Romans - రోమీయులకు 9 | View All

1. నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదనయు కలవు.

దేవుడు మానవజాతికోసం సిద్ధం చేసిన విముక్తి గురించి వివరించడం ముగించాడు పౌలు. ఇప్పుడు 9,10,11 అధ్యాయాల్లో దేవుని ప్రజలైన ఇస్రాయేల్‌వారు క్రీస్తునూ, ఆయన శుభవార్తనూ ఎందుకు తిరస్కరించారో వారి భవిష్యత్తు ఏమిటో వివరిస్తున్నాడు.

2. క్రీస్తునందు నిజమే చెప్పు చున్నాను, అబద్ధమాడుట లేదు.

“అంతర్వాణి”– అపో. కార్యములు 23:1; అపో. కార్యములు 24:16; 1 కోరింథీయులకు 4:4; 1 కోరింథీయులకు 8:7; 2 కోరింథీయులకు 1:12; 1 తిమోతికి 1:5, 1 తిమోతికి 1:19; 1 తిమోతికి 3:9. అనేకమంది యూదులు పౌలును తమ విరోధిగా ఎంచుతున్నందు చేత పౌలు ఈ వచనాలను అంత గట్టిగా నొక్కి చెప్తున్నాడు (అపో. కార్యములు 21:21, అపో. కార్యములు 21:28; అపో. కార్యములు 24:5). వాస్తవమేమిటంటే అతడు వారిని ప్రేమతో చూస్తున్నాడు. వారికి పాపవిముక్తి కలగాలని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నాడు. తాను క్రీస్తునుంచి వేరై నశించి పోవడం (అది సాధ్యం అయితే) వల్ల వారికి విముక్తి కలుగుతుందనుకుంటే అందుకైనా సిద్ధమే. నిర్గమకాండము 32:32; గలతియులకు 3:13 పోల్చి చూడండి. ఇది క్రీస్తు మనసు.

3. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతోకూడ సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్య మైనయెడల, దేహసంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తునుండి వేరై శాపగ్రస్తుడనై యుండ గోరుదును.
నిర్గమకాండము 32:32

4. వీరు ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులును వాగ్దానములును వీరివి.
నిర్గమకాండము 4:22, ద్వితీయోపదేశకాండము 7:6, ద్వితీయోపదేశకాండము 14:1-2

రోమీయులకు 3:1 లో ఉన్న ప్రశ్నకు పౌలు ఇక్కడ మరింత వివరంగా జవాబిస్తున్నాడు. ఒక జాతిగా ఇస్రాయేల్‌వారికి ఇప్పటికీ కొన్ని ఆధిక్యతలు ఉన్నాయంటున్నాడు. వారు క్రీస్తును నిరాకరించి నందుచేత అవి రూపుమాసిపోలేదు. “దత్తస్వీకారం... వారికి చెందుతాయి”– అంటూ వర్తమాన కాలంలోనే రాస్తున్నాడు. ఇక్కడ దత్తస్వీకారం అంటే దేవుడు వారిని తన ప్రజలుగా ఎన్నుకున్నాడు (ద్వితీయోపదేశకాండము 7:6; ద్వితీయోపదేశకాండము 14:1-2). లోకంలోని ప్రజలందరిలోకీ వారికి మాత్రమే వారి ఆరాధన స్థలంలో దేవుని మహిమ ప్రకాశం ప్రత్యక్షంగా ఉంది. రాబోయే కాలంకోసం ఆ మహిమను గురించిన వాగ్దానం ఉంది (నిర్గమకాండము 40:34-35; 1 రాజులు 8:11; యెహెఙ్కేలు 43:2-5; యెహెఙ్కేలు 44:4). దేవుడు వారితో చేసిన ఒడంబడికలు వారివి (ఆదికాండము 15:18; నిర్గమకాండము 24:8; 2 సమూయేలు 7:16; 2 సమూయేలు 23:5; యిర్మియా 31:31-33; యిర్మియా 32:40). దేవుడు వారికి మాత్రమే తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు (నిర్గమకాండము 20:1-2; ద్వితీయోపదేశకాండము 4:8). చరిత్రలో ఇతర జనాలన్నిటిలోనూ వారికి మాత్రమే దేవుడే సాక్షాత్తూ నియమించిన ఆరాధన పద్ధతి ఉంది (నిర్గమ 25—40 అధ్యాయాలు; 1 రాజులు 6 అధ్యాయం). పాత ఒడంబడిక గ్రంథమంతటా అక్కడక్కడా కనిపించే వాగ్దానాలన్నీ వారివే. భవిష్యత్తులో వారికి కలుగబోయే దీవెనల గురించిన వాగ్దానాలు అవి.

5. పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.
కీర్తనల గ్రంథము 41:13

“పితరులు” – అంటే ఆ ప్రజల మూల పురుషులనూ నాయకులనూ – అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులను దేవుడే ఎన్నుకున్నాడు (రోమీయులకు 11:28; ఆదికాండము 12:1-3; నిర్గమకాండము 3:6). యేసుప్రభువు ఇస్రాయేల్ జాతిలో అబ్రాహాము, దావీదుల వంశంలో జన్మించాడు (మత్తయి 1:1). వ 5లో యేసుప్రభువు దేవుడని స్పష్టంగా ప్రకటించడం కనిపిస్తూ ఉంది (ఇతర రిఫరెన్సులు ఫిలిప్పీయులకు 2:6; లూకా 2:11 నోట్స్‌లో చూడండి).

6. అయితే దేవునిమాట తప్పి పోయినట్టు కాదు; ఇశ్రాయేలు సంబంధులందరును ఇశ్రాయేలీయులు కారు.
సంఖ్యాకాండము 23:19

ఇన్ని అధిక్యతలున్నా ఒక ప్రజగా ఇస్రాయేల్‌వారు క్రీస్తును, ఆయన శుభవార్తను స్వీకరించలేదు. దేవుడు తన రాజ్యాన్ని వారి నుంచి తీసివేసి ఇతరులకు ఇచ్చాడు (యోహాను 1:11; మత్తయి 21:42-43). అంటే దేవుని వాక్కు విఫలమైపోయి ఆయన వాగ్దానాలు భంగమైపోయాయనా? కాదంటున్నాడు పౌలు. రెండు రకాల యూదుల మధ్య తేడాలను మన ముందుంచుతున్నాడు. ఒకటి అబ్రాహాముకు శరీర సంబంధమైన సంతానం, రెండోది వారిలోనుంచి దేవుడు ఎన్నుకొని తన చెంతకు పిలుచుకొన్న వ్యక్తులు. ఈ తరువాతి వారే నిజమైన ఇస్రాయేల్‌వారు. రోమీయులకు 2:28-29; మత్తయి 3:9; యోహాను 8:39-41 కూడా చూడండి.

7. అబ్రాహాము సంతానమైనంత మాత్రముచేత అందరును పిల్లలు కారు గాని ఇస్సాకు వల్లనైనది నీ సంతానము అనబడును,
ఆదికాండము 21:12

ఆదికాండము 21:12. అబ్రాహాముకు ఇతర సంతానం కూడా ఉన్నారు (ఆదికాండము 16:15; ఆదికాండము 25:1-2). కానీ దేవుడు అబ్రాహాముకు వారసుడుగా ఆధ్యాత్మిక సంతానంగా ఇస్సాకును మాత్రమే ఎన్నుకున్నాడు. అతడు “వాగ్దానం” మూలంగా పుట్టిన కొడుకు – రోమీయులకు 4:18-21; ఆదికాండము 15:4; ఆదికాండము 17:15-16; ఆదికాండము 18:10; ఆదికాండము 21:1-3. అంటే దేవుడు అబ్రాహాముతో చేసిన ఒడంబడిక, వాగ్దానాలు అతని శారీరక సంతానమంతటి కోసమూ కాదు గాని దేవుడు ఎన్నుకున్న కొందరికోసమే అని అర్థం.

8. అనగా శరీరసంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని యెంచ బడుదురు.

9. వాగ్దానరూపమైన వాక్యమిదేమీదటికి ఈ సమయమునకు వచ్చెదను; అప్పుడు శారాకు కుమారుడు కలుగును.
ఆదికాండము 18:10, ఆదికాండము 18:14

10. అంతేకాదు; రిబ్కా మన తండ్రియైన ఇస్సాకు అను ఒకనివలన గర్భవతియైనప్పుడు,
ఆదికాండము 25:21

ఇదే సత్యం ఇస్సాకు సంతానానికి కూడా వర్తిస్తుంది. దేవుడు ఇస్సాకుకు వారసుడుగా తన ప్రజల నాయకుడుగా, అబ్రాహాము వంశంలో దేవుని వాగ్దానాలకు ఉత్తరాధికారిగా యాకోబును ఎన్నుకొన్నాడు. దేవుడు యాకోబును ఎన్నుకొని ఏశావును తిరస్కరించినది వారు ఆ తరువాత చేయబోయే పనులమీద ఆధారపడి కాదు. తన జ్ఞానం చొప్పున దేవుడు ఒకణ్ణి ఎన్నుకున్నాడు. అతనిలో దేవుని వాక్కు నెరవేరింది. “పెద్దవాడు నరకానికి, చిన్నవాడు పరలోకానికి పోతాడు” అని దేవుడు అనలేదు – “పెద్దవాడు చిన్నవాడికి సేవ చేస్తాడు” అని మాత్రమే అన్నాడు, గమనించండి. 9–11 అధ్యాయాల్లోని విషయం వ్యక్తుల పాపవిముక్తి లేక నాశనం కాదు గాని ప్రజలతో జాతులతో దేవుడు వ్యవహరించిన విధానమే.

11. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, క్రియల మూలముగా కాక పిలుచు వాని మూలముగానే నిలుకడగా ఉండు నిమిత్తము,

12. పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయక ముందేపెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను.
ఆదికాండము 25:23

13. ఇందునుగూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడి యున్నది.
మలాకీ 1:2-3

మలాకీ 1:2-3. దేవుని ద్వేషం గురించిన నోట్స్ కీర్తనల గ్రంథము 5:5; మలాకీ 1:3; లూకా 14:26 చూడండి. దేవునికి యాకోబు పట్ల ప్రత్యేకమైన ప్రేమ ఉంది. దాన్ని చరిత్రలో ఆయన కనపరిచాడు. ఏశావు సంతతివారి చరిత్ర చూస్తే అదే ప్రేమ దేవునికి వారిపై లేదని అర్థమవుతుంది. వ 12 చరిత్రలో నెరవేరిందని రుజువు చేసేందుకు పౌలు మలాకీలోని మాటలను ఎత్తి రాస్తున్నాడు.

14. కాబట్టి యేమందుము? దేవునియందు అన్యాయము కలదా? అట్లనరాదు.
ద్వితీయోపదేశకాండము 32:4

ఈ కాలంలో ఇస్రాయేల్ జాతి మొత్తాన్ని దేవుడు తిరస్కరించడం పూర్తిగా న్యాయమే. దేవుడు చేసినది న్యాయమేనా అనే ప్రశ్న తప్పకుండా వస్తుంది (వ 14). దీనికి జవాబేమిటంటే దేవుడు సర్వాధికారి. మనుషుల విషయంలో తన ఇష్టప్రకారం జరిగించగలడు. అందరూ పాపులే (రోమీయులకు 3:9, రోమీయులకు 3:23). దేవుడు న్యాయంగా అందరినీ తిరస్కరించవచ్చు. దానికి బదులు ఆయన కొందరిని తన ప్రజలుగా ఉండాలని ఎన్నుకున్నాడు. అది పూర్తిగా న్యాయమే. దేవునికి ఎదురు చెప్పే హక్కు ఎవరికీ లేదు (వ 20,21). దేవుడు దేవుడే. విశ్వానికంతటికీ ఆయన గొప్ప రాజు (కీర్తనల గ్రంథము 47:1-3; యెషయా 40:22-23; దానియేలు 4:34-35). తన ఇష్టం, సంకల్పం ప్రకారం జరిగించగలడు, జరిగిస్తాడు. ఆయన కొందరిని ఎన్నుకొని, మిగతావారిని ఎన్నుకోక పోవడానికి కర్మ సిద్ధాంతంతోను, గత జన్మం పుణ్యంవంటి తప్పుడు సిద్ధాంతాలతోను ఏ సంబంధమూ లేదు (యోబు 11:12; యోహాను 9:3 నోట్స్ చూడండి). అంతేగాక ఎవరో ప్రజాపీడకుడు, నియంత చేసే నిరంకుశమైన నిర్ణయం లాంటిది కాదిది. దేవుడు సర్వాధికారే, ఏ విషయంలోనైనా తన ఇష్టం వచ్చినట్టు చేయగలవాడే. కానీ ఆయన ప్రేమస్వరూపియైన సర్వాధికారి అని మనం అర్థం చేసుకోవాలి (1 యోహాను 4:9). తన స్వభావాన్ని అనుసరించే ఆయనెప్పుడూ ప్రవర్తిస్తాడు. కరుణ చూపడం న్యాయం అయినప్పుడు కరుణ చూపడం ఆయనకు ఆనందం (రోమీయులకు 10:12; రోమీయులకు 11:32; నిర్గమకాండము 34:6-7; మీకా 7:18). ఇక్కడ ఈ అధ్యాయంలోని వచనాలను మాత్రమే తీసుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకూడదు. వీటిని బైబిలంతటిలో వెల్లడి అయినదాని వెలుగులో పరిశీలించి అర్థం చేసుకోవాలి. దేవుని సర్వాధిపత్యం, పూర్వజ్ఞానం, పూర్వ నిర్ణయం అనేవాటిలోని రహస్యం ఏదైనప్పటికీ ఒకటి మాత్రం వాస్తవం – తన వాక్కులో తన గురించి ఆయన వెల్లడి చేసుకున్నదానికి వ్యతిరేకంగా అవేవీ ఆయనచేత చేయించవు. దేవుడు ఎలాంటి పొరపాటూ చెయ్యడు. ఆయన చేసేదంతా అఖండ న్యాయం, అమిత ప్రేమలపై ఆధారపడి ఉంటుంది. ఆ స్థిరమైన బండపై మన హృదయాలు విశ్రాంతి తీసుకోవచ్చు. ఆదికాండము 18:25.

15. అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును; ఎవనియెడల జాలి చూపుదునో వానియెడల జాలి చూపుదును.
నిర్గమకాండము 33:19

16. కాగా పొందగోరువానివలననైనను, ప్రయాసపడువాని వలననైనను కాదు గాని,కరుణించు దేవునివలననే అగును.

ఎవరి పట్ల కరుణ చూపాలో ఎవర్ని శిక్షించాలో దేవునికి మాత్రమే తెలుసు. ఆయన కరుణ ఉచితమైనది. దాన్ని ఎవరిపట్ల అయినా చూపాలన్న బాధ్యత ఆయనకు లేదు. మనుషులు తమ ప్రయత్నాల ద్వారా దాన్ని సంపాదించుకోలేరు. లేక తమకు అది కావాలి కాబట్టి బలవంతంగా దేవునినుంచి దాన్ని స్వాధీనం చేసుకోలేరు. దీన్నిబట్టి దేవుడు కఠిన హృదయుడనీ, కరుణ చూపడం ఆయనకంతగా ఇష్టం లేదనీ మనం అనుకోకూడదు. ఎవరైనా తన పాపాలను విడిచిపెట్టి దేవునివైపుకు తిరిగితే వారిపై ఆయన తప్పక కరుణ చూపుతాడు (రోమీయులకు 11:32; యెషయా 55:7). దేవుని జాలి, దయ, ప్రేమగల సంకల్పానికి వ్యతిరేకమైన కఠిన సంకల్పం మరొకటి ఆయనలో లేదు. వీలైన చోటెల్లా కరుణ చూపుతాడు. తప్పనిసరైతే శిక్షిస్తాడు. ఆయన సర్వాధిపత్యం ఆయన ప్రేమకు విరుద్ధంగా ఎన్నడూ పని చేయదు.

17. మరియు లేఖనము ఫరోతో ఈలాగు చెప్పెను నేను నీయందు నా బలము చూపుటకును, నా నామము భూలోకమందంతట ప్రచురమగుటకును, అందు నిమిత్తమే నిన్ను నియమించితిని.

నిర్గమకాండము 9:16; నిర్గమకాండము 7:17. తన గురించిన జ్ఞానం లోకంలో అభివృద్ధి చెంది, తన మహిమకు దోహదం కలిగే రీతిలో దేవుడు దుర్మార్గుల పట్ల ప్రవర్తించగలడు. ఇది లోకం విషయంలో గొప్ప లాభదాయకమైనది, ఆయన లోకంపట్ల కనపరచిన గొప్ప కరుణ.

18. కావున ఆయన ఎవనిని కనికరింప గోరునో వానిని కనికరించును; ఎవని కఠినపరచ గోరునో వాని కఠిన పరచును.
నిర్గమకాండము 4:21, నిర్గమకాండము 7:3, నిర్గమకాండము 9:12, నిర్గమకాండము 14:4, నిర్గమకాండము 14:17

నిర్గమకాండము 4:21 దగ్గర ఫరో హృదయాన్ని మొద్దుబారిపోయేలా చేయడం గురించి నోట్ చూడండి. దేవుడు జాలి చూపి దేశంమీదికి పంపిన తెగుళ్ళను తొలగించాలని ఫరో కోరాడు. కానీ పశ్చాత్తాపపడి దేవునికి సేవ చేసేందుకు ఇష్టపడలేదు. మరింత పాపానికి అతణ్ణి వదిలివెయ్యడం ద్వారా, అతని హృదయాన్ని కఠినం చెయ్యడం ద్వారా దేవుడు అతని పాపాన్ని శిక్షించాడు. రోమీయులకు 1:21-26, రోమీయులకు 1:28 పోల్చి చూడండి. అలాంటి శిక్షకు పూర్తిగా తగినవారిని తప్ప మరెవరినీ దేవుడు అలా కఠినపరచడని మనం నిశ్చయంగా నమ్మవచ్చు. ప్రతి వ్యక్తి విషయంలోనూ తనకు సరి అనిపించిన రీతిలో ప్రవర్తించేందుకు దేవునికి స్వేచ్ఛ ఉంది.

19. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేల అని నీవు నాతో చెప్పుదువు.

మనుషులు తమ భ్రష్ట స్థితికీ, హృదయ కాఠిన్యతకూ దేవుణ్ణే తప్పుపట్టడం మామూలు సంగతి అని పౌలుకు తెలుసు. నిజానికి అందుకు బాధ్యులు వారే అయినప్పటికీ అలా చేస్తారు. ఆదికాండము 3:12-13 పోల్చి చూడండి. సృష్టికర్త అయిన దేవునిపై సృష్టి అయిన మనుషుడికి ఏమి చెప్పడానికీ హక్కు లేదని కూడా పౌలుకు తెలుసు. మనుషుల్లో చూచినప్పటికీ ఒక కుమ్మరివాడు తనకు ఇష్టం వచ్చిన కుండను చేయగలడు. ఈ విషయంలో ఏమి అనడానికి కూడా కుండకు హక్కు లేదు, హక్కు ఉండకూడదు. యెషయా 29:16; యెషయా 45:9; యెషయా 64:8; యిర్మియా 18:4-6 పోల్చి చూడండి. ఆదికాండం గ్రంథంలో సృష్టి గురించి చెప్పినదాన్ని బట్టి దేవుడు దివ్య కుమ్మరిగా చెడ్డ పాత్రలేవీ చేయలేదని గ్రహించవచ్చు (ఆదికాండము 1:31). జ్ఞానం, ప్రేమ గలవాడైన మంచి కుమ్మరి ఎన్నడూ వికారమైన భ్రష్ట “పాత్రలు” చెయ్యడు. దేవుడు అలాంటి కుమ్మరే. ఏ “పాత్ర” అయినా చెడ్డదైతే, ఆ చెడ్డతనానికి మూలం మనిషే గాని దేవుడు కాదు. దేవుని ఎదుట ధూళిలో ఉండవలసినవాడే మనిషి. అతడు తన దోషాలనూ అసమర్థతనూ ఒప్పుకొంటూ దేవుడు దేవుడని గ్రహిస్తూ, మనం ఎలా ఉండాలో అలా ఉండేలా చేయగలవాడు ఆయనేనని గుర్తిస్తూ ఉండాలి. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, మన స్థితికి ఆయన్ను నిందిస్తూ ఉండే బదులు, మనసారా ఆయన్ను నమ్మి మనల్ని మనం ఆయన చేతుల్లో ఉంచుకోవాలి. అప్పుడు ఆయన మనల్ని ఘనతకు, మహిమ గల ప్రయోజనాలకు తగిన పాత్రలుగా చేస్తాడు.

20. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీ వెవడవు? నన్నెందు కీలాగు చేసితివని రూపింపబడినది రూపించినవానితో చెప్పునా?
యెషయా 29:16, యెషయా 45:9

21. ఒక ముద్దలోనుండియే యొక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద కుమ్మరివానికి అధికారము లేదా?
యిర్మియా 18:6, యెషయా 29:16, యెషయా 45:9

“ఒకే ముద్ద” (వ 21)– మనుషులంతా ఒకటే స్వభావం గలవారు. అంటే వారందరిదీ పాపభరితమైన భ్రష్ట స్వభావం (రోమీయులకు 3:9; ఎఫెసీయులకు 2:3). వారు తమను తాము చెడు మట్టి ముద్దగా చేసుకున్నారు. మంచిగా మలచబడేందుకు వారెవరికీ అర్హత లేదు. మనుషుల్లో కొందరు మంచి, ఘనమైన మట్టి ముద్దలు, మరి కొందరు నీచమైన భ్రష్టమైన మట్టి ముద్దలు అని లేరు. మనందరమూ ఒకే మానవజాతి మట్టి ముద్దలోని వాళ్ళం. ఒకే మనిషి ఆదాము సంతతివాళ్ళం. అందరిలోనూ పాపం ఉంది (రోమీయులకు 5:12; ఎఫెసీయులకు 2:1-3).

22. ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, ఇచ్చయించినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు ధీర్ఘశాంతముతో సహించిన నేమి?
యెషయా 54:16, యిర్మియా 50:25

మానవజాతిపట్ల దేవుడు ప్రవర్తించే దానంతటి లోనూ దేవునికి మంచి ఉద్దేశం ఉంది. దేవునికి పాపమంటే అమిత కోపమనీ, ఆయన ఏదైనా చేయగల దేవుడనీ మనుషులు అర్థం చేసుకోగలిగే అవకాశాలు ఉండడం లోకమంతటికీ ప్రయోజనకరం. ఆయన ఫరోకూ, ఈజిప్ట్ వారికీ (వ 17) మానవ చరిత్రలో ఇంకా కొందరికి వ్యతిరేకంగా తన ఉగ్రతను, బలప్రభావాల్ని ప్రదర్శించాలని నిర్ణయించాడు. ఇక్కడ పౌలు రెండు గుంపులవారిని వేరుచేసి చెప్తున్నాడు – “మహిమ కోసం సిద్ధం చేసిన...కరుణ పొందిన పాత్రలు”, “నాశనానికి సిద్ధమై కోపానికి గురి అయిన పాత్రలు.” అంటే విశ్వాసులు, అవిశ్వాసులు అన్నమాట. పాపవిముక్తి, రక్షణకోసం ఆయన ఎన్నుకొన్నవారు, అలా ఎన్నుకోనివారు. దేవుడు విశ్వాసుల గురించి మహిమ కోసం సిద్ధం చేశాడని పౌలు చెప్తున్నాడు (రోమీయులకు 8:17-18 పోల్చి చూడండి). అవిశ్వాసుల గురించి వారు నాశనం కోసం సిద్ధమైనవారని రాస్తున్నాడు, గానీ వారిని అలా సిద్ధం చేసినదెవరో చెప్పలేదు. సిద్ధం చేసినది దేవుడు అని చెప్పలేదు కాబట్టి వేరెవరైనా అలా సిద్ధం చేసి ఉండవచ్చు అనుకునేందుకు అవకాశం ఉంది, లేదా వారు తమను తామే అలా సిద్ధం చేసుకున్నారని కూడా అనుకోవచ్చు. రోమీయులకు 1:18-32; రోమీయులకు 2:4-11; సామెతలు 1:24-33; యెహెఙ్కేలు 18:30-32; మత్తయి 23:37; 1 తిమోతికి 2:3-4 వంటి వచనాలను ఆధారం చేసుకుని మనుషులు నాశనానికి తమను తామే సిద్ధం చేసుకుంటారని మనం నమ్మవచ్చు. మత్తయి 13:38-39 మొ।। కూడా చూడండి. దేవుని ఉగ్రత గురించి నోట్స్ రోమీయులకు 1:18; సంఖ్యాకాండము 25:3; కీర్తనల గ్రంథము 90:7-11; యోహాను 3:36 చూడండి.

23. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల, అనగా యూదులలోనుండి మాత్రము కాక,

24. అన్యజనములలో నుండియు ఆయన పిలిచిన మనయెడల, తన మహిమై శ్వర్యము కనుపరచవలెననియున్న నేమి?

“ఇతర ప్రజలు”– రోమీయులకు 1:7, రోమీయులకు 1:16. పైన చెప్పిన దానంతటిలో పౌలు ఉద్దేశమేమిటంటే ఇస్రాయేల్‌జాతిలో నుంచి కొద్దిమందిని మాత్రమే ఎన్నుకుని, మిగతావారిని తిరస్కరించడానికీ, ఇతర ప్రజలపై కరుణ చూపడానికీ దేవునికి హక్కు ఉంది. 25-29 వచనాల్లో ఇదంతా పాత ఒడంబడిక గ్రంథానికి అనుగుణంగానే ఉందని అతడు తెలియజేస్తున్నాడు. దేవుని వాక్కు నెరవేరకుండా పోలేదు (వ 6).

25. ఆ ప్రకారము నా ప్రజలు కానివారికి నా ప్రజలనియు, ప్రియురాలు కానిదానికి ప్రియురాలనియు, పేరుపెట్టుదును.
హోషేయ 2:23

హోషేయ 2:23. “నా ప్రజ కానివారు” అంటే ఇక్కడ అర్థం దేవుని ప్రజలైన ఇస్రాయేల్‌జాతికి చెందనివారు.

26. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని యేచోటను వారితో చెప్ప బడెనో, ఆ చోటనే జీవముగల దేవుని కుమారులని వారికి పేరుపెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు.
హోషేయ 1:10

27. మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి, క్లుప్తపరచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలె ఉండినను శేషమే రక్షింపబడునని
యెషయా 10:22-23

28. యెషయాయు ఇశ్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు.
యెషయా 10:22-23

29. మరియయెషయా ముందు చెప్పినప్రకారము సైన్యములకు అధిపతియగు ప్రభువు, మనకు సంతానము శేషింపచేయకపోయినయెడల సొదొమవలె నగుదుము, గొమొఱ్ఱాను పోలియుందుము.
యెషయా 1:9

యెషయా 1:9. ఆ జాతి ఎంత చెడిపోయిందంటే దేవుడు వారిలో కొద్దిమందిని ఎన్నుకోకపోయినట్టయితే ఆ జాతి మొత్తం పూర్తిగా తుడిచి పెట్టుకుపోయేది (ఆదికాండము 19:23-25). “సేనల ప్రభువు”– 1 సమూయేలు 1:3 నోట్.

30. అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడని అన్య జనులు నీతిని, అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి;

యూదులు తమ మతం విషయంలో కష్టపడ్డారు. వారికి దేవుని ధర్మశాస్త్రం ఉంది. దాన్ని పాటించడానికి ప్రయత్నించడమనే మార్గం ద్వారా దేవునికి అంగీకారం కావాలని చూశారు. కానీ తమ క్రియలను బట్టి నిర్దోషులూ న్యాయవంతులూ కావాలన్న ప్రయత్నంలో ఘోరంగా విఫలమయ్యారు (రోమీయులకు 3:9, రోమీయులకు 3:19-20). ఇతర ప్రజలకు దేవుని ధర్మశాస్త్రం లేదు. నిర్దోషత్వం గురించి అంతగా పట్టింపు లేదు. కానీ వారు క్రీస్తు శుభవార్తను విన్నప్పుడు నమ్మకం ఉంచి నిర్దోషులయ్యారు. నమ్మకం మూలంగానే దేవుడు వారిని నిర్దోషులుగా ఎంచాడన్నమాట (రోమీయులకు 3:22, రోమీయులకు 3:26, రోమీయులకు 3:28; రోమీయులకు 5:1). యూదులైతే అలా కాకుండా దేవుడు జెరుసలంలో ఉంచిన రాయియైన యేసుప్రభువును నిరాకరించారు (యోహాను 1:11; మత్తయి 21:42; అపో. కార్యములు 4:11; 1 పేతురు 2:6-8). యూదులు అలా పతనం కావాలని దేవుడు ముందుగా నిర్ణయించినందువల్ల వారలా అయ్యారని పౌలు అనడం లేదని గమనించండి. వారి సొంత విధానాలవల్లే పతనమయ్యారు.

31. అయితే ఇశ్రాయేలు నీతికారణమైన నియమమును వెంటాడి నను ఆ నియమమును అందుకొనలేదు,

32. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసమూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి.
యెషయా 8:14

33. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచు వాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి, తొట్రుపడిరి.
యెషయా 28:16Shortcut Links
రోమీయులకు - Romans : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |