క్రీస్తు శిష్యులు ఎక్కువగా ఆశించవలసిన విషయాలు ఈ క్రింది ప్రార్థనలో ఉన్నాయి. ఎంత గొప్ప సత్యాలు ఎన్ని ముఖ్య విన్నపాలు సామాన్యమైన భాషలో, కొద్ది మాటల్లో పెట్టవచ్చునో గమనించండి. దేవుని ప్రజలు ప్రార్థన చేసే విషయాలన్నీ ఇక్కడ లేవు గానీ అన్ని వేళలా వారి మనస్సులో ఉండవలసినవి మాత్రం ఈ ప్రార్థనలో ఉన్నాయి. వారు ఎలా ప్రార్థించాలి, దేనికోసం ప్రార్థించాలి అన్న విషయాలను తెలిపే నమూనా, లేక ఉదాహరణ, లేక మాదిరి ప్రార్థన ఇది. ఇక్కడ చెప్పినవి గాక అనేక విషయాలు మనం ప్రార్థనలో అడగవచ్చు. అయితే ఈ ప్రార్థనలోని విషయాలను అడగవలసిన అవసరం ఇక లేదనీ మన ఆధ్యాత్మిక స్థితి దీన్ని మించిపోయిందనీ మాత్రం ఎన్నడూ భావించకూడదు.
“తండ్రీ”– మత్తయి 5:16 నోట్. దేవుని ప్రజల ప్రార్థనలకు తామే గాక దేవుడే కేంద్రంగా ఉండాలి. అవి స్వార్థపూరితంగా ఉండకూడదు. మనం ప్రార్థించేటప్పుడు మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నామో ఆయన ఎలాంటివాడో ఆలోచిస్తూ ప్రార్థించాలి. “పరలోకంలో” అనే మాట మహనీయత, ఘనత, గొప్పతనం, సర్వాతీత స్థితులను సూచిస్తున్నది. “పేరు” అంటే దేవుని స్వభావం, గుణాలు అన్నమాట. ఆయన ఎవరో, ఏమై ఉన్నాడో దాన్ని తెలియజేస్తుంది. భూమిపై దేవునికి పేరుప్రతిష్ఠలు కలగాలన్నది యేసు శిష్యుల్లో ప్రతి వ్యక్తికీ మొదటి ఆశయమై ఉండాలి. ప్రార్థనలో మాత్రమే గాక జీవితంలో కూడా వ్యక్తిగత విన్నపాలకంటే ఈ ఉద్దేశమే ముందుండాలి. వారి ప్రార్థనలు, అభిలాషలు, చర్యలు, మాటలు అన్నీ ఇదే లక్ష్య సాధన కోసమే ఉండాలి. ఇందులో యేసు తానే ఆదర్శం (మత్తయి 5:16; యోహాను 8:29; యోహాను 17:4; 1 కోరింథీయులకు 10:31). దేవుని ప్రతిష్ఠ విషయం మనకు లెక్క లేదనేమో బహుశా మన ప్రార్థనల్లో అనేకాలకు జవాబు రాదు. “పవిత్రమై ఉంటుంది” అంటే ఇక్కడ పవిత్రంగా ఎంచబడాలని అర్థం. ఏకైక పరిపూర్ణ పవిత్రుడు దేవుడే. ప్రార్థన చేసేవారికి దీని విషయం శ్రద్ధ ఉండాలి. ఒకవేళ దేవుడు తన పేరును లోకంలో పవిత్రం చెయ్యాలనీ, ఏకైక నిజ దేవుని పవిత్ర స్వభావాన్ని మనుషులు గుర్తించగలిగే పరిస్థితిని ఆయన మనుషుల్లో కలిగించాలనీ ఈ ప్రార్థన ఉద్దేశమై ఉండవచ్చు. యెహెఙ్కేలు 36:23 పోల్చిచూడండి. దేవుని పవిత్రత గురించి నోట్ లేవీయకాండము 20:7; యెషయా 6:3; ప్రకటన గ్రంథం 15:4.