం 1:7; జెకర్యా 12:10-14. “ఆకాశ మేఘాలు”– మత్తయి 26:64; దానియేలు 7:13; 1 థెస్సలొనీకయులకు 4:17; ప్రకటన గ్రంథం 1:7. క్రీస్తు రెండో రాకడ మొదటి రాకడలాగా ఉండదు. మొదటి సారైతే ఆయన తన మహిమను పక్కన పెట్టి సాధుశీలుడై, కొంతమట్టుకు నిస్సహాయంగా ఉన్నట్టు వచ్చాడు – ఫిలిప్పీయులకు 2:5-8.

31. మరియు ఆయన గొప్పబూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు.
ద్వితీయోపదేశకాండము 30:4, యెషయా 27:13, జెకర్యా 2:6

మత్తయి 13:30, మత్తయి 13:41-43 పోల్చి చూడండి. “దేవదూతలు”– ఆదికాండము 16:7. “బూర”– 1 కోరింథీయులకు 15:52; 1 థెస్సలొనీకయులకు 4:16; ప్రకటన గ్రంథం 11:15. క్రీస్తు సంఘం ఆకాశంలో ఆయన్ను కలుసుకునేందుకు వెళ్ళడం “చివరి” బూరధ్వని వినిపించినప్పుడని పౌలు చెప్పాడు. “ఎన్నుకొన్నవారిని”– యోహాను 6:37; యోహాను 17:2, యోహాను 17:6; రోమీయులకు 8:33; ఎఫెసీయులకు 1:4; కొలొస్సయులకు 3:13; 2 తిమోతికి 2:10; తీతుకు 1:1; 1 పేతురు 1:2. ఈ సంఘ యుగంలోని విశ్వాసులకు పెట్టిన పేరు ఈ “ఎన్నుకొన్నవారు” అనేది (పాత ఒడంబడికలో దేవుడు ఎన్నుకున్నది ఇస్రాయేల్ జనమంతటినీ – యెషయా 45:4; యెషయా 65:9). దేవుడు ఎన్నుకున్నవారిని పోగుచేసే సందర్భంలో యేసు ఆకాశం, మేఘాలను అన్నాడు గానీ భూమి అన్నమాటే ఎత్తలేదు. అంటే ఎన్నుకున్నవారు అప్పటికే ఆకాశంలోకి చేరి ఉంటారని ఇందులోని ఉద్దేశమా? అలా అనుకోవటానికి అవసరం లేదు – నెహెమ్యా 1:9; ద్వితీయోపదేశకాండము 30:4; యెషయా 13:5 చూడండి. ఆ రిఫరెన్సుల్లో దేవుడు భూమిమీద జరగబోయే సంఘటనల గురించి చెప్తున్నాడు. మార్కు 13:27 లో యేసు భూమి అనే మాట వాడాడు.

32. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చు కొనుడి. అంజూరపుకొమ్మ లేతదై చిగిరించునప్పుడు వసంత కాలము యింక సమీపముగా ఉన్నదని మీకు తెలియును.

అంజూరు చెట్టు బహుశా కొన్ని సార్లు ఇస్రాయేల్‌కు చిహ్నంగా ఉండవచ్చు – యిర్మీయా 24వ అధ్యాయం; యోవేలు 1:6-7; హోషేయ 9:10. మత్తయి 21:19; లూకా 13:6 కూడా చూడండి. ఇక్కడైతే అంజూరు చెట్టు ఒక్క విషయాన్ని గానీ ఒక్క సంఘటనను గానీ సూచించడం లేదు. ఈ అధ్యాయంలో ముందు రాబోయే విషయాల గురించి యేసు చెప్పిన వాటన్నిటికీ ఇది సూచనగా ఉంది – లూకా 21:28 చూడండి.

33. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నియు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే, ద్వారముదగ్గరనే యున్నా డని తెలిసికొనుడి.

34. ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

కొన్ని అనువాదాల్లో ఇక్కడ “జాతి” అని తర్జుమా చేసిన మాటను “తరం” అని తర్జుమా చేశారు. ఈ రచయిత అభిప్రాయం ప్రకారం ఇక్కడ ఈ సందర్భంలో దీనిని “జాతి” అనే అనువదించాలి (గ్రీకు పదానికి ఈ రెండు అర్థాలూ ఉన్నాయి). యేసు ఈ మాటలు చెప్పినప్పుడు జీవిస్తున్న తరం ఇవన్నీ జరక్కముందే గతించిపోయింది. 27-29 వచనాల్లో వర్ణించిన విషయాల లాంటివేవీ క్రీస్తు రాయబారుల తరంలో జరగలేదు. “తరం” అంటే ఈ యుగాంతంలో ఈ సంభవాలు జరగడం మొదలు పెట్టినప్పుడు ఉండే తరం అని కొందరు పండితులు అభిప్రాయపడ్డారు.

35. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలుఏ మాత్రమును గతింపవు.

మత్తయి 5:18 తో పోల్చి చూడండి. ధర్మశాస్త్రమూ, తన మాటలు కూడా సాక్షాత్తు దేవుని మాటలేననీ, అవి శాశ్వతంగా నిలిచి ఉంటాయనీ యేసుకు తెలుసు.

36. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలై నను కుమారుడైనను ఎరుగరు.

యేసు ముందుగా చెప్పిన సంఘటనలను బట్టీ, కనిపెట్టి చూడవలసిందని మనకు చెప్పిన సూచనలను బట్టీ (వ 33; లూకా 21:28, లూకా 21:31) యేసు వచ్చే సమయాన్ని దాదాపుగా లెక్కకట్టవచ్చుగానీ ఆ సమయమేదో ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. యేసు అన్నీ తెలిసిన దేవుడే అయితే తాను రాబోయే రోజు, గంట ఆయనకు ఎందుకు తెలియదు? యేసు దేవుని అవతారం (యోహాను 1:1, యోహాను 1:14) కాబట్టి తాను కోరితే ఒక సంగతి తనకు తెలియకూడదని కోరుకోగలడు అనుకోవచ్చు. (ఇలాగే ఆయన సర్వశక్తి గలవాడైనప్పటికీ తన స్వంత బలప్రభావాలు, అధికారం చేత ఏ పనీ చేయకూడదని నిశ్చయించుకున్నాడు – యోహాను 5:30; యోహాను 6:38; అపో. కార్యములు 10:38; ఫిలిప్పీయులకు 2:7-8). ఏది ఏమైనా ఒక ప్రత్యేకమైన విషయం గురించి దేవుడు తన జ్ఞానాన్ని పరిమితం చేసుకోవడానికి ఆయనకు స్వేచ్ఛ లేదా? లేదని వాదించడం జ్ఞానం అనిపించుకొంటుందా? ఆదికాండము 18:20-21 పోల్చి చూడండి.

37. నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును ఆలాగే ఉండును.
ఆదికాండము 6:9-12

“నోవహు”– ఆదికాండం అధ్యాయం 6.

38. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు, వారు తినుచు త్రాగుచు పెండ్లిచేసికొనుచు పెండ్లికిచ్చుచునుండి
ఆదికాండము 6:13-724, ఆదికాండము 7:7

యేసు ఇక్కడ నోవహు కాలంలోని ప్రజల అజ్ఞానం గురించీ, వారిపైకి విపత్తు హఠాత్తుగా వచ్చిపడడం గురించీ నొక్కి చెప్తున్నాడు. వారు తమ కిష్టమైన బ్రతుకు తీరుకు లొంగిపోయేవారు. దేవుడు ఏం చెయ్యబోతున్నాడో వారికి తెలియదు, తెలుసుకోవాలన్న కోరికా వారికి లేదు. 2 పేతురు 2:5 పోల్చి చూడండి.

39. జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి; ఆలాగుననే మనుష్యకుమారుని రాకడ ఉండును.
ఆదికాండము 6:13-724

40. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసి కొనిపోబడును ఒకడు విడిచి పెట్టబడును.

41. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసరుచుందురు, ఒకతె తీసికొని పోబడును,ఒకతె విడిచిపెట్టబడును.

వ 31.

42. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి.

43. ఏ జామున దొంగవచ్చునో యింటి యజమానునికి తెలిసియుండిన యెడల అతడు మెలకువగా ఉండి తన యింటికి కన్నము వేయనియ్యడని మీరెరుగుదురు.

44. మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి.

వ 42లో క్రీస్తు “మెళుకువగా ఉండండి” అన్నాడు. ఇక్కడ “సిద్ధంగా ఉండండి” అంటున్నాడు. ఆయన రాకడకు సంబంధించి ఆయన శిష్యులు పాటించవలసిన రెండు విధులు ఇవి. నిజానికి ఇవి రెండూ దాదాపు ఒకటే. మత్తయి 25:13 నోట్ చూడండి. మనకు ఆ సమయం ఖచ్చితంగా తెలియదు కాబట్టి మనం కనిపెట్టుకొని ఉండాలి, అన్ని వేళల్లోనూ ఆధ్యాత్మికంగా సిద్ధపడి ఉండాలి – మత్తయి 25:10; 1 థెస్సలొనీకయులకు 5:6-8; 1 యోహాను 2:28.

45. యజమానుడు తన యింటివారికి తగినవేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు?

మత్తయి 25:21, మత్తయి 5:23. సంఘాల్లోని కాపరులు, ఉపదేశకుల గురించి ఇక్కడ యేసు మాట్లాడుతున్నాడు. వారు దేవుని ప్రజలకు ఆత్మ సంబంధమైన ఆహారం పెట్టాలి (యోహాను 21:15-17). దేవుడు నియమించిన కాలాలూ తేదీల గురించి లెక్కలు వేసుకుంటూ కూర్చోవడం కన్నా ఇది ఎంతో ప్రాముఖ్యం (అపో. కార్యములు 1:7). దేవుని ప్రజలను సరిగ్గా పోషించడానికి ఎంతో జ్ఞానం, విశ్వసనీయత అవసరం – 1 కోరింథీయులకు 4:2; 2 తిమోతికి 2:2; యాకోబు 1:5-6.

46. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు.

47. అతడు తన యావదాస్తిమీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

48. అయితే దుష్టుడైన యొక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని

వుని సేవకులమని చెప్పుకుంటూనే దుర్మార్గంగా కపటంగా ఉండే సంఘకాపరులు, ఉపదేశకులు ఉన్నారు. వారి నాశనం తప్పనిసరి (2 పేతురు 2:1-3; యూదా 1:4, యూదా 1:12-15 వచనాలు).

49. తనతోడి దాసులను కొట్ట మొదలుపెట్టి, త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటె

50. ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి,వానిని నరికించి వేషధారులతో కూడ వానికి పాలు నియమించును.

51. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును.

“పళ్ళు”– మత్తయి 8:12.Shortcut Links
మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |