యేసు నిర్దోషి అని పిలాతుకు తెలుసు. తానొక భయంకరమైన తప్పు చేస్తున్నానేమో అని భయపడ్డాడు. న్యాయంగా తీర్పు తీర్చడం అతని బాధ్యత, కానీ అతని తెలివితేటలు, భయాలు, బాధ్యత అంతా అతనికి ఉన్న మరో భయం ఎదుట దిగదుడుపు అయిపోయాయి. అదేమంటే సీజరుకు అభ్యంతరం కలిగించి తన పదవికి ముప్పు వస్తుందేమోనన్న భయం. ఆ భయం గుప్పెట్లో ఉన్న పిలాతు మనసులో సత్యానికి, న్యాయానికి నిలువ నీడలేకుండా పోయింది (సామెతలు 29:25 పోల్చి చూడండి). అలాంటి భయాన్ని దూరం చేసే దేవుని భయం పిలాతులో లేదు. దేవునికంటే మనుషులకు ఎక్కువగా భయపడే వారెవరైనా, సత్యం న్యాయాల కన్నా తన పదవికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే వారెవరైనా భయంకరమైన ఆధ్యాత్మిక ప్రమాదంలో ఉన్నారు. దేవుని తీర్పుకూ శిక్షకూ గురి అయ్యే అపాయంలో ఉన్నారు.