Romans - రోమీయులకు 15 | View All

1. కాగా బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచుకొనక, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై యున్నాము.

రోమీయులకు 14:1, రోమీయులకు 14:19-21; 1 కోరింథీయులకు 12:25; గలతియులకు 6:1-2. లూకా 9:23 పోల్చి చూడండి. క్రీస్తు మనల్ని పిలిచినది మనం మనల్ని అన్ని విధాలా సంతోషపెట్టడం, సంతృప్తి చేసుకోవడం కోసం కాదు. “నేను” అనేదాన్ని చంపివేయాలి మనం.

2. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను.

3. క్రీస్తుకూడ తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించువారి నిందలు నామీద పడెను. అని వ్రాయబడియున్నట్లు ఆయనకు సంభవించెను.
కీర్తనల గ్రంథము 69:9

కీర్తనల గ్రంథము 69:9; యోహాను 8:29. క్రీస్తు ఈ భూమిపై తండ్రియైన దేవునికి ప్రతినిధిగా ఉండడం చేత ఆయన తిరస్కారం, హేళన, నింద భరించవలసివచ్చింది. ఆయన తననే సంతోషపెట్టుకోదలిస్తే దానంతటినుంచి తప్పించుకోగలిగి ఉండేవాడు. అయితే జీవితంలో ఆయన ఏకైక లక్ష్యం, ఏమి జరిగినప్పటికీ, దేవునికి సంతోషం కలిగించడమే. ఆయనే మన ఆదర్శం.

4. ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి.

లేఖనాలలో (పాత ఒడంబడిక గ్రంథంలో) తమ సంతోషం చూచుకోవడం గాక దేవునికోసం, ఇతరులకోసం జీవించినవారు చాలామంది ఉన్నారు. వారినుంచి మనం నేర్చుకోవాలి. పాత ఒడంబడిక గ్రంథంలోని అన్నీ మన ఉపదేశం కోసమేనని గమనించండి. అందులో ఏ భాగాన్ని మనం చదవకుండా వదిలేసినా, ఏదో ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని ఎరగకుండా ఉండిపోతున్నామన్నమాట. అలాంటప్పుడు మనకు ప్రోత్సాహం కలిగించేవి, విశ్వాసులుగా మనం ఈ లోకంలో ఎదుర్కోవలసినవాటిని భరించేందుకు సహాయం చేసేవి అనేక విషయాలను మనం పోగొట్టుకొంటాం. 2 తిమోతికి 3:16-17 కూడా చూడండి.

5. మీరేకభావము గలవారై యేకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమ పరచు నిమిత్తము,

“ఏకభావం”– రోమీయులకు 12:5, రోమీయులకు 12:16; రోమీయులకు 14:19; యోహాను 17:21-23; ఎఫెసీయులకు 4:3. “మహిమ కలిగించాలి”– ప్రతి విశ్వాసీ చేసే ప్రతి పనిలోనూ ఉండవలసిన ఏకైక లక్ష్యం ఇదే.

6. క్రీస్తుయేసు చిత్తప్రకారము ఒకనితో నొకడు మనస్సు కలిసినవారై యుండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక.

7. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చు కొనుడి.

8. నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయెను.
మీకా 7:20

“సేవకుడు”– మత్తయి 15:24; మత్తయి 20:28; లూకా 22:27; యోహాను 13:4-5; ఫిలిప్పీయులకు 2:7; యెషయా 42:1. “సున్నతి గలవారికి” అంటే యూదులకు. వారికి సేవకుడుగా క్రీస్తు పాత ఒడంబడికలో దేవుడు వారికి చేసిన వాగ్దానాలను రద్దు చెయ్యలేదు. వాటిని సుస్థిరం చేశాడు. రోమీయులకు 9:4-5; రోమీయులకు 11:26-27 చూడండి. వాగ్దానాలను సుస్థిరం చేయడమంటే అవి తప్పక నెరవేరేలా ఏర్పాటు చేయడం. ఆయన మరణం, పునర్జీవితాల మూలంగా దేవుని వాగ్దానాలన్నీ నెరవేరడానికి క్రీస్తు పునాది వేశాడు.

9. అందు విషయమై ఈ హేతువుచేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును; నీ నామసంకీర్తనము చేయుదును అని వ్రాయబడియున్నది.
2 సమూయేలు 22:50, కీర్తనల గ్రంథము 18:49

అయితే ఇతర జనాలు కూడా క్రీస్తు మనసులో ముందునుంచీ ఉన్నారు. పాత ఒడంబడిక వాక్కులు కొన్నిటిని ఎత్తి చెప్పడం ద్వారా పౌలు దీన్ని చూపిస్తున్నాడు. ఈ మొదటి వాక్కు కీర్తనల గ్రంథము 18:49. క్రీస్తు ఇతర జనాలమధ్య దేవుణ్ణి స్తుతించడం అక్కడ కనిపిస్తున్నది.

10. మరియు అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు
ద్వితీయోపదేశకాండము 32:43

ద్వితీయోపదేశకాండము 32:43. ఇతర జనాలు యూదులతో (“ఆయన ప్రజలు”) కలిసి సంతోష సహవాసం చేస్తారు.

11. మరియు సమస్త అన్యజనులారా, ప్రభువును స్తుతించుడి సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు గాక అనియు చెప్పియున్నది.
కీర్తనల గ్రంథము 117:1

12. మరియయెషయా యీలాగు చెప్పుచున్నాడు యెష్షయిలోనుండి వేరు చిగురు, అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును; ఆయన యందు అన్యజనులు నిరీక్షణ యుంచుదురు.
యెషయా 11:10

13. కాగా మీరు పరిశుద్ధాత్మశక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక.

“ఆశాభావానికి కర్త అయిన దేవుడు”అంటే తన ప్రజల్లో ఆశాభావాన్ని కలిగించి, దాన్ని నెరవేర్చే దేవుడు అని అర్థం. ఈ ఆశాభావం అంతిమ విముక్తి గురించినది (రోమీయులకు 5:2-5; రోమీయులకు 8:23-25). విశ్వాసుల హృదయాల్లో పవిత్రాత్మ దీన్ని కలిగిస్తాడు. శాంతి, ఆనందం కూడా దేవుని ఆత్మ మూలంగా కలిగేవే (గలతియులకు 5:22). అవి దేవుని రాజ్యంలో సహజంగా ఉండేవి (రోమీయులకు 14:17). క్రీస్తుకు విధేయులైన శిష్యులకు ఆయన ఈ రెంటినీ వాగ్దానం చేశాడు (యోహాను 14:27; యోహాను 15:11). విశ్వాసులు వీటితో నిండి ఉండాలని దేవుని కోరిక. అప్పుడే వారు ఇతరుల పట్ల ప్రవర్తించవలసిన రీతిలో ప్రవర్తిస్తారు. దేవుణ్ణి స్తుతించవలసిన రీతిలో స్తుతిస్తూ ఆయన ఘనతకోసం జీవిస్తారు. విశ్వాసులు తమ శాంతి సంతోషాలను దోచుకుని తమ ఆశాభావాన్ని మసకపరిచే దేన్నైనా సరే తిరస్కరించడం నేర్చుకోవాలి.

14. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును, సమస్త జ్ఞానసంపూర్ణులును, ఒకరికి ఒకరు బుద్ధిచెప్ప సమర్థులునై యున్నారని నామట్టుకు నేనును మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను.

దేవుని ఆత్మ ఇచ్చే మరో ఫలం మంచితనం (గలతియులకు 5:22). ఒకరికొకరు నేర్పించుకొనే సామర్థ్యం విశ్వాసులందరికీ ఉండాలి (హెబ్రీయులకు 5:11-14; 1 థెస్సలొనీకయులకు 5:14).

15. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మవలన పరిశుద్ధపరచబడి ప్రీతికర మగునట్లు, నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు, దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపనుబట్టి, అన్యజనులనిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని.

రోమీయులకు 1:8. 2 పేతురు 1:12; 2 పేతురు 3:1; యూదా 1:5; 2 తిమోతికి 2:14 పోల్చి చూడండి. ఆధ్యాత్మిక సత్యాలు చేజారిపోవడం, వాటిని మరచిపోవడం చాలా తేలిక. మనందరికీ అస్తమానం వాటి గురించి గుర్తు చేస్తుండడం అవసరం.

16. ఇది హేతువు చేసికొని మీకు జ్ఞాపకము చేయవలెనని యుండి యెక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయుచున్నాను.

అపో. కార్యములు 22:21; గలతియులకు 2:7; ఎఫెసీయులకు 3:8. పౌలుకున్న గొప్ప పని శుభవార్త ప్రకటన (రోమీయులకు 1:1). ఇది అతని “యాజి” సేవ. సామాన్య విశ్వాసులు కాదు తానే యాజిని అని పౌలు అనడం లేదు (విశ్వాసులంతా యాజులే – 1 పేతురు 2:5, 1 పేతురు 2:9; ప్రకటన గ్రంథం 1:6; ప్రకటన గ్రంథం 5:10; ప్రకటన గ్రంథం 20:6; హెబ్రీయులకు 10:19-22). పౌలు (యాజులు చేసినట్టు) ఎలాంటి బలి, అర్పణ ఇతర ప్రజలకోసం అర్పించలేదు. ఇతర ప్రజలే ఆ అర్పణ. శుభవార్తను నమ్మినవారు దేవునికి అంగీకారమైన అర్పణ అయ్యారు. ఎందుకంటే వారిని పవిత్రాత్మ పవిత్రం చేశారు (రోమీయులకు 12:1 పోల్చి చూడండి). అంటే వారిని దేవుని ప్రజల్లో ఉన్నవారుగా చేసేందుకు ఆయన వారిని ప్రత్యేకించుకున్నాడని అర్థం. పవిత్రం చేయడం గురించి నోట్ యోహాను 17:17-19.

17. కాగా, క్రీస్తుయేసునుబట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయకారణము కలదు.

పౌలు తన గురించి తాను అతిశయించలేదు, డంబాలు పలకలేదు. అతని సేవ క్రీస్తులో, అతని అతిశయం క్రీస్తులో. తన శక్తిసామర్థ్యాల వల్ల తన పరిచర్య జరిగిందని అతడు అనుకోలేదు. తన గురించి చెప్పుకున్నప్పుడు పౌలు వేరే భాష మాట్లాడాడు – రోమీయులకు 7:18; ఎఫెసీయులకు 3:8; 1 తిమోతికి 1:15.

18. ఏలాగనగా అన్యజనులు విధేయులగునట్లు, వాక్యముచేతను, క్రియచేతను, గురుతుల బలముచేతను, మహత్కార్యముల బలముచేతను, పరిశుద్ధాత్మ బలముచేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనినిగూర్చియు మాటలాడ తెగింపను.

19. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతమువరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించియున్నాను.

అపో. కార్యములు 14:8-9; అపో. కార్యములు 16:18, అపో. కార్యములు 16:25-26; అపో. కార్యములు 19:11-12; 2 కోరింథీయులకు 12:11-12. జెరుసలంనుంచి ఇల్లూరికం (మాసిదోనియాకు వాయువ్య దిక్కున ఉన్న ప్రాంతం) వరకు అంటే సిరియా, టర్కీ పశ్చిమ, మధ్య భాగాలు, గ్రీసు, మాసిదోనియా ప్రాంతాలు ఉన్న చాలా విశాలమైన ప్రాంతం.

20. నేనైతే మరియొకని పునాదిమీద కట్టకుండు నిమిత్తము ఆయననుగూర్చిన సమాచారమెవరికి తెలియజేయబడ లేదో వారు చూతురనియు, విననివారు గ్రహింతు రనియు,

పౌలుకు అతని పరిచర్యలో మార్గదర్శకంగా ఉన్న సూత్రం ఇది. ఈ వాక్యభాగం యెషయా 52:15 లోనిది. సాధారణంగా పౌలు ప్రయాణాల్లో ఉండేవాడు. క్రీస్తు శుభవార్త విననివారికి వినిపించాలనీ, తన తరంలో మనుషులందరికీ శుభవార్త వినే అవకాశం కలిగించాలనీ అతని ఆశయం. ఇందులో అతడు మనందరికీ ఆదర్శం. మత్తయి 28:18-20; మార్కు 16:15; లూకా 24:46-47; అపో. కార్యములు 1:8.

21. వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆశగలవాడనై యుండి ఆలాగున ప్రకటించితిని.
యెషయా 52:15

22. ఈ హేతువుచేతను మీయొద్దకు రాకుండ నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను.

రోమీయులకు 1:10-13 చూడండి. ఆ విశాలమైన ప్రాంతమంతటిలో పరిచర్య పూర్తి చేసుకున్న తరువాతే కొత్త ప్రాంతాలకు వెళ్ళాలని అతని ఉద్దేశం.

23. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరింపవలసిన భాగము లేదు గనుక, అనేక సంవత్సరములనుండి మీయొద్దకు రావలెనని మిక్కిలి అపేక్షకలిగి,

24. నేను స్పెయిను దేశమునకు వెళ్లునప్పుడు మార్గములో మిమ్మును చూచి,మొదట మీ సహవాసమువలన కొంత మట్టుకు సంతృప్తిపొంది, మీచేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను.

ఇటలీకి పశ్చిమాన సముద్రం అవతల ఉన్న దేశం స్పెయిన్. ఇక్కడ, వ 28లో మాత్రమే ఈ దేశం పేరు బైబిల్లో కనిపిస్తుంది. పౌలుకు ఇప్పటికి దాదాపు 60 ఏళ్ళ వయసు ఉండవచ్చు. అయితే పరిచర్యకోసం కొత్త అవకాశాల గురించి, కొత్త ప్రాంతాల గురించి తలపోసుకుంటున్నాడు. పౌలు ఈ వచనంలో రోమ్‌వారిని ఆర్థిక సహాయం కోసం అడగడం లేదు. డబ్బు కోసం అడగడం అతని విధానం కానే కాదు. ప్రయాణం చేసేవారిని సాగనంపేందుకు అతనితోబాటు ఇద్దరు ముగ్గురు సోదరులను కొంత దూరంవరకు పంపే అలవాటు గురించి రాసిన మాటలివి (అపో. కార్యములు 15:3; అపో. కార్యములు 20:38; అపో. కార్యములు 21:5; 1 కోరింథీయులకు 16:6, 1 కోరింథీయులకు 16:11; 2 కోరింథీయులకు 1:16).

25. అయితే ఇప్పుడు పరిశుద్ధులకొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్లుచున్నాను.

2 కోరింథీయులకు 8:1-5. ఈ సూత్రం ఇప్పటికీ అనుసరించవలసినదే. ఆధ్యాత్మిక ప్రయోజనాలు పొందినవారు అలాంటి ప్రయోజనాలు తమకు చేకూరడానికి సాధనాలైన వారికి ఇహలోక సంబంధంగా సహాయం చేయడం ధర్మం. 1 కోరింథీయులకు 9:7-14 చూడండి.

26. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియ వారును అకయవారును కొంత సొమ్ము చందా వేయ నిష్టపడిరి.

27. అవును వారిష్టపడి దానిని చేసిరి; వారు వీరికి ఋణస్థులు; ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలి వారై యున్నారు గనుక శరీరసంబంధమైన విషయములలో వీరికి సహాయముచేయ బద్ధులై యున్నారు.

28. ఈ పనిని ముగించి యీ ఫలమును వారికప్పగించి, నేను, మీ పట్టణముమీదుగా స్పెయినునకు ప్రయాణము చేతును.

బైబిలు గానీ చరిత్ర గానీ పౌలు స్పెయిన్ దేశానికి వెళ్ళాడనేందుకు ఏ ఆధారాలూ చూపడం లేదు.

29. నేను మీయొద్దకు వచ్చునప్పుడు, క్రీస్తుయొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని యెరుగుదును.

పౌలు రోమ్ నగరానికి వెళ్ళాడు. రోమ్ ప్రభుత్వానికి ఖైదీగా వెళ్ళాడు (అపో. కార్యములు 28:16). కానీ అతని నమ్మకం మాత్రం నెరవేరింది. అతనికి క్రీస్తు దీవెనల సంపూర్ణత అంటే సుఖం, సౌఖ్యం, అన్నీ సమృద్ధిగా ఉండడం, జేబునిండా డబ్బు ఉండడం కాదు గాని హృదయంలో శాంతి, ఆనందం, దేవుని సేవ చేసేందుకూ శుభవార్త ప్రకటించేందుకూ దేవుని బలప్రభావాలు ఉండడమే. దేవునికి చెందిన ఆ పవిత్ర వ్యక్తికి బయటి పరిస్థితులతో నిమిత్తం లేదు. ఫిలిప్పీయులకు 4:11-13; 2 కోరింథీయులకు 12:9-10 చూడండి. మనందరికీ అతడు ఆదర్శం.

30. సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలోనుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసియున్న యీ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును,

తనకోసం విశ్వాసులు చేసే ప్రార్థనల విలువ పౌలుకు బాగా తెలుసు – 2 కోరింథీయులకు 1:11; ఎఫెసీయులకు 6:19-20; ఫిలిప్పీయులకు 1:19; 1 థెస్సలొనీకయులకు 5:25; 2 థెస్సలొనీకయులకు 3:1; ఫిలేమోను 22 చూడండి. “ప్రయాసపడాలి”– 1 కోరింథీయులకు 9:25-26; ఎఫెసీయులకు 6:12; కొలొస్సయులకు 1:29. క్రీస్తుకు సేవ చేయదలచుకుని పవిత్ర జీవితం గడపాలని ప్రయత్నించే వారందరికీ ఈ ప్రయాస ఏమిటో కొంత తెలుసు. “ఆత్మ ప్రేమ” అంటే బహుశా పవిత్రాత్మకు విశ్వాసులపట్ల ఉన్న ప్రేమ. పవిత్రాత్మకు వ్యక్తిత్వం ఉందని అది సూచిస్తుంది (యోహాను 14:16-17 నోట్‌).

31. నేను దేవుని చిత్తమువలన సంతోషముతో మీయొద్దకు వచ్చి, మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును,

అపో. కార్యములు 21:27 నుంచి చివరివరకు పౌలు యూదయలోని అవిశ్వాసుల చేతిలోనుంచి విడుదల అయి ఆనందంతో రోమ్‌కు చేరిన వైనం రాసి ఉంది. రోమ్‌లోని విశ్వాసుల ప్రార్థనలకు ఇందులో పాత్ర లేదని అనుకోగలమా? యాకోబు 5:16 పోల్చి చూడండి.

32. మీరు నాకొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెనని, మన ప్రభువైన యేసు క్రీస్తును బట్టియు, ఆత్మవలని ప్రేమను బట్టియు మిమ్మును బతిమాలు కొనుచున్నాను.

33. సమాధానకర్తయగు దేవుడు మీకందరికి తోడై యుండును గాక. ఆమేన్‌.

“శాంతి ప్రదాత”– రోమీయులకు 16:20; ఫిలిప్పీయులకు 4:9; 1 థెస్సలొనీకయులకు 5:23; హెబ్రీయులకు 13:20. రోమీయులకు 15:13 పోల్చి చూడండి. శాంతికి కర్త, శాంతిని దయ చేసేవాడు దేవుడే.Shortcut Links
రోమీయులకు - Romans : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |