పౌలు క్రీస్తును అనుసరించడం ఆరంభించినప్పటి నుంచి యూదులు అతణ్ణి చంపజూస్తూ ఉన్నారు (అపో. కార్యములు 9:23-25; అపో. కార్యములు 14:19; అపో. కార్యములు 17:5). వారతణ్ణి ఎన్నడూ చంపలేకపోయారు. తన సేవకులను తన దగ్గర చేర్చుకోవలసిన రోజువరకు వారినెలా కాపాడాలో దేవునికి తెలుసు. ఈ లోకంలో వారు చేయవలసిన పని ఇంకా ఉంటే ఏ శత్రువూ వారిలో ఎవరి ప్రాణం తీయడం అసాధ్యం. పౌలు భద్రతకోసం దేవుడు అతని మేనల్లుణ్ణి ఉపయోగించాడు (వ 16. అతని గురించి గానీ పౌలు సోదరి గురించి గానీ క్రొత్త ఒడంబడిక గ్రంథంలో ఈ ఒక ప్రస్తావన మాత్రమే ఉంది). అతణ్ణి గాక దేవుడు శతాధిపతిని (వ 17), పై అధికారిని (వ 18), 200 సైనికులనూ 70 రౌతులనూ 200 ఈటెలవారినీ (వ 23), యూదయ ప్రదేశానికి అధిపతిగా ఉన్న ఫేలిక్స్నూ (వ 34,35) ఉపయోగించాడు. ఒకవేళ అవసరమైతే దేవుడు దేవదూతల సైన్యాన్ని పరలోకంనుంచి పంపి ఉంటాడు. దేవుడు తన సేవకులను కాపాడాలనుకుంటే కాపాడతాడు, పరలోకంలో చేర్చుకొందామనుకుంటే చేర్చుకొంటాడు (అపో. కార్యములు 12:1-3).