Acts - అపొ. కార్యములు 26 | View All

1. అగ్రిప్ప పౌలును చూచి నీ పక్షమున చెప్పు కొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చేయి చాచి యీలాగు సమాధానము చెప్పసాగెను

1. అప్పుడు అగ్రిప్ప రాజు పౌలుతో, “నీవు చెప్పుకోదలచింది ఇక చెప్పకోవచ్చు!” అని అన్నాడు. పౌలు తన చేతులెత్తి, తాను నిర్దోషినని నిరూపించుకోవటానికి ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు:

2. అగ్రిప్పరాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనుక

2. “అగ్రిప్ప రాజా! ఈ రోజు మీ ముందు నిలుచొని యూదులు నాపై ఆరోపించిన నేరాలు అసత్యమని ఋజువు చేసుకోవటానికి అవకాశం కలగటం నా అదృష్టం.

3. యూదులు నామీద మోపిన నేరములన్నిటినిగూర్చి నేడు తమరియెదుట సమాధానము చెప్పుకొనబోవుచున్నందుకు నేను ధన్యుడనని యనుకొను చున్నాను; తాల్మితో నా మనవి వినవలెనని వేడుకొను చున్నాను.

3. మీకు యూదులతో, వాళ్ళ ఆచారాలతో, వాళ్ళు తర్కించే విషయాలతో బాగా పరిచయముంది. కనుక యిది నిజంగా నా అదృష్టం. నేను చెప్పేది మీరు శాంతంగా వినాలని మనవి చేసుకొంటున్నాను.

4. మొదటినుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యమునుండి నేను బ్రదికిన బ్రదుకు ఏలాటిదో యూదులందరు ఎరుగుదురు.

4. “నేను చిన్ననాటినుండి ఏ విధంగా జీవించానో యూదులందరికీ తెలుసు. నా దేశంలో గడచిన నా బాల్యం మొదలుకొని యెరూషలేములో జరిగిన సంఘటనల దాకా జరిగినదంతా వాళ్ళకు తెలుసు.

5. వారు మొదటినుండి నన్ను ఎరిగినవారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికిష్టమైతే నేను మన మతములోని బహునిష్ఠగల తెగను అనుసరించి, పరిసయ్యుడనుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు.

5. వాళ్ళు నన్ను ఎన్నో సంవత్సరాలనుండి ఎరుగుదురు. నేను, మన మతంలోని నిష్టగల పరిసయ్యుల తెగను అనుసరిస్తూ జీవించానని వాళ్ళకు తెలుసు. కావాలనుకొంటే వాళ్ళే యిది నిజమని సాక్ష్యం చెబుతారు.

6. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణనుగూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచియున్నాను.

6. దేవుడు మన పూర్వీకులకు చేసిన వాగ్దానంలో నాకు నమ్మకం ఉంది. అందువల్లే నేను ఈ రోజు ఈ పరీక్షకు నిలబడవలసి వచ్చింది.

7. మన పండ్రెండు గోత్రములవారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించు చున్నారు. ఓ రాజా, యీ నిరీక్షణ విషయమే యూదులు నామీద నేరము మోపి యున్నారు.

7. ఈ వాగ్దానం పూర్తి కావాలని మన పండ్రెండు గోత్రాల వాళ్ళు రాత్రింబగళ్ళు విశ్వాసంతో దేవుణ్ణి సేవిస్తూ ఎదురు చూస్తున్నారు. ఓ రాజా! ఈ ఆశ నాలో ఉండటం వల్లే యూదులు నన్ను నేరస్థునిగా పరిగణిస్తున్నారు.

8. దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మతగనిదని మీరేల యెంచు చున్నారు?

8. దేవుడు చనిపోయిన వాళ్ళను బ్రతికిస్తాడు. ఈ సత్యాన్ని మీరు ఎందుకు కాదంటున్నారు?

9. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేననుకొంటిని;

9. “ఒకప్పుడు నేను కూడా నజరేతు నివాసి యేసు నామము లేకుండా చెయ్యటం నా కర్తవ్యంగా భావించాను.

10. యెరూషలేములో నేనాలాగు చేసితిని. నేను ప్రధాన యాజకులవలన అధికారము పొంది, పరిశుద్ధులను అనేకులను చెరసాలలలో వేసి, వారిని చంపినప్పుడు సమ్మతించితిని;

10. నేను యెరూషలేములో చేసింది అదే. ప్రధాన యాజకులు యిచ్చిన అధికారంతో నేను చాలామంది పరిశుద్ధుల్ని కారాగారంలో వేసాను. వాళ్ళను చంపటానికి నేను అంగీకారం కూడా తెలిపాను.

11. అనేకపర్యాయములు సమాజమందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయునట్లు బలవంతపెట్ట చూచితిని. మరియు వారిమీద మిక్కిలి క్రోధము గలవాడనై యితర పట్టణములకును వెళ్లి వారిని హింసించు చుంటిని.

11. ఎన్నోసార్లు నేను ఒక సమాజ మందిరమునుండి మరొక నమాజ మందిరానికి వెళ్ళి వాళ్ళను శిక్షించాను. వాళ?్ళతో బలవంతంగా యేసును దూషింపచేసాను. పిచ్చి కోపంతో యితర పట్టణాలకు కూడా వెళ్ళి ఆ మార్గాన్ని అనుసరించే వాళ్ళను హింసించాను.

12. అందు నిమిత్తము నేను ప్రధానయాజకులచేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా

12. “ఒక రోజు నేను, ప్రధాన యాజకుల అధికారంతో, అనుమతితో డెమాస్కసుకు వెళ్తున్నాను.

13. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టును నాతోకూడ వచ్చినవారి చుట్టును ఆకాశమునుండి సూర్య తేజస్సుకంటె మిక్కిలి ప్రకాశమానమైన యొక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని.

13. సుమారు మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు, ఓ రాజా! నేను దారిలో ఉండగా ఆకాశం నుండి ఒక గొప్ప వెలుగు రావటం చూసాను. ఆ వెలుగు సూర్యునికన్నా యింకా ఎక్కువ వెలుగుతో వచ్చి నా మీద నాతో ఉన్న వాళ్ళ మీద ప్రకాశించింది.

14. మేమందరమును నేలపడినప్పుడు సౌలా సౌలా, నన్నెందుకు హింసించు చున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీభాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని.

14. మేమంతా నేలపై పడిపొయ్యాము. ఒక స్వరం హెబ్రీ భాషలో నాతో ఈ విధంగా అనటం విన్నాను: ‘సౌలా! సౌలా! నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఇలా చేయటంవల్ల నీకే నష్టం కలుగుతుంది.’

15. అప్పుడు నేను ప్రభువా, నీవు ఎవడవని అడుగగా ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును.

15. నేను, ‘మీరెవరు ప్రభూ! అని అడిగాను. ‘నేను నీవు హింసిస్తున్న యేసును’ అని ప్రభువు జవాబు చెప్పాడు.

16. నీవు నన్ను చూచి యున్న సంగతినిగూర్చియు నేను నీకు కనబడబోవు సంగతినిగూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడియున్నాను.నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము;
యెహెఙ్కేలు 2:1

16. ‘ఇక లేచి నిలబడు, నిన్ను నా సేవకునిగా నియమించుకోవాలని అనుకున్నాను. నన్ను చూసిన ఈ సంఘటనను గురించి, నేను చూపబోయే వాటిని గురించి యితర్లకు చెప్పటానికి నిన్ను నియమించాలని నీకు ప్రత్యక్షమయ్యాను.

17. నేను ఈ ప్రజలవలనను అన్యజనులవలనను హాని కలుగకుండ నిన్ను కాపాడెదను;
1 దినవృత్తాంతములు 16:35, యిర్మియా 1:7-8

17. నిన్ను నీ వాళ్ళనుండి, యూదులుకాని వాళ్ళనుండి రక్షిస్తాను.

18. వారు చీకటిలోనుండి వెలుగులోనికిని సాతాను అధికారమునుండి దేవుని వైపుకును తిరిగి, నా యందలి విశ్వాసముచేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచ బడినవారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారియొద్దకు పంపెదనని చెప్పెను.
ద్వితీయోపదేశకాండము 33:3-4, యెషయా 35:5-6, యెషయా 42:7, యెషయా 42:16, యెషయా 61:1

18. వాళ?్ళ కళు?్ళ తెరిపించి వాళ?్ళను చీకటినుండి వెలుగులోకి పిలుచుకు రావటానికి నిన్ను పంపుతున్నాను. వాళ్ళను సైతాను ఆధీనం నుండి కాపాడి, దేవుని వైపు మళ్ళించటానికి నిన్ను పంపుతున్నాను. వాళ్ళు నన్ను విశ్వసించి తమ పాపాలకు క్షమాపణ పొందాలని, దేవుడు ఎన్నుకొన్న వాళ్ళతో కలిసి తమ స్థానం పొందాలని యిలా చేస్తున్నాను”

19. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశమునుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక

19. “అందువల్ల అగ్రిప్ప రాజా! ఆకాశం నుండి వచ్చిన దివ్య దర్శనము నేను అతిక్రమించలేను.

20. మొదట దమస్కులోనివారికిని, యెరూషలేములోను యూదయ దేశమంతటను, తరువాత అన్యజనులకును, వారు మారు మనస్సు పొంది దేవునితట్టు తిరిగి మారుమనస్సునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని.

20. మారు మనస్సు పొంది దేవుని వైపు మళ్ళుమని, తమ నిజమైన పశ్చాత్తాపం మారు మనస్సు అన్న విషయం పనుల ద్వారా ఋజువు చేయుమని ఉపదేశించాను. ఈ ఉపదేశం డెమాస్కసు ప్రజలతో మొదలు పెట్టి యెరూషలేములోని ప్రజలకు, యూదయలోని యితర ప్రజలకు, యూదులు కాని వాళ్ళకు చెప్పాను.

21. ఈ హేతువుచేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నముచేసిరి;

21. ఆ కారణంగా యూదులు నన్ను మందిరంలో పట్టుకొని చంపాలని ప్రయత్నించారు.

22. అయినను నేను దేవుని వలననైన సహాయము పొంది నేటివరకు నిలిచియుంటిని; క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందువారిలో మొదటివాడగుటచేత, ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని

22. కాని దేవుని దయ ఈనాటికీ నా మీద ఉంది. కనుక చిన్నా, పెద్దా, అనే భేధం లేకుండా అందరికీ దీన్ని గురించి చెబుతున్నాను. మోషే, మరియు ప్రవక్తలు జరుగనున్న వాటిని గురించి ముందే ఈ విధంగా చెప్పారు:

23. ప్రవక్తలును మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమియు చెప్పక, అల్పు లకును ఘనులకును సాక్ష్యమిచ్చుచుంటిని.
యెషయా 42:6, యెషయా 49:6

23. ‘క్రీస్తు మరణించవలసి వస్తుంది. కాని బ్రతికి వచ్చిన వాళ్ళలో ఆయన మొదటివాడౌతాడు. తన ప్రజలకు, యూదులుకాని వాళ్ళకు వెలుగునివ్వటానికి వచ్చాడని చెపుతున్నాను.’ నేను వీళ్ళు చెప్పినవి తప్ప వేరే విషయాలు చెప్పటం లేదు.”

24. అతడు ఈలాగు సమాధానము చెప్పుకొనుచుండగా ఫేస్తు- పౌలా, నీవు వెఱ్ఱివాడవు, అతి విద్యవలన నీకు వెఱ్ఱిపట్టినదని గొప్ప శబ్దముతో చెప్పెను.

24. పౌలు, తన రక్షణార్థం ఈ విధంగా మాట్లాడుతుండగా, ఫేస్తు, పౌలుతో వాదన ఆపమంటూ, “నీకు మతిపోయింది పౌలూ! నీ పాండిత్యం నిన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది” అని బిగ్గరగా అన్నాడు.

25. అందుకు పౌలు ఇట్లనెను మహా ఘనత వహించిన ఫేస్తూ, నేను వెఱ్ఱివాడను కానుగాని సత్యమును స్వస్థబుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను.

25. పౌలు, “మహా ఘనత పొందిన ఓ ఫేస్తూ! నేను పిచ్చివాణ్ణి కాదు. సక్రమంగానే మాట్లాడాను. సత్యం చెప్పాను.

26. రాజు ఈ సంగతులెరుగును గనుక అతని యెదుట నేను ధైర్యముగా మాటలాడు చున్నాను; వాటిలో ఒకటియు అతనికి మరుగైయుండ లేదని రూఢిగా నమ్ముచున్నాను; ఇది యొక మూలను జరిగిన కార్యము కాదు.

26. రాజుగారికి యివన్నీ తెలుసు. నేను రాజుగారితో స్వేచ్ఛగా మాట్లాడగలను. ఇవి అతని దృష్టి నుండి తప్పించుకోలేవన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే యివి రహస్యంగా సంభవించలేదు.

27. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేనెరుగుదును.

27. అగ్రిప్ప రాజా! మీరు ప్రవక్తలు వ్రాసిన వాటిని నమ్ముచున్నారా? అవును, నమ్ముచున్నారని నాకు తెలుసు” అని పౌలు అన్నాడు.

28. అందుకు అగ్రిప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ జూచుచున్నావే అని పౌలుతో చెప్పెను.

28. అగ్రిప్ప, “అంత సులభంగా నన్ను క్రైస్తవునిగా చెయ్యాలనుకుంటున్నావా?” అని అన్నాడు.

29. అందుకు పౌలు సులభముగానో దుర్లభముగానో, తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరును ఈ బంధకములు తప్ప నావలె ఉండునట్లు దేవుడనుగ్రహించుగాక అనెను.

29. పౌలు, “సులభమో, కష్టమో! మీరే కాదు, ఈ రోజు నా మాటలు వింటున్న ప్రతి ఒక్కడూ ఈ సంకెళ్ళు తప్ప మిగిలిన వాటిలో నావలె కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను” అని అన్నాడు.

30. అంతట రాజును అధిపతియు బెర్నీకేయు వారితో కూడ కూర్చుండినవారును లేచి అవతలకు పోయి

30. రాజు లేవగానే రాష్ట్రాధిపతి, బెర్నీకే, మరియు వాళ్ళతో కూర్చున్న వాళ్ళు లేచి నిలుచున్నారు.

31. ఈ మనుష్యుడు మరణమునకైనను బంధకములకైనను తగిన దేమియు చేయలేదని తమలోతాము మాటలాడుకొనిరి.

31. వాళ్ళా గది వదిలివెళ్తూ తమలో తాము, “ఇతడు మరణ దండన పొందటానికి కాని, కారాగారంలో ఉండ వలసిన నేరం కాని ఏదీ చేయలేదు” అని అనుకున్నారు.

32. అందుకు అగ్రిప్ప ఈ మనుష్యుడు కైసరు ఎదుట చెప్పుకొందునని అననియెడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పెను.

32. అగ్రిప్ప ఫేస్తుతో, “ఇతడు చక్రవర్తికి విన్నపం చేయకుండా ఉండినట్లైతే విడుదల చేసి ఉండేవాణ్ణి!” అని అన్నాడు.Shortcut Links
అపో. కార్యములు - Acts : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |