Matthew - మత్తయి సువార్త 28 | View All

1. విశ్రాంతిదినము గడచిపోయిన తరువాత ఆదివారమున, తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి.

యేసును సిలువ వేసిన తరువాత ఇది మూడో రోజు (అపో. కార్యములు 10:40; 1 కోరింథీయులకు 15:4). “విశ్రాంతిదినం”– నిర్గమకాండము 20:8-11. మరో మరియ అంటే యాకోబు, యోసే అనేవారి తల్లి (మత్తయి 27:56).

2. ఇదిగో ప్రభువు దూత పరలోకమునుండి దిగివచ్చి, రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను; అప్పుడు మహాభూకంపము కలిగెను.

దేవదూత సమాధి రాయిని అవతలకు దొర్లించినది యేసు బయటికి రాగలిగేందుకు కాదు గాని యేసు శిష్యులు లోపలికి వెళ్ళి అది ఖాళీగా ఉందని చూచేందుకు (వ 6). “దూత” గురించి ఆదికాండము 16:7 నోట్ చూడండి.

3. ఆ దూత స్వరూపము మెరుపువలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను.

4. అతనికి భయ పడుటవలన కావలివారు వణకి చచ్చినవారివలె నుండిరి.

దానియేలు 8:17; లూకా 1:12; లూకా 2:9. దేవదూతను చూచే మనుషులు ఇంత కంగారు పడితే, సాక్షాత్తూ దేవుని ఎదుట నిలబడితే ఏం చేస్తారో (ప్రకటన గ్రంథం 20:11-12).

5. దూత ఆ స్త్రీలను చూచిమీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియును;

మానవ చరిత్రలోనే మహోదయం ఇది. ఇది ఆనంద సమయమే గాని భయపడవలసినది కాదు. అయితే దూత భయపడవద్దని కావలివారికి చెప్పలేదు. యేసును వెతుకుతున్న స్త్రీలతో చెప్పాడు. ఇతర మనుషులు భయపడే చాలా విషయాల గురించి క్రీస్తు శిష్యులు భయపడనవసరం లేదు. వారికి మహానంద కారణం ఇతరులకు గొప్ప భయకారణం కావచ్చు.

6. ఆయన ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచి యున్నాడు; రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి

యేసుప్రభువు తాను తిరిగి సజీవంగా లేస్తానని చెప్పాడు (మత్తయి 16:21; మత్తయి 17:23; మత్తయి 20:19; యోహాను 10:17-18). అలా జరక్కుండా చేసేందుకు ఆయన శత్రువులు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆయన సజీవంగా లేచాడు. ఒక మనిషి చనిపోకముందు తాను చనిపోయాక సజీవంగా లేస్తానని చెప్పడమే గొప్ప విశేషం. ప్రపంచ సాహిత్యమంతట్లో ఇలాంటిది ఎక్కడా లేదు. ఇక అక్షరాలా ఆ విధంగా లేవడమన్నది సాటిలేని పరమాద్భుతమే. దేవదూత మాటలను జాగ్రత్తగా గమనించండి. యేసుప్రభువు మొత్తంగా – అంటే శరీరం, ప్రాణం, మనసు, ఆత్మ సహితంగా – సజీవంగా లేచి సమాధి బయటికి వచ్చాడు. సమాధిలో ఉంచిన ఆయన మృత దేహం అక్కడ లేదు. ఆ స్త్రీలు తమ కళ్ళతో ఇది చూశారు. చనిపోయి సజీవంగా లేవడం ద్వారా యేసు తాను మోసగాడు కాడనీ (మత్తయి 27:63), పరలోకంనుంచి వచ్చిన దేవుని కుమారుడనీ రుజువు చేశాడు (రోమీయులకు 1:4). మరణాన్ని జయించినవాడనీ, తాను చెప్పిన రీతిగా శాశ్వత జీవాన్ని ఇచ్చేవాడనీ నిరూపించుకున్నాడు (యోహాను 5:21-29; యోహాను 11:25-26). క్రీస్తు సజీవంగా లేవడంనుంచి మనం నేర్చుకోదగిన మరి కొంత సత్యం కోసం 1 కొరింతు 15వ అధ్యాయం చూడండి. ఈ దేవదూత “ఆయన సజీవంగా లేచాడు” అని చెప్పిన మాటను మనం సందేహించడానికి ఆధారమేమన్నా ఉందా? ఏదీ లేదు. ఉన్న సాక్ష్యాధారాలన్నీ రుజువులన్నీ ఆయన లేచాడనే చెప్తున్నాయి. మొట్టమొదటగా, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా యేసు చెప్పిన మాటలే మనకు ఆధారం (మత్తయి 16:21; మత్తయి 17:23; మత్తయి 20:19; యోహాను 10:17-18; లూకా 24:45). అంతేగాక ఆయన సజీవంగా లేచిన తరువాత చాలామంది ఆయన్ను చూశారు. ఈ ప్రత్యక్ష సాక్షులు ఆయన లేచాడన్న మాట కోసం బాధలను అనుభవించి మరణించడానికైనా సిద్ధమయ్యారు (అపొ కా గ్రంథం దీన్ని స్పష్టం చేస్తున్నది). అంతేగాక వారు ప్రకటించిన ఈ సత్యాన్ని స్థిరపరిచేందుకు దేవుడు కూడా వారితో కలిసి అమిత శక్తితో పని చేశాడు (హెబ్రీయులకు 2:3-4). ఈ ప్రత్యక్ష సాక్షులకు యేసు కనిపించిన సందర్భాల గురించి మత్తయి శుభవార్తలో రాసి ఉన్నదానికంటే మరింత వివరంగా కావాలంటే లూకా 24వ అధ్యాయం, యోహాను 20,21 అధ్యాయాలు; అపో. కార్యములు 1:3-9 చూడండి.

7. త్వరగా వెళ్లి, ఆయన మృతులలోనుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి; ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్లు చున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు; ఇదిగో మీతో చెప్పితిననెను.

వ 10,16. క్రీస్తు సజీవంగా లేచాక జరిగిన సంభవాల వరుస క్రమం స్పష్టంగా లేదు. ఏ ఒక్క శుభవార్తలోనూ అవన్నీ రాసిలేవు. ప్రతి రచయితా దేవుడు అతణ్ణి ప్రేరేపించిన రీతిగా వర్ణించాడు. యేసుప్రభువు పదకొండు వేరువేరు సందర్భాల్లో శిష్యులకు కనిపించినట్టుంది. వీటి క్రమం బహుశా ఇది: మగ్దలేనే మరియకు (మార్కు 16:9; యోహాను 20:14); ఆమె లేకుండా సమాధినుంచి తిరిగి వస్తున్న స్త్రీలకు (మత్తయి 28:9-10); తరువాత పేతురుకు (లూకా 24:34); ఎమ్మాయస్ గ్రామానికి పోయేదారిలో ఇద్దరు శిష్యులకు (లూకా 24:13); తరువాత తోమా లేని సమయంలో జెరుసలంలో కొందరు శిష్యులకు (యోహాను 20:19); తోమా ఉన్నప్పుడు (యోహాను 20:26-29); తరువాత గలలీ సరస్సు ఒడ్డున ఏడుగురు శిష్యులకు (యోహాను 21:1); గలలీ ప్రదేశంలోని కొండపై కొంతమంది శిష్యులకు (మత్తయి 28:16); తరువాత ఒకే సమయంలో 500 కంటే ఎక్కువమందికి (1 కోరింథీయులకు 15:6); యాకోబుకు (1 కోరింథీయులకు 15:7); చివరికి ఆలీవ్ కొండ మీద తన పదకొండుమంది రాయబారులకు (లూకా 24:50-51; అపో. కార్యములు 1:9-12). ఆయన తన రాయబారులకు 40 దినాలపాటు కనిపిస్తూ వచ్చాడు గనుక బైబిలులో రాయని ప్రత్యక్షాలు మరి కొన్ని జరిగి ఉండాలి (అపో. కార్యములు 1:3). ఈ ప్రత్యక్షాలన్నీ ఒకే ఒక గొప్ప సత్యాన్ని పూర్తిగా రుజువు చేసి శాశ్వతంగా స్థిరపరచాయి – చనిపోయిన యేసు తిరిగి సజీవంగా లేచాడు.

8. వారు భయముతోను మహా ఆనందముతోను సమాధియొద్దనుండి త్వరగా వెళ్లి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా

కీర్తనల గ్రంథము 2:11. యేసు చనిపోయి తిరిగి లేచాడనే సంగతి వాస్తవంగా నమ్మినవారికి అది ఎప్పటికీ ఆనంద కారణంగా ఉంటుంది (లూకా 24:52; యోహాను 20:20).

9. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను.వారు ఆయన యొద్దకు వచ్చి, ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా

10. యేసు భయపడకుడి; మీరు వెళ్లి, నా సహోదరులు గలిలయకు వెళ్లవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను.

యేసు సజీవంగా లేచాడన్న దివ్యమైన సత్యం మనలోని భయాన్ని తొలగించి దాన్ని గురించి మాట్లాడేందుకు లోకంలోకి పంపించగలగాలి. “నా సోదరులు” అంటే శిష్యులు (మత్తయి 12:48-49; హెబ్రీయులకు 2:11-12). వారు వెంటనే గలలీకు ప్రయాణం కట్టలేదు. క్రీస్తు సజీవంగా లేచాడన్న సత్యాన్ని వారు త్వరగా నమ్మలేదు – మత్తయి 16:11, మత్తయి 16:13-14. అందువల్ల ఆయన వారికి జెరుసలంలో కనిపించాడు (యోహాను 20:19-29).

11. వారు వెళ్లుచుండగా కావలివారిలో కొందరు పట్టణము లోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటిని ప్రధాన యాజకులతో చెప్పిరి.

సత్యంపట్ల ద్వేషం మనుషులను సత్యంనుంచి మరింత దూరం చేస్తుంది. అందుకు ఇది మరో ఉదాహరణ. ఈ యూదులు చెప్పినది కేవలం కట్టు కథేనని జెరుసలంలో ఉన్నవారికీ, లోకంలో ఉన్నవారందరికీ త్వరలోనే అర్థమైపోయింది. ఆ తరువాత శిష్యులు ప్రవర్తించిన తీరు యేసు దేహాన్ని దొంగిలించుకు వెళ్ళి ఎక్కడో దాచిపెట్టిన మోసగాళ్ళ తీరు కాదు. యేసు సజీవంగా లేచాడని తాము ప్రకటించిన సత్యంకోసం వారు బాధలను అనుభవించి మరణించారు.

12. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచనచేసి ఆ సైనికులకు చాల ద్రవ్యమిచ్చి

13. మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రి వేళవచ్చి అతనిని ఎత్తికొనిపోయిరని మీరు చెప్పుడి;

ఎంత విచిత్రమైన ఆదేశాలు! వారు నిద్రపోతూ ఉంటే యేసు దేహానికి ఏం జరిగిందో వారికెలా తెలుస్తుంది? ఇలాంటి సాక్ష్యాన్ని లోకంలో ఏ కోర్టూ అంగీకరించదు గదా.

14. ఇది అధిపతి చెవిని బడినయెడల మేమతని సమ్మతిపరచి మీకేమియు తొందరకలుగకుండ చేతుమని చెప్పిరి.

15. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసికొని తమకు బోధింపబడినప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటివరకు ప్రసిద్ధమైయున్నది.

16. పదునొకండుమంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్లిరి.

వ 10.

17. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరిగాని, కొందరు సందేహించిరి.

“ఆరాధించారు”– మత్తయి 2:11; మత్తయి 4:10; మత్తయి 14:33 చూడండి. “సందేహించారు”– వారు సందేహించినది దేన్నో స్పష్టంగా లేదు. అయితే లూకా, యోహాను శుభవార్తల్లో ఉన్నదాన్ని బట్టి యేసు సజీవంగా లేచిన తరువాత ఆయన స్వరూపం అచ్చంగా అంతకు ముందులాగా లేదనీ, తక్షణమే ఆయన్ను గుర్తుపట్టడం కుదరలేదనీ స్పష్టంగా ఉంది (లూకా 24:16, లూకా 24:31, లూకా 24:36-43; యోహాను 20:15; యోహాను 21:5). దగ్గరగా వచ్చి వారితో మాట్లాడ్డం ద్వారా యేసు వారి సందేహాలు తొలగించేశాడు. అసలు ఇలా సందేహపడ్డారు అని చెప్పడంలో శుభవార్త రచయితల యథార్థత బయట పడుతున్నది. ఒకవేళ యేసు నిజంగా సజీవంగా లేవలేదనుకోండి, ఆయన అలా లేచాడని వీరు తమ పుస్తకాల ద్వారా ప్రజల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారనుకోండి. అలాంటప్పుడు, కొందరి సందేహాల గురించీ ఆయన్ను గుర్తు పట్టడంలోని సమస్యల గురించీ అసలు రాసి ఉండేవారా?

18. అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధి కారము ఇయ్యబడియున్నది.
దానియేలు 7:14

యోహాను 3:35; యోహాను 17:2; యోహాను 5:22-23; అపో. కార్యములు 2:32-33, అపో. కార్యములు 2:36; ఫిలిప్పీయులకు 2:9-11. యేసుప్రభువు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు ప్రకటన గ్రంథం 19:16. అలా ఆయన్ను స్వీకరించి ఆయనలో నమ్మకం ఉంచినవారు ధన్యులు (కీర్తనల గ్రంథము 2:6-12). ఆయన భూమిపై జరుగుతున్నవాటిని తన ఇష్టప్రకారం నిర్వహిస్తూ తన ఉద్దేశాలను నెరవేర్చుకుంటూ ఉన్నాడు. ఈ అధికారం ఆయనకు “ఇవ్వబడింది”. ఎవరిచ్చారు? తండ్రియైన దేవుడు. ఈ జగత్తు గురించిన వ్యవహారాలను నిర్వహించడంలో ఆయన కుమారుని కన్నా ఉన్నత స్థాయిలో ఉన్నాడు. (యోహాను 10:29; యోహాను 14:28; 1 కోరింథీయులకు 15:22-28).

19. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగాచేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు

మార్కు 16:15; లూకా 24:47-49; యోహాను 20:21; అపో. కార్యములు 1:8. యేసుకు మనుషులందరిమీదా అధికారం ఉంది (యోహాను 17:2) కాబట్టి ఆయన ఆజ్ఞాపించినట్టెల్లా ఆయన శిష్యులు చేయగలుగుతారు. మనుషుల్ని శిష్యులుగా చేయడం వారి పని. అంటే కేవలం శుభవార్త ప్రకటించడమే కాదు. వారు చేయవలసినదానిలో అది ఒక భాగం మాత్రమే. యేసు ఉపదేశించినదంతా మనుషులకు ఉపదేశించి వారిని దానికంతటికి విధేయులుగా చేయాలి (వ 20; యోహాను 14:21, యోహాను 14:23; 1 యోహాను 2:3-6). “బాప్తిసం” గురించి నోట్ మత్తయి 3:6. “పేరట”– దేవుని పేరును గురించి చివరిగా యేసు ఇక్కడ వెల్లడిస్తున్నాడు. పేరు అన్నది ఏకవచనమే, బహువచనం కాదు. ఎందుకంటే తండ్రి, కుమారుడు, పవిత్రాత్మ ముగ్గురు దేవుళ్ళు కాదు; స్వభావంలోను లక్షణాలలోనూ పరిపూర్ణ ఐక్యత గల ఒకే ఒక దేవుడు. దేవుని పేరును వెల్లడి చేయడం అంటే దేవుడెలాంటివాడో చెప్పడమే (యోహాను 17:6; నిర్గమకాండము 34:5-7). దేవుడు త్రిత్వం (మత్తయి 3:16-17; మత్తయి 11:27; యోహాను 1:1, యోహాను 1:14, యోహాను 1:18; యోహాను 5:30; యోహాను 10:30; యోహాను 14:16-17; 2 కోరింథీయులకు 13:14; ఎఫెసీయులకు 4:4-6).

20. నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి.ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.
హగ్గయి 1:13

క్రీస్తు రాయబారులు ఈ ఆజ్ఞను గంబీరమైనదిగా ఎంచారు. దాన్ని ఆషామాషీగా తీసుకోలేదు. దీనిప్రకారం చేసేందుకు బహు శక్తివంతంగా పని చేశారు. అపొ కా గ్రంథంలోనూ వారు రాసిన లేఖనాల్లోనూ ఇది స్పష్టంగా ఉంది. “మీకు” అంటే అక్కడున్న శిష్యులు మాత్రమే కాదు, ఈ యుగమంతటిలోనూ వారి తరువాత వచ్చినవారు కూడా. ఈ చివరి మాటల్లో ఇది స్పష్టంగా తెలుస్తున్నది. క్రీస్తు రాయబారులు ఆరంభించిన పనిని కొనసాగించడానికి ప్రతి తరంలోనూ నమ్మకమైన మనుషులు కావాలి. క్రీస్తు తానే ఎప్పుడూ అలాంటివారితో ఉంటాడు. మత్తయి మొదటి అధ్యాయంలో ఇమ్మానుయేలు వస్తున్నాడన్న ప్రకటన ఉంది (మత్తయి 1:23). ఈ చివరి వచనంలో ఈ యుగాంతం వరకు ఇమ్మానుయేలు తన ప్రజలతో ఉంటాడన్న వాగ్దానం ఉంది. మత్తయి 18:20 కూడా చూడండి.Shortcut Links
మత్తయి - Matthew : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |