Acts - అపొ. కార్యములు 17 | View All

1. వారు అంఫిపొలి, అపొల్లోనియ పట్టణములమీదుగా వెళ్లి థెస్సలొనీకకు వచ్చిరి. అక్కడయూదుల సమాజ మందిరమొకటి యుండెను

1. వాళ్ళు ‘అంఫిపొలి’, ‘అపోల్లోనియ’, పట్టణాల ద్వారా ప్రయాణం చేసి థెస్సలొనీక అనే పట్టణం చేరుకొన్నారు. అక్కడ ఒక యూదుల సమాజ మందిరం ఉంది.

2. గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారియొద్దకు వెళ్లిక్రీస్తు శ్రమపడి మృతులలోనుండి లేచుట ఆవశ్యకమనియు,

2. అలవాటు ప్రకారం పౌలు ఆ సమాజ మందిరానికి వెళ్ళాడు. అక్కడ మూడు శనివారాలు గడిపాడు. వాళ్ళతో యూదుల లేఖనాలు చెప్పి, విషయాలు తర్కించాడు.

3. నేను మీకు ప్రచురముచేయు యేసే క్రీస్తయియున్నాడనియు లేఖనములలోనుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు, వారితో మూడువిశ్రాంతి దినములు తర్కించుచుండెను.

3. క్రీస్తు చనిపోవలసిన అవసరం, బ్రతికి రావలసిన అవసరం ఉందని వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పాడు. ఈ విషయాన్ని లేఖనాలుపయోగించి ఋజువు చేసాడు. “నేను చెబుతున్న ఈ యేసే క్రీస్తు!” అని వాళ్ళకు నచ్చచెప్పాడు.

4. వారిలో కొందరును, భక్తిపరులగు గ్రీసుదేశస్థులలో చాలమందియు, ఘనతగల స్త్రీలలో అనేకులును ఒప్పుకొని పౌలుతోను సీలతోను కలిసికొనిరి.

4. తద్వారా కొందరు సమ్మతించి పౌలు, సీలల పక్షము చేరిపోయారు. దైవ భీతిగల చాలా మంది గ్రీకులు, ముఖ్యమైన స్త్రీలు వీళ్ళ పక్షం చేరిపోయారు.

5. అయితే యూదులు మత్సరపడి, పనిపాటులు లేక తిరుగుకొందరు దుష్టులను వెంటబెట్టు కొని గుంపుకూర్చి పట్టణమెల్ల అల్లరిచేయుచు, యాసోను ఇంటిమీదపడి వారిని జనుల సభయెదుటికి తీసికొని వచ్చుటకు యత్నముచేసిరి.

5. ఇది గమనించి యూదులు అసూయ పడ్డారు. సంతలో ఉన్న పనిలేని వాళ్ళను కొందర్ని నమావేశపరచి పట్టణంలో అల్లర్లు మొదలు పెట్టారు. పౌలు, సీలలను ప్రజల ముందుకు లాగాలనుకొని అంతా కలిసి యాసోను యింటి మీద పడ్డారు.

6. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారులయొద్దకు ఈడ్చుకొనిపోయి భూలోకమును తలక్రిందుచేసిన వీరు ఇక్కడికి కూడ వచ్చి యున్నారు; యాసోను వీరిని చేర్చుకొనియున్నాడు.

6. వాళ్ళు అక్కడ కనిపించక పోయేసరికి యాసోన్ను, మరి కొందరు సోదరుల్ని పట్టణపు అధికారుల ముందుకు తీసుకొని వచ్చి, “ప్రపంచాన్నే కలవరపరచిన ఈ మనుష్యులు ఇప్పుడిక్కడికి వచ్చారు.

7. వీరందరు యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి, కైసరు చట్టములకు విరోధముగా నడుచుకొనువారు అని కేకలువేసిరి.

7. వీళ్ళకు యాసోను తన యింట్లో ఆతిథ్యమిచ్చాడు. వీళ్ళంతా చక్రవర్తి నియమాల్ని అతిక్రమిస్తూ యేసు అనే మరొక రాజున్నాడంటున్నారు” అని కేకలు వేసారు.

8. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరచిరి.

8. ఈ మాటలు విని అక్కడున్న ప్రజలు, అధికారులు రేకెత్తిపోయారు.

9. వారు యాసోనునొద్దను మిగిలినవారియొద్దను జామీను తీసికొని వారిని విడుదల చేసిరి.

9. ఆ తర్వాత యాసోనుతో, మిగతా వాళ్ళందరితో పత్రాన్ని వ్రాయించుకొని వాళ్ళను వదిలి వేసారు.

10. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి.

10. అర్థరాత్రి కాగానే సోదరులు పౌలు, సీలలను బెరయ అనే పట్టణానికి పంపించారు. బెరయకు వచ్చిన వాళ్ళు యూదుల సమాజ మందిరానికి వెళ్ళారు.

11. వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.

11. థెస్సలోనీక వాళ్ళకన్నా బెరయ వాళ్ళు మర్యాద కలవాళ్ళు. వాళ్ళు దైవ సందేశాన్ని శ్రద్ధతో వినేవాళ్ళు. ప్రతీరోజు పవిత్ర గ్రంథాలు చదివి, ఆ సందేశంలోని నిజానిజాలు పరిశీలించే వాళ్ళు.

12. అందుచేత వారిలో అనేకులును, ఘనతగల గ్రీసుదేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలమందియు విశ్వసించిరి.

12. చాలా మంది యూదులు విశ్వాసులయ్యారు. వాళ్ళలాగే ముఖ్యమైన గ్రీకు స్త్రీలు, పురుషులు కూడా విశ్వాసులయ్యారు.

13. అయితే బెరయలోకూడ పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని థెస్సలొనీకలో ఉండు యూదులు తెలిసికొని అక్కడికిని వచ్చి జనసమూహములను రేపి కలవరపరచిరి.

13. పౌలు దైవ సందేశాన్ని బెరయలో కూడా ఉపదేశిస్తున్నాడని థెస్సలోనీకలోని యూదులకు తెలిసింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రజలను పురికొలిపి, వాళ్ళలో అల్లర్లు రేకెత్తించారు.

14. వెంటనే సహోదరులు పౌలును సముద్రమువరకు వెళ్లుమని పంపిరి; అయితే సీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి.

14. వెంటనే సోదరులు పౌలును సముద్ర తీరానికి పంపారు. సీల, తిమోతి బెరయలోనే ఉండిపోయారు.

15. పౌలును సాగనంప వెళ్లినవారు అతనిని ఏథెన్సు పట్టణము వరకు తోడుకొని వచ్చి, సీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతనియొద్దకు రావలెనని ఆజ్ఞపొంది బయలుదేరి పోయిరి.

15. పౌలుతో వెళ్ళిన వాళ్ళు అతనితో కలిసి ఏథెన్సుదాకా వెళ్ళారు. సీలను, తిమోతిని అయినంత త్వరలో రమ్మనమని పౌలు వాళ్ళ ద్వారా కబురు పంపాడు. ఈ వార్తతో వాళ్ళు తిరిగి బెరయకు వెళ్ళిపోయారు.

16. పౌలు ఏథెన్సులో వారికొరకు కనిపెట్టుకొని యుండగా, ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను.

16. పౌలు ఏథెన్సులో వాళ్ళకోసం ఎదురు చూస్తూ కొద్ది రోజులు ఆగిపొయ్యాడు. ఆ పట్టణం విగ్రహాలతో నిండి ఉండటం గమనించి అతని ఆత్మ క్షోభించింది.

17. కాబట్టి సమాజమందిరములలో యూదులతోను, భక్తిపరులైన వారితోను ప్రతిదినమున సంతవీధిలో తన్ను కలిసికొను వారితోను తర్కించుచు వచ్చెను.

17. అందువల్ల నమాజ మందిరంలో సమావేశమయ్యే యూదులతో, దైవ భీతిగల యూదులు కాని ప్రజలతో, సంతకు వచ్చి పోయే ప్రజలతో ప్రతి రోజు మాట్లాడే వాడు.

18. ఎపికూరీయులలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరుబోతు చెప్పునది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసునుగూర్చియు పునురుత్థానమును గూర్చియు ప్రకటించెను గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి.

18. ఎపికూరీయులు అని అనబడే కొందరు తత్వజ్ఞులు, స్తోయికులు అనబడే కొందరు తత్వజ్ఞులు అతనితో తర్కించారు. “ఆ వదరుబోతు ఏమంటున్నాడు?” అని కొందరు అన్నారు. “ఇతర దేవుళ్ళను గురించి ప్రబోధిస్తున్నట్లుంది” అని మరి కొందరు అన్నారు. పౌలు యేసును గురించి, ఆయన బ్రతికి రావటాన్ని గురించి ప్రకటించటం వల్ల అతణ్ణి వాళ్ళిలా విమర్శించారు.

19. అంతట వారు అతని వెంటబెట్టుకొని అరేయొపగు అను సభ యొద్దకు తీసికొనిపోయినీవు చేయుచున్న యీ నూతన బోధ యెట్టిదో మేము తెలిసికొనవచ్చునా?

19. వాళ్ళు అతనిని పట్టుకొని అరేయొపగు సభకు పిలుచుకు వచ్చారు. “నీవు చెబుతున్న ఈ క్రొత్త బోధన ఏమిటో మేము తెలుసుకోవచ్చా?” అని కొందరు అడిగారు.

20. కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలిసికొన గోరుచున్నామని చెప్పిరి.

20. “మీరు చిత్రమైన విషయాలు మా చెవుల్లో వేసారు. వాటి అర్థం మాకు చెప్పండి” అని మరి కొందరడిగారు.

21. ఏథెన్సువారందరును అక్కడ నివసించు పరదేశులును ఏదోయొక క్రొత్త సంగతి చెప్పుట యందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపు చుండువారు.

21. ఏథెన్సు ప్రజలు, ఆ పట్టణంలో నివసించే పరదేశీయులు, తమ కాలాన్నంతా కొన్ని సిద్ధాంతాలను చెప్పటంలోనో లేక వినటంలోనో గడిపే వాళ్ళు. మరే పని చేసే వాళ్ళు కాదు.

22. పౌలు అరేయొపగు మధ్య నిలిచిచెప్పిన దేమనగా ఏథెన్సువారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తిగలవారై యున్నట్టు నాకు కనబడు చున్నది.

22. పౌలు అరేయొపగు సభలో నిల్చొని, “ఏథెన్సు ప్రజలారా! మీరు అన్ని విషయాల్లో చాలా నిష్టగా ఉన్నారు. ఇది నేను గమనించాను.

23. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీదతెలియబడని దేవునికి అని వ్రాయబడియున్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తికలిగియున్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను.

23. నేను మీ పట్టణమంతా పర్యటించాను. మీరు పూజించే వాటిని చూసాను. అంతేకాదు సాంబ్రాణి వేసే ఒక బలిపీఠం మీద, ‘తెలియని దేవునికి’ అని వ్రాయబడి ఉండటం చూసాను. అందువల్ల మీకు తెలియకున్నా మీరు పూజించే ఆ దేవుణ్ణి గురించి ప్రకటించబోతున్నాను.

24. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు.
1 రాజులు 8:27, 2 దినవృత్తాంతములు 6:18, కీర్తనల గ్రంథము 146:6, యెషయా 42:5

24. ఈ ప్రపంచాన్ని, దానిలో ఉన్న ప్రతి వస్తువును సృష్టించిన దేవుడు; ఆకాశానికి, భూమికి ప్రభువైనటువంటి దేవుడు, మానవులు కట్టిన మందిరాల్లో నివసించడు.

25. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువ యున్నట్టు మనుష్యుల చేతులతో సేవింప బడువాడు కాడు.
కీర్తనల గ్రంథము 50:12, యెషయా 42:5

25. మానవులు దేవుని కోసం చేయగలిగిందేదీ లేదు. జీవి పీల్చుకొనే గాలిని, కావలసిన ప్రతీ వస్తువును యిచ్చిన దేవునికి మానవుని సేవలు కావాలా?

26. మరియు యావద్భూమిమీద కాపుర ముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందు రేమో యని,
ద్వితీయోపదేశకాండము 32:8

26. ఆయన ఒక్క మనుష్యునితో మానవులందర్ని సృష్టించి వాళ్ళు ఈ ప్రపంచమంతా నివసించేటట్లు చేసాడు. వాళ్ళ కోసం ఒక కాలాన్ని నియమించాడు. ఏ దేశపు ప్రజలు ఎక్కడ నివసించాలో ఆ స్థలాన్ని, కాలాన్ని సరిగ్గా నియమించాడు.

27. తన్ను వెదకునిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.
యెషయా 55:6, యిర్మియా 23:23

27. మానవులు తనను వెతకాలనీ, గ్రుడ్డివాడు తడిమినట్టు తడిమి తనను కనుగొనే అవకాశం వాళ్ళకు కలిగించాలనీ యిలా చేసాడు. కాని నిజానికి ఆయన ఎవ్వరికీ దూరంగా లేడు:

28. మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించు చున్నాము, ఉనికి కలిగియున్నాము. అటువలెమన మాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు.

28. ‘మనం ఆయనలో జీవిస్తున్నాం ఆయనలో కదులుతున్నాం. ఆయన కారణంగా మనం ఉన్నాం’ మీలోని కొందరు కవులు చెప్పినట్లు: ‘మనం ఆయన సంతానం.’

29. కాబట్టి మనము దేవుని సంతానమైయుండి, మనుష్యుల చమత్కార కల్పనలవలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి యున్నదని తలంపకూడదు.
ఆదికాండము 1:27, యెషయా 40:18-20, యెషయా 44:10-17

29. మనం దేవుని సంతానం కదా! అలాంటప్పుడు, దేవుడు బంగారంతో కాని లేక వెండితో కాని, లేక రాతితో కాని చేయబడిన విగ్రహంలాంటి వాడని మనం ఎట్లా అనగలం? ఆయన మానవుడు తన కల్పనతో, కళతో సృష్టించిన విగ్రహంలాంటివాడుకాడు.

30. ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.

30. గతంలో మానవుని అజ్ఞానం పట్ల ఆయన చూసీ చూడనట్లు ప్రవర్తించాడు. కాని యిప్పుడు ప్రతి ఒక్కణ్ణీ మారు మనస్సు పొందుమని ఆజ్ఞాపిస్తున్నాడు.

31. ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించి యున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.
కీర్తనల గ్రంథము 9:8, కీర్తనల గ్రంథము 72:2-4, కీర్తనల గ్రంథము 96:13, కీర్తనల గ్రంథము 98:9, యెషయా 2:4

31. ప్రపంచంలో ఉన్న ప్రతీ వ్యక్తిపై న్యాయమైన తీర్పు చెప్పనున్న రోజును నిర్ణయించాడు. ఎవని ద్వారా తీర్పు చెప్పనున్నాడో ఆయన్ని నియమించాడు. ఆయన్ని బ్రతికించితాను చేయనున్న దాన్ని ప్రజలందరికీ ఋజువు చేసాడు.”

32. మృతుల పునరుత్థానమునుగూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యముచేసిరి; మరికొందరుదీనిగూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి.

32. చనిపోయిన వారు యేసువలె బ్రతికి వస్తారన్న విషయం విని కొందరు అతణ్ణి హేళన చేసారు. మరి కొందరు, “ఈ విషయాన్ని గురించి మాకింకా వినాలని ఉంది” అని అన్నారు.

33. ఆలాగుండగా పౌలు వారి మధ్యనుండి వెళ్లిపోయెను.

33. పరిస్థితులు యిలా అవటం వల్ల పౌలు ఆ సభనుండి వెళ్ళిపొయ్యాడు.

34. అయితే కొందరు మనుష్యులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయొపగీతుడైన దియొనూసియు, దమరి అను ఒక స్త్రీయు, వీరితోకూడ మరికొందరునుండిరి.

34. కొందరు విశ్వాసులై పౌలును అనుసరించారు. వాళ్ళలో అరేయొపగు అను సభకు సభ్యత్వం ఉన్న దియొనూసియు అనేవాడు, దమరి అనే స్త్రీ మొదలగు వాళ్ళున్నారు.Shortcut Links
అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |