39. కొంత దూరము వెళ్లి, సాగిలపడి నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను.
ఇలా సాగిలపడడం గొప్ప మనోవేదనకూ, గండం గురించిన అనుభూతి, కంగారుకూ, సహాయం కోరి మనసుపెట్టే పొలి కేకకూ గుర్తు. హెబ్రీయులకు 5:7 పోల్చి చూడండి. ఆయన ముందున్న భయానకమైన క్రూర అనుభవాలకు సూచన ఈ గిన్నె. మానవ పాపానికి వ్యతిరేకంగా చెలరేగే దేవుని ఆగ్రహమనే గిన్నెలోది ఆయన తాగబోతున్నాడు. దేవుడాయన్ను పాపంగా చేయబోతున్నాడు (వ 38; 2 కోరింథీయులకు 5:21). ఆయన వచ్చినది ఇందుకే (యోహాను 12:27; యోహాను 18:11). అయితే ఇప్పుడు ఆ క్షణం దగ్గరైంది కాబట్టి అది ఇంత వికృతంగా బీకరంగా అనిపించి ఆయన పవిత్ర స్వభావం కంపరంతో దానినుంచి వైదొలగాలని చూస్తున్నది. మనుషులపట్ల దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చుకునేందుకు ఒకవేళ వేరొక మార్గమేదైనా చూడగలిగితే, తాను ఆ గిన్నెలోది తాగవలసిన అవసరం లేకపోతే అలా చెయ్యమని ప్రార్థించాడు. అయితే అలాంటిది సాధ్యం కాదు కాబట్టి తన ఆత్మ అంత వేదనలో ఉండి కూడా (లూకా 22:44) యేసు తండ్రి అయిన దేవుని సంకల్పాన్ని అంగీకరించాడు. మనుషులంతా నేర్చుకోవలసిన ప్రార్థన యేసు ఇక్కడ చెప్తున్నాడు. దేవుని మార్గమే, సంకల్పమే ఎప్పుడూ అతి శ్రేష్ఠమైనది. దాన్ని అంగీకరించడంవల్ల కొద్ది కాలం బాధ, నష్టం వాటిల్లినప్పటికీ, ఎక్కువ విధేయతతో అంగీకరించినవారే ఎక్కువ ధన్యులు.