“ఇప్పుడైతే”– ఎఫెసీయులకు 2:4; తీతుకు 3:4 పోల్చి చూడండి. ఈ మాటలో ఇదంతా గొప్ప మలుపు తిరుగుతున్నది. మనుషులందరి పాపం చూపించిన తరువాత వారికి రావలసిన శిక్షను తప్పించుకునే మార్గాన్ని పౌలు చూపిస్తున్నాడు. మనుషులకు కావలసినది నిర్దోషత్వం, నీతిన్యాయాలు. దాన్ని పొందే విధానాన్ని దేవుడిక్కడ వెల్లడిస్తున్నాడు. ఈ లేఖలో నిర్దోషత్వం (నీతిన్యాయాలు) అంటే విశ్వమంతటికీ పవిత్రుడూ న్యాయవంతుడూ అయిన దేవుని ఎదుట శాంతిగా నిలబడ గలిగేందుకు మనుషులకు అవసరమైనదంతా అని అర్థం. ఇది ఎంత మాత్రం లోపం, కల్తీ లేని నిర్దోషత్వం, దేవుడే ఆమోదించి అంగీకరించే నీతిన్యాయాలు. యేసుప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రదర్శించిన నీతిన్యాయాలివి. మత్తయి 3:17 లో దేవునిచేత ఆ మాటలు పలికించిన నీతిన్యాయాలివి. ఈ నీతిన్యాయాల గురించి పౌలు ఈ క్రింది సత్యాలను వెల్లడిస్తున్నాడు.
అది దేవుని నుంచి వచ్చేది (వ 21); అందువల్లే అది లోపరహితమైనది, కళంకం లేనిది.
అది ధర్మశాస్త్రంతో పని లేనిది (వ 21), అంటే దేవుని ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను పాటించేందుకు ప్రయత్నించడం ద్వారా లభించేది కాదు.
ధర్మశాస్త్రం, ప్రవక్తలు (పాత ఒడంబడిక గ్రంథం) దాని గురించి చెప్తున్నాయి (వ 21), అంటే అదేదో కొత్తది, వింతైనది కాదు (ఆదికాండము 15:6; హబక్కూకు 2:4).
దాన్ని స్వీకరించగోరే వారెవరికైనా దేవుడు ఉచితంగా దీన్ని దయచేస్తాడు (వ 22,24); ఇది అపాత్రులైన పాపులకు దేవుడు తన కృపవల్ల ఉచితంగా ఇచ్చేది.
కేవలం నమ్మకంద్వారానే దాన్ని పొందగలం (వ 22,24; రోమీయులకు 1:17). అందువల్ల మన క్రియలద్వారా దాన్ని సంపాదించుకునే ప్రయత్నం చెయ్యకూడదు. దానికోసం కేవలం దేవునిపైనే ఆధారపడాలి.
నిజానికి ఈ నీతిన్యాయాలు పరిపూర్ణుడూ న్యాయవంతుడైన క్రీస్తే (1 కోరింథీయులకు 1:29; 2 కోరింథీయులకు 5:21). క్రీస్తును కలిగి ఉన్నవారికి దేవుని నుంచి వచ్చే ఈ నీతిన్యాయాలు, ఈ నిర్దోషత్వం ఉంది. నమ్మకం ద్వారా మాత్రమే క్రీస్తును మనం స్వీకరించగలం (యోహాను 1:12; యోహాను 3:16, యోహాను 3:36).
నీతిన్యాయాలు లేక నిర్దోషత్వం బైబిల్లో కొన్ని చోట్ల శుభ్రమైన వస్త్రంతో పోల్చడం చూడగలం. యెషయా 61:10; జెకర్యా 3:3-5; మత్తయి 22:11-12 (యెషయా 64:6 లో ఇది మనకెంత అవసరమో రాసి ఉంది). మనం క్రీస్తులో నమ్మకం పెట్టుకొన్నప్పుడు దేవుడు మనకు క్రీస్తు యొక్క నిష్కళంకమైన నీతిన్యాయాలను వస్త్రంగా తొడుగుతాడు.
మనుషులను ఈ విధంగా న్యాయవంతులుగా నిర్దోషులుగా ఎంచడానికి యేసుప్రభువు మరణమే ఆధారం (వ 24,25). న్యాయవంతుడైన తీర్పరి అయిన దేవుడు మనుషుల పాపాలు తొలగిపోతే తప్ప పాపులను నిర్దోషులుగా ఎంచలేడు. దేవుని సొంత ధర్మశాస్త్రం మనల్ని నేరస్థులుగా తీర్చి మనకు శిక్ష విధిస్తుంది. దేవుడు తన ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఏమీ చెయ్యడు. అలాగైతే ఆయన మనల్ని క్షమించడమెలా? మనం శిక్ష తప్పించుకునేలా చేయడమెలా? మనల్ని నిర్దోషులుగా లెక్కించడమెలా? ఎలా అంటే యేసుప్రభువు మన స్థానంలో మనకు రావలసిన శిక్షను భరించాడు కాబట్టి దేవుడలా చేసేందుకు అభ్యంతరం లేదు. లోక పాపాలన్నిటి కోసం ఆయన రక్తబలి దానం చేశాడు – వ 25; యోహాను 1:29; మత్తయి 26:27-28; 1 యోహాను 2:2; యెషయా 53:5-6, యెషయా 53:10. తనపై నమ్మకం పెట్టుకొన్నవారి పాపాలను తీసివేయడం ద్వారా వారినుంచి దేవుని కోపాగ్ని మళ్ళించాడు (వ 25).