మత్తయి 16:19; మత్తయి 18:15-18 పోల్చి చూడండి. యేసుప్రభువు తన సంఘ స్థాపకులతో (అంటే మానవపరంగా), ప్రతినిధులతో మాట్లాడుతున్నాడు. అంటే భూమిపై ఉన్న ఆయన సంఘం (క్రీస్తు విశ్వాసులందరితో ఏర్పడిన సంఘం) దేవుని ఆత్మను పొంది ఎలాంటి మనుషులకు క్షమాపణ దొరుకుతుందో, ఎవరికి క్షమాపణ లేదో ప్రకటించగలుగుతుంది. పాపాలను క్షమించేదీ, క్షమించకపోయేదీ దేవుడే (మార్కు 2:7 నోట్. కీర్తనల గ్రంథము 103:3; కీర్తనల గ్రంథము 130:4 కూడా చూడండి). ఎలాంటివారిని క్షమించాలో ఎలాంటి వారిని క్షమించకూడదో నిర్ణయించేది కూడా దేవుడే. ఆయన దీన్ని ఇదివరకే నిర్ణయించాడు – లూకా 24:46-47; అపో. కార్యములు 10:43; అపో. కార్యములు 13:38-39; ఎఫెసీయులకు 1:7; 1 యోహాను 1:9. పశ్చాత్తాపపడి క్రీస్తులో నమ్మకం పెట్టుకునేవారినే దేవుడు క్షమిస్తాడు. క్షమాపణ ఆయన ఉచితంగా ఇచ్చేదే. ఈ సత్యాన్ని ప్రకటించడం క్రీస్తు సంఘం చెయ్యవలసిన పని. పాత ఒడంబడిక గ్రంథంలో ఇలాంటిదాని కోసం 2 సమూయేలు 12:13 చూడండి. పాత ఒడంబడిక ప్రవక్తలు ఫలానా విషయాలు చేస్తారని దేవుడు చెప్పినప్పుడు వారు వాటిని ప్రకటిస్తారని అర్థం. క్రీస్తు రాయబారులు చేసినది సరిగ్గా ఇదే. క్రీస్తు శుభవార్తను ప్రకటించడం ద్వారా నమ్మేవారందరికీ క్షమాపణ ద్వారాన్ని వారు తెరిచారు. నమ్మని వారందరికీ దాన్ని మూసివేశారు. పాపాలను క్షమించే దేవుని వైపుకు వ్యక్తులను మళ్ళించారు. మత్తయి 6:12; లూకా 11:4 లో మనం పాపక్షమాపణ కోసం ఎవర్ని అడగాలో యేసు నేర్పించాడు. క్రీస్తుసంఘం గానీ అందులోని సభ్యుడెవరైనా గానీ ఈ భూమిపై ఎవరితోనైనా ఇలా అనవచ్చు “నీవు యేసుప్రభువుపై నమ్మకం ఉంచితే నీ పాపాలన్నిటికీ క్షమాపణ ఉంది”. విశ్వాసులందరితో వారు ఇలా అనవచ్చు, “మీ పాపాలను మీరు ఒప్పుకుంటే ఆయన మిమ్మల్ని క్షమించి అన్యాయమంతటి నుంచీ మిమ్మల్ని శుద్ధి చేస్తాడు”. క్రీస్తు క్రైస్తవుల్లో నుంచి ఏ ప్రత్యేక గుంపునూ గురువులుగా, యాజులుగా నియమించలేదు, ఇలాంటి సత్యాన్ని కేవలం వారే ప్రకటించాలని ఎవరినీ ఎన్నుకోలేదు.