Romans - రోమీయులకు 6 | View All

1. ఆలాగైన ఏమందుము? కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా?

పాపం వృద్ధి చెందిన చోట కృప మరింత వృద్ధి చెందిందని పౌలు చెప్పాడు (రోమీయులకు 5:20). ఈ ఉపదేశాన్ని అర్థం చేసుకోలేని పాపులు కొందరు ఈ వచనంలో ఉన్న ప్రశ్న అడుగుతూ ఇలా అనవచ్చు: “పాపం చేయడంవల్ల భలే మంచి ఫలితం వస్తున్నదే! దేవుని కృప వృద్ధి చెందడానికి పాపం దోహదం చేస్తున్నది – అందువల్ల మన శక్తి కొద్దీ పాపం చేద్దాం. దాన్నంతటినీ క్షమించేందుకు తగిన కృప మనకు రావాలని ఎదురు చూద్దాం”. ఈ అధ్యాయంలో అలాంటి ప్రశ్నలు, అలాంటి తలంపులు క్రీస్తు శుభవార్తను అర్థం చేసుకున్న విశ్వాసికీ ఎంత విపరీతంగా ధ్వనిస్తాయో చెప్తున్నాడు. “మీకు తెలియదా” అనే మాటలు రెండు సార్లు (వ 3,16), “మనకు తెలుసు” అనే మాటలు మరి రెండు సార్లు (వ 6,9) ఉపయోగించాడు. విశ్వాసులు పవిత్ర జీవితం గడపాలనే దేవుడు వారిని నిర్దోషులుగా తీరుస్తాడని పౌలుకు బాగా తెలుసు. లేక పౌలు మాటల్లో చెప్పాలంటే “మనం కూడా కొత్త జీవంతో బ్రతకాలి (వ 4). 8వ అధ్యాయం అంతం వరకు ఈ అంశాన్నే కొనసాగించాడు. పవిత్ర జీవితం గురించి యోహాను 17:17-19 నోట్ చూడండి.

2. అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము?

“అలా కానే కాదు”– వ 1 లోని ప్రశ్నకు విశ్వాసి ఇవ్వగలిగిన జవాబు ఇదొక్కటే. ఎందుకు? విశ్వాసులు పాపం విషయంలో మరణించారు కాబట్టి. ఈ మరణం ఎప్పుడు, ఎలా జరిగింది? వ 6,8లో జవాబు ఉంది – “క్రీస్తుతో సిలువ మరణం పాలైందని”, “క్రీస్తుతో చనిపోయాం”. విశ్వాసులు క్రీస్తుతో ఐక్యంగా ఉన్నారు (వ 5). క్రీస్తు తన మరణంలో, పునర్జీవితంలో విశ్వాసుల గుంపంతటికీ నాయకుడూ ప్రతినిధీ. ఆయనకు సంభవించినది వారందరికీ జరిగినట్టే దేవుడు లెక్కిస్తాడు. యేసు వారికి బదులుగా అవన్నీ అనుభవించాడు. దేవుని దృష్టిలో విశ్వాసులు తమ పాత భ్రష్ట స్వభావాన్ని బట్టి ఏమై ఉన్నారో అదంతా సిలువ వేయబడి మరణించినట్టే.

3. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా?

పౌలు ఇక్కడ మాట్లాడుతున్న బాప్తిసం ఏమిటి? బాప్తిసం అనేది గ్రీకు భాషలోనుంచి వచ్చిన పదం. ఇక్కడ “బాప్తిసం పొందడం” అని కాకుండా ఆ గ్రీకు పదాన్ని తెలుగులోకి అనువదిస్తే ఇలా ఉంటుంది – “క్రీస్తులోకి ముంచబడిన”, లేక “క్రీస్తులోకి ప్రవేశించిన”, లేక “యేసుక్రీస్తులోకి తీసుకురాబడిన”. మనం “ఆయన మరణంలో ముంచబడ్డామని”, లేక “ఆయన మరణంలో ప్రవేశించామని”, లేక “ఆయన మరణంలోకి తీసుకురాబడ్డామని” అనవచ్చు. ఆ విధంగా ముంచబడడమంటే క్రీస్తులోకి మునగడమని అర్థం గానీ నీటిలోకి కాదు. అలాంటప్పుడు బాప్తిసం క్రీస్తుతో ఐక్యతను సూచిస్తుంది, ఆయనతో ఒక ప్రత్యేక సంబంధంలోకి ప్రవేశించడం, పవిత్రాత్మ మూలంగా ఆయన ఆధ్యాత్మికదేహంలో ఒక అవయవంగా మారడం అని దీని అర్థం (1 కోరింథీయులకు 12:12-13; యోహాను 17:21, యోహాను 17:23). బాప్తిసం అనే అర్థాన్నిచ్చే గ్రీకు పదం క్రొత్త ఒడంబడికలో ఇతర చోట్ల చిహ్నంగా సాదృశ్య రూపకంగా వాడడం కనిపిస్తుంది. లూకా 12:50; 1 కోరింథీయులకు 10:2 చూడండి. నీటి బాప్తిసం పౌలు ఇక్కడ చెప్తున్న ఆధ్యాత్మిక వాస్తవ విషయాలకు ఒక చిహ్నంగా సూచనగా మాత్రమే ఉండగలదు. నీటిలోకి వెళ్ళడం క్రీస్తుతో మరణానికీ పాతిపెట్టబడడానికీ సూచన. నీటినుంచి బయటికి రావడం క్రీస్తుతో సజీవంగా తిరిగి లేవడానికి సూచన. నీటి బాప్తిసం గురించిన నోట్స్ కోసం మత్తయి 3:6; మత్తయి 28:19; మార్కు 16:16; అపో. కార్యములు 2:38 చూడండి. పవిత్రాత్మ బాప్తిసం గురించి అపో. కార్యములు 1:5 మొదలైనవి చూడండి. క్రీస్తులో దేవుడు మనకోసం చేసినదానంతటి ఉద్దేశం మనమొక కొత్త రకం జీవితం గడపాలనే, పాపం మరణాలు అనే బంధకాలనుంచి విడుదల అయిన పునర్జీవిత సంబంధమైన జీవితం మనకు కలగాలనే. 2 కోరింథీయులకు 5:17; తీతుకు 2:11-14 చూడండి.

4. కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో పాలు పొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితివిు.

5. మరియు ఆయన మరణముయొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమైన యెడల, ఆయన పునరుత్థానముయొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగల వారమై యుందుము.

ఐక్యం అన్నది ఇక్కడ మూల పదం. విశ్వాసులు క్రీస్తులో ఉన్నారు (రోమీయులకు 8:1; యోహాను 15:4; ఎఫెసీయులకు 1:4; ఫిలిప్పీయులకు 1:1; కొలొస్సయులకు 1:1). క్రీస్తుతో ఏకమై ఉన్నారు (రోమీయులకు 12:5; 1 కోరింథీయులకు 6:15, 1 కోరింథీయులకు 6:17; 1 కోరింథీయులకు 12:13. యోహాను 17:21-23 నోట్స్ చూడండి). ఆయన మరణం వారి మరణమైనట్టే ఆయన పునర్జీవితం వారిదే (ఎఫెసీయులకు 2:6; కొలొస్సయులకు 2:12; కొలొస్సయులకు 3:1).

6. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము ఆయనతోకూడ సిలువవేయ బడెనని యెరుగుదుము.

మన “పాత స్వభావం” అంటే మనం విశ్వాసులుగా క్రీస్తులో కొత్త మనుషులంగా కాకముందు మన స్థితి, మనం ఏమై ఉన్నామో అదంతా. సిలువ మరణమంటే మనకు మనం చేసుకున్నది కాదు. క్రీస్తు క్రీ శ 30 ప్రాంతాల్లో సిలువ వేయబడినప్పుడు విశ్వాసులమైన మనమంతా ఆయనతో కూడా సిలువ వేయబడ్డాం (వ 3; గలతియులకు 2:20). పాప శరీరం అంటే విశ్వాసుల శరీరాల్లోని భ్రష్ట స్వభావం (రోమీయులకు 7:18). క్రీస్తు మన స్థానంలో చనిపోయినప్పుడు అది నాశనమైపోలేదు. కానీ దాని ప్రభావంనుంచి దేవుడు మనలను తప్పించేందుకు క్రీస్తు మరణం మార్గం ఏర్పరచింది (వ 14,22; రోమీయులకు 5:21). దేవుని కృపవల్ల మనం దానికి దాసులుగా జీవించనక్కరలేదు.

7. చనిపోయినవాడు పాపవిముక్తుడని తీర్పుపొందియున్నాడు.

దేవుని దృష్టిలో విశ్వాసులమైన మనం ఆదాములో పాపం చేశాం. క్రీస్తులో చనిపోయాం (2 కోరింథీయులకు 5:14; కొలొస్సయులకు 3:3). ఆదాము పాపం అనే మూలంనుంచి మనపైకి శిక్షావిధి వచ్చింది (రోమీయులకు 5:16; రోమీయులకు 5:18), క్రీస్తు మరణం ద్వారా దానినుంచి విడుదల కలిగింది. ఆయనతో చనిపోవడం మూలంగా మనం పాపంనుంచి విడుదల అయ్యాం. పాపంతో మన సంబంధం తెగిపోయింది. దేవుడు ఇకపై మన పాపాలను మనవిగా లెక్కించడు (రోమీయులకు 4:7-8). క్రీస్తు బాధలు, మరణం ద్వారా మన పాపాలన్నిటికీ విడుదల వెల చెల్లించడం జరిగింది. పై విషయాలన్నీ నిజ విశ్వాసులందరి విషయంలోనూ వాస్తవాలే, ఎవరో కొందరు ఉత్తమ భక్తుల విషయంలో మాత్రమే కాదు.

8. మనము క్రీస్తుతోకూడ చనిపోయిన యెడల, మృతులలోనుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు,

వ 4. దేవుడు విశ్వాసులకిచ్చిన నూతన ఆధ్యాత్మిక జీవితాన్ని వారు క్రీస్తుతో కూడా గడుపుతున్నారు (యోహాను 5:24; యోహాను 14:23), అలా నిరంతరమూ ఆయనతో వారు జీవిస్తారు (1 థెస్సలొనీకయులకు 4:17).

9. మరణమునకు ఇకను ఆయనమీద ప్రభుత్వము లేదనియు ఎరిగి, ఆయనతోకూడ జీవించుదుమని నమ్ముచున్నాము.

మరణం పాప ఫలితం (రోమీయులకు 5:12; రోమీయులకు 6:23). క్రీస్తు విశ్వాసుల స్థానంలో వారి పాపాలకు పరిహారం చెల్లించేందుకు మరణించాడు (రోమీయులకు 3:25; యోహాను 1:29; 1 కోరింథీయులకు 15:3). ఇది ఆయన ఒకేసారి చేసి ముగించాడు (హెబ్రీయులకు 10:10, హెబ్రీయులకు 10:14; యోహాను 19:30). ఇప్పుడు ఆయన శాశ్వతంగా జీవిస్తున్నాడు (ప్రకటన గ్రంథం 1:18). దేవుని కోసమే, తండ్రి అయిన దేవునికి ఆనందం కలిగించడం కోసమే దేవునికి కీర్తి కలగాలని ఆయన సంకల్పం నెరవేర్చడం కోసమే జీవిస్తున్నాడు (యోహాను 8:29) గానీ స్వార్థం కోసం, పాపం కోసం కాదు.

10. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా, పాపము విషయమై, ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా, దేవుని విషయమై జీవించుచున్నాడు

11. అటువలె మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తుయేసు నందు సజీవులుగాను మిమ్మును మీరే యెంచుకొనుడి.

పై విషయంలో విశ్వాసులు క్రీస్తులాగా ఉండాలి. ఆయనలాగానే దేవునికోసం జీవించాలి. ఆయన విషయంలో లాగానే “మరణానికి వారిపై ఎలాంటి అధికారమూ లేదు” (యోహాను 11:25-26). దేవుడు చూచినట్టుగానే వారు ఈ విషయాలను చూడాలి – క్రీస్తు చనిపోయినప్పుడు తామూ చనిపోయామనీ, ఆయనలో నూతన జీవానికి తిరిగి లేచామనీ ఎంచుకోవాలి.

12. కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి.

విశ్వాసుల విషయం చూస్తే “చావుకు లోనయ్యే శరీరాల్లో” ఇక పాపం లేదని పౌలు చెప్పడం లేదు. ఉందని అతనికీ తెలుసు – రోమీయులకు 7:18, రోమీయులకు 7:25; గలతియులకు 5:17; ఎఫెసీయులకు 4:22 (1 యోహాను 1:8 కూడా చూడండి.) పాపం అక్కడ ఏలకూడదని పౌలు అంటున్నాడు (రోమీయులకు 5:21). విశ్వాసులపై పాపం ఇక పెత్తనం చేసే యజమానిగా ఉండకూడదు (వ 14; యోహాను 8:31-36).

13. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి సజీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించు కొనుడి, మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి.

దేవుడు విశ్వాసులను మరణంనుంచి జీవంలోకి తెచ్చాడు (యోహాను 5:24). ఇప్పుడు వారు మళ్ళీ తమ పాత యజమాని అంటే పాపం వైపుకు తిరగకూడదు. తమ చేతులు, కాళ్ళు, చెవులు, కళ్ళు, నోరులను దానికి ఇచ్చేయకూడదు. వారికొక కొత్త యజమాని ఉన్నాడు. ఏకైక నిజ దేవుడు ఆయన. వారు తమను, తమకున్నదంతటినీ ఆయనకు సమర్పించు కోవాలి (రోమీయులకు 12:1). పాపం గానీ తాము గానీ తమకు యజమానులుగా ఉండకూడదు. దేవుడే వారి యజమాని. విశ్వాసులు దీన్ని గుర్తించి దీనిప్రకారం ప్రవర్తించకపోతే పాపం వారిపైబడి పట్టుకోవడానికీ వారిని తిరిగి లోబరచుకోవడానికీ పొంచి ఉందని వారు తెలుసుకుంటారు.

14. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు.

పాపం పీడిస్తూ కష్టపెడుతూ ఉన్న విశ్వాసులకు ఇది అత్యంత మధురమైన వాగ్దానం. దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ప్రయత్నించడం వల్ల పాపాన్ని జయించగలమని మనం ఆలోచించకూడదు. పాపం మనపై చేసే పెత్తనాన్ని వదిలించుకునేందుకు దేవుని కృప మాత్రమే చేయగలదు. పాపక్షమాపణను, శాశ్వత జీవాన్ని, పవిత్రాత్మను, పాపానికి వ్యతిరేకంగా మనం చేసే పోరాటంలో జయించేందుకు కావలసిన శక్తి, బలాన్ని ఆ కృప మనకిస్తుంది. “కృప క్రింద”– రోమీయులకు 5:21. కృప నిజంగా మధురమైన, శక్తి సంపన్నమైన యజమాని.

15. అట్లయినయెడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగువారము కామని పాపము చేయుదమా? అదెన్న టికిని కూడదు.

వ 1. పాపాన్ని అదుపులో ఉంచాలంటే ఆజ్ఞలూ చట్టాలూ చెయ్యడం ద్వారా మాత్రమే సాధ్యమని సాధారణంగా మనుషులు అనుకుంటారు కాబట్టి ఈ ప్రశ్న తలెత్తుతుంది. అలాంటివారు కృపను గురించి పౌలు ఉపదేశాలను అర్థం చేసుకోలేకపోతే అతడు విశ్వాసులకు పాపం చేసేందుకు అనుమతి ఇస్తున్నాడు అనవచ్చు. నిజానికి పాపం చేయకుండా ఉండే మార్గాన్ని పౌలు చూపిస్తున్నాడు. శుభవార్త పాపవిముక్తి, రక్షణ కలిగించే దేవుని ప్రభావం (రోమీయులకు 1:16). అది మనుషులను దేవునికి నిజమైన సేవకులుగా చేస్తుంది. “ధర్మశాస్త్రం క్రింద...కాదు”– రోమీయులకు 7:1-4 పోల్చి చూడండి.

16. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా?

మనుషులు తమకు పాపం చేసేందుకు స్వేచ్ఛ ఉందనుకోవచ్చు. నిజానికి వారు పాపం చేయడమే వారికి స్వేచ్ఛ ఏమి లేదనీ, వారు పాపానికి బానిసలనీ తెలియజేస్తున్నది (యోహాను 8:34; 2 పేతురు 2:19). వారు పాపానికి లొంగితే పాపం వారిపై పట్టు సంపాదించుకుంటుంది. వారిని అలా చేజిక్కించుకుని మళ్ళీ మళ్ళీ పాపం చేయిస్తుంది. ఈ దారి తిన్నగా మరణానికి నడుపుతుంది. మనకు అందుబాటులో వేరొక దారి ఒక్కటే ఉంది. అది దేవుని పట్ల విధేయత దారి. అంటే పాపాన్ని విసర్జించి మనకు మనం దానికి చచ్చినవారుగా ఎంచుకోవడం. ఈ మార్గం నీతిన్యాయాలకు నడిపిస్తుంది. ఈ రెండు దారులకూ మధ్య దారి ఏదీ లేదు. మత్తయి 7:13-14 పోల్చి చూడండి.

17. మీరు పాపమునకు దాసులై యుంటిరిగాని యే ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వకముగా లోబడినవారై,

విశ్వాసులకు స్వేచ్ఛ ఎలా వస్తుందో చూడండి. వారి విషయంలోనైతే క్రీస్తు శుభవార్తకూ ఉపదేశాలకూ లోబడడమే ఈ స్వేచ్ఛ. “హృదయపూర్వకంగా” అనే మాట గమనించండి. తమ పాపాలను వదిలి దేవుని సేవకులు కావాలని ఎవరూ వారిని బలవంతం చెయ్యలేదు. తమ హృదయమంతటితో వారు దాన్ని కోరారు.

18. పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము.

“నీతిన్యాయాలకు దాసులయ్యారు”– ఇది మరెవరో బలవంతంగా వారిని దాసులుగా చేయడం కాదు. ఆయన సంకల్పం ప్రకారం చేసేందుకు సంతోషంతో మనసారా సమ్మతించి, ఒక దయగల యజమానికి లోబడడమే.

19. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను; ఏమనగా అక్రమము చేయుటకై, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగు అప్ప గించితిరో, ఆలాగే పరిశుద్ధత కలుగుటకై యిప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి.

వ 13. “న్యాయానికి”– విశ్వాసి ఈ కొత్త యజమానికి కట్టుబడ్డాడు (వ 18). అయితే అతడు ఈ సత్యానికి అనుగుణంగా జీవించాలి. తన తలంపుల్లో ఉద్దేశాల్లో చర్యల్లో నీతిన్యాయాలనుంచి తొలగిపోకుండేలా ప్రయత్నించాలి. ఈ “బానిసత్వం” ఈ భూమిపై మనం పొందగల అతి సంతోషకరమైన స్థితిని తెస్తుంది (మత్తయి 5:6, మత్తయి 5:10; మత్తయి 6:33). అలాంటివారిని మంచి చేయడానికి ఏ ధర్మశాస్త్రమూ బలవంతం చెయ్యనక్కర్లేదు. తమ హృదయమంతటితో మంచిగా ఉండాలని వారు కోరుతున్నారు. క్రీస్తులో నిజమైన నమ్మకం ఒక మనిషిలో కలిగించేది ఇదే. పాపం చేయాలన్న చెడు ప్రేరేపణ విశ్వాసులకు ఎన్నడూ కలగదనీ వారెన్నడూ పడిపోరనీ దీని అర్థం కాదు (ఈ వచనంలో “దుర్భల స్వభావం” అనే మాట గమనించండి). వారి బ్రతుకు తీరు మొత్తంమీద నీతిన్యాయాల అదుపులో ఉంటుందని దీని అర్థం. “ఇచ్చివేసుకోండి”– వ 13. దీనికి ఫలితం పవిత్ర జీవితం.

20. మీరు పాపమునకు దాసులై యున్నప్పుడు నీతివిషయమై నిర్బంధము లేనివారై యుంటిరి.

ఏ మనిషీ ఇద్దరు యజమానులు, అంటే పాపం, నీతిన్యాయాలు అనే రెండింటి కింద పని చెయ్యలేడు (మత్తయి 6:24 పోల్చి చూడండి). అంటే పాపానికి బానిసలు మనుషుల దృష్టిలో మంచి పనులుగా ఉన్నవాటిని చెయ్యరనీ, మత సంబంధమైన భక్తి వారిలో కనిపించడం అసాధ్యమనీ కాదు (నిజానికి అలాంటివారు చాలా మతనిష్ఠ గలవారుగా కనబడ వచ్చు). మొత్తంగా జీవితంపై యజమాని ఎవరు అన్నదాని గురించి పౌలు మాట్లాడుతున్నాడు. పాపులు చేసే నీతి క్రియలు కూడా దేవుని దృష్టిలో పాపం రంగు అంటివుంటాయి (యెషయా 64:6).

21. అప్పటి క్రియలవలన మీకేమి ఫలము కలిగెను? వాటినిగురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే,
యెహెఙ్కేలు 16:61, యెహెఙ్కేలు 16:63

వారు నిజంగా పశ్చాత్తాపపడి దేవునికి లోబడ్డారు కాబట్టి తమ పాత జీవిత విధానం గురించి వారికి సిగ్గు. ఒక వ్యక్తి తాను క్రీస్తు విశ్వాసినని చెప్పుకొంటూ గతంలో తాను చేసిన పాపాలకు సిగ్గుపడకపోతే ఎక్కడో ఏదో తీవ్రమైన పొరపాటు ఉందన్నమాట. అదే పాపాలకు అతడు పరిగెత్తుకుంటూ పోయే అవకాశం ఉంది (2 పేతురు 2:22). ఎవరికైనా పాపభరితమైన జీవితానికి అంతం, వారు తమ గురించి తాము ఏమి చెప్పుకున్నా సరే, మరణమే.

22. అయినను ఇప్పుడు పాపమునుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము.

పవిత్రతకు, శాశ్వత జీవానికీ ఏకైక మార్గం దేవునికి బానిసలుగా మారడమే. ఆయన సొత్తుగా అయి, ఆయన స్వరానికి లోబడడానికి సిద్ధపాటే. ఆధ్యాత్మిక స్వతంత్రతకు కూడా మార్గమిదే (గలతియులకు 5:13; యోహాను 8:36). అది దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆనందంగా సేవించగలిగే స్వతంత్రత.

23. ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము.

వ 16-22 లాగేనే పాపానికి బానిసలుగా ఉండడానికీ, దేవునికి బానిసలుగా ఉండడానికీ మధ్య గల వ్యత్యాసాన్నే ఈ వచనంలో చెప్తున్నాడు. పాపం తన బానిసలకు కూలి ఇస్తుంది. అది మరణం. దేవుని సన్నిధినుంచి శాశ్వతంగా దూరమై ఉండడమే మరణమంటే. ప్రకటన గ్రంథం 21:8; 2 థెస్సలొనీకయులకు 1:8-9; మత్తయి 25:41. పాపం యొక్క బానిసలకు వారికి తగినదే, తమ ప్రవర్తనవల్ల సంపాదించుకున్నదే లభిస్తుంది. దేవుడు తన “బానిసలకు” ఇచ్చేది ఒక ఉచిత కృపావరమే. అది శాశ్వత జీవం. వారి పనుల్ని బట్టి చూస్తే అది వారికి తగినది కాదు. దాన్నెవరూ సొంతగా సంపాదించుకోలేరు (రోమీయులకు 4:4-5; రోమీయులకు 5:17; లూకా 17:10; ఎఫెసీయులకు 2:8-9; యోహాను 3:16; యోహాను 4:14). ఎవరైనా దేవునికి “బానిస”గా ఎలా కాగలరు? తమ పాపాలకు పశ్చాత్తాపపడి క్రీస్తులో నమ్మకముంచడం ద్వారానే. విశ్వాసులంతా దేవుడు కొనుక్కున్న ఆస్తి. ఆయన్ను సేవించాలని వారందరికీ మనసు ఉంది. వారాయన్ను సేవించేది శాశ్వత జీవాన్ని సంపాదించుకొనేందుకు కాదు వారికి శాశ్వత జీవం ఉంది కాబట్టే సేవిస్తున్నారు.Shortcut Links
రోమీయులకు - Romans : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |