Romans - రోమీయులకు 12 | View All

1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.

పౌలు తన లేఖలోని సిద్ధాంత భాగాన్ని పూర్తి చేశాడు. అందరూ పాపులేననీ దేవుని కోపానికి తప్ప మరి దేనికీ తగినవారు కాదనీ చూపించాడు. దేవుని కరుణలోని గొప్పతనం కొంతవరకు వివరించాడు. ఇక్కడినుంచి ఈ లేఖ చివరివరకు విశ్వాసుల పట్ల దేవుడు కరుణ చూపినందుచేత వారు ఆచరణలో అనుదినం కనపరచవలసిన జీవిత విధానం గురించి రాస్తున్నాడు. 1–11 అధ్యాయాల్లో వెల్లడైన అద్భుత సత్యాలను చదివి, ఏమీ మారకుండా వాటికి లోబడకుండా ఉండేవారికి వాటివల్ల లాభమేముంది? మనందరం చేయవలసిన మొదటి పని ఏమిటంటే మనల్ని మనం దేవునికి సంపూర్ణంగా ఇచ్చివేసుకోవాలి. పాత ఒడంబడిక దినాల్లో ఇస్రాయేల్‌లోని యాజులు జంతు బలులు అర్పించేవారు. ఇప్పుడు ఈ క్రొత్త ఒడంబడిక శకంలో విశ్వాసులందరూ యాజులు (ప్రకటన గ్రంథం 1:6; 1 పేతురు 2:5, 1 పేతురు 2:9; హెబ్రీయులకు 13:15-16). బలి అర్పించవలసినది జంతువుల్ని కాదు గాని తమ సొంత శరీరాల్ని. అవి సజీవమైన యజ్ఞంగా మహిమార్థంగా ఉంటాయి (రోమీయులకు 6:13, రోమీయులకు 6:19; 1 కోరింథీయులకు 6:13, 1 కోరింథీయులకు 6:19-20). దేవుడు కోరే ఆరాధన ఇదే, కేవలం నోటి మాటలు కాదు. ఇలాంటి అర్పణ దేవునికి పవిత్రం, అంగీకారం.

2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.

క్రొత్త ఒడంబడిక గ్రంథంలో లోకం గురించి అనేక సంగతులు రాసి ఉన్నాయి. లోకం దేవుణ్ణి ఎరగదు (యోహాను 1:10) ఆత్మ సంబంధమైన అంధకారమంటే దానికి ఇష్టం (యోహాను 3:19) క్రీస్తునూ, ఆయన్ను అనుసరించేవారినీ అది ద్వేషిస్తుంది (యోహాను 7:7; యోహాను 15:19) దాని పరిపాలకుడు, దైవం సైతాను (యోహాను 12:31; 2 కోరింథీయులకు 4:4) అది దేవుని ఆత్మను పొందడం అసాధ్యం (యోహాను 14:17) దాని జ్ఞానం తెలివి తక్కువతనంగా ఉంది (1 కోరింథీయులకు 1:20; 1 కోరింథీయులకు 3:19) అది క్షణికమైనది (1 కోరింథీయులకు 7:31; 2 కోరింథీయులకు 4:18) అది దేవుడు లేకుండా, ఆశాభావానికి సరైన కారణం లేకుండా ఉంది (ఎఫెసీయులకు 2:12) దానితో స్నేహమంటే దేవునితో వైరం (యాకోబు 4:4) అది చెడిపోయినది (2 పేతురు 1:4) అది గర్వంతో, చెడు కోరికలతో నిండి ఉంది (1 యోహాను 2:15-17) అది పూర్తిగా దుర్మార్గతలో మునిగి ఉంది (1 యోహాను 5:19) లోకంతో రాజీపడి దాని తీరుకు లొంగవద్దని పౌలు చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు. అందులోని ప్రజలను మలచి, చెడు మార్గాల్లో ప్రవర్తించేలా చేసే బలమైన శక్తులు లోకంలో ఉన్నాయి. విశ్వాసులు క్రీస్తు పోలికలోకి మార్పు చెందాలి. ఇలా మార్పు చెందడం అన్నది వారి అంతరంగాల్లో దేవుని ఆత్మ నెరవేర్చే కార్యం. విశ్వాసులు వేరుగా ఈ లోకం తీరుకు దూరంగా ఉండడమే కాదు, వారి అంతరంగ జీవితం కూడా పూర్తిగా వేరుగా ఉండాలి. వారి మనసు కొత్తది కావడం మూలంగా ఇది జరుగుతుంది (ఎఫెసీయులకు 4:22-23). తలంపులు చాలా ప్రాముఖ్యమైనవి. విశ్వాసుల ప్రవర్తనను చాలా వరకు అవే నిర్ణయిస్తాయి. మార్పు చెందిన జీవితానికి ఏకైక మార్గం మన తలంపులను అదుపులో ఉంచుకొంటూ దేవుని సత్యంతో మన మనస్సులను నింపుకొంటూ ఉండడమే (రోమీయులకు 8:5-6; 2 కోరింథీయులకు 10:5; కొలొస్సయులకు 3:16; కీర్తనల గ్రంథము 1:1-3; ఫిలిప్పీయులకు 2:5; ఫిలిప్పీయులకు 4:8; హెబ్రీయులకు 8:10). మనం దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించాలి (మత్తయి 22:37). మనకు అవసరమైన కొత్తదనం ఇదే. దేవునికి తమను తాము ఇచ్చివేసుకోనివారు, అంతరంగంలోని మార్పుకు దేవుని ఆత్మతో సహకరించనివారు తమ విషయంలో దేవుని సంకల్పమేమిటో తెలుసుకోలేరు. మనం తెలుసుకుని ఆ లోపరహితమైన సంకల్పాన్ని అనుసరించ దలచుకుంటే ఇక్కడ మనకు చెప్పినట్టు చేయాలి.

3. తన్నుతాను ఎంచుకొనతగినదానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణప్రకారము, తాను స్వస్థబుద్ధిగలవాడగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెనని, నాకు అను గ్రహింపబడిన కృపనుబట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను.

2 కోరింథీయులకు 10:12; గలతియులకు 6:3. విశ్వాసులు మార్పు చెంది గడపవలసిన జీవితాల గురించి పౌలు ఇక్కడ మాట్లాడ సాగుతున్నాడు. వారి మనసులతో, ముఖ్యంగా వారి గురించి వారిలో ఉండే తలంపులతో అతడు ఆరంభిస్తున్న విషయం గమనించండి. దేవుడు కొందరికి ఇతరులకన్న ఎక్కువ నమ్మకం ఇవ్వవచ్చన్న సంగతిని కూడా గమనించండి (1 కోరింథీయులకు 12:9).

4. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను, ఈ అవయవములన్నిటికిని ఒక్కటే పని యేలాగు ఉండదో,

దేవుని ఆత్మద్వారా విశ్వాసులంతా ఒకే ఆధ్యాత్మిక శరీరంగా ఐక్యమయ్యారు. యోహాను 17:21-23; 1 కోరింథీయులకు 12:12-13; ఎఫెసీయులకు 4:15-16; ఎఫెసీయులకు 5:23 చూడండి. ఈ ఆధ్యాత్మిక శరీరంలో ప్రతి విశ్వాసీ ఇతరులందరికీ చెందినవాడు (వ 5). దేవుడు ప్రతి ఒక్కరికీ కనీసం ఒక సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఆ శరీరంలో ప్రతి ఒక్కరూ ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలని ఇలా ఇచ్చాడు. ప్రతి వ్యక్తీ తన సమర్థత ఏమిటో గుర్తించి దాన్ని దేవుని ఘనతకోసం, ఇతరుల మేలుకోసం ఉపయోగించాలి. 1 కోరింథీయులకు 12:7-11, 1 కోరింథీయులకు 12:27-31; ఎఫెసీయులకు 4:11-13 కూడా చూడండి.

5. ఆలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై యున్నాము.

6. మన కనుగ్రహింపబడిన కృపచొప్పున వెవ్వేరు కృపావరములు కలిగినవారమై యున్నాము గనుక,

“దేవుని మూలంగా పలకడం”– సంఖ్యాకాండము 11:25; 1 కోరింథీయులకు 12:10, 1 కోరింథీయులకు 12:28 నోట్స్.

7. ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణముచొప్పున ప్రవచింతము;పరిచర్యయైతే పరిచర్యలోను,

8. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పనికలిగియుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను, పైవిచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించు వాడు సంతోషముతోను పని జరిగింపవలెను.

9. మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను. చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి.
ఆమోసు 5:15

విశ్వాసులు మార్పు చెంది గడపవలసిన జీవితం ఏమిటో ఇక్కడ చక్కగా కనిపిస్తున్నది. ఇతర విశ్వాసులపట్ల (వ 9,10,13,15,16), క్రీస్తు పట్ల (వ 11,12), శత్రువుల పట్ల (వ 14,19-21). ప్రేమ చూపించడమే ఆ జీవితం. “కల్లా కపటాలు”– ఇతరులను ప్రేమించినట్టు నటిస్తే ఏదో లాభం కలగవచ్చుననుకొనే అవకాశం ఉంది. మన ప్రేమ అలా ఉండకూడదు. “అసహ్యించుకోండి”– దేవుణ్ణి ప్రేమించవలసిన రీతిలో ఆయన్ను ప్రేమిస్తే ఆయనకు వ్యతిరేకమైన వాటన్నిటినీ అసహ్యించుకోవడం నేర్చుకుంటాం – కీర్తనల గ్రంథము 97:10. క్రీస్తు ప్రేమించిన రీతిగా మనం మనుషులను ప్రేమించాలి గానీ వారిలోని దుర్మార్గతను అసహ్యించుకోవాలి.

10. సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.

11. ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రతగలవారై ప్రభువును సేవించుడి.

1 కోరింథీయులకు 15:58; తీతుకు 2:14. దేవుణ్ణి ప్రేమించవలసిన విధంగా ప్రేమిస్తే ఆయన సేవలో మనకు ఆసక్తి ఉంటుంది. నిజానికి ఆయనపట్ల మన ప్రేమ మన మాటల్లో గాక ఆయనకోసం మనం చేసేదానిలోనే వెల్లడి అవుతుంది.

12. నిరీక్షణగలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి.

13. పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి.

ప్రేమ మన ప్రవర్తనలో వెల్లడి కావాలి. కొన్ని సార్లు దానిమూలంగా మనం నష్టం కూడా భరించాలి – 1 యోహాను 3:16-18; మత్తయి 25:34-40. “సహాయపడుతూ”– “ఇవ్వడం” గురించి నోటు రిఫరెన్సులు 2 కోరింథీయులకు 9:15 చూడండి.

14. మిమ్మును హింసించువారిని దీవించుడి; దీవించుడి గాని శపింపవద్దు.

15. సంతోషించు వారితో సంతోషించుడి;
కీర్తనల గ్రంథము 35:13

1 కోరింథీయులకు 12:25-27; గలతియులకు 6:2. విశ్వాసులు కఠినంగా, సానుభూతి లేకుండా, స్వార్థంగా ఉండకూడదు. ఇతరుల ఆనందంలో, దుఃఖంలో పాలుపంచుకోవాలి.

16. ఏడ్చువారితో ఏడువుడి; ఒకనితో నొకడు మనస్సుకలిసి యుండుడి. హెచ్చు వాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులై యుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు.
సామెతలు 3:7, యెషయా 5:21

అపో. కార్యములు 4:32; ఎఫెసీయులకు 4:2-3. గర్వం, దురహంకారం, తనను ఇతరులకంటే హెచ్చించుకోవడం విశ్వాసుల మధ్య ఉండే మైత్రిని, ఐక్యతను చెరుపుతాయి. ఉన్నత స్థితిలో ఉన్నా తక్కువ స్థితిలో ఉన్నా క్రీస్తులో అందరూ ఒకటే, అలానే ప్రవర్తించాలి – అపో. కార్యములు 6:1; 1 కోరింథీయులకు 12:13; గలతియులకు 3:28. కులాన్ని బట్టీ, సమాజంలో, లేక క్రైస్తవ సంఘంలోని స్థితి స్థానాలను బట్టీ అహంకారాలు, విభేదాలు, పక్షపాతం దేవునికి అసహ్యం.

17. కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యు లందరి దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగి యుండుడి.
సామెతలు 3:4

వ 21; మత్తయి 5:38-41. విశ్వాసులు ఈ లోకంలో క్రీస్తుకు ప్రతినిధులు. వారి మంచి ప్రవర్తన ఆయనకు కీర్తిని తెస్తుంది. చెడు ప్రవర్తన ఆయన్ను అపకీర్తిపాలు చేస్తుంది. రోమీయులకు 2:24; 1 పేతురు 2:9 పోల్చి చూడండి.

18. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.

19. ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది.
లేవీయకాండము 19:18, ద్వితీయోపదేశకాండము 32:35

ద్వితీయోపదేశకాండము 32:35. పగతీర్చుకోవాలన్న కోరిక వ్యక్తుల, కుటుంబాల, జాతుల మధ్య గొప్ప అల్లకల్లోలాలకు మూలాల్లో ఒకటి. క్రీస్తు ప్రజల హృదయాల్లో దీనికి తావుండకూడదు. మత్తయి 5:44; 2 థెస్సలొనీకయులకు 1:6-9; కీర్తనల గ్రంథము 94:1; సంఖ్యాకాండము 31:1-3; నహూము 1:2, నహూము 1:7 నోట్స్.

20. కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు.
సామెతలు 25:21-22

సామెతలు 25:21-22; లూకా 6:27-28; 1 పేతురు 2:21-23. మనల్ని గాయపరిచే వారిని గాయపరచడమంటే దుర్మార్గతను దుర్మార్గతతోనే జయించేందుకు ప్రయత్నించడం. అంటే అది దేవుని స్పష్టమైన ఆదేశాలను మనం మీరి చెడుగా ప్రవర్తించేలా చేయడానికి ఇతరుల చెడు ప్రవర్తన చేయనివ్వడమన్నమాట.

21. కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము.



Shortcut Links
రోమీయులకు - Romans : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |