Acts - అపొ. కార్యములు 24 | View All

1. అయిదు దినములైన తరువాత ప్రధానయాజకుడైన అననీయయు, కొందరు పెద్దలును, తెర్తుల్లు అను ఒక న్యాయ వాదియు కైసరయకు వచ్చి, పౌలుమీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి.

1. అయిదు రోజుల తర్వాత ప్రధాన యాజకుడైన అననీయ, కొంతమంది పెద్దలతో, తెర్తుల్లు అనబడే న్యాయవాదితో కలిసి కైసరియ చేరుకున్నాడు. పౌలు పట్ల తాము చేయదలచిన నేరారోపణల్ని రాష్ట్రాధిపతి ముందు ఉంచాడు.

2. పౌలు రప్పింపబడినప్పుడు తెర్తుల్లు అతనిమీద నేరము మోప నారంభించి యిట్లనెను

2. తెర్తుల్లు తన వాదనను ప్రారంభిస్తూ, “మీ పాలనలో చాలాకాలం శాంతంగా జీవించాము. ఇది మా అదృష్టం. మీ ముందు చూపువల్ల ఈ దేశంలో ఎన్నో సంస్కరణలు జరిగాయి.

3. మహా ఘనత వహించిన ఫేలిక్సా, మేము తమవలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు, ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటవుచున్నవనియు ఒప్పుకొని, మేము సకల విధములను సకల స్థలములలోను పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము.

3. “మహా ఘనత పొందిన ఫేలిక్సు ప్రభూ! మీరు చేసిన వాటిని అన్ని ప్రాంతాల్లో ఉన్న మా ప్రజలు, ఎంతో కృతజ్ఞతతో, సంపూర్ణంగా అంగీకరిస్తున్నారు.

4. నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగజేయకుండ మేము క్లుప్తముగా చెప్పుకొనుదానిని తమరు ఎప్పటివలె శాంతముగా వినవలెనని వేడుకొను చున్నాను.

4. మిమ్మల్ని ఎక్కువగా విసిగించటం మాకు ఇష్టం లేదు. కనుక క్లుప్తంగా చెపుతాము. మేము చెప్పేది మాపై దయవుంచి వినుమని విజ్ఞప్తి చేస్తున్నాము.

5. ఈ మనుష్యుడు పీడవంటివాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపు వాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడునై యున్నట్టు మేము కనుగొంటిమి,

5. ఇతడు సమస్యలు, కష్టాలు కలిగిస్తాడని మాకు తెలిసింది. ప్రపంచంలో ఉన్న యూదులందరిలో ఇతడు అల్లర్లు లేపాడు. ఇతడు కుట్రలు పన్నే నజరేతు జాతికి నాయకుడు.

6. మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడెను గనుక మేము అతని పట్టుకొంటిమి.

6. ఇతడు దేవాలయాన్ని అపవిత్రం చెయ్యటానికి ప్రయత్నించాడు.

7. తమరు విమర్శించిన యెడల

7. [This verse may not be a part of this translation]

8. మేము ఇతనిమీద మోపుచున్న నేరములన్నియు తమకే తెలియవచ్చునని చెప్పెను.

8. మీరితణ్ణి విచారిస్తే మేము చేసిన ఆరోపణల యొక్క నిజానిజాలు మీకే తెలుస్తాయి” అని అన్నాడు.

9. యూదులందుకు సమ్మతించి యీ మాటలు నిజమే అని చెప్పిరి.

9. న్యాయస్థానంలో యూదులందరూ ఈ ఆరోపణలు నిజమని చెబుతూ, తెర్తుల్లు వాదనను బలపరిచారు.

10. అప్పుడు అధిపతి మాటలాడుమని పౌలునకు సైగచేయగా అతడిట్లనెను తమరు బహు సంవత్సరములనుండి యీ జనమునకు న్యాయాధిపతులై యున్నారని యెరిగి నేను ధైర్యముతో సమాధానము చెప్పుకొనుచున్నాను.

10. రాష్ట్రాధిపతి పౌలును మాట్లాడుమని సంజ్ఞ చేసాడు. పౌలు ఈ విధంగా మాట్లాడటం మొదలు పెట్టాడు: “మీరు ఈ దేశంలో ఎన్నో సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నారు. అందువల్ల నేను ఆనందంగా నా నిర్దోషత్వం నిరూపిస్తాను.

11. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్లిననాట నుండి పండ్రెండు దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలిసికొన వచ్చును.

11. నేను ఆరాధించటానికి యెరూషలేము వెళ్ళి యింకా పన్నెండు రోజులు కాలేదు. నేను చెబుతున్న దానిలోని నిజానిజాలు మీరు సులభంగా విచారించవచ్చు.

12. దేవాలయములో నేమి, సమాజమందిరములలో నేమి, పట్టణములోనేమి, నేను ఎవనితోను తర్కించుటయైనను, జనులను గుమికూర్చుటయైనను వారు చూడలేదు.

12. నాపై నేరారోపణ చేసిన వీళ్ళు నేను మందిరంలో వాదిస్తుండగా చూసారా? లేదు. సమాజమందిరంలో కాని పట్టణంలో మరెక్కడైనా కాని, నేను ప్రజల్ని పురికొల్పటం వీళ్ళు చూసారా? లేదు.

13. మరియు వారు ఇప్పుడు నామీద మోపు నేరములను తమరికి ఋజువుపరచలేరు.

13. వీళ్ళు ప్రస్తుతం నాపై మోపుతున్న నేరాల్ని నిరూపించలేరు.

14. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములయందును వ్రాయబడియున్నవన్నియు నమ్మి,

14. వాళ్ళు, దేన్ని వేరొక జాతిగా పరిగణిస్తారో దాన్ని నేను అనుసరిస్తున్నానని ఒప్పుకుంటాను. ఈ మార్గాన్ననుసరించి నేను మా పూర్వీకుల దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. పైగా, ధర్మశాస్త్రంలో వ్రాయబడినవాటిని, మన ప్రవక్తలు వ్రాసిన వాటిని, నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను.

15. నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగ బోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేనుకూడ దేవునియందు నిరీక్షణయుంచి, వారు మతభేదమని పేరుపెట్టు ఈ మార్గముచొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరియెదుట ఒప్పుకొనుచున్నాను.
దానియేలు 12:2

15. వాళ్ళలాగే నాకూ దేవుడంటే నమ్మకం ఉంది. వాళ్ళలాగే, సన్మార్గుడు, దుర్మార్గుడు బ్రతికి వస్తారని నేను ఎదురు చూస్తున్నాను.

16. ఈ విధమున నేనును దేవునియెడలను మనుష్యులయెడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసికొనుచున్నాను.

16. అందువలన నా ఆత్మను దేవుని దృష్టిలో, మానవుని దృష్టిలో మలినం కాకుండా ఉంచుకోవటానికి ఎప్పుడూ మనసారా ప్రయత్నిస్తున్నాను.

17. కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా స్వజనులకు దానద్రవ్యమును కానుకలును అప్పగించుటకు వచ్చితిని.

17. “పేద వాళ్ళకు డబ్బు దానం చెయ్యాలని, దేవునికి కానుకలివ్వాలని ఎన్నో ఏండ్ల తర్వాత నేను యెరూషలేముకు వచ్చాను.

18. నేను శుద్ధి చేసికొనినవాడనై యీలాగు అప్పగించుచుండగా వారు దేవాలయములో నన్ను చూచిరి. నేను గుంపుకూర్చి యుండలేదు, నావలన అల్లరి కాలేదు. ఆసియనుండి వచ్చిన కొందరు యూదులు ఉండిరి;

18. నేనీ కార్యాలు మందిరావరణంలో చేస్తుండగా వాళ్ళు చూసారు. నేను శాస్త్రయుక్తంగా శుభ్రమయ్యాను. నా వెంట ప్రజా సమూహం లేదు. నేను ఏ అల్లర్లు మొదలు పెట్టలేదు.

19. నామీద వారికేమైన ఉన్నయెడల వారే తమరి సన్నిధికివచ్చి నామీద నేరము మోపవలసియుండెను.

19. కానీ అక్కడికి ఆసియనుండి వచ్చిన కొందరు యూదులకు నేను నేరం చేసానని అనిపిస్తే, యిక్కడికి వచ్చి నేరారోపణ చేయవలసి ఉంది.

20. లేదా, నేను మహాసభయెదుట నిలిచియున్నప్పుడు, మృతుల పునరుత్థానమునుగూర్చి నేడు వారియెదుట విమర్శింపబడు చున్నానని

20. నేను మహాసభ ముందు నిలుచున్నప్పుడు నాలో ఏ అపరాధం కనిపెట్టారో ఇక్కడ నిలుచున్న వాళ్ళను చెప్పమనండి.

21. వారి మధ్య నిలువబడి నేను బిగ్గరగా చెప్పిన యీ యొక్క మాట విషయమై తప్ప నాయందు మరి ఏ నేరమైనను వీరు కనుగొనియుంటే వీరైన చెప్పవచ్చుననెను.

21. ఔను! నేను ఒకటి చేసాను. వాళ్ళ సమక్షంలో నిలుచొని బిగ్గరగా ‘చనిపోయిన వాళ్ళు బ్రతికి వస్తారని నమ్మినందుకు మీ ముందు ఈ రోజు నేరస్థునిగా నిలుచున్నాను’ అని అన్నాను. ఇది తప్ప నేనేమీ చెయ్యలేదు.”

22. ఫేలిక్సు ఈ మార్గమునుగూర్చి బాగుగా ఎరిగినవాడై సహస్రాధిపతియైన లూసియ వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలిసికొందునని చెప్పి విమర్శ నిలుపు చేసెను.

22. యేసు ప్రభువు మార్గం బాగా తెలిసిన ఫేలిక్సు సభను ముగిస్తూ, “సహస్రాధిపతి లూసియ వచ్చాక నీ విషయం నిర్ణయిస్తాను” అని అన్నాడు.

23. మరియు అతని విడిగా కావలిలో ఉంచి, అతనికి పరిచారము చేయుటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించెను.

23. శతాధిపతితో, “పౌలును కాపలాలో ఉంచు! కాని కొంత స్వేచ్ఛనివ్వు. అతని స్నేహితులు అతనికి ఏదైనా ఇవ్వటానికి వస్తే వాళ్ళనాపవద్దు” అని అన్నాడు.

24. కొన్ని దినములైన తరువాత ఫేలిక్సు యూదురాలైన ద్రుసిల్ల అను తన భార్యతోకూడ వచ్చి పౌలును పిలిపించి, క్రీస్తుయేసునందలి విశ్వాసమునుగూర్చి అతడు బోధింపగా వినెను.

24. కొద్ది రోజుల తర్వాత ఫేలిక్సు తన భార్య ద్రుసిల్లతో వచ్చాడు. ద్రసిల్ల యూదురాలు. ఫేలిక్సు పౌలును పిలిపించాడు. ‘యేసు క్రీస్తులో విశ్వాసం’ అనే విషయాన్ని గురించి, పౌలు మాట్లాడాడు. ఫేలిక్సు విన్నాడు.

25. అప్పుడతడు నీతిని గూర్చియు ఆశానిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శనుగూర్చియు ప్రసంగించు చుండగా ఫేలిక్సు మిగుల భయపడిఇప్పటికి వెళ్లుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పెను.

25. పౌలు సన్మార్గాన్ని గురించి, మనో నిగ్రహాన్ని గురించి, రానున్న తీర్పును గురించి చెప్పటం విని ఫేలిక్సు భయపడి, “ఇప్పటికి చాలించి, వెళ్ళు! నాకు వీలున్నప్పుడు నిన్ను మళ్ళీ పిలిపిస్తాను” అని అన్నాడు.

26. తరువాత పౌలువలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి, మాటిమాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను.

26. కాని తనకు లంచమిస్తాడని ఆశించి అతణ్ణి మాటిమాటికి పిలిపించి అతనితో మాట్లాడే వాడు.

27. రెండు సంవత్సరములైన తరువాత ఫేలిక్సుకు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫేలిక్సు యూదులచేత మంచి వాడనిపించుకొనవలెనని కోరి, పౌలును బంధకములలోనే విడిచిపెట్టి పోయెను.

27. రెండు సంవత్సరాలు గడిచాక పోర్కియు ఫేస్తు ఫేలిక్సు స్థానంలో వచ్చాడు. ఫేలిక్సు యూదులకు ఒక ఉపకారం చెయ్యాలనే ఉద్దేశంతో పౌలును కారాగారంలోనే ఉంచాడు.Shortcut Links
అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |