క్రీస్తులో విశ్వాసులు దేవుని రాజ్యంలోకి వచ్చారు. రారాజు యేసు క్రీస్తు పట్ల వారికి మొదటగా స్వామిభక్తి ఉండాలి. అయితే వారింకా లోకంలోనే ఉన్నారు. ఏదో ఒక మానవ రాజ్యంలోనే ఉన్నారు. ప్రభుత్వాధికారుల పట్ల ఎలా ప్రవర్తించాలో ఈ వచనాలు తెలియజేస్తున్నాయి.
పాలకులంతా, ప్రభుత్వాధికారులంతా మంచివారేనని, దేవునికి విధేయులేననీ దీని ఉద్దేశం కాదు (పౌలు ఈ మాటలు రాసిన సమయంలో రోమ్వారి చక్రవర్తులందరిలోకీ అధముడు నీరో చక్రవర్తి పరిపాలిస్తున్నాడు). కానీ వాటిలో తప్పులు, పాపాలు, అన్యాయాలు ఎన్ని ఉన్నా ప్రభుత్వాలను నియమించినది దేవుడే (కీర్తనల గ్రంథము 75:2-7; దానియేలు 4:34-35). కొన్నిసార్లు ప్రజల పాపాలకు శిక్షగా దుర్మార్గులైన పాలకులు అధికారంలోకి వచ్చేందుకు దేవుడు అనుమతిస్తాడు. అసలు ప్రభుత్వమే లేకపోవడం కంటే కనీసం చెడ్డ ప్రభుత్వమన్నా ఉండడం మంచిది. అరాచకం, ప్రభుత్వం దానికి ఎవరూ లోబడకపోయేటంత బలహీనమైపోవడం అనేది ఏ దేశానికైనా, ఏ రాజ్యానికైనా రాగల ఘోర స్థితి, ఎందుకంటే అప్పుడు దుర్మార్గతను అదుపులో ఉంచడానికి ఏదీ ఉండదు. దేవుడు ప్రభుత్వాన్ని నియమించాడు కాబట్టి దానికి లోబడి నడుచుకోవడం క్రైస్తవుల బాధ్యత (వ 2,5,7). ఒక విషయంలో మాత్రమే ఈ నియమం చెల్లదు – ఒక దేశంలోని చట్టాలు, లేక అధికారుల ఆజ్ఞలు దేవుని వాక్కుకు వ్యతిరేకంగా ఉంటే మాత్రం విశ్వాసులు ఆ మనుషుల మాటలు లెక్క చెయ్యకుండా దేవునికే లోబడాలి. అపో. కార్యములు 4:18-20; అపో. కార్యములు 5:28-29.