11. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుటవలనను, దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుటవలనను, ఆయన మరియొక ఉపమానము చెప్పెను. ఏమనగా,
ఈ ఉదాహరణకు మత్తయి 25:14-30 లో ఉన్నదానితో కొన్ని పోలికలున్నాయి. అయితే కొన్ని తేడాలు కూడా ఉన్నాయి. ఈ రెంటినీ వేరువేరు చోట్ల, వేరువేరు సమయాల్లో చెప్పాడు యేసు.
“దేవుని రాజ్యం”– మత్తయి 4:17. యేసుప్రభువు తాను అభిషిక్తుణ్ణని ఇస్రాయేల్‌వారి రాజునని బహిరంగంగా ప్రకటించుకొని, రోమ్ ప్రభుత్వ కాడి తీసేసి, ఇస్రాయేల్‌కు తిరిగి రాజ్యాధికారాన్ని, ఘనతనూ కట్టబెడతాడని ప్రజలు భావించారు. ఇలాంటిది ఆ సమయంలో జరగదని యేసు అంటున్నాడు. తాను వెళ్ళి పోవాలి (వ 12), ఇస్రాయేల్ వారు తనను రాజుగా అంగీకరించరు (వ 14). అయితే ఆయన తిరిగి వస్తాడు (వ 15), ఈ లోగా ఆయన సేవకులు చెయ్యవలసిన పని ఉంది (వ 13).