8. మరల అపవాది మిగుల ఎత్తయిన యొక కొండమీదికి ఆయనను తోడుకొనిపోయి, యీ లోక రాజ్యములన్నిటిని, వాటి మహిమను ఆయనకు చూపి
సైతాను ఇక్కడ తన రహస్యమైన కోరికను బయట పెడుతున్నాడు – మనుషులు తనను ఆరాధించాలని వాడి కోరిక. వాడు ఈ యుగదేవుడు (2 కోరింథీయులకు 4:4). అందువల్ల మనుషులు తనను గొప్పచేసి తనకు మొక్కి విధేయత చూపాలని కోరుతాడు. మనుషులు కొందరు తెలిసి, కొందరు తెలియకా అలానే చేస్తారు. లేవీయకాండము 17:7; ద్వితీయోపదేశకాండము 32:17; కీర్తనల గ్రంథము 106:37; 1 కోరింథీయులకు 10:20; ప్రకటన గ్రంథం 9:20 చూడండి. ఇది సాధించేందుకు భూమిమీద మత సంబంధం, లోక సంబంధం అయిన అన్ని వ్యవహారాల్లోనూ వాడు చురుకుగా పని చేస్తూ ఉంటాడు. తనవైపుకు వాడు మనుషుల్ని ఆకర్షించుకునే పద్ధతుల్లో ఒకటి సంపదలు, అధికారం ఎర చూపించడం ద్వారా. ఇలాంటివి వాడు ఇవ్వగలడు. ఎందుకంటే వాడు ఆదామును పాపంలోకి లాగినప్పుడు ఒక విధంగా చెప్పాలంటే అవన్నీ అతడి హస్తగతం అయ్యాయి. భూమిని పాలించడానికి దేవుడు నియమించిన వ్యక్తి ఆదాము (ఆదికాండము 1:27-28). అతడే మానవ జాతికి జనకుడు, ప్రతినిధి. అయితే అతడు పాపంలో పడి భ్రష్టుడై పోయినందువల్ల మానవ జాతిని సైతాను చాలా మట్టుకు తన వశం చేసుకోగలిగాడు. లూకా 4:6; యోహాను 12:31; ఎఫెసీయులకు 2:1-2; 2 తిమోతికి 2:26; 1 యోహాను 5:19 పోల్చిచూడండి. ఇహలోకంలోని కొంచెం సంపదను, కొంచెం ఘనతను, కొద్ది అధికారాన్ని సంపాదించుకోవాలని అనేకమంది న్యాయ సూత్రాలను విడిచి, దేవుని సత్యాన్ని నిరాకరించి, అబద్ధాలు, మోసం, స్వార్థం, అన్యాయంతో కూడిన మార్గాన్ని అనుసరిస్తారు. ఇది సైతాను మార్గం (ఇలాంటి వాళ్ళలో క్రైస్తవులని పేరు పెట్టుకున్నవారు కూడా ఉండడం చాలా విచారకరం). వీరికీ క్రీస్తుకూ ఉన్న తేడా ఒక్క విషయంలో తెలిసిపోతున్నది. కొంచెం ఇంటి స్థలం కోసం వారు న్యాయం, నియమాలనూ అన్నిటినీ వదిలివేస్తారు. క్రీస్తు అయితే లోకం మొత్తాన్ని సంపాదించడం కోసమైనా సరే ఒక్క స్వల్ప న్యాయ సూత్రాన్ని కూడా విడిచి పెట్టడు. తండ్రియైన దేవుని పట్ల నమ్మకంగా ఉండేందుకూ, తండ్రి చిత్తాన్ని నెరవేర్చేందుకూ క్రీస్తు సైతాను ఇవ్వజూపిన వాటన్నిటినీ గడ్డిపోచతో సమానంగా ఎంచాడు. అలా చేసినందువల్ల పేదరికం, బాధలు, మరణం వాటిల్లినా సరే వాటిని వదలలేదు. ఆయనే మనకు ఆదర్శం.