Mark - మార్కు సువార్త 6 | View All

1. ఆయన అక్కడనుండి బయలుదేరి స్వదేశమునకు రాగా, ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి.

1. యేసు అక్కడినుండి తన శిష్యులతో కలిసి స్వగ్రామానికి వెళ్ళాడు.

2. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజమందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడనుండి వచ్చెను? ఇతనికియ్యబడిన ఈ జ్ఞానమెట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి? ఇదేమి?

2. విశ్రాంతి రోజు రాగానే సమాజమందిరంలో బోధించటం మొదలుపెట్టాడు. చాలామంది ఆయన చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు పరస్పరం ఈ విధంగా మాట్లాడుకొన్నారు. “ఈయన కింత జ్ఞానం ఏవిధంగా లభించింది? ఈ జ్ఞానం ఎలాంటిది? ఈయన మహత్యాలు ఎట్లా చేస్తున్నాడు.

3. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరు మనతో నున్నారు కారా? అని చెప్పు కొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి.

3. ఈయన వడ్రంగి కదా! మరియ కుమారుడు కదూ! యాకోబు, యోసేపు, యూదా, సీమోనుల సోదరుడే యితడు. ఇతని చెల్లెండ్లు యిక్కడ మనతోనే ఉన్నారు కదూ!” అని అంటూ వాళ్ళు ఆయన్ని తృణీకరించారు.

4. అందుకు యేసు ప్రవక్త తన దేశము లోను తన బంధువులలోను తన యింటివారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పెను.

4. యేసు వాళ్ళతో, “ప్రవక్తకు స్వగ్రామంలో, తన బంధువుల్లో, తన యింట్లో తప్ప అన్నిచోట్లా గౌరవం లభిస్తుంది” అని అన్నాడు.

5. అందు వలన కొద్దిమంది రోగులమీద చేతులుంచి వారిని స్వస్థ పరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను.

5. యేసు కొందరు వ్యాధిగ్రస్తుల మీద తన చేతులుంచి, వాళ్ళకు నయం చేయటం తప్ప మరే మహత్యాలు అక్కడ చేయలేక పోయాడు.

6. ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను.

6. వాళ్ళలో విశ్వాసం లేక పోవటం చూసి ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత యేసు, గ్రామ గ్రామానికి వెళ్ళి బోధించాడు.

7. ఆయన పండ్రెండుగురు శిష్యులను తనయొద్దకు పిలిచి, వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు, అపవిత్రాత్మల మీద వారి కధికారమిచ్చి

7. ఆయన పన్నెండుగురిని పిలిచి వాళ్ళకు దయ్యాలపై అధికారమిచ్చాడు. ఇద్దరిద్దరి చొప్పున పంపుతూ,

8. ప్రయాణముకొరకు చేతికఱ్ఱను తప్ప రొట్టెనైనను జాలెనైనను సంచిలో సొమ్మునైనను తీసికొనక

8. వాళ్ళకు ఈ విధంగా ఉపదేశించాడు: “ ప్రయాణం చేసేటప్పుడు చేతి కర్రను తప్ప మరేది తీసుకు వెళ్ళకండి. ఆహారము, సంచీ, దట్టీలో డబ్బు, తీసుకువెళ్ళకండి.

9. చెప్పులు తొడగుకొనుడనియు, రెండంగీలు వేసికొన వద్దనియు వారికాజ్ఞాపించెను.

9. చెప్పులు వేసుకోండి. కాని మారు దుస్తులు తీసుకు వెళ్ళకండి.

10. మరియు ఆయన వారితో ఇట్లనెనుమీరెక్కడ ఒక యింట ప్రవేశించెదరో అక్కడనుండి మీరు బయలుదేరువరకు ఆ యింటనే బసచేయుడి.

10. ఒకరి యింటికి వెళ్ళాక ఆ గ్రామం వదిలి వెళ్ళేదాకా ఆ యింట్లోనే ఉండండి.

11. ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చు కొనక మీ మాటలు వినకుంటే, మీరు అక్కడనుండి బయలుదేరునప్పుడు వారిమీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింది ధూళి దులిపివేయుడి.

11. ఒక గ్రామం వాళ్ళు మీకు స్వాగతమివ్వక పోతే, లేక మీ బోధనల్ని వినకపోతే మీరా గ్రామం వదిలేముందు వాళ్ళ వ్యతిరేకతకు గుర్తుగా మీ కాలికంటిన వాళ్ళ ధూళిని దులపండి.”

12. కాగా వారు బయలుదేరి, మారుమనస్సు పొందవలెనని ప్రక టించుచు

12. వాళ్ళు వెళ్ళి ప్రజలకు మారుమనస్సు పొందమని బోధించారు.

13. అనేక దయ్యములు వెళ్లగొట్టుచు నూనెరాచి అనేకులగు రోగులను స్వస్థపరచుచునుండిరి.

13. ఎన్నో దయ్యాలను వదిలించారు. చాలామంది వ్యాధిగ్రస్తులకు నూనెరాచి నయం చేసారు.

14. ఆయన కీర్తి ప్రసిద్ధమాయెను గనుక రాజైన హేరోదు ఆయననుగూర్చి వినిబాప్తిస్మమిచ్చు యోహాను మృతులలోనుండి లేచియున్నాడు గనుక అతనియందు అద్భుత ములు క్రియారూపకములగుచున్నవని చెప్పెను.

14. యేసుకు పేరు ప్రఖ్యాతులు రావడంతో హేరోదు రాజుకు వీటిని గురించి తెలిసింది. బాప్తిస్మము నిచ్చే యోహాను బ్రతికివచ్చాడని, కనుకనే మహత్వపూర్వకమైన కార్యాలు చేసేశక్తి అతనిలో ఉన్నదని అన్నాడు.

15. ఇతరులు ఈయన ఏలీయా అనియు, మరికొందరుఈయన ప్రవక్తయనియు, ప్రవక్తలలో ఒకనివలె నున్నాడనియు చెప్పుకొనుచుండిరి.

15. ఆయన ఏలియా అని కొందరన్నారు ప్రవక్త అని మరికొందరన్నారు. “పూర్వకాలపు ప్రవక్తల్లాంటివాడు” అని మరికొందరన్నారు.

16. అయితే హేరోదు వినినేను తల గొట్టించిన యోహానే; అతడు మృతులలోనుండి లేచి యున్నాడని చెప్పెను.

16. కాని హేరోదు వీటిని గురించి విని, “నేను తల నరికించిన యోహాను బ్రతికి వచ్చాడు” అని అన్నాడు.

17. హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్యయైన హేరోదియను పెండ్లిచేసికొనినందున యోహానునీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక

17. క్రితంలో హేరోదు, స్వయంగా యోహానును బంధించి కారాగారంలో వేయమని ఆజ్ఞాపించాడు. తాను వివాహం చేసుకొన్న హేరోదియ కారణంగా ఈ పని చేయవలసి వచ్చింది. ఈమె హేరోదు సోదరుడైన ఫిలిప్పు భార్య.

18. ఇత డామె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి, చెరసాలలో బంధించియుండెను.
లేవీయకాండము 18:16

18. పైగా యోహాను హేరోదుతో, “నీ సహోదరుని భార్యను చేసుకోవటం అన్యాయం” అంటూ ఉండేవాడు.

19. హేరోదియ అతని మీద పగపట్టి అతని చంపింప గోరెను గాని ఆమెచేత గాకపోయెను.

19. అందువల్ల హేరోదియకు యోహాను అంటే యిష్టం వుండేదికాదు. అంతేకాక, ఆమె అతణ్ణి చంపి వేయాలని ఆశించింది. కాని యోహాను అంటే హేరోదు భయపడేవాడు. కనుక అలాచెయ్య లేక పొయ్యాడు.

20. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి, అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చెను. మరియు అతని మాటలు విని నప్పుడు, ఏమిచేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను.

20. పైగా యోహాను నీతిమంతుడని, పవిత్రమైనవాడని హేరోదుకు తెలుసు. కనుక అతణ్ణి కాపాడుతూ వుండేవాడు. హేరోదు యోహాను మాటలు విన్నప్పుడు ఎంతో కలవరం చెందేవాడు, అయినా అతని మాటలు వినటానికి యిష్టపడేవాడు.

21. అయితే తగిన దినమొకటి వచ్చెను; ఎట్లనగా, హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయదేశ ప్రముఖులకును విందు చేయించెను.

21. చివరకు హేరోదియకు అవకాశం లభించింది. హేరోదు తన రాజ్యంలోని ప్రముఖ అధికారులను, సైన్యాధిపతులను గలిలయలోని ప్రముఖులను పిలిచి తన పుట్టినరోజు పండుగ చేసాడు.

22. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడ పంక్తిని కూర్చున్నవారిని సంతోషపరచెను గనుక రాజునీకిష్టమైనది ఏదైనను నన్నడుగుము, నేను నీకిచ్చెదనని ఆ చిన్నదానితో చెప్పెను

22. హేరోదియ కూతురు వచ్చి నాట్యం చేసింది. ఆమె హేరోదును, అతని అతిథుల్ని మెప్పించింది. హేరోదు ఆమెతో, “నీకు కావలసింది ఏదైనా కోరుకో! యిస్తాను!” అని అన్నాడు.

23. మరియు-నీవు నా రాజ్యములో సగముమట్టుకు ఏమి అడిగినను నీకిచ్చెదనని అతడు ఆమెతో ఒట్టుపెట్టుకొనెను
Ester 5 3-6, Ester 7 2

23. "నీవేదడిగినా యిస్తాను, అర్ధ రాజ్యాన్నైనా సరే!” అని ప్రమాణం చేసాడు.

24. గనుక ఆమె వెళ్లి-నేనేమి అడిగెదనని తన తల్లి నడుగగా ఆమె బాప్తిస్మమిచ్చు యోహాను తల అడుగుమనెను.

24. ఆమె వెళ్ళి తన తల్లితో, “నన్నేమి కోరుకోమంటావు?” అని అడిగింది. “బాప్తిస్మము నిచ్చే యోహాను తల కోరుకో!” అని ఆమె సమాధానం చెప్పింది.

25. వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి-బాప్తిస్మమిచ్చు యోహాను తల పళ్లెములో పెట్టియిప్పుడే నాకిప్పింప గోరుచున్నానని చెప్పెను.

25. వెంటనే ఆమె రాజు దగ్గరకు పరుగెత్తి, “బాప్తిస్మము నిచ్చే యోహాను తలను ఒక పళ్ళెంలో పెట్టి తక్షణమే యిప్పించమని మిమ్మల్ని వేడుకొంటున్నాను” అని అన్నది.

26. రాజు బహుగా దుఃఖపడెను గాని తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండియున్న వారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అననొల్లక పోయెను.

26. రాజుకు చాలా దుఃఖం కలిగింది. కాని తాను ప్రమాణం చేసాడు. పైగా అతిథులక్కడే ఉన్నారు. కనుక ఆమె కోరికను నిరాకరించ దలచుకోలేదు.

27. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి యొక బంట్రౌతును పంపెను. వాడు వెళ్లి చెరసాలలో అతని తల గొట్టి

27. అందువల్ల అతడు వెంటనే యోహాను తల తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తూ ఒక భటుణ్ణి పంపాడు. ఆ భటుడు వెళ్ళి యోహాను తలను కారాగారంలోనే నరికి వేసి,

28. పళ్లెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్న దాని కిచ్చెను, ఆ చిన్నది తన తల్లికిచ్చెను.

28. దాన్ని ఒక పళ్ళెంలో పెట్టి తీసుకు వచ్చి ఆమెకు బహూకరించాడు. ఆమె దాన్ని తన తల్లికి ఇచ్చింది.

29. యోహాను శిష్యులు ఈ సంగతి విని, వచ్చి శవమును ఎత్తికొనిపోయి సమాధిలో ఉంచిరి.

29. యోహాను శిష్యులు ఇది విని అక్కడికి వెళ్ళి అతని దేహాన్ని తీసుకువెళ్ళి సమాధిచేసారు.

30. అంతట అపొస్తలులు యేసునొద్దకు కూడివచ్చి తాము చేసినవన్నియు బోధించినవన్నియు ఆయనకు తెలియ జేసిరి.

30. అపొస్తలులు యేసు చుట్టూ చేరి తాము చేసిన వాటిని గురించి, బోధించిన వాటిని గురించి వివరంగా ఆయనకు చెప్పారు.

31. అప్పుడాయన మీరేకాంతముగా అరణ్య ప్రదేశ మునకు వచ్చి, కొంచెముసేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను; ఏలయనగా అనేకులు వచ్చుచు పోవుచు నుండి నందున, భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను.

31. వాళ్ళ దగ్గరకు చాలామంది వస్తూ పోతూ ఉండటంవల్ల వాళ్ళకు తినటానికి కూడా సమయం లేకపోయింది. అందుకు యేసు వాళ్ళతో “నాతో మీరు మాత్రమే ఏకాంత ప్రదేశానికి వచ్చి కొంత విశ్రాంతి తీసుకోండి” అని అన్నాడు.

32. కాగా వారు దోనె యెక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్లిరి.

32. అందువల్ల వాళ్ళు మాత్రమే ఒక పడవనెక్కి నిర్జన ప్రదేశానికి వెళ్ళారు.

33. వారు వెళ్లుచుండగా జనులు చూచి, అనేకులాయనను గుర్తెరిగి, సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరుగెత్తి వారికంటె ముందుగా వచ్చిరి.

33. కాని, వాళ్ళు వెళ్ళటం చాలా మంది చూసారు. వాళ్ళెవరో గుర్తించి అన్ని పట్టణాల నుండి పరుగెత్తుకొంటూ వెళ్ళి, వాళ్ళకన్నా ముందే ఆ ఎడారి ప్రాంతాన్ని చేరుకొన్నారు.

34. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెలవలె ఉన్నందున వారిమీద కనికరపడి, వారికి అనేక సంగతు లను బోధింప సాగెను.
సంఖ్యాకాండము 27:17, 1 రాజులు 22:17, 2 దినవృత్తాంతములు 18:16, యెహెఙ్కేలు 34:5, యెహెఙ్కేలు 34:8, జెకర్యా 10:2

34. యేసు పడవ దిగి ఆ ప్రజాసమూహాన్ని చూసాడు. కాపరి లేని గొర్రెల్లా ఉన్న ఆ ప్రజల్ని చూసి ఆయనకు జాలివేసింది. అందువల్ల వాళ్ళకు ఎన్నో విషయాలు బోధించటం మొదలు పెట్టాడు.

35. చాల ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యు లాయనయొద్దకు వచ్చిఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాల ప్రొద్దుపోయినది;

35. అప్పటికే మధ్యాహ్నం దాటి సాయంకాలమవుతూ వుంది. ఆయన శిష్యులు వచ్చి, “ఇది నిర్మానుష్య ప్రాంతం. ఇప్పటికే సాయంకాలమవుతూ వుంది.

36. చుట్టుపట్ల ప్రదేశ ములకును గ్రామములకును వారు వెళ్లి భోజనమున కేమైనను కొనుక్కొనుటకు వారిని పంపి వేయుమని చెప్పిరి.

36. మీరి ప్రజల్ని పంపివేస్తే వాళ్ళు చుట్టూవున్న పల్లెలకో లేక గ్రామలకో వెళ్ళి ఏదైనా కొనుక్కొని తింటారు” అని అన్నారు.

37. అందుకాయన మీరు వారికి భోజనము పెట్టుడనగా వారుమేము వెళ్లి యీన్నూరు దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయన నడిగిరి.

37. కాని యేసు, “వాళ్ళు తినటానికి మీరే ఏదైనా ఇవ్వండి!” అని సమాధానం చెప్పాడు. “రెండు వందల దేనారాలకు రొట్టెలు కొని వాళ్లకు పంచి పెట్టమంటావా?” అని ఆయన్ని అడిగారు.

38. అందుకాయన మీయొద్ద ఎన్ని రొట్టె లున్నవి? పోయి చూడుడనివారితో చెప్పెను. వారు చూచి తెలిసికొని అయిదు రొట్టెలును రెండు చేపలు నున్నవనిరి.

38. “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయో వెళ్ళి చూడండి” అని యేసు అన్నాడు. వాళ్ళు వెళ్ళి చూసి వచ్చి, “ఐదు రొట్టెలు, రెండు చేపలు ఉన్నాయి” అని అన్నారు.

39. అప్పుడాయన పచ్చికమీద అందరు పంక్తులు పంక్తులుగా కూర్చుండవలెనని వారికాజ్ఞాపింపగా

39. పచ్చిగడ్డి మీద అందరిని గుంపులు గుంపులుగా కూర్చోబెట్టమని శిష్యులతో చెప్పాడు.

40. వారు నూరేసి మంది చొప్పునను ఏబదేసిమంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి.

40. ప్రజలు గుంపుకు యాబై, నూరుగురి చొప్పున కూర్చున్నారు.

41. అంతట ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని, ఆకాశమువైపు కన్నులెత్తి ఆశీర్వదించి, ఆ రొట్టెలు విరిచి, వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి, ఆ రెండు చేపలను అందరికిని పంచి

41. యేసు ఆ ఐదు రొట్టెల్ని రెండు చేపల్ని తీసుకొని ఆకాశం వైపు చూసి కృతజ్ఞత చెప్పి రొట్టెల్ని తుంచాడు. అవి తన శిష్యులకిచ్చి ప్రజల ముందుంచమన్నాడు. అదే విధంగా ఆ రెండు చేపల్ని కూడా భాగాలు చేసి అందరికి పంచాడు.

42. వారందరు తిని తృప్తి పొందిన

42. అందరూ సంతృప్తిగా తిన్నారు.

43. తరువాత మిగిలిన చేపలును రొట్టె ముక్కలును పండ్రెండు గంపెళ్లు ఎత్తిరి.

43. శిష్యులు మిగిలిన రొట్టెముక్కల్ని, చేప ముక్కల్ని పన్నెండు గంపల నిండా నింపారు.

44. ఆ రొట్టెలు తినినవారు అయిదువేలమంది పురుషులు.

44. ఆ రోజు అక్కడ ఐదు వేలమంది పురుషులు భోజనం చేసారు.

45. ఆయన జనసమూహమును పంపివేయునంతలో, దోనె ఎక్కి అద్దరినున్న బేత్సయిదాకు ముందుగా వెళ్లుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను.

45. ఆ తదుపరి యేసు తన శిష్యులతో, పడవనెక్కి, తనకన్నాముందు బేత్సయిదాకు వెళ్ళమని గట్టిగా చెప్పాడు. బేత్సాయిదా సముద్రంకు ఆవలివైపున ఉంది. యేసు ప్రజల్ని తమ తమ యిండ్లకు వెళ్ళమని చెప్పాడు.

46. ఆయన వారిని వీడుకొలిపి, ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లెను.

46. వాళ్ళను వదిలి ప్రార్థించటానికి కొండ మీదికి వెళ్ళాడు.

47. సాయంకాలమైనప్పుడు ఆ దోనె సముద్రము మధ్య ఉండెను ఆయన ఒంటరిగా మెట్ట నుండెను.

47. అర్ధరాత్రికి శిష్యులున్న పడవ సముద్రం మధ్యవుంది. యేసు మాత్రం యింకా గట్టునే ఉన్నాడు.

48. అప్పుడు వారికి గాలి ఎదురైనందున, దోనె నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి, రాత్రి ఇంచు మించు నాలుగవ జామున సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చి, వారిని దాటిపోవలెనని యుండెను.

48. ఎదురు గాలి వీయటంవల్ల శిష్యులు కష్టంగా తెడ్లు వేయటం ఆయన చూసాడు. తెల్లవారు ఝామున యేసు నీళ్ళ మీదుగా నడిచి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళను దాటి ముందుకు వెళ్తుంటే

49. ఆయన సముద్రముమీద నడుచుట వారు చూచి, భూత మని తలంచి కేకలు వేసిరి.

49. ఆయన శిష్యులు ఆయన నీళ్ళమీద నడవటం చూసి, దయ్యం అనుకొని భయపడి బిగ్గరగా కేకలు వేసారు.

50. అందరు ఆయనను చూచి తొందరపడగా, వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చు కొనుడి, నేనే, భయపడకుడని చెప్పెను.

50. వెంటనే ఆయన వాళ్ళతో మాట్లాడుతూ, “ధైర్యంగా ఉండండి. నేనే! భయపడకండి!” అని అన్నాడు.

51. తరువాత ఆయన దోనె యెక్కి వారియొద్దకు వచ్చినప్పుడు గాలి అణగెను, అందుకు వారు తమలోతాము మిక్కిలి విభ్రాంతి నొందిరి;

51. ఆయన పడవనెక్కగానే గాలి తీవ్రత పూర్తిగా తగ్గి పోయింది. వాళ్ళు ఇది చూసి దిగ్భ్రాంతి చెందారు. రొట్టెలు పంచిన అద్భుతాన్ని వాళ్ళు చూశారు.

52. అయినను వారి హృదయము కఠిన మాయెను గనుక వారు రొట్టెలనుగూర్చిన సంగతి గ్రహింపలేదు.

52. కాని దానిని అర్థం చేసుకోలేక పోయారు.

53. వారు అవతలకు వెళ్లి గెన్నేసరెతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరి పట్టిరి.

53. సముద్రం దాటి గెన్నేసరెతు తీరాన్ని చేరుకొని అక్కడ పడవను నిలిపారు.

54. వారు దోనె దిగగానే, జనులు ఆయనను గురుతుపట్టి

54. వాళ్ళు పడవ దిగగానే ప్రజలు యేసును గుర్తించారు.

55. ఆ ప్రదేశమందంతట పరుగెత్తికొనిపోయి, ఆయన యున్నాడని వినినచోటునకు రోగులను మంచముల మీద మోసికొని వచ్చుటకు మొదలుపెట్టిరి.

55. ప్రజలు చుట్టూ ఉన్న ప్రాంతాలకు పరుగెత్తి వెళ్ళి రోగుల్ని చాపలపై పడుకోబెట్టి ఆయనున్న చోటికి తీసుకు వచ్చారు.

56. గ్రామముల లోను పట్టణములలోను పల్లెటూళ్లలోను ఆయన యెక్క డెక్కడ ప్రవేశించెనో అక్కడి జనులు రోగులను సంత వీథులలో ఉంచి, వారిని ఆయన వస్త్రపుచెంగుమాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరు స్వస్థతనొందిరి.

56. పల్లెల్లో, పట్టణాల్లో, పొలాల్లో, చుట్టూ, ఆయన వెళ్ళిన ప్రతిచోట రోగుల్ని వీథుల్లో పడుకోబెట్టారు. ఆయన వస్త్రానైనా తాకనీయమని ఆయన్ని బ్రతిమిలాడారు. ఆయన్ని తాకిన ప్రతి ఒక్కరికి నయమై పోయింది.Shortcut Links
మార్కు - Mark : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |