ఇది అద్భుతాలు అధ్యాయం. ఇందులో యేసుప్రభువు మనుషుల వ్యాధులపైనా (వ 1-17), ఆధ్యాత్మిక జీవన సంబంధమైన సంగతులపైనా (వ 18-22), ప్రకృతి శక్తులపైనా (వ 23-27), అదృశ్యమైన ఆత్మల లోకంపైనా (వ 28-34) తన అధికారాన్నీ, ప్రభావాన్నీ కనపరుస్తున్నాడు. ఆయన తానెవరినని చెప్పుకున్నాడో – అంటే పరలోకంనుంచి వచ్చిన ప్రభువు – అక్షరాలా ఆయనే అనేందుకు ఇదంతా ధారాళమైన సాక్ష్యాధారం (యోహాను 3:13; యోహాను 8:23). క్రీస్తు అద్భుతాలు ఆయన మహిమను కనపరిచాయి – యోహాను 2:11. పరమ తండ్రి అయిన దేవుడు ఆయన్ను పంపాడనీ, ఆయన ఆ తండ్రితో ఏకంగా ఉన్నాడనీ ఇదంతా రుజువు చేస్తున్నది (యోహాను 5:36; యోహాను 10:37-38; యోహాను 14:11; అపో. కార్యములు 2:22). ఇవి క్రీస్తు యోగ్యతా పత్రాల లాంటివి, దేవుడు ఆయన యోగ్యతను దృఢపరుస్తూ రాసి ఇచ్చిన సిఫారసు లేఖల లాంటివి. ఇవి వ్రాత పూర్వకంగా లేవు, చేతల రూపంలోనే ఉన్నాయి. దేవుని రాజ్యం వచ్చిందనడానికి ఇవి నిదర్శనాలు (మత్తయి 12:18). యేసుప్రభువు చేసిన అద్భుతాలు మంత్రవిద్య ద్వారా చేయగలిగిన మాయలు కావు. “నివారణ లేని” కుష్ఠువంటి వ్యాధులున్నవారిని ఆయన బాగు చేశాడు. గుడ్డివారి కళ్ళను తెరిచాడు (మత్తయి 9:27-30; మత్తయి 11:4; మత్తయి 20:34), నీళ్ళమీద నడిచాడు (మత్తయి 14:25), చనిపోయిన వారిని బ్రతికించాడు (లూకా 7:11-15; లూకా 8:49-56; యోహాను 11:43-44). అంతే గాక తానే మరణంనుంచి లేచాడు (మత్తయి 28:1-6) – మానవ చరిత్రంతట్లో అలా చేసినది ఆయన ఒక్కడే. యేసు చేసినది కేవలం ఉపదేశించడం కాదు. అతి స్పష్టమైన రీతిలో దేవుని ప్రభావాన్నీ, దేవుని లక్షణాలనూ ప్రదర్శించాడు. అలాగని అద్భుతాలు చేసేవారంతా దేవునినుంచి వచ్చారని భావించకూడదు (మత్తయి 7:22; మత్తయి 24:24). కపట ప్రవక్తలు చేసే అద్భుతాలు సైతాను శక్తికి సాక్ష్యాధారాలు. వారి స్వభావం కూడా వారి ఉపదేశాల వల్లా, జీవిత విధానాల వల్లా క్రీస్తు శిష్యులైనవారికి తేటతెల్లమే.