“అప్పుడు”– 24వ అధ్యాయంలో ఉన్నట్టుగా ఈ యుగాంతం రోజుల్లో అని అర్థం. పరలోక రాజ్యం గురించి నోట్ మత్తయి 4:17. క్రీస్తు జీవించిన కాలంలో ఉండే సంప్రదాయాలను ఈ ఉదాహరణ ప్రతిబింబిస్తున్నది. పెళ్ళికొడుకు పెళ్ళికూతురి ఇంటికి వచ్చి ఆమెను తన ఇంట్లో జరిగే పెండ్లి విందుకు ఆమెను తీసుకువెళ్ళాలి. అతడి రాకకోసం ఈ పదిమంది కన్యలు ఎదురు చూస్తున్నారు. ఈ ఉదాహరణలో పెళ్ళికొడుకంటే యేసుప్రభువు. పెళ్ళికూతురంటే అనేకమంది వ్యక్తులతో కూడిన నిజ సంఘం (మత్తయి 9:15; ప్రకటన గ్రంథం 19:6-8 చూడండి). మరి ఈ పదిమంది కన్యలు ఎవరు? బహుశా వధువును వరుడి రాకకోసం సిద్ధం చేయవలసిన బాధ్యత ఉన్న సంఘ నాయకులు కావచ్చు (అంటే మత్తయి 24:45-49 లోని సేవకులు కావచ్చు. 2 కోరింథీయులకు 11:2 లో పౌలు చెప్పిన మాటలను పోల్చి చూడండి). లేక తాము నిజ సంఘంలో ఉన్నామని అనుకుంటూ క్రీస్తు రాజ్యంలో, రక్షణలో భాగం పంచుకోవాలని ఆశిస్తూ, బయటికి సంఘంగా కనిపించేదానిలో ఉన్నవారు కావచ్చు (బయటికి సంఘంగా కనిపించేదానిలో విశ్వాసులూ, అవిశ్వాసులు కూడా ఉన్నారు). ఒక వేళ ఈ కన్యలు ఈ చివరి రకం వారైతే, తెలివైనవారు, తెలివితక్కువ వారు అనే వ్యత్యాసం నిజమైన క్రైస్తవులకూ, అబద్ధ క్రైస్తవులకూ, దేవుని ఆత్మమూలంగా తిరిగి పుట్టినవారికీ (యోహాను 3:3-8), అలా పుట్టని వారికీ ఉన్న భేదాన్ని సూచిస్తుందన్నమాట.