Luke - లూకా సువార్త 13 | View All

1. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా

“పిలాతు”– లూకా 3:1; మత్తయి 27:2. ఈ సంఘటన మరెక్కడా రాసిలేదు. పిలాతు స్వభావం గురించి ఇది మనకు కొంత అవగాహన కలిగిస్తుంది. కొందరు ఆలయంలో దేవుణ్ణి ఆరాధిస్తుండగా పిలాతు వారిని చంపించాడు. కారణం ఇక్కడ రాసి లేదు.

2. ఆయన వారితో ఇట్లనెను ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటె పాపులని మీరు తలంచు చున్నారా?

మనుషుల పైకి గొప్ప విపత్తులు వచ్చి పడినప్పుడు వారు ఇతరులకన్న చెడ్డవారు గనుక ఆ విపత్తులకు వారు అర్హులే అనే ఆలోచన మనకు కలిగే అవకాశం ఉంది. యోబు 4:7-9; యోబు 8:3 నోట్స్ చూడండి. కొన్ని సందర్భాల్లో ఇది నిజమే కావచ్చు (ఆదికాండము 6:5-7; 2 పేతురు 2:5-6). అయితే ఈ గలలీ ప్రజల విషయంలో ఇది నిజం కాదు. అంతేగాక చాలా సందర్భాల్లో ఇలా అనుకోవడానికి వీలు లేదు. ఆపదల మూలంగా మనం గుణపాఠం నేర్చుకోవాలని యేసుప్రభువు కోరుతున్నాడు. పశ్చాత్తాప పడవలసిన అవసరాన్ని గుర్తించాలనీ, బాధలు పడుతున్న వారికన్నా మనం మంచివాళ్ళమని అనుకోవడం మానుకోవాలనీ ఆయన ఉద్దేశం. వారిమీదికి ఆపదలు వచ్చినంత న్యాయంగా మనక్కూడా ఆపదలు వాటిల్లవచ్చు. పశ్చాత్తాపం గురించిన నోట్స్ మత్తయి 3:2.

3. కారని మీతో చెప్పుచున్నాను; మీరు మారుమనస్సు పొందనియెడల మీరందరును ఆలాగే నశింతురు.
కీర్తనల గ్రంథము 7:12

4. మరియసిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ పదునెనిమిదిమంది, యెరూషలేములో కాపురమున్న వారందరికంటె అపరాధులని తలంచుచున్నారా?

సిలోయం జెరుసలంలో ఉంది (నెహెమ్యా 3:15; యోహాను 9:7). ఈ సంఘటన కూడా మరెక్కడా రాసిలేదు.

5. కారని మీతో చెప్పుచున్నాను; మీరు మారుమనస్సు పొందనియెడల మీరందరును ఆలాగే నశింతురు.
కీర్తనల గ్రంథము 7:12

6. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక మనుష్యుని ద్రాక్షతోటలో అంజూరపు చెట్టొకటి నాటబడి యుండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమియు దొరకలేదు
హబక్కూకు 3:17

లూకా శుభవార్తలో మాత్రమే కనిపించే ఈ ఉదాహరణ పైనున్న వచనాలతో సంబంధం కలిగి ఉంది. దేవుడు మనుషుల వ్యవహారాలను అదుపు చేస్తూ, తన జ్ఞానం చొప్పున వారికి తీర్పులు తీరుస్తూ ఉండడం గురించి ఇది చెప్తున్నది. ఇలా చేసేందుకు దేవుడు పిలాతువంటి మనుషులను, కూలే గోపురాలను లేక మరి ఏ ఇతర సాధనాన్నైనా వాడుకోవచ్చు. లేవీయకాండము 26:14-33; ద్వితీయోపదేశకాండము 28:20-29; న్యాయాధిపతులు 2:14-15; యెషయా 10:5-6; యిర్మియా 14:11-12. యిర్మియా 13:6 అంజూరుచెట్టును గురించి మాట్లాడ్డంలో వ్యక్తులు, ఇస్రాయేల్ జాతి కూడా యేసుప్రభు మనసులో ఉండి ఉండవచ్చు. మత్తయి 21:18-22 చూడండి. అంజూరు చెట్టు ఉన్న మనిషి దేవుణ్ణి సూచిస్తున్నాడు. ఆయన ద్రాక్ష తోట పనివాడు అంటే దేవుని సేవకులు, లేక స్వయంగా యేసుప్రభువే కావచ్చు. మనుషులు చేస్తున్న వాటిని, చెయ్యకుండా వదిలి పెడుతున్న వాటిని దేవుడు ఎప్పుడు గమనిస్తున్నాడనడంలో సందేహం లేదు. కొందరిని లోకంనుండి తొలగిస్తూ మరి కొందరి విషయంలో మరి కొద్ది కాలం ఓపికతో ఎదురు చూస్తున్నాడు. మంచి ఫలాలు లేని ఏ జీవితమైనా ప్రమాదంలో ఉన్నట్టే. మత్తయి 3:10; మత్తయి 7:19; యెషయా 51:1-7; యోహాను 15:2, యోహాను 15:6.

7. గనుక అతడు ఇదిగో మూడేండ్లనుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని యేమియు దొరకలేదు; దీనిని నరికివేయుము, దీనివలన ఈ భూమియు ఏల వ్యర్థమై పోవలెనని ద్రాక్షతోట మాలితో చెప్పెను.

దేవుని కోసం ఫలించని మనుషులు అనవసరంగా ఆయనకు చెందిన భూమిపై కొంత భాగాన్ని ఆక్రమించి ఉంటున్నారన్నమాట. వారు అలాగే చాలా కాలం ఉండేందుకు ఆయన అనుమతించాలా?

8. అయితే వాడు అయ్యా, నేను దానిచుట్టు త్రవ్వి, యెరువు వేయుమట్టుకు ఈ సంవత్సరముకూడ ఉండనిమ్ము;

ద్రాక్షతోటలో పని చేసే వ్యక్తి అంజూరు చెట్టు గురించి యజమానిని బ్రతిమాలడం ద్వారా కనీసం మరి కొంత కాలం దానిపైకి రానున్న తీర్పును ఆలస్యం అయ్యేలా చేశాడు. ఆ సమయంలో అంజూరు చెట్టు గనుక కాయలు కాయడం మొదలు పెడితే ఆ తీర్పును శాశ్వతంగా మళ్ళించిన వాడవుతాడు. ఆదికాండము 18:22-23; నిర్గమకాండము 32:7-14, నిర్గమకాండము 32:31-32; యెహెఙ్కేలు 22:30-31. ఎడతెగకుండా యేసుప్రభువు మనకోసం ప్రార్థన చేస్తూ ఉండకపోతే మనమంతా ఎక్కడ ఉండేవాళ్ళం? (రోమీయులకు 8:34; హెబ్రీయులకు 7:25).

9. అది ఫలించిన సరి, లేనియెడల నరికించివేయుమని అతనితో చెప్పెను.

10. విశ్రాంతి దినమున ఆయన యొక సమాజమందిరములో బోధించుచున్నప్పుడు

“విశ్రాంతి దినం”– నిర్గమకాండము 20:8-11. “సమాజ కేంద్రాలు”– మత్తయి 4:23.

11. పదునెనిమిది ఏండ్లనుండి బలహీన పరచు దయ్యము పట్టిన యొక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి యెంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను.

ఒక దురాత్మ (దయ్యం) అనేక రకాల అంగవైకల్యాలను కలిగించవచ్చు – మత్తయి 9:32-33; మత్తయి 12:22; మార్కు 9:25.

12. యేసు ఆమెను చూచి, రమ్మని పిలిచి అమ్మా, నీ బలహీనతనుండి విడుదల పొంది యున్నావని ఆమెతో చెప్పి

13. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను.

14. యేసు విశ్రాంతిదినమున స్వస్థపరచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి, జనసమూహ మును చూచిపనిచేయదగిన ఆరు దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థతపొందుడి; విశ్రాంతిదినమందు రావద్దని చెప్పెను.
నిర్గమకాండము 20:9-10, ద్వితీయోపదేశకాండము 5:13-14

15. అందుకు ప్రభువు వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతిదినమున తన యెద్దునైనను గాడిదనైనను గాడియొద్దనుండి విప్పి, తోలు కొనిపోయి, నీళ్లు పెట్టును గదా.

వారికి ద్వంద్వ ప్రమాణాలు గనుక యేసు వారిని “కపట భక్తులారా” అంటున్నాడు. వారిది తమకో సిద్ధాంతం, ఇతరులకో సిద్ధాంతం. ఇతరులను ప్రేమించాలని ధర్మశాస్త్రంలో ఆజ్ఞ ఉన్నప్పటికీ వారు సాటి మానవులపై కంటే తమ పశువులపై ఎక్కువ శ్రద్ధ చూపారు – లేవీయకాండము 19:18.

16. ఇదిగో పదునెనిమిది ఏండ్లనుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తెయైన యీమెను విశ్రాంతిదినమందు ఈ కట్లనుండి విడిపింపదగదా? అని అతనితో చెప్పెను.

యూద జాతికి మూల పురుషుడైన అబ్రాహాము సంతానమే ఆ స్త్రీ. “సైతాను”– 1 దినవృత్తాంతములు 21:1; మత్తయి 4:1-10; యోహాను 8:44; యోహాను 12:31.

17. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నెదిరించిన వారందరు సిగ్గుపడిరి; అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘన కార్యములన్నిటిని చూచి సంతోషించెను.

18. ఆయనదేవుని రాజ్యము దేనిని పోలియున్నది? దేనితో దాని పోల్తును?

19. ఒక మనుష్యుడు తీసికొనిపోయి తన తోటలోవేసిన ఆవగింజను పోలియున్నది. అది పెరిగి వృక్షమాయెను; ఆకాశపక్షులు దాని కొమ్మల యందు నివసించెననెను.
యెహెఙ్కేలు 17:22-23, యెహెఙ్కేలు 31:6, దానియేలు 4:12, దానియేలు 4:21

20. మరల ఆయనదేవుని రాజ్యమును దేనితో పోల్తును?

21. ఒక స్త్రీ తీసికొని, అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలియున్నదని చెప్పెను.

22. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారము చేయుచుండెను.

23. ఒకడు ప్రభువా, రక్షణపొందు వారు కొద్దిమందేనా? అని ఆయన నడుగగా

మొత్తం జనాభాలో పోల్చుకుంటే ఎప్పుడైనా సరే కొద్దిమందే విముక్తి పొందుతారు (మత్తయి 7:14). అయితే అన్ని కాలాల్లోనూ పాప విముక్తి పొందిన వారందరినీ ఒకచోట సమకూరుస్తే చాలమంది అవుతారు – ప్రకటన గ్రంథం 7:9.

24. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి; అనేకులు ప్రవేశింప జూతురు గాని వారివలన కాదని మీతో చెప్పుచున్నాను.

ఎవరు కూడా దేవుడు ఎంతమందికి పాపవిముక్తిని ఇస్తాడోనని ఊహాగానాలు చెయ్యకూడదనీ, అలాంటివారిలో తాము కూడా ఉండేలా అందరూ జాగ్రత్త పడాలనీ యేసు ఇక్కడ చెప్తున్నాడు. “తీవ్ర ప్రయత్నం చేయండి”– అందరూ దేవుని ఆధ్యాత్మిక రాజ్యంలో ప్రవేశించడానికి అతి తీవ్రంగా మనస్ఫూర్తిగా ప్రయాసపడాలి, పెనుగులాడాలి. ఆ రాజ్యంలోకి తీసుకువెళ్ళే ఇరుకు దారిలో ప్రవేశించడానికి కొన్ని కష్టాలు, అడ్డంకులు ఉంటాయని ఈ మాటలు తెలియజేస్తున్నాయి. అలా ప్రవేశించని వారికోసం గొప్ప ప్రమాదం పొంచి ఉందని కూడా సూచిస్తాయి. ప్రవేశించినవారికి ఏదో ఒక గొప్ప, అద్భుతమైన సంగతి దొరుకుతుంది, అనుభవంలోకి వస్తుందని కూడా సూచిస్తాయి. మత్తయి 7:13-14.

25. ఇంటి యజమానుడు లేచి తలుపువేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా, మాకు తలుపు తీయుమని చెప్ప నారంభించి నప్పుడు

అవకాశమనే తలుపు కలకాలం తెరిచే ఉండదు – మత్తయి 25:10-11; సామెతలు 1:20-33.

26. ఆయన మీ రెక్కడివారో మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరునీ సముఖ మందు మేము తిని త్రాగుచుంటిమే; నీవు మా వీధులలో బోధించితివే అని చెప్ప సాగుదురు.

దేవుని వాక్కును వినేందుకు తమకు కలిగిన అవకాశాలు వారి దోషాన్ని ఇంకా పెంచుతున్నాయని వారు అర్థం చేసుకోవలసింది. ఎందుకంటే వారు ఆ వాక్కుకు లోబడలేదు.

27. అప్పుడాయన మీ రెక్కడివారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పు చున్నాను; అక్రమము చేయు మీరందరు నా యొద్దనుండి తొలగిపొండని చెప్పును.
కీర్తనల గ్రంథము 6:8

28. అబ్రాహాము ఇస్సాకు యాకోబులును సకల ప్రవక్తలును దేవుని రాజ్యములో ఉండుటయు, మీరు వెలుపలికి త్రోయబడుటయు, మీరు చూచునప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు.

29. మరియు జనులు తూర్పునుండియు పడమట నుండియు ఉత్తరమునుండియు దక్షిణమునుండియువచ్చి, దేవుని రాజ్యమందు కూర్చుందురు.
కీర్తనల గ్రంథము 107:3, యెషయా 59:19, మలాకీ 1:11

30. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటివారిలో కొందరు కడపటి వారగుదురని చెప్పెను.

31. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చినీ విక్కడనుండి బయలుదేరి పొమ్ము; హేరోదు నిన్ను చంప గోరుచున్నాడని ఆయనతో చెప్పగా

మత్తయి 14:1. యేసుప్రభువును భయపెట్టడం ద్వారా ఆయన్ను వదిలించుకోగలమని వారనుకోవడం అవివేకం.

32. ఆయన వారిని చూచిమీరు వెళ్లి, ఆ నక్కతో ఈలాగు చెప్పుడి ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ల గొట్టుచు (రోగులను) స్వస్థపరచుచునుండి మూడవ దినమున పూర్ణ సిద్ధి పొందెదను.

గుంటనక్క జిత్తులమారి జంతువని ప్రతీతి. యేసు తన గమ్యం కేసి వెళ్తుండగా హేరోదన్నా, మరెవరన్నా ఆయనకు భయం లేదు. తానేమి చెయ్యబోతున్నదీ, తనకేమి సంభవించ నున్నదీ, ఈ భూమిపై తన పనిని ఎప్పుడు ఎలా తాను ముగించనున్నదీ యేసుప్రభువుకు తెలుసు. వ 33; మత్తయి 16:21; మత్తయి 17:22-23; యోహాను 7:30.

33. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలెను; ప్రవక్త యెరూషలేము నకు వెలుపల నశింప వల్లపడదు.

యేసు ఈ మాటను వ్యంగ్యంగా అంటున్నాడు. జెరుసలంలో అనేకమంది ప్రవక్తలు హతమయ్యారు. యేసుకు తాను కూడా అక్కడే చనిపోతానని తెలుసు. వేరే చోట హేరోదు చేతిలో తనకు మరణం రాదని ఆయనకు తెలుసు.

34. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు, నీయొద్దకు పంప బడినవారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏలాగు చేర్చుకొనునో ఆలాగే ఎన్నో మారులు నేను నీ ప్లిలలను చేర్చుకొనవలెనని యుంటినిగాని మీ రొల్లకపోతిరి.

35. ఇదిగో మీ యిల్లు మీకు పాడుగా విడువబడుచున్నది ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాకని మీరు చెప్పువరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాననెను.
కీర్తనల గ్రంథము 118:26, యిర్మియా 12:7, యిర్మియా 22:5Shortcut Links
లూకా - Luke : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |