John - యోహాను సువార్త 8 | View All

1. యేసు ఒలీవలకొండకు వెళ్లెను.

ఈ వచనాలు గ్రీకు మూల ప్రతుల్లో లేవని కొందరు పండితులు అభిప్రాయం. ఇవి గ్రీకు మూలంలో ఉన్న వచనాలేనని ఈ నోట్స్ రచయిత నమ్ముతున్నాడు.

2. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరు ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించు చుండెను.

3. శాస్త్రులును పరిసయ్యులును, వ్యభిచారమందు పట్టబడిన యొక స్త్రీని తోడు కొనివచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి

“పరిసయ్యులు”– మత్తయి 3:7. ఈ స్త్రీ వాళ్ళకెలా దొరికిందో రాసిలేదు. యేసుమీద నేరం మోపే కారణం వెదకాలని (వ 6) వారు కావాలనే ఆమెను కపటోపాయం చేత చిక్కించుకుని ఉండవచ్చు.

4. బోధకుడా, యీ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను;

వారాయన్ను “ఉపదేశకా” అని పిలుస్తున్నారు గాని ఆయన ఉపదేశించిన వాటిల్లో దేన్నీ అంగీకరించలేదు. లూకా 6:46 పోల్చి చూడండి.

5. అట్టివారిని రాళ్లు రువి్వ చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మన కాజ్ఞాపించెను గదా; అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి.
లేవీయకాండము 20:10, ద్వితీయోపదేశకాండము 22:22

ధర్మశాస్త్రం ఇలా చెప్పిన సంగతి నిజమే గాని మగవాణ్ణి కూడా చంపాలని కూడా చెప్పింది (ద్వితీయోపదేశకాండము 22:22-24; లేవీయకాండము 20:10). దోషి అయిన ఆ మగవాణ్ణి వారు తీసుకు రాకపోవడంలో ఏదో మోసం ఉంది. బహుశా వాడు వాళ్ళ మనిషే కావచ్చు. ధర్మశాస్త్రం విధిస్తున్న శిక్షనుంచి యేసు ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తాడని బహుశా వారు గట్టిగా నమ్మి ఉండవచ్చు. ఆయన గనుక అలా చేస్తే అది ఆయన్ను ధర్మశాస్త్రానికి విరోధంగా నిలబెడుతుంది గదా అని వారి దురాలోచన.

6. ఆయనమీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి, నేలమీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను.

ఆయన్ను అలా బుట్టలో వేయజూసినది ఇదొక్క సారే కాదు. మత్తయి 22:15 చూడండి. యేసు రాస్తూ ఉన్నదేమిటో ఎందుకు రాశాడో ఊహాగానాలు అనవసరం. ఇది ఎవరికీ తెలియదు. ఆధ్యాత్మికమైన మేలు కలిగించే స్పష్టమైన విషయాలు బైబిల్లో కోకొల్లలు. వాటిని ప్రధానంగా నేర్చుకుందాం.

7. వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తలయెత్తి చూచిమీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమెమీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పి
ద్వితీయోపదేశకాండము 17:7

ఈ ఆశ్చర్యకరమైన జవాబు పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. ఆ స్త్రీకీ, యేసుకూ విరోధంగా గుమిగూడినవారు ఓడిపోయి యుద్ధరంగం వదిలి జారుకోవలసి వచ్చింది. వారాయన కోసం గొయ్యి తవ్వారు గానీ వారే దాన్లో పడ్డారు. కీర్తనల గ్రంథము 7:14-15; కీర్తనల గ్రంథము 57:6; సామెతలు 26:27.

8. మరల వంగి నేలమీద వ్రాయు చుండెను.

9. వారామాట విని, పెద్దవారు మొదలుకొని చిన్నవారివరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్లిరి; యేసు ఒక్కడే మిగిలెను; ఆ స్త్రీ మధ్యను నిలువబడియుండెను.

పరిసయ్యుల్లో అనేకమంది స్వనీతిపరులూ, ఇతరులకన్న తామే మంచివారమని భావించే వారైనప్పటికీ (లూకా 18:9-12), వారిలో ఒక్కడు కూడా తాను పాపం లేని వాణ్ణని ధైర్యంగా చెప్పగలవాడు లేడు. పాత ఒడంబడిక గ్రంథం వారికి తెలుసు (ఆదికాండము 8:21; కీర్తనల గ్రంథము 51:5; యిర్మియా 17:9). అనేక సార్లు వారు తమ అంతర్వాణిని అణచివేసుకున్నప్పటికీ వారిలోని ఆ స్వరం పూర్తిగా చచ్చిపోలేదు, మౌనం దాల్చలేదు.

10. యేసు తలయెత్తి చూచి అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడు

ఆమెపై నేరం మోపినవారంతా వెళ్ళిపోయారు. ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే వారెవరూ ఇక లేరు. అందువల్ల ధర్మశాస్త్రాన్ని బట్టి చూచినా ఆమెను వెళ్ళిపోనివ్వడమే న్యాయం. ద్వితీయోపదేశకాండము 17:6-7; ద్వితీయోపదేశకాండము 19:15 చూడండి.

11. ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను.

యోహాను 3:17 చూడండి. యేసు పాపులను నేరస్థులుగా తీర్చి వారికి శిక్ష విధించేందుకు గనుక వచ్చివుంటే అందరూ – అంటే ఈ స్త్రీ, పరిసయ్యులు, మొత్తం ప్రజలంతా, ఆయన శిష్యులు కూడా నేరస్థులుగా తీర్చబడి శిక్షకు గురై ఉండేవారే. ఎందుకంటే అందరూ పాపులే (రోమీయులకు 3:9, రోమీయులకు 3:19, రోమీయులకు 3:23; మత్తయి 7:11). కానీ యేసు దారి తప్పిన వారిని వెతికి పాపవిముక్తుల్ని చేసి రక్షించేందుకు వచ్చాడు గానీ నేరం మోపి శిక్షించాలని కాదు (లూకా 19:10). అంటే పాపం చేసినా ఫర్వాలేదని యేసు అంటున్నట్టా? ఎంతమాత్రం కాదు. పాపం బహు భయానకమైనదని ఆయనకు తెలుసు. పాపాన్ని తీసివేసే బలి అర్పణగా బాధలు అనుభవించి చనిపోవడానికే ఆయన వచ్చాడు (యోహాను 1:29; యోహాను 3:14; యోహాను 6:53-58; యోహాను 10:11). ఈ స్త్రీతో ఆయన ఏమంటున్నాడో చూడండి – “ఇకనుంచి అపరాధం చేయకుండా ఉండు”. యోహాను 5:14; మత్తయి 4:17; లూకా 13:2-3 కూడా చూడండి. పాపం చేసినా ఫర్వాలేదని దీని అర్థంలా అనిపిస్తున్నదా? యేసుప్రభువు మన పాపాలను క్షమించాడంటే మనం అలాగే పాపాలు చేస్తూ ఉండవచ్చని కాదు, పాపం చెయ్యడం మానుకోవాలనే. మత్తయి 1:21; కీర్తనల గ్రంథము 130:4; రోమీయులకు 6:14; 1 యోహాను 2:1.

12. మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను.
యెషయా 49:6

“వెలుగును”– యోహాను 1:4; యోహాను 3:19-20; యోహాను 12:35-36; మత్తయి 4:16; లూకా 1:79; 2 కోరింథీయులకు 4:6; 1 యోహాను 1:5; 1 యోహాను 2:8. దేవుడు ఈ లోకమంతటికీ ఇచ్చిన వెలుగు యేసుప్రభువు. ఈ భూమికి సూర్యగోళం ఎలానో, మానవాళికి యేసు అలా. ఆయన జీవితం, చర్యలు, ఆయన వాక్కులు దేవుణ్ణి గురించీ, మనిషి పాపవిముక్తి గురించీ దేవుడు ఏం చేస్తాడో, మనిషి ఏం చెయ్యాలో దాన్ని గురించీ సత్యాన్ని వెల్లడి చేస్తున్నాయి. ఈ వెలుగు వాస్తవమైనవాటికీ, వాస్తవం కానివాటికీ, సత్యానికీ అసత్యానికీ ఉన్న తేడాను స్పష్టం చేస్తున్నది. అది పరలోకానికి మార్గం చూపుతుంది. అయితే క్రీస్తును అనుసరించేవారికే ఈ వెలుగు పనికి వస్తుంది. అనుసరించడమంటే నమ్మిక ఉంచి విధేయత చూపడం. మనం ఆయన్నుండి వెనక్కు తగ్గితే జీవితంలోని అతి ప్రాముఖ్యమైన విషయాల గురించి తెలియక చీకట్లోనూ అజ్ఞానంలోనూ ఉండిపోతాం. యేసును అనుసరించేవారు ఇప్పుడు వెలుగులో ఉన్నారు. వేరే పరిస్థితుల్లో చూడలేని అనేక సత్యాలను వారు చూడగలుగుతారు. తాము ఎక్కడికి వెళ్తున్నదీ వారికి తెలుస్తుంది. అవిశ్వాసులు ఇప్పుడు చీకట్లో ఉన్నారు (అందువల్ల వారు చేయగలిగినదల్లా వెలుగును నిరాకరించి, ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఊహాగానాలు చెయ్యడమే). వారు శాశ్వత అంధకారంలోకి వెళ్ళిపోతారు (మత్తయి 8:12; మత్తయి 22:13; 2 పేతురు 2:17; యూదా 1:13). “జీవ కాంతి” అనే మాటకు బహుశా జీవం అయిన కాంతి (లేక సజీవమైన వెలుగు), లేదా జీవాన్నిచ్చే కాంతి, లేదా జీవంనుండి ప్రసరించే కాంతి, లేక పై అర్థాలన్నీ కూడా కావచ్చు. ఇక్కడ అతి ప్రాముఖ్యమైన ప్రశ్న ఉంది. క్రీస్తు ఇచ్చే కాంతిని నిజంగా మనం కోరుతున్నామా, లేక మన చీకటితో తృప్తిపడి ఊరుకుంటున్నామా?

13. కాబట్టి పరిసయ్యులు నిన్నుగూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు; నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా

వీరు యేసు మాటల్ని తిప్పి ఆయనమీదే ప్రయోగించాలని చూస్తున్నారా (యోహాను 5:31)? కాంతిని గురించి వారేమీ నోరు విప్పడం లేదన్న సంగతి గమనించండి. వారి చీకటి వారికి చాలు. విరోధ భావంతో, అపనమ్మకంతో వారు యేసును ఆయనే వెలుగు అనేందుకు రుజువు అడుగుతున్నారు. నిజానికి సహజంగా చూస్తే వెలుగు తానున్నానని ఎలాంటి రుజువులూ చూపనక్కర్లేదు. అది వెలుగుతూ ఉంటే చాలు. వెలుగుతూ ఉండడమే కాంతికి రుజువు. వెలుగనేది లేదని చీకటి అనవచ్చు. అయితే అలా అనడం వెలుగు లేదనడానికి రుజువు కాదు, చీకటి ఉందని మాత్రమే అనడానికి అది రుజువు.

14. యేసునేను ఎక్కడనుండి వచ్చితినో యెక్కడికి వెళ్లుదునో నేనెరుగుదును గనుక నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పు కొనినను నా సాక్ష్యము సత్యమే; నేను ఎక్కడనుండి వచ్చుచున్నానో యెక్కడికి వెళ్లుచున్నానో మీరు ఎరుగరు.

యోహాను 5:31 లో తాను గాక వేరే సాక్షులెవరూ లేకుండా తనగురించి తానే సాక్ష్యం చెప్పుకుంటే అది చాలదని యేసుప్రభువు చెప్పాడు. అలాంటి సాక్ష్యాన్ని ఏ కోర్టూ అంగీకరించదు. ఇక్కడ ఆయన రెండు విషయాలను బట్టి తన సాక్ష్యం సత్యం అంటున్నాడు. తానెక్కడనుంచి వచ్చినదీ ఎక్కడికి వెళ్తున్నదీ తనకు తెలుసు. తండ్రి అయిన దేవుడు ఆయనకు సాక్షి. యోహాను 5:36-37 కూడా చూడండి.

15. మీరు శరీరమునుబట్టి తీర్పు తీర్చుచున్నారు; నేనెవరికిని తీర్పు తీర్చను.

16. నేను ఒక్కడనైయుండక, నేనును నన్ను పంపిన తండ్రియు కూడ నున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే.

17. మరియు ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది గదా.
ద్వితీయోపదేశకాండము 17:6, ద్వితీయోపదేశకాండము 19:15

ద్వితీయోపదేశకాండము 19:15. ధర్మశాస్త్రం ప్రకారం ఇద్దరు వ్యక్తుల సాక్ష్యం అంగీకారమే. తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడు ఇచ్చిన సాక్ష్యాన్ని మనం అంగీకరించవద్దా?

18. నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పుకొను వాడను; నన్ను పంపిన తండ్రియు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడని చెప్పెను.

19. వారు నీ తండ్రి యెక్కడ ఉన్నాడని ఆయనను అడుగగా యేసు మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు; నన్ను ఎరిగి యుంటిరా నా తండ్రినికూడ ఎరిగి యుందురని వారితో చెప్పెను.

యోహాను 10:30; యోహాను 14:9 పోల్చి చూడండి. దేవుని కుమారుడు, తండ్రి అయిన దేవుడు స్వభావంలోనూ గుణశీలాల్లోనూ మనస్సు, ఉద్దేశాల్లోనూ ఎంత ఐక్యంగా ఉన్నారంటే ఒకర్ని ఎరిగితే మరొకర్ని ఎరిగినట్టే. యోహాను 1:18; హెబ్రీయులకు 1:3 కూడా చూడండి. క్రీస్తు దేవత్వం గురించి ఫిలిప్పీయులకు 2:6; లూకా 2:11 నోట్స్‌లో రిఫరెన్సులు చూడండి. ఈ పరిసయ్యులకు క్రీస్తు తెలియదు. వారాయన్ను చూశారు. ఆయన మాట్లాడినప్పుడు విన్నారు. అయితే వారి దురభిమానం, అపనమ్మకం ఆయన నిజంగా ఎవరో అర్థం చేసుకోనియ్యకుండా చేశాయి.

20. ఆయన దేవాలయములో బోధించుచుండగా, కానుక పెట్టె యున్నచోట ఈ మాటలు చెప్పెను. ఆయన గడియ యింకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు.

21. మరియొకప్పుడు ఆయననేను వెళ్లిపోవుచున్నాను; మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపములోనే యుండి చనిపోవుదురు; నేను వెళ్లుచోటికి మీరు రాలేరని వారితో చెప్పెను.

యోహాను 7:33-34. ఇక్కడ యేసు “మీ పాపాలలోనే చనిపోతారు” అనే భయంకరమైన మాటను కలుపుతున్నాడు. పాపంలో చనిపోవడం అంటే శాశ్వతంగా నశించిపోవడమే గనుక ఇవి భయానకమైన మాటలు. చావు తరువాత పాపవిముక్తి పొందే అవకాశాలు ఉన్నాయని బైబిలు చెప్పడం లేదు. మనుషులు ఈ భూమిపై తిరిగి తిరిగి జన్మిస్తూ ఉండరు. యోహాను 9:3; హెబ్రీయులకు 9:27; లూకా 16:19-31 చూడండి.

22. అందుకు యూదులునేను వెళ్లుచోటికి మీరు రాలేరని యీయన చెప్పుచున్నాడే; తన్ను తానే చంపు కొనునా అని చెప్పుకొనుచుండిరి.

యోహాను 7:35-36. యేసు ఆత్మహత్య చేసుకుంటాడని వీరు నిజంగా అనుకోగలిగారా? ఆయన్ను గురించీ ఆయన తండ్రిని గురించీ వారెంత అజ్ఞానంలో ఉన్నారో ఇది తెలియజేస్తున్నది (వ 19).

23. అప్పుడాయన మీరు క్రిందివారు, నేను పైనుండువాడను; మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోకసంబంధుడను కాను.

ఇక్కడ యేసుప్రభువు తనకూ, ఇతరులందరికీ మధ్య ఉన్న తేడా చెప్తున్నాడు. మనం ఈ లోకానికి చెందినవారం. ఆయన పరలోకం నుంచి వచ్చినవాడు (యోహాను 3:13; యోహాను 6:33, యోహాను 6:38, యోహాను 6:50-51). 1 కోరింథీయులకు 15:45-47 కూడా చూడండి.

24. కాగా మీ పాపములలోనేయుండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించనియెడల మీరు మీ పాపములోనేయుండి చనిపోవుదురని వారితో చెప్పెను.

పాపాల్లోనే చనిపోయి నశించిపోకుండా తప్పించు కొనేందుకు ఏకైక మార్గం యేసులో నమ్మకం పెట్టడమేనని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. యోహాను 3:36 పోల్చి చూడండి. “నేను ఉన్నవాడను”– ఇది పాత ఒడంబడిక గ్రంథంలో దేవుడు తానే మాట్లాడిన రీతి –నిర్గమకాండము 3:14; యెషయా 43:10. పాత ఒడంబడికలో యెహోవాగా వెల్లడి అయిన దేవుణ్ణి తానే అని యేసు ఇక్కడ చెప్పుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తున్నది. వ 58లో ఇది మరీ స్పష్టంగా ఉంది. మనుషులు దీన్ని నమ్మకపోతే వారు తమ పాపాల్లోనే చనిపోతారని చెప్తున్నాడు. యేసు యెహోవా అవతారమని తెలియజేసే ఇతర రిఫరెన్సులు లూకా 2:11 నోట్‌లో ఉన్నాయి.

25. కాబట్టి వారునీ వెవరవని ఆయన నడుగగా యేసు వారితోమొదటనుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడనే.

దేవుడు తన తండ్రి అని యేసుప్రభువు పదేపదే చెప్పాడు (యోహాను 2:16; యోహాను 3:16, యోహాను 3:18; యోహాను 5:19-23, యోహాను 5:26; యోహాను 6:40). అంటే తాను దేవుణ్ణని ఆయన చెప్పుకుంటున్నట్టు వారు అర్థం చేసుకున్నారు. వారి ఆలోచన సరిగానే ఉంది. కుమారునికి తండ్రి స్వభావమే ఉంటుంది గదా.

26. మిమ్మునుగూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాల సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు; నేను ఆయనయొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను.

ఆయన లోకానికి తీర్పు తీర్చేందుకు రాలేదు, అంటే దానిపై అంతిమ తీర్పు వినిపించి శిక్షించేందుకు రాలేదన్నమాట (యోహాను 3:17). కానీ ఇతరుల ప్రవర్తనను ఆయన గమనించాడు. వారి గురించిన సత్యం మాట్లాడ్డానికి ఆయనకు అధికారం ఉంది.

27. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పెనని వారు గ్రహింపక పోయిరి.

మళ్ళీ ఇక్కడ అపనమ్మకంలోని గుడ్డితనం కనిపిస్తున్నది.

28. కావున యేసు మీరు మనుష్యకుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతట నేనే యేమియు చేయక, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు.

“మానవపుత్రుడు”– మత్తయి 8:20. “పైకెత్తేటప్పుడు”– సిలువను గురించి ఆయన మాట్లాడుతున్నాడు (యోహాను 3:14), కానీ పైకెత్తడం అని అనువదించిన గ్రీకు మాటకు “హెచ్చించడం”, “గొప్ప చేయడం” అని కూడా అర్థం ఉంది. కాబట్టి ఇక్కడ ఆయన మాటలో ఆయన సజీవంగా తిరిగి లేవడం, పరలోకానికి వెళ్ళిపోవడం కూడా ఇమిడి ఉండవచ్చు. ఈ సంఘటనల తరువాతే చాలమంది యూదులు, యూదుల నాయకులు కొందరు కూడా ఆయనెవరో తెలుసుకొని, ఆయన్ను అనుసరించసాగారు (అపో. కార్యములు 2:41; అపో. కార్యములు 4:4; అపో. కార్యములు 6:7; అపో. కార్యములు 21:20). ఇంకా చాలా మందికి ఆయన్ను అనుసరించాలని తెలుసు గాని అలా చెయ్యడం ఇష్టం లేదు.

29. నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు; ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను.

ఆయన జీవితం ముఖ్యోద్దేశం తండ్రి అయిన దేవునికి ఆనందం కలిగించడమే. దాన్ని ఆయన లోపరహితంగా నెరవేర్చాడు (యోహాను 4:34 నోట్‌).

30. ఆయన యీ సంగతులు మాటలాడుచుండగా అనేకు లాయనయందు విశ్వాసముంచిరి.

తరువాత వస్తున్న వచనాలను బట్టి వారి నమ్మకం ఎంత అల్పమైనదో చూడవచ్చు. యోహాను 2:23-25; యోహాను 12:42-43 చూడండి. యేసును గురించి కొన్ని విషయాలు వారు నమ్మారు. అయితే ఈ నమ్మకం వారి హృదయాల లోతుల్లోకి పోయి వారి బ్రతుకుల్ని మార్చలేదు.

31. కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతోమీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు;

శిష్యులంటే యేసుప్రభువు తమ ఏకైక ఉపదేశకుడుగా అంగీకరించినవారే, ఆయన్నుండి నేర్చుకుని ఆయనకు లోబడుతూ తమను ఆయన ఎటు తీసుకు వెళ్తే అటు వెళ్ళేవారే. అలా చేస్తూ ఉండేవారే నిజమైన శిష్యులని ఇక్కడ ఆయన చెప్తున్నాడు. శిష్యులనడానికి రుజువు వారు శిష్యులుగా ఉండిపోవడమే. కొంతమంది ఆరంభం బాగానే ఉన్నట్టుంది గాని త్వరలోనే క్రీస్తు ఉపదేశాలను విడిచిపెట్టి తమ సొంత దారుల్లో వెళ్ళిపోతారు. అలాంటివారు నిజమైన శిష్యులు ఎన్నడూ కాలేదు. 1 యోహాను 2:19 పోల్చి చూడండి.

32. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా

క్రీస్తు మనుషుల్ని విడుదల చేయడానికే వచ్చాడు (లూకా 4:18). ఈ విడుదల ఏమిటి? ఇది రాజకీయ స్వేచ్ఛ గానీ అక్షరాలా బానిసత్యం నుంచి స్వేచ్ఛ గానీ కాదు. పాప బంధకాల నుంచీ విడుదల (వ 34). దానితోబాటు అపరాధులమనే తీర్పు నుంచీ శిక్ష నుంచి దేవుని పవిత్ర ధర్మశాస్త్రం చేసే నేరారోపణ నుంచీ చావు భయం నుంచీ భవబంధాల నుంచీ ఆస్తిపాస్తుల కట్లనుంచీ క్రీస్తును అనుసరించకుండా దేవుణ్ణి సేవించకుండా అడ్డుపడే అన్ని సంకెళ్ళ నుంచీ ఆయన మనకు విడుదలను అనుగ్రహిస్తాడు. ఆయనిచ్చేది ఆత్మ సంబంధమైన విడుదల. క్రీస్తు ఈ విడుదలను ఎలా ప్రసాదిస్తాడు? మనం సత్యాన్ని తెలుసుకోవడం ద్వారానే. నిజమైన శిష్యుడు సత్యస్వరూపి అయిన క్రీస్తును (యోహాను 1:17; యోహాను 14:6), ఆయన్ను గురించిన సత్యాన్ని తెలుసుకుంటాడు. అంటే ఆయనెవరో, ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఇక్కడ ఆయన సాధించినదేమిటో తెలుసుకుంటాడు. అంతేగాక అతడు తన గురించీ పాపవిముక్తి గురించీ యేసు చేసిన ఇతర గొప్ప ఉపదేశాల గురించీ సత్యాన్ని కూడా తెలుసుకుంటాడు. సత్యం గురించిన ఈ జ్ఞానం ఒక్కటే విడుదలకు మార్గం. పాపం, అపనమ్మకం, సత్యాన్ని ఎరగకపోవడం మనుషుల్ని బానిసత్వంలో ఉంచుతున్నాయి. యోహాను 15:21; మొ।। నోట్స్ చూడండి. వారికి విడుదల ప్రసాదించే సత్యం క్రీస్తు సత్యం ఒక్కటే.

33. వారుమేము అబ్రాహాము సంతానము, మేము ఎన్నడును ఎవనికిని దాసులమై యుండలేదే; మీరు స్వతంత్రులుగా చేయ బడుదురని యేల చెప్పుచున్నావని ఆయనతో అనిరి.
Neh-h 9 36

మత్తయి 3:9 చూడండి. ఇది జాతి గురించిన అహంకారం. యూద జాతి వంశకర్త అబ్రాహాము గొప్పవాడు కాబట్టి తాము కూడా గొప్పవారమని వారు అనుకున్నారు. కానీ వారు ఆత్మ సంబంధంగా అబ్రాహాము సంతతి కాదని 39,40 వచనాలు చూపిస్తున్నాయి. కుటుంబ సంబంధంగా జాతి సంబంధంగా గర్వించడం మనల్ని దేవుని ఛాయలకు కూడా తీసుకువెళ్ళదు. “విడుదల”– ఎప్పటిలాగానే యేసుప్రభువును వారు అపార్థం చేసుకున్నారు. శారీరికంగా బానిసత్వం నుంచి విడుదల గురించి ఆయన మాట్లాడుతున్నాడని అనుకున్నారు.

34. అందుకు యేసుపాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

ఎవరూ కూడా అపార్థం చేసుకోవడానికి వీలులేకుండా అతి స్పష్టంగా యేసు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్కు విధిస్తున్న కట్టుబాట్లు తెంచుకొని, తమ సొంత దారుల్లో సాగిపోవడం స్వేచ్ఛ అనుకునేవారు ఎంతమందో ఉన్నారు. అయితే తమ ఇష్టప్రకారం చేసేందుకూ తనివితీరా పాపం చేసేందుకూ స్వేచ్ఛ కావాలని వారి ప్రయత్నాలవల్ల వారు తమ సొంత బంధకాలను తయారు చేసుకుంటున్నారు, చాలా క్రూరమైన యజమానికి – అంటే పాపానికి బానిసలౌతున్నారు.

35. దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసముచేయడు; కుమారు డెల్లప్పుడును నివాసముచేయును.
నిర్గమకాండము 21:2, ద్వితీయోపదేశకాండము 15:12

ఏ కుటుంబం విషయంలోనైనా చివరికి దేవుని కుటుంబం విషయంలో కూడా ఇది సత్యమే. పాపానికి దాసులైన వారికి కుమారునికి ఉన్నట్టుగా అందులో నిజమైన స్థానం, హక్కు లేవు.

36. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు.

బానిసలు తమను తాము విడిపించుకోలేరు. అలా విడిపించుకోగలిగితే వారు బానిసలే కాదు. వారిని విడిపించాలనంటే వారు గాక వేరొకరు, బానిస కానివాడు అవసరం. దీన్ని క్రీస్తు చేశాడు. చేస్తూనే ఉన్నాడు (మత్తయి 1:21; అపో. కార్యములు 26:17-18; రోమీయులకు 6:16-18, రోమీయులకు 6:22; రోమీయులకు 8:2, రోమీయులకు 8:21; గలతియులకు 5:1).

37. మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలియును; అయినను మీలో నా వాక్యమునకు చోటులేదు గనుక నన్ను చంప వెదకుచున్నారు.

సంతానం అంటే శారీరికంగా సంతానం అని యేసు ఉద్దేశం. తనను చంపడానికి వారు పన్నుతున్న కుట్రల సంగతంతా యేసుకు తెలుసు –యోహాను 5:18.

38. నేను నా తండ్రియొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను; ఆ ప్రకారమే మీరు మీ తండ్రియొద్ద వినినవాటినే జరి గించుచున్నారని వారితో చెప్పెను.

క్రీస్తు ఎప్పుడూ దేవుని సన్నిధిలో ఉన్నాడు – వ 28; యోహాను 1:1; యోహాను 5:19-20. “మీ తండ్రి”– అంటే సైతాను (వ 41,44).

39. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రాహామనిరి; యేసుమీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలు చేతురు.

అబ్రాహాము తమ తండ్రి అని వారు నొక్కి చెప్పారు. బహుశా అది శరీరికంగా, ఆధ్యాత్మికంగా కూడా వాస్తవమే అని వారి ఉద్దేశం కావచ్చు. ఇది నిజం కాదని వారి ప్రవర్తనే తెలియజేస్తూ ఉన్నదని యేసు అంటున్నాడు. అబ్రాహాము ఎలాంటివాడో బైబిలు తెలియజేస్తున్నది (ఆది 12-24 అధ్యాయాలు). ఈ యూదులు ఎంతమాత్రం అతని లాంటివారు కాదు.

40. దేవునివలన వినిన సత్యము మీతో చెప్పినవాడనైన నన్ను మీరిప్పుడు చంప వెదకుచున్నారే; అబ్రాహాము అట్లు చేయలేదు

41. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను; అందుకు వారుమేము వ్యభిచారమువలన పుట్టినవారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా
ద్వితీయోపదేశకాండము 32:6, యెషయా 63:16, యెషయా 64:8

ఈ యూదులు ఇలా ఎందుకన్నారో స్పష్టంగా తెలియదు. తాము భౌతికంగా ఆధ్యాత్మికంగా కూడా అబ్రాహాము సంతానమనీ, నిజ దేవుణ్ణి ఆరాధించేవారమనీ వారి ఉద్దేశం కావచ్చు (పాత ఒడంబడిక గ్రంథంలో పర దేవత పూజ వ్యభిచారం వంటిదని చెప్పడం జరిగింది. యిర్మియా 2:1; యెహెఙ్కేలు 16:31-34; యెహెఙ్కేలు 23:2-3; హోషేయ 1:2 నోట్స్‌). ఇస్రాయేల్ జాతికి దేవుడే తండ్రి అని వారికి తెలుసు (యెషయా 64:8; మలాకీ 2:10). ఇక్కడ వ్యక్తిగతంగా తమకు కూడా దేవుడే తండ్రి అని చెప్పుకుంటున్నారు. కానీ కేవలం అలా చెప్పినంత మాత్రాన అలా అయిపోదు.

42. యేసు వారితో ఇట్లనెనుదేవుడు మీ తండ్రియైనయెడల మీరు నన్ను ప్రేమింతురు; నేను దేవుని యొద్దనుండి బయలుదేరి వచ్చి యున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను.

చాలామంది తాము దేవుని పిల్లలమనుకుంటారు. అలా చెప్పుకుంటారు. కానీ వారికి యేసుప్రభువంటే ప్రేమ ఉందా? లేని పక్షంలో వారు అనుకునేది ఏమైనప్పటికీ వారు దేవుని పిల్లలు కాదు. యేసుప్రభువును ప్రేమించడమంటే ఏమిటి? యోహాను 14:15, యోహాను 14:23-24 చూడండి. ఆయన ఈ లోకంలోకి పంపిన యేసుప్రభువును ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమించడం సాధ్యం కాదు.

43. మీరేల నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుటవలననేగదా?

వారెందుకు వినలేకపోతున్నారు? ఎందుకంటే ఆత్మ సంబంధంగా వారు చెవిటివారు, గుడ్డివారు, చచ్చినవారు. చీకటంటే వారికి ఇష్టం (యోహాను 3:19). దేవుని తీర్పు వారిపై ఉంది (మత్తయి 13:11-15).

44. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంత కుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధి కుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు.
ఆదికాండము 3:4

వ 38,41. శారీరకంగా వారు అబ్రాహాము సంతానం. కానీ ఆధ్యాత్మిక విషయాల్లో వారు సైతాను పిల్లలు (మత్తయి 13:38. సైతాను గురించి 1 దినవృత్తాంతములు 21:1; మత్తయి 4:1-11; 2 కోరింథీయులకు 11:14 నోట్స్‌). సైతాను వారిలో పని చేస్తున్నాడు (ఎఫెసీయులకు 2:2); వారు వాడికి లోబడ్డారు, అనేక విధాలుగా వాడివంటి వారు. వారు వాడికి చెందినవారు. యేసుప్రభువు పట్ల వారి ప్రవర్తనే ఈ విషయాన్ని బయటపెట్టింది. దీన్ని బట్టి మనం ఓ పాఠం నేర్చుకుందాం. ఒక వ్యక్తి ముందు తరాలవారు గొప్పవారై ఉండవచ్చు. అతడు చాలా మతనిష్ఠ గలవాడై ఉండవచ్చు. తాను దేవుని సంతానమని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ఆ వ్యక్తి సైతాను కొడుకై ఉండే అవకాశం ఉంది. మానవ హృదయంలో మోసకరమైన స్థితి, ఘోరమైన చెడుతనం అలాంటిదే (యిర్మియా 17:9). యేసు ఇక్కడ సైతాను గురించి రెండు సంగతులను వెల్లడిస్తున్నాడు – వాడు హంతకుడు, పచ్చి అబద్ధాలకోరు. “మొదటినుంచి వాడు హంతకుడు” అనేమాట సైతాను ఆదామునూ హవనూ నాశనం చేయజూచిన సంగతి గురించిన మాట కావచ్చు (ఆదికాండము 2:17; ఆదికాండము 3:1-4). లేక హేబెలు హత్యను గురించినది కావచ్చు (ఆదికాండము 4:8). తమ్ముణ్ణి హత్య చెయ్యడానికి కయీనును ప్రేరేపించినది నిస్సంశయంగా సైతానే. సైతాను మానవజాతి మొత్తానికి హంతకుడు అనడం అతిశయోక్తి కాదు. ఆదాము, హవలను వాడు ప్రేరేపించి చేయించిన పాపం మూలంగా వారికీ, వారి సంతతివారందరికీ మరణం దాపురించింది (రోమీయులకు 5:12). సైతాను అబద్ధికుడు కూడా. తన అబద్ధాలతో మానవజాతి అంతటినీ దారి తప్పిపోయేలా చేస్తున్నాడు (ప్రకటన గ్రంథం 12:9). దేవుణ్ణి గురించి, మనిషి గురించి, పాపవిముక్తి, మతం గురించి, మనుషుల్ని వల్లో వేసుకుని నాశనం చేసేందుకు తనకు వీలున్నదనుకున్న ఏ సందర్భంలోనైనా వాడు అబద్ధాలు చెప్తాడు. వాడు ముఖ్యంగా మత సంబంధంగా పని చేస్తుంటాడు. విచారమేమిటంటే ఎక్కువ మంది మనుషులు క్రీస్తు నేర్పిన సత్యాలను నమ్మక, సైతాను అబద్ధాలనే నమ్ముతారు. తెలిసో, తెలియకో చాలామంది సైతానుకు పూజ చేస్తారు కూడా (మత్తయి 4:8-9; లేవీయకాండము 17:7; ద్వితీయోపదేశకాండము 32:17; కీర్తనల గ్రంథము 106:37; 1 కోరింథీయులకు 10:20; ప్రకటన గ్రంథం 9:20). “అబద్ధాలకు తండ్రి”– అబద్ధాలాడేవారంతా సైతాను పక్షం వహించి, సత్యస్వరూపియైన దేవుణ్ణి ఎదిరిస్తున్నారు (కీర్తనల గ్రంథము 31:5). ఈ ఘోర పాపానికి తగిన శిక్ష అనుభవిస్తారు – ప్రకటన గ్రంథం 21:8.

45. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు.

“సత్యం చెప్పినందుచేతే”– యేసు వారికి అబద్ధాలు చెప్పి ఉంటే వారు ఆయన్ను నమ్మి ఉండేవారే! వారు అప్పటికే సైతాను అబద్ధాలు నమ్మారు గనుక సత్యమంటే వారికి ద్వేషం. సత్యాన్ని వారు నమ్మలేదు, నమ్మలేకపోయారు. యోహాను 5:44 కూడా చూడండి.

46. నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్నయెడల మీరెందుకు నన్ను నమ్మరు?

యేసు ఎప్పుడైనా పాపం చేశాడని వారు గానీ మరెవరైనా గానీ ఎప్పుడూ నిరూపించలేకపోయారు (మత్తయి 27:23; లూకా 23:4; 2 కోరింథీయులకు 5:21; హెబ్రీయులకు 4:15; హెబ్రీయులకు 7:26; 1 పేతురు 1:22-24). తరువాతి వచనంలో వారికి తానంటే ఎందుకు నమ్మకం లేదో చెప్తున్నాడు.

47. దేవుని సంబంధియైనవాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను.

48. అందుకు యూదులు నీవు సమరయు డవును దయ్యముపట్టినవాడవును అని మేము చెప్పుమాట సరియేగదా అని ఆయనతో చెప్పగా

వారు వాదంలో ఓడిపోయి ఆగ్రహంతో అపనిందలు వెయ్యసాగారు. ఇది సాధారణంగా దుర్మార్గుల తీరు. యేసు దయ్యం పట్టినవాడని యూదులు నాలుగు సార్లు అన్నారు (యోహాను 7:20; యోహాను 8:48, యోహాను 8:52; యోహాను 10:20). మత్తయి 12:24 కూడా చూడండి. సమరయ దేశస్థులంటే యూదులు అసహ్యపడ్డారు (యోహాను 4:9) గనుక, వాళ్ళను మతభ్రష్టులుగా ఎంచారు గనుక ఆయన్ను సమరయుడు అన్నారు. ఒక మనిషిని సమరయ దేశస్థుడు అని పిలవడం చాలా కించపరచినట్టు అన్నమాట వారి ఉద్దేశంలో.

49. యేసు నేను దయ్యముపట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచువాడను; మీరు నన్ను అవమానపరచుచున్నారు.

యేసు యూదుడైనప్పటికీ తనను సమరయ దేశస్థుడు అని ఎవరైనా పిలవడం తనకు అవమానంగా భావించలేదు. దాని విషయం ఏమీ అనలేదు. ఏ జాతివారినీ ఆయన చిన్నచూపు చూచేవాడు కాదు.

50. నేను నా మహిమను వెదకుటలేదు; వెదకుచు తీర్పు తీర్చుచు ఉండువా డొకడు కలడు.

తనకు చెందవలసిన గౌరవాన్ని మనుషులు తనకియ్యాలని ఆయనకేమీ తాపత్రయం లేదు. ఆయన ఉద్దేశమంతా తండ్రి అయిన దేవునికి మహిమ కలిగించడమే.

51. ఒకడు నా మాట గైకొనిన యెడల వాడెన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను.

యోహాను 6:49-51 నోట్. మనుషులు “మరణం” అని దేన్నైతే పిలుస్తారో దాన్ని గురించి ఆయన మాట్లాడ్డం లేదు. స్వీకరించే మనసు గల వారెవరి కోసమైన మరో గొప్ప వాగ్దానం ఇవ్వకుండా ఆ చర్చను ముగించడం ఆయనకు ఇష్టం లేదు. ఇది యోహాను 5:24; యోహాను 6:50; యోహాను 11:25-26 లో ఉన్న వాగ్దానాల్లాంటిదే.

52. అందుకు యూదులునీవు దయ్యము పట్టినవాడవని యిప్పుడెరుగు దుము; అబ్రాహామును ప్రవక్తలును చనిపోయిరి; అయినను ఒకడు నా మాట గైకొనినయెడల వాడు ఎన్నడును మరణము రుచిచూడడని నీవు చెప్పుచున్నావు.

ఎప్పటిలాగానే వారాయన్ను సరిగా అర్థం చేసుకోలేదు.

53. మన తండ్రియైన అబ్రాహాము చనిపోయెను గదా; నీవతనికంటె గొప్పవాడవా? ప్రవక్తలును చనిపోయిరి; నిన్ను నీ వెవడవని చెప్పుకొనుచున్నావని ఆయన నడిగిరి.

54. అందుకు యేసు నన్ను నేనే మహిమపరచుకొనినయెడల నా మహిమ వట్టిది; మా దేవుడని మీరెవరినిగూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు.

55. మీరు ఆయనను ఎరుగరు, నేనాయనను ఎరుగుదును; ఆయనను ఎరుగనని నేను చెప్పినయెడల మీవలె నేనును అబద్ధికుడనై యుందును గాని, నేనాయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను.

వ 19; యోహాను 15:21; యోహాను 16:3. వారి సమస్యంతా ఇదే. ఈ జ్ఞానం లోపించడంవల్ల చీకట్లో తడుములాడినట్టు వారు వాదిస్తున్నారు.

56. మీ తండ్రియైన అబ్రా హాము నా దినము చూతునని మిగుల ఆనందించెను; అది చూచి సంతోషించెను అనెను.

వారి గొప్ప పూర్వీకుడు అబ్రాహాముకూ వారికీ ఉన్న తేడాను మరోసారి చూపిస్తున్నాడు యేసు. క్రీస్తు వచ్చే రోజును గురించి అబ్రాహాము సంతోషించాడు. వారైతే క్రీస్తును చంపజూశారు. రాబోయే అభిషిక్తుని కోసం అబ్రాహాము ఆనందంతో ఎదురుచూశాడు. రాబోయే ఆ రోజును దేవుడు ఒక ప్రత్యేకమైన దర్శనం ద్వారా అబ్రాహాముకు చూపించి ఉండవచ్చు. అయితే ఇలాంటి దర్శనం గురించి బైబిలులో రాయలేదు.

57. అందుకు యూదులునీకింకను ఏబది సంవత్సరములైన లేవే, నీవు అబ్రాహామును చూచితివా అని ఆయనతో చెప్పగా,

నిజానికి యేసు వయసు దాదాపు 33 ఏళ్లు మాత్రమే. సరైన నిండువయసు అయినా యేసుకు రాలేదు అని వారి ఉద్దేశం. దీనికి 2000 సంవత్సరాలకు ముందు అబ్రాహాము జీవించాడు.

58. యేసు అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

“మీతో ఖచ్చితంగా చెపుతున్నాను”అంటే యేసు ఇక్కడ మరో గంబీరమైన, ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పబోతున్నాడు. “నేను ఉన్నవాడను”– వ 24; నిర్గమకాండము 3:14-15. ఈ శుభవార్త ఆరంభంలో ఉన్న సత్యాన్నే (యోహాను 1:1) యేసుప్రభువు ప్రకటిస్తున్నాడు – తాను యెహోవా దేవుణ్ణన్నదే ఈ సత్యం. లూకా 2:11; ఫిలిప్పీయులకు 2:6, ఫిలిప్పీయులకు 2:10-11 కూడా చూడండి.

59. కాబట్టి వారు ఆయనమీద రువ్వుటకు రాళ్లు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్లిపోయెను.

యోహాను 5:18 చూడండి. యేసు దేవదూషణ చేస్తున్నాడని, తన గురించి లేనిపోనివి చెప్పుకుంటున్నాడని వారనుకున్నారు. మత్తయి 26:63-66 కూడా చూడండి. నిజానికి ఆయన కేవలం సత్యం పలికాడు. కానీ వారు తమ అంధకారంలో ఉండి దాన్ని నమ్మడానికి నిరాకరించారు. యేసు వారిని విడిచి వెళ్ళిపోయింది భయంచేత కాదు. తన సమయం ఇంకా రాలేదని ఆయనకు తెలుసు కాబట్టి (యోహాను 7:30).Shortcut Links
యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |