John - యోహాను సువార్త 8 | View All

1. యేసు ఒలీవలకొండకు వెళ్లెను.

1. యేసు మళ్ళీ ఒలీవల చెట్ల కొండ మీదికి వెళ్ళాడు.

2. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరు ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించు చుండెను.

2. సూర్యోదయం అవుతుండగా ఆయన మళ్ళీ మందిరంలో కనిపించాడు. అక్కడ ప్రజలు ఆయన చుట్టూ సమావేశమయ్యారు. వాళ్ళకు బోధించటానికి ఆయన కూర్చున్నాడు.

3. శాస్త్రులును పరిసయ్యులును, వ్యభిచారమందు పట్టబడిన యొక స్త్రీని తోడు కొనివచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి

3. వ్యభిచారం చేస్తుండగా పట్టుబడిన స్త్రీని శాస్త్రులు, పరిసయ్యులు కలిసి అక్కడికి తీసుకొని వచ్చారు. ఆమెను అందరి ముందు నిలుచో బెట్టి

4. బోధకుడా, యీ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను;

4. యేసుతే, “బోధకుడా! ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టుబడింది.

5. అట్టివారిని రాళ్లు రువి్వ చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మన కాజ్ఞాపించెను గదా; అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి.
లేవీయకాండము 20:10, ద్వితీయోపదేశకాండము 22:22

5. మోషే, ధర్మశాస్త్రంలో యిలాంటి స్త్రీని రాళ్ళతో కొట్టి చంపుమని ఆజ్ఞాపించాడు. మీరేమంటారు?” అని అడిగారు.

6. ఆయనమీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి, నేలమీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను.

6. ఆయన్ని పరీక్షించటానికి ఈ ప్రశ్న వేసారు. ఆయన్ని శిక్షించటానికి కారణం దొరుకుతుందని వాళ్ళ ఉద్దేశ్యం. కాని యేసు వంగి, నేలపై తన వ్రేలితో వ్రాయటం మొదలు పెట్టాడు.

7. వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తలయెత్తి చూచిమీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమెమీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పి
ద్వితీయోపదేశకాండము 17:7

7. వాళ్ళు ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. యేసు తలెత్తి చూస్తూ, “మీలో పాపం చెయ్యనివాడు ఎవరైనా ఉంటే, అతడు ఆమెపై మొదటిరాయి విసర వచ్చు!” అని అన్నాడు.

8. మరల వంగి నేలమీద వ్రాయు చుండెను.

8. ఇలా అన్నాక, మళ్ళీ క్రిందికి వంగి నేలపై వ్రాస్తూ ఉన్నాడు.

9. వారామాట విని, పెద్దవారు మొదలుకొని చిన్నవారివరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్లిరి; యేసు ఒక్కడే మిగిలెను; ఆ స్త్రీ మధ్యను నిలువబడియుండెను.

9. ఇది విన్న వాళ్ళు ఒక్కొక్కరు అక్కడి నుండి వెళ్ళటం మొదలుపెట్టారు. మొదట వృద్ధులు వెళ్ళి పోయారు. చివరకు అక్కడ నిలుచున్న స్త్రీతో యేసు మాత్రం మిగిలిపోయ్యాడు.

10. యేసు తలయెత్తి చూచి అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడు

10. యేసు తలెత్తి చూస్తూ, “వాళ్ళెక్కడమ్మా! నిన్నెవ్వరూ శిక్షించ లేదా?” అని అడిగాడు.

11. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను.

11. “లేదు ప్రభూ!” అని ఆమె అన్నది. “నేను కూడా శిక్ష విధించను. వెళ్ళు! ఇకనుండి పాపం చెయ్యకు!” అని అన్నాడు.

12. మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను.
యెషయా 49:6

12. యేసు మరొక సమయంలో ప్రజలకు బోధించినప్పుడు, “నేను ప్రపంచానికి వెలుగును. నన్ను అనుసరించినవాళ్ళు అంధకారంలో నడవరు. వాళ్ళకు జీవితం యొక్క వెలుగు లభిస్తుంది” అని అన్నాడు.

13. కాబట్టి పరిసయ్యులు నిన్నుగూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు; నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా

13. పరిసయ్యులు సవాలు చేస్తూ,”నీ పక్షాన నీవు సాక్ష్యం చెప్పుకుంటున్నావు. నీ సాక్ష్యం పనికి రాదు” అని అన్నారు.

14. యేసునేను ఎక్కడనుండి వచ్చితినో యెక్కడికి వెళ్లుదునో నేనెరుగుదును గనుక నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పు కొనినను నా సాక్ష్యము సత్యమే; నేను ఎక్కడనుండి వచ్చుచున్నానో యెక్కడికి వెళ్లుచున్నానో మీరు ఎరుగరు.

14. యేసు సమాధానం చెబుతూ,”నేను నా పక్షాన సాక్ష్యం చెబితే ఆ సాక్ష్యం నమ్మవచ్చు. ఎందుకంటే, నేనెక్కడినుండి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. కాని నేను ఎక్కడినుండి వచ్చానో ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలియదు.

15. మీరు శరీరమునుబట్టి తీర్పు తీర్చుచున్నారు; నేనెవరికిని తీర్పు తీర్చను.

15. మీరు అందరి మానవులవలె తీర్పుచెబుతారు. నేను ఎవరిపైనా తీర్పు చెప్పను.

16. నేను ఒక్కడనైయుండక, నేనును నన్ను పంపిన తండ్రియు కూడ నున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే.

16. కాని నేను ఒక వేళ తీర్పు చెబితే నా తీర్పు సత్యసమ్మతమైనది. ఎందుకంటే, నేను ఒంటరిగా తీర్పు చెప్పటం లేదు. నన్ను పంపిన నా తండ్రి నాతో ఉన్నాడు.

17. మరియు ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది గదా.
ద్వితీయోపదేశకాండము 17:6, ద్వితీయోపదేశకాండము 19:15

17. ఇద్దరు కలసి సాక్ష్యం చెబితే ఆ సాక్ష్యాన్ని నమ్మవచ్చని మీ ధర్మశాస్త్రంలో వ్రాసారు.

18. నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పుకొను వాడను; నన్ను పంపిన తండ్రియు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడని చెప్పెను.

18. నేను నా పక్షాన సాక్ష్యం చెబుతున్నాను. నా యింకొక సాక్షి నన్ను పంపిన ఆ తండ్రి” అని అన్నాడు.

19. వారు నీ తండ్రి యెక్కడ ఉన్నాడని ఆయనను అడుగగా యేసు మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు; నన్ను ఎరిగి యుంటిరా నా తండ్రినికూడ ఎరిగి యుందురని వారితో చెప్పెను.

19. అప్పుడు వాళ్ళు, “నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు?” అని అడిగారు. యేసు, “మీకు నేను ఎవరినో, నా తండ్రి ఎవరో తెలియదు. నేనెవరినో తెలిస్తే, నా తండ్రి ఎవరో మీకు తెలుస్తుంది” అని సమాధానం చెప్పాడు.

20. ఆయన దేవాలయములో బోధించుచుండగా, కానుక పెట్టె యున్నచోట ఈ మాటలు చెప్పెను. ఆయన గడియ యింకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు.

20. ఆయనీ విషయాలన్నీ మందిరంలో కానుకలు వేసే చోట నిలుచొని బోధిస్తూ మాట్లాడాడు. అయినా ఆయన్నెవరూ బంధించలేదు; కారణం? ఆయన ఘడియ యింకా రాలేదు!

21. మరియొకప్పుడు ఆయననేను వెళ్లిపోవుచున్నాను; మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపములోనే యుండి చనిపోవుదురు; నేను వెళ్లుచోటికి మీరు రాలేరని వారితో చెప్పెను.

21. యేసు మరొకసారి వాళ్ళతో, “నేను వెళ్తున్నానను. మీరు నా కోసం వెతుకుతారు. కాని నేను వెళ్ళేచోటికి మీరు రాలేరు. ఎందుకంటే మీరు మీ పాపాల్లో మరణిస్తారు” అని అన్నాడు.

22. అందుకు యూదులునేను వెళ్లుచోటికి మీరు రాలేరని యీయన చెప్పుచున్నాడే; తన్ను తానే చంపు కొనునా అని చెప్పుకొనుచుండిరి.

22. యూదులు, “ఆత్మహత్య చేసుకొంటాడా? అందుకేనా, ‘నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు’ అని అంటున్నాడు” అని అన్నారు.

23. అప్పుడాయన మీరు క్రిందివారు, నేను పైనుండువాడను; మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోకసంబంధుడను కాను.

23. యేసు, “మీరు యిక్కడి వాళ్ళు. నేను పైనుండి వచ్చిన వాణ్ణి. మీరు ఈలోకపు వాళ్ళు. నేను ఈ లోకపు వాణ్ణి కాదు.

24. కాగా మీ పాపములలోనేయుండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించనియెడల మీరు మీ పాపములోనేయుండి చనిపోవుదురని వారితో చెప్పెను.

24. మీరు మీ పాపాలతో మరణిస్తారు” అని అన్నాడు.

25. కాబట్టి వారునీ వెవరవని ఆయన నడుగగా యేసు వారితోమొదటనుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడనే.

25. వాళ్ళు, “అది సరే కాని, నీవెవరు?” అని అడిగారు. యేసు, “నేను యింతదాకా ఎవర్నని చెబుతున్నానో ఆయన్నే” అని అన్నాడు.

26. మిమ్మునుగూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాల సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు; నేను ఆయనయొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను.

26. “నేను మీ తీర్పు విషయంలో ఎన్నో సంగతులు చెప్పగలను. కాని దానికి మారుగా నన్ను పంపిన వాని నుండి విన్న వాటిని మాత్రమే ప్రపంచానికి చెబుతున్నాను. ఆయన నమ్మదగినవాడు” అని అన్నాడు.

27. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పెనని వారు గ్రహింపక పోయిరి.

27. ఆయన తన తండ్రిని గురించి చెబుతున్నాడు. వాళ్ళు అర్థం చేసుకోలేదు.

28. కావున యేసు మీరు మనుష్యకుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతట నేనే యేమియు చేయక, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు.

28. అందువలన యేసు వాళ్ళతో,”మనుష్యకుమారుణ్ణి పైకి లేపినప్పుడు ఆయన నేనేనని మీరు తెలుసుకుంటారు. అంతేకాక స్వతహాగా నేను ఏమీ చెయ్యనని, నా తండ్రి బోధించిన వాటిని మాత్రమే చెబుతానని తెలుసుకుంటారు.

29. నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు; ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను.

29. నన్ను పంపిన వాడు నాతో ఉన్నాడు. నేను అన్ని వేళలా ఆయనకు యిష్టమైనవే చేస్తాను. కనుక ఆయన నన్ను ఒంటరిగా వదిలి వేయడు” అని అన్నాడు.

30. ఆయన యీ సంగతులు మాటలాడుచుండగా అనేకు లాయనయందు విశ్వాసముంచిరి.

30. ఆయన చెప్పిన విషయాలు విని అనేకులు ఆయన విశ్వాసులైయ్యారు.

31. కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతోమీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు;

31. తనను నమ్మిన యూదులతో యేసు, “మీరు నా బోధనలు పాటిస్తే, మీరు నా నిజమైన శిష్యులు.

32. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా

32. అప్పుడు మీరు సత్యాన్ని గురించి తెలుసు కుంటారు. ఆ సత్యమే మీకు స్వేచ్ఛ కలిగిస్తుంది” అని అన్నాడు.

33. వారుమేము అబ్రాహాము సంతానము, మేము ఎన్నడును ఎవనికిని దాసులమై యుండలేదే; మీరు స్వతంత్రులుగా చేయ బడుదురని యేల చెప్పుచున్నావని ఆయనతో అనిరి.
Neh-h 9 36

33. వాళ్ళు, “మేము అబ్రాహాము వంశీయులం. మేమింతవరకు ఎవ్వరికి బానిసలుగా ఉండలేదు. మరి మాకు స్వేచ్ఛ కలుగుతుందని ఎందుకంటున్నావు?” అని అన్నారు.

34. అందుకు యేసుపాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

34. యేసు జవాబు చెప్పుతూ, “ఇది నిజం. పాపం చేసిన ప్రతి ఒక్కడూ పాపానికి బానిస ఔతాడు.

35. దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసముచేయడు; కుమారు డెల్లప్పుడును నివాసముచేయును.
నిర్గమకాండము 21:2, ద్వితీయోపదేశకాండము 15:12

35. బానిసకు కుటుంబంలో శాశ్వతమైన స్థానం ఉండదు. కాని కుమారుడు శాశ్వతంగా ఆ యింటికి చెందినవాడు.

36. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు.

36. కుమారుడు స్వేచ్ఛ కలిగిస్తే మీకు నిజమైన స్వేచ్ఛ కలుగుతుంది.

37. మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలియును; అయినను మీలో నా వాక్యమునకు చోటులేదు గనుక నన్ను చంప వెదకుచున్నారు.

37. మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలుసు. అయనా మీకు నా సందేశం నచ్చలేదు. కనుక నన్ను చంపటానికి ప్రయత్నిస్తున్నారు.

38. నేను నా తండ్రియొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను; ఆ ప్రకారమే మీరు మీ తండ్రియొద్ద వినినవాటినే జరి గించుచున్నారని వారితో చెప్పెను.

38. నేను నా తండ్రి సమక్షంలో చూసిన దాన్ని చెబుతున్నాను. మీరు మీ తండ్రి నుండి విన్నదాన్ని చేస్తున్నారు” అని అన్నాడు.

39. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రాహామనిరి; యేసుమీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలు చేతురు.

39. “అబ్రాహాము మా తండ్రి” అని వాళ్ళు సమాధానం చెప్పారు. యేసు, “మీరు అబ్రాహాము సంతానమైతే అబ్రాహాము చేసినట్లు చేసేవాళ్ళు!

40. దేవునివలన వినిన సత్యము మీతో చెప్పినవాడనైన నన్ను మీరిప్పుడు చంప వెదకుచున్నారే; అబ్రాహాము అట్లు చేయలేదు

40. నేను చేసిందల్లా దేవుని నుండి విన్న సత్యాన్ని చెప్పటమే! దానికి మీరు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు. అబ్రాహాము మీలా ప్రవర్తించలేదు.

41. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను; అందుకు వారుమేము వ్యభిచారమువలన పుట్టినవారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా
ద్వితీయోపదేశకాండము 32:6, యెషయా 63:16, యెషయా 64:8

41. మీరు మీ తండ్రి చేసినట్లు చేస్తున్నారు” అని అన్నాడు. వాళ్ళు, “మేము అక్రమంగా పుట్టలేదు. మాకు దేవుడొక్కడే తండ్రి” అని అన్నారు.

42. యేసు వారితో ఇట్లనెనుదేవుడు మీ తండ్రియైనయెడల మీరు నన్ను ప్రేమింతురు; నేను దేవుని యొద్దనుండి బయలుదేరి వచ్చి యున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను.

42. యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “దేవుడు మీ తండ్రి అయినట్లయితే నేను దేవునినుండి వచ్చానని నమ్మేవాళ్ళు. కనుక మీరు నన్ను ప్రేమించే వాళ్ళు. స్వతహాగా నేను యిక్కడికి రాలేదు. దేవుడే నన్ను పంపాడు.

43. మీరేల నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుటవలననేగదా?

43. మీరు నా సందేశం అంగీకరించటం లేదు కనుక నేను చెప్పేది మీకు అర్థం కావటం లేదు.

44. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంత కుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధి కుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు.
ఆదికాండము 3:4

44. మీరు సైతానుకు చెందిన వాళ్ళు. వాడే మీ తండ్రి. మీ తండ్రి కోరికల్ని తీర్చడమే మీ అభిలాష. వాడు మొదటి నుండి హంతకుడు. వాడు సత్యాన్ని అనుసరించడు. వాడిలో సత్యమనేది లేదు. అబద్ధమాడటం వాడి ప్రకృతి. కనుక వాడు అన్ని వేళలా అబద్ధమాడు తాడు. వాడు అబద్ధానికి తండ్రి.

45. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు.

45. నేను నిజం చెప్పటంవల్ల మీరు నమ్మటంలేదు.

46. నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్నయెడల మీరెందుకు నన్ను నమ్మరు?

46. నేను పాపం చేశానని మీలో ఎవరైనా నిరూపించగలరా? నేను నిజం చెబుతున్నాను కదా! నన్నెందుకు విశ్వసించరు.

47. దేవుని సంబంధియైనవాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను.

47. దేవుని సంతానం దేవుని మాట వింటుంది. మీరు దేవుని సంతానం కాదు కనుక నేను చెప్పింది వినటంలేదు.”

48. అందుకు యూదులు నీవు సమరయు డవును దయ్యముపట్టినవాడవును అని మేము చెప్పుమాట సరియేగదా అని ఆయనతో చెప్పగా

48. “నీవు సమరయ దేశస్థుడవని, నీకు దయ్యం పట్టిందని మేమనటంలో నిజం లేదా?” అని వాళ్ళు ప్రశ్నించారు.

49. యేసు నేను దయ్యముపట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచువాడను; మీరు నన్ను అవమానపరచుచున్నారు.

49. “నాకు దయ్యం పట్టలేదు. నేను నా తండ్రిని గౌరవిస్తాను. మీరు నన్ను అగౌరవ పరుస్తున్నారు.

50. నేను నా మహిమను వెదకుటలేదు; వెదకుచు తీర్పు తీర్చుచు ఉండువా డొకడు కలడు.

50. నేను నా కీర్తిని కోరటం లేదు. కాని నా కీర్తి కోరేవాడొకాయన ఉన్నాడు. ఆయనే న్యాయాధిపతి.

51. ఒకడు నా మాట గైకొనిన యెడల వాడెన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను.

51. ఇది నిజం. నా బోధ అనుసరించిన వాడు ఎన్నటికీ చావుచూడడు” అని అన్నాడు.

52. అందుకు యూదులునీవు దయ్యము పట్టినవాడవని యిప్పుడెరుగు దుము; అబ్రాహామును ప్రవక్తలును చనిపోయిరి; అయినను ఒకడు నా మాట గైకొనినయెడల వాడు ఎన్నడును మరణము రుచిచూడడని నీవు చెప్పుచున్నావు.

52. ఇది విని యూదులు బిగ్గరగా, “నీకు దయ్యం పట్టిందని మాకిప్పుడు తెలిసింది! అబ్రాహాము చనిపోయాడు. అలాగే ప్రవక్తలు చనిపోయారు. అయినా నీ బోధన అనుసరించిన వాడు చనిపోడని అంటున్నావు.

53. మన తండ్రియైన అబ్రాహాము చనిపోయెను గదా; నీవతనికంటె గొప్పవాడవా? ప్రవక్తలును చనిపోయిరి; నిన్ను నీ వెవడవని చెప్పుకొనుచున్నావని ఆయన నడిగిరి.

53. నీవు మా తండ్రి అబ్రాహాము కన్నాగొప్ప వాడవా? అతడు చనిపొయ్యాడు. ప్రవక్తలు కూడా చనిపొయ్యారు. నీ మనస్సులో నీవెవరవనుకుంటున్నావు?” అని అన్నారు.

54. అందుకు యేసు నన్ను నేనే మహిమపరచుకొనినయెడల నా మహిమ వట్టిది; మా దేవుడని మీరెవరినిగూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు.

54. యేసు, “నన్ను నేను పొగుడుకుంటే ఆ పొగడ్తకు అర్థం లేదు. నన్ను పొగిడేవాడు నా తండ్రి. ఆయన మీ దేవుడని మీరే అంటున్నారు.

55. మీరు ఆయనను ఎరుగరు, నేనాయనను ఎరుగుదును; ఆయనను ఎరుగనని నేను చెప్పినయెడల మీవలె నేనును అబద్ధికుడనై యుందును గాని, నేనాయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను.

55. ఆయన మీకు తెలియదు. కాని నాకాయన తెలుసు. ఆయన నాకు తెలియదని అంటే, నేను మీలాగే అబద్ధాలాడినట్లవుతుంది. కాని ఆయన నాకు తెలుసు. ఆయన మాట నేను పాటిస్తాను.

56. మీ తండ్రియైన అబ్రా హాము నా దినము చూతునని మిగుల ఆనందించెను; అది చూచి సంతోషించెను అనెను.

56. మీ తండ్రి అబ్రాహాము నా కాలాన్ని చూడగలనని గ్రహించిన వెంటనే ఆనందపడ్డాడు. అతడు చూశాడు: ఆనంద పడ్డాడు” అని అన్నాడు.

57. అందుకు యూదులునీకింకను ఏబది సంవత్సరములైన లేవే, నీవు అబ్రాహామును చూచితివా అని ఆయనతో చెప్పగా,

57. ఆ కారణంగా యూదులు, “నీకింకా యాభై ఏళ్ళైనా నిండలేదు. నీవు అబ్రాహామును చూసావా?” అని అన్నారు.

58. యేసు అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

58. యేసు, “ఇది నిజం. అబ్రాహాము పుట్టక ముందే నేను ఉన్నాను” అని అన్నాడు.

59. కాబట్టి వారు ఆయనమీద రువ్వుటకు రాళ్లు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్లిపోయెను.

59. ఇది విని వాళ్ళు ఆయన్ని కొట్టాలని రాళ్ళు ఎత్తి పట్టుకున్నారు. కాని యేసు వాళ్ళకు కనిపించకుండా దాక్కొని ఆ గుంపు నుండి వెళ్ళి పోయాడు.Shortcut Links
యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |