పౌలు ద్వారా దేవుడు ఇంతవరకు వెల్లడించిన దివ్య సత్యాలను విని విశ్వాసులు ఏమి అనుకోవాలి? ఏం చేయాలి? దేవుని అద్భుత కృప వెలుగులో విశ్వాసుల బాధ్యత ఏమిటి? పౌలు రోమీయులకు 6:11-13,రోమీయులకు 6:19 లో ఈ విషయం కొంత రాశాడు. స్వార్థ త్యాగం చేసుకుని, తమ శరీర స్వభావానికి లోబడక “శరీర క్రియలను చావుకు గురి చేసేందుకు” దేవుని ఆత్మ ఇచ్చే బలప్రభావాలను ఉపయోగించుకోవాలి (కొలొస్సయులకు 3:5-10 చూడండి. మత్తయి 5:29-30; గలతియులకు 5:24 పోల్చి చూడండి). ఎప్పుడూ చేస్తూ ఉండవలసిన పని ఇది. ప్రతి చెడ్డ పనినీ విసర్జించి, దాన్ని చంపేసేందుకు దేవుని ఆత్మకు దాన్ని అప్పగించాలి – మన జీవితాల్లో పాపాన్ని చంపేసే బలప్రభావాలు ఆయనవే, మనవి కాదు. కానీ మనం ఆయనతో సహకరించి ఆయన మనకిచ్చే శక్తిని ఉపయోగించాలి (ఫిలిప్పీయులకు 2:12-13 పోల్చి చూడండి). మన ఇళ్ళల్లో విష సర్పాలను ఎలా ఉంచుకోమో అదే విధంగా చెడ్డ క్రియలు, ప్రవర్తన, పాపమైన తలంపులూ ఆశలూ మన బ్రతుకుల్లో ఉండనీయకూడదు. నిజ విశ్వాసి తన పాపాల విషయం పశ్చాత్తాప పడ్డాడు, తన జీవితంలోని పాపాలకు విరోధంగా పోరాడుతూ, వాటిపై దేవుని ఆత్మ బలాన్ని ప్రయోగించడం నేర్చుకుంటూ ఉన్నాడు. అతడు క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఇదంతా చేయాలని నిర్ణయించు కున్నాడు. అది అప్పటికప్పుడు హఠాత్తుగా చేసుకున్న నిర్ణయం. అయితే దాన్ని నెరవేర్చడం మాత్రం మెల్లగా చాలా కష్టతరంగా జరగవచ్చు. బహుశా కొద్దిమందే నిలకడగా సంపూర్ణంగా దీన్ని చేయగలుగుతారేమో. అయితే విశ్వాసులందరి జీవితాల్లోనూ ఇలా చెయ్యాలన్న మనస్తత్వం, ధోరణి ఉంటుంది. “సోదరుడు” అని పిలవబడిన వాడెవడైనా శరీర క్రియలను చావుకు గురి చేస్తూ ఉండకపోతే తనలో జీవమిచ్చే ఆత్మ లేడనీ, పని చేయడం లేదనీ బయట పెట్టుకుంటున్నాడన్నమాట (1 యోహాను 3:6, 1 యోహాను 3:9). ఎవరైనా సరే ఎప్పుడూ శరీరానుసారంగా జీవిస్తూ ఉండడం ఆ వ్యక్తిలో దేవుని ఆత్మ నివసించడం లేదనేదానికి రుజువు. అలా జీవించడం మరణమే, మరణానికే దారి తీస్తుంది (వ 6; రోమీయులకు 6:16, రోమీయులకు 6:23).