Corinthians I - 1 కొరింథీయులకు 1 | View All

1. దేవుని చిత్తమువలన యేసుక్రీస్తు యొక్క అపొస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సొస్తెనేసును

రోమీయులకు 1:1; గలతియులకు 1:1. “తన సంకల్పం” – ఏ విశ్వాసి ఏమై ఉన్నప్పటికీ దేవుని సంకల్పం మూలంగానే అతడు అదై ఉండాలి. అదై ఉండడం దేవుని చిత్తమని అతడు ఎరిగి ఉండాలి. ఈ లేఖ పౌలు చెప్తుండగా సొస్తనేసు రాసిపెట్టి ఉండవచ్చు. రోమీయులకు 16:22 పోల్చి చూడండి. క్రీస్తులో విశ్వాసులంతా ఏమిటో ఆ విషయం పౌలు రాస్తున్నాడు. వారు లోకం నుంచి వేరుగా పిలువబడిన గుంపు (సంఘం గురించి నోట్ మత్తయి 16:18). వారు దేవునికి చెందినవారు (1 కోరింథీయులకు 6:19-20; యోహాను 17:9-10). వారు ప్రత్యేకించబడినవారు (యోహాను 17:17-19). వారు క్రీస్తులో ఉన్నవారు (ఎఫెసీయులకు 1:1, ఎఫెసీయులకు 1:4). దేవుడు పవిత్రులుగా ఉండేందుకు వారిని పిలిచాడు (లేవీయకాండము 20:7; 1 పేతురు 2:9 నోట్స్ చూడండి) వారికి ఒక్కడే ప్రభువు (1 కోరింథీయులకు 8:5-6; రోమీయులకు 10:9).

2. కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతిస్థలములో ప్రార్థించువారికందరికిని శుభమని చెప్పి వ్రాయునది.

3. మన తండ్రియైన దేవుని నుండియు, ప్రభువైన యేసు క్రీస్తునుండియు కృపాసమాధానములు మీకు కలుగును గాక.

4. క్రీస్తుయేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి, మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

5. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయనయందు మీరు ప్రతి విషయములోను,

“అభివృద్ధి చెందారు”– రోమీయులకు 10:12; 2 కోరింథీయులకు 8:9; మత్తయి 7:11. తనకు సేవ చేయడానికి కావలసిన ఆధ్యాత్మిక సమర్థతలన్నిటినీ దేవుడు వారికిచ్చాడు – 1 కోరింథీయులకు 12:4-11, 1 కోరింథీయులకు 12:28-31; రోమీయులకు 12:6-8. పౌలు కేవలం ఆ సంఘంలోని నాయకులు, ఉపదేశకులు, బోధకుల గురించే కాదు, విశ్వాసులందరి గురించీ మాట్లాడుతున్నాడు. కొరింతు విశ్వాసుల్లోని ఆధ్యాత్మిక జీవమే వారికి అతడు ప్రకటించిన శుభవార్త సత్యమని రుజువు చేస్తున్నది. అది క్రీస్తు రెండో రాకడ కోసం వారు ఆత్రుతతో ఎదురు చూచేలా చేసింది (వ 7; మత్తయి 24:30; 2 థెస్సలొనీకయులకు 1:7; 1 పేతురు 1:7, 1 పేతురు 1:13; 1 పేతురు 4:13; ప్రకటన గ్రంథం 1:7). క్రీస్తు రెండో రాకడ రహస్యంగా జరుగుతుందని గానీ క్రీస్తుసంఘం ఎవరికీ తెలియకుండా పరలోకానికి ఆరోహణం అవుతుందని గానీ పౌలు ఏమీ చెప్పలేదు. కొరింతులోని విశ్వాసులు బహిరంగంగా క్రీస్తు ప్రత్యక్షమౌతాడని చూస్తున్నారు. తీతుకు 2:13 పోల్చి చూడండి.

6. అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్య వంతులైతిరి;

7. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు.

8. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై యుండునట్లు అంతమువరకు ఆయన మిమ్మును స్థిరపర చును.

“నిందారహితులై”– ఎఫెసీయులకు 1:4. నిర్దోషులంటే ఎవరిమీదనైతే ఎలాంటి నేరం మోపడానికైనా వీలుండదో వారు. రోమీయులకు 4:8; రోమీయులకు 8:33-34 పోల్చి చూడండి. “చివరివరకు”– ఫిలిప్పీయులకు 1:6; రోమీయులకు 5:9-10; రోమీయులకు 8:29-30; యోహాను 10:28-29; హెబ్రీయులకు 7:25; 1 పేతురు 1:5.

9. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు.
ద్వితీయోపదేశకాండము 7:9

“సహవాసానికి”– 1 యోహాను 1:3; యోహాను 14:23. “నమ్మతగినవాడు”– విశ్వాసులకు దేవుడు తాను చేసిన వాగ్దానాలన్నిటినీ నెరవేరుస్తాడు. అంతం వరకు వారిని కాపాడతాడు (వ 8; 1 థెస్సలొనీకయులకు 5:24; తీతుకు 1:2; 2 తిమోతికి 2:13).

10. సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాట లాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సు తోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండ వలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను.

1 కోరింథీయులకు 12:25; రోమీయులకు 12:16; ఎఫెసీయులకు 4:3. మనసులోని ఉద్దేశాలలో పూర్తిగా ఏకీభవించడం విశ్వాసులకు సాధ్యమేనా? సాధ్యమేనన్నమాట. 1 కోరింథీయులకు 2:16; 2 కోరింథీయులకు 13:11; ఎఫెసీయులకు 4:13; ఫిలిప్పీయులకు 1:27; ఫిలిప్పీయులకు 2:2; అపో. కార్యములు 4:32 కూడా చూడండి. క్రీస్తు, ఆయన రాయబారులు చేసిన ఉపదేశాల గురించి మాట్లాడుతున్నాడు పౌలు. విశ్వాసులంతా వాటి విషయంలో ఏకీభావం కలిగి ఉండడం సాధ్యమే గాని చాలా కష్టతరం. అందుకు దేవుని వాక్కు బాగా తెలిసి ఉండాలి, అందులో చెక్కు చెదరని నమ్మకం ఉండాలి, ప్రతి పరిస్థితికీ దాన్ని ఉపయోగించడానికి దృఢ నిర్ణయం ఉండాలి.

11. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మునుగూర్చి క్లోయె యింటివారివలన నాకు తెలియవచ్చెను.

ఇది వారు క్రీస్తులో అభివృద్ధి చెందవలసినంతగా ఇంకా చెందలేదనీ వారు ఆధ్యాత్మిక మనుషులు కారనీ సూచిస్తూ ఉన్నది – 1 కోరింథీయులకు 3:1-4. వారికి చాలా తెలుసు. చక్కగా మాట్లాడగలరు (వ 5). కానీ తమకు తెలిసిన సత్యంలో కొద్దిగా మాత్రమే ఆచరణలో పెట్టారు. ఇది అన్ని కాలాల్లోనూ అంతటా సాధారణంగా కనిపించే పొరపాటే. మనుషులను తగిన దానికంటే ఎక్కువగా హెచ్చించారు, పొగడారు. ఇది కూడా అన్ని కాలాల్లో కనిపించే మరో పొరపాటు – 1 కోరింథీయులకు 3:5-8

12. మీలో ఒకడునేను పౌలు వాడను, ఒకడునేను అపొల్లోవాడను, మరియొకడు నేను కేఫావాడను, ఇంకొకడునేను క్రీస్తువాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము.

“అపొల్లో”– అపో. కార్యములు 18:24-28. “కేఫా” అనేది పేతురు మరో పేరు. రెంటికీ అర్థం “రాయి” అనే. “క్రీస్తు”– క్రీస్తును మాత్రమే అనుసరిస్తున్నామని చెప్పుకునేవారు సంఘంలో చీలికలకు దీనిని కారణంగా చేసుకుని ఇతరులను చిన్నచూపు చూస్తూ ఉంటే వారికి మిగతా వారికన్నా పరిపక్వత, ఆధ్యాత్మికత ఎక్కువేమీ లేదు. “నేను పౌలు పక్షం వాణ్ణి” అని చెప్పుకొనే గుంపు అక్కడ ఉందని పౌలు ఏమీ సంతోషించలేదని గమనించండి. అలాంటివి అతనికి అవసరం లేదు. మనుషులను ఎప్పుడూ తన వైపుకు కాక క్రీస్తువైపుకే చూపించేవాడు.

13. క్రీస్తు విభజింపబడి యున్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడెనా? పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా?

క్రీస్తును గానీ ఆయన శరీరాన్ని విభజించడం సాధ్యం కాదు (1 కోరింథీయులకు 12:12-13). విశ్వాసులు ఈ సత్యాన్ని గుర్తించాలి, ఒకరినొకరు స్వీకరించి క్రీస్తులో వారికున్న ఐక్యతలో జీవించాలి. ఈ వచనంలో పౌలు “క్రీస్తుతో పోల్చుకుంటే ఏ మనిషైనా ఎంతటివాడు? ఏ మనిషినీ మరీ ఉన్నత స్థానానికి పెంచకండి” అంటున్నాడు.

14. నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని యెవరైనను చెప్పకుండునట్లు,

మత్తయి 3:6; మత్తయి 28:19; మార్కు 16:16; అపో. కార్యములు 2:38 దగ్గర బాప్తిసం గురించి నోట్స్ చూడండి. పాపవిముక్తి కలగాలంటే పశ్చాత్తాపం, నమ్మకం ప్రాముఖ్యమైన విషయాలని పౌలుకు తెలుసు (అపో. కార్యములు 17:30; అపో. కార్యములు 20:21; రోమీయులకు 10:9-10). ఈ రోజుల్లో కొందరు బల్ల గుద్ది చెప్తున్నట్టు పాపవిముక్తికి బాప్తిసం అవసరమైతే పౌలు ఈ విధంగా మాట్లాడి ఉండేవాడా? బాప్తిసం గురించిన ప్రశ్నల కంటే విశ్వాసులందరూ ఒకరితో ఒకరు ఐకమత్యంతో కలిసిమెలిసి జీవించడమనే బాధ్యత ప్రాముఖ్యమైనదని పౌలు ఎంచాడన్నది స్పష్టమే.

15. క్రిస్పునకును గాయియుకును తప్ప మరి యెవరికిని నేను బాప్తిస్మమియ్యలేదు; అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను.

16. స్తెఫను ఇంటివారికిని బాప్తిస్మమిచ్చితిని; వీరికి తప్ప మరి ఎవరికైనను బాప్తిస్మమిచ్చితినేమో నేనెరుగను.

17. బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని, క్రీస్తుయొక్క సిలువ వ్యర్థముకాకుండునట్లు, వాక్చాతుర్యము లేకుండ సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను.

17 వ వచనంలో తన శిష్యులు బాప్తిసం ఇవ్వాలని క్రీస్తు చెప్పిన సంగతిని కాదనడం లేదు పౌలు (మత్తయి 28:19). విశ్వాసులందరూ బాప్తిసం పొందాలన్న ఆజ్ఞను త్రోసిపుచ్చడం లేదు. తన పరిచర్యలోని ప్రధానాంశాన్ని గురించి అతడు చెప్తున్నాడు. శుభవార్తను ప్రకటించడమనే ఒకే ఒక అత్యంత ప్రాముఖ్యమైన సంగతి అది. తన ఉపదేశాల్లో పౌలు మానవ జ్ఞానాన్ని ఉపయోగించ లేదన్న సంగతి గమనించండి. అలాంటి జ్ఞానం నిజానికి తెలివి తక్కువతనమని పౌలుకు తెలుసు (వ 20). దాని మూలంగా ఎవరికీ దేవుణ్ణి గురించిన నిజమైన జ్ఞానం కలగదనీ (వ 21), మనుషులను పాపవిముక్తిలోకి తేవడానికి దేవుడు శుభవార్తను స్పష్టంగా ప్రకటించడమనే మార్గాన్ని నియమించాడనీ కూడా (వ 21,23; 1 కోరింథీయులకు 15:1-2; రోమీయులకు 1:16) అతనికి తెలుసు. మానవ జ్ఞానంతో ప్రకటించడం క్రీస్తు సిలువలోని ప్రభావం మొత్తాన్ని పోగొడుతుంది. అలా చేసేదేదైనా దేవునికి చెందినది కాదనీ మనుషుల విముక్తి విషయంలో అలాంటిది నిరుపయోగమనీ తెలుసు. వ 18 రెండు గుంపుల మనుషుల గురించి చెప్తున్నది – “నశించిపోతూ” ఉన్నవారు, “రక్షణ పొందుతూ” ఉన్నవారు. క్రీస్తు సిలువ పట్ల మనుషులకున్న మనస్తత్వం, ఆలోచనలు వారు ఏ గుంపుకు చెందుతారో చూపిస్తాయి. ఈ వచనాల్లో “నశించిపోతూ” ఉన్నవారు (యోహాను 3:16; లూకా 19:10) రెండు రకాలు (వ 22) – మతనిష్ఠ కలిగి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న యూదులు, వేదాంతం పట్ల ప్రీతి కలిగి తమ విగ్రహాలను పూజించుకునే గ్రీసుదేశం వారు. ఈ రెండు రకాల వారికి కూడా సిలువ తెలివితక్కువతనంగా అనిపిస్తుంది. ఎందుకు? వారు దాన్ని అర్థం చేసుకోవడం లేదు (2 కోరింథీయులకు 4:4). అది అవసరమని వారు నమ్మరు (ఈ శుభవార్త మనిషి ఆలోచనా విధానం కాదు, దేవునిది – రోమీయులకు 8:5-7). అంతేగాక సిలువ వారికి ఇష్టం లేదు (వారు ఆత్మనిబ్బరం, అహంకారం గలవారు; సిలువ అయితే వారిని ధూళిలో అణచివేసేది). ఈనాడు ఇలాంటివారు అనేకులున్నారు. అబద్ధాలు, మోసం, దొంగతనం చేయడం, క్షణికమైన సుఖాలకోసం జీవించడం, మనుషులు చేసిన బొమ్మలకు వంగి నమస్కారం చెయ్యడం ఇవన్నీ తెలివితక్కువతనమని వారనుకోరు. వారికి సిలువ (దేవుని జ్ఞానం అయి ఉన్న సిలువ – వ 24) మాత్రమే తెలివితక్కువతనం! ఎంత విపరీతం! కొందరైతే రక్షణ పొందుతూ ఉన్నారు (ఈ రక్షణ కొత్త జన్మతో ఆరంభమౌతుంది – యోహాను 1:12-13; యోహాను 3:3-8; విశ్వాసులు మరణం నుంచి సజీవంగా లేవడం, మహిమాస్థితి పొందడం వరకూ కొనసాగుతుంది – రోమీయులకు 8:23, రోమీయులకు 8:30). వారికి సిలువ అంటే దేవుని బలప్రభావాలు (వ 18,24; రోమీయులకు 1:16). వారు ఆ బలప్రభావాన్ని అనుభవించారు. అది వారి బ్రతుకుల్ని పూర్తిగా మార్చేసింది (2 కోరింథీయులకు 5:17). వారి పాలిట అది దేవుని జ్ఞానం కూడా (వ 24). క్రీస్తును ఎరుగని, నమ్మని ప్రపంచ వేదాంతులూ తత్వజ్ఞులూ విద్వాంసులూ జ్ఞానులందరూ రాసిన పుస్తకాలన్నిటిలో కంటే ఎంతో ఎక్కువ దైవ జ్ఞానం సిలువ మాట ఒక్కదానిలో వారికి కనిపిస్తుంది.

18. సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.

19. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. వివేకులవివేకమును శూన్యపరతును అని వ్రాయబడియున్నది.
యెషయా 29:14

20. జ్ఞాని యేమయ్యెను? శాస్త్రి యేమయ్యెను? ఈ లోకపు తర్కవాది యేమయ్యెను? ఈలోక జ్ఞానమును దేవుడు వెఱ్ఱితనముగా చేసియున్నాడు గదా?
యెషయా 19:12, యెషయా 33:18, యెషయా 44:25

నిజమైన జ్ఞానం ఏకైక నిజ దేవుని పట్ల భయభక్తులతో ఆరంభమౌతుంది (యోబు 28:28; కీర్తనల గ్రంథము 111:10; సామెతలు 1:7). ఈ లోకానికి చెందిన జ్ఞానులకూ మేధావులకూ విద్వాంసులకూ వేదాంతులకూ ఇది లేదు. అందువల్ల వారికి నిజమైన జ్ఞానం ప్రాథమిక దశలో కూడా లేదు. అయితే ఇక్కడి విషయమేమంటే జ్ఞానమని వారను కుంటున్న దాన్నంతటినీ సిలువ మూలంగా దేవుడు తెలివితక్కువ తనంగా చేసేశాడు. మనుషులను రక్షించడానికి దేవునికున్న ఏకైక మార్గం సిలువ. మనుషుల్లో అందరిలోకీ జ్ఞానులెవరూ ఇలాంటి మార్గం గురించి ఒక్క సారి కూడా ఆలోచించలేదు. వారి జ్ఞానమార్గం ఎవరికీ విముక్తిని తేవడం అసాధ్యం. అది దేవుని మార్గం కాదు. కొలొస్సయులకు 2:8 కూడా చూడండి.

21. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానముచేత దేవునిని ఎరుగకుండినందున, సువార్త ప్రకటన యను వెఱ్ఱి తనముచేత నమ్మువారిని రక్షించుట దేవుని దయా పూర్వక సంకల్ప మాయెను.

ఇక్కడ ముఖ్యమైన సత్యాలు మూడున్నాయి. ఒకటి, మనుషులు తమ వేదాంత సారం, తత్వశాస్త్రం, మేధాశక్తి, గూఢమైన జ్ఞానమంతా ఉపయోగించి కూడా దేవుణ్ణి తెలుసు కోలేకపోయారు. నిజానికి అందుకు వ్యతిరేకంగానే జరిగింది. మానవజాతికి గతంలో ఒకప్పుడు దేవుణ్ణి గురించి ఉన్న జ్ఞానాన్ని కూడా వారు కోల్పోయారు (రోమీయులకు 1:21-23). రెండు, జ్ఞానులనబడిన వారికి తెలివితక్కువతనంగా అనిపించే దాని ద్వారా – అంటే సిలువను ప్రకటించడం ద్వారా దేవుడు మనుషులకు పాపవిముక్తిని కలిగిస్తాడు (వ 18). మూడు, ఈ ప్రకటనను నమ్మినవారికి పాపవిముక్తి, రక్షణ కలుగుతుంది (రోమీయులకు 1:16-17).

22. యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసుదేశస్థులు జ్ఞానము వెదకు చున్నారు.

మార్కు 8:11; యోహాను 6:30; మత్తయి 12:39-40. “సూచన...జ్ఞానం”– ప్రతిదీ తమ బుద్ధికి అనుగుణంగా ఉండాలని వారు చూశారు. ఒకటి సత్యమని దేవుడు చెప్పాడు కాబట్టి దాన్ని నమ్మి ఊరుకోవడం వారికి ఇష్టం లేదు.

23. అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము.

“ఆటంకంగా(అడ్డురాయిగా)”– యూదులు ఎదురు చూచినది, కోరినది సిలువ వేయబడిన అభిషిక్తుణ్ణి కాదు. “తెలివితక్కువతనం”– నేరస్థులను మాత్రమే సిలువ వేస్తారు గదా, సిలువ వేయబడిన నేరస్థుడికి ఎవరి విముక్తితోనైనా ఏమి సంబంధం ఉండగలదు? అనీ, తాము వెదికే జ్ఞానం అలాంటివారిలో ఎలా వెల్లడౌతుంది? అనీ వారు వాదించేవారు.

24. ఆయన యూదులకు ఆటంకము గాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై యున్నాడు.

“పిలుపు అందిన”– రోమీయులకు 1:6; రోమీయులకు 8:30. ఇక్కడ దేవుడు పిలిచినవారంటే వ 18 లో రక్షణ పొందుతూ ఉన్నవారని అర్థం.

25. దేవుని వెఱ్ఱితనము మనుష్యజ్ఞానముకంటె జ్ఞానముగలది, దేవుని బలహీనత మనుష్యుల బలముకంటె బలమైనది.

మానవ జ్ఞానానికీ దేవుని జ్ఞానానికీ ఎంత తేడానో చూడండి. దేవుని జ్ఞానం ఎంత ఉన్నతమో చూడండి – యెషయా 55:8-9; రోమీయులకు 11:33-36.

26. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను అనేకులు పిలువబడలేదు గాని

అప్పటికీ, ఇప్పటికీ ఇది సత్యమే. భారత దేశంలో దేవుడు మేధావుల వర్గంలో, పెద్ద కులాల్లో కొందరిని పిలిచాడు గానీ ఎక్కువమందిని కాదు. పేదలు, విద్యలేని వారిలో, తక్కువ కులాలు, కులం లేని వారిలో ఎక్కువమందిని పిలిచారు.

27. ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు,

దీనస్థితిలో ఉన్నవారిని, తిరస్కారాలకు గురి అయినవారిని తన ప్రజలుగా ఉండేందుకు పిలవడంలో ఉన్న దేవుని మంచి ఉద్దేశం ఇది. మనిషి గర్వం అంటే ఆయనకు అసహ్యం. తమ బలప్రభావాలను బట్టీ జ్ఞానాన్ని బట్టీ గొప్పలు చెప్పుకునేవారిని ఆయన సహించలేడు. యిర్మియా 9:23; సామెతలు 6:16-17; సామెతలు 16:5; యెషయా 1:31; యెషయా 2:12-18; యెషయా 13:11; యిర్మియా 17:5; యాకోబు 4:6; మత్తయి 18:34 చూడండి. మనుషులు వేటి విషయంలో గర్విస్తారో అదంతా వ్యర్థమైపోయేలా, ఆయన సన్నిధిలో ఏ మనిషీ గొప్పలు చెప్పుకోకుండేలా ఆయన ఏర్పాట్లు చేశాడు – రోమీయులకు 3:27; ఎఫెసీయులకు 2:9.

28. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.

29. ఎన్నికైనవారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్ని కలేనివారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు.

30. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసు నందున్నారు.
యిర్మియా 23:5-6

విశ్వాసులు క్రీస్తులో ఉన్నారు (ఎఫెసీయులకు 1:1, ఎఫెసీయులకు 1:4). తండ్రి అయిన దేవుడు వారిని ఎన్నుకున్నాడు కాబట్టి వారలా ఉన్నారు. వారికి విముక్తికి, రక్షణకు అవసరమైనదంతా ఇప్పుడూ అనంత యుగాలలోనూ క్రీస్తే.

31. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింప వలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను.
యిర్మియా 9:24

లోకం తెలుసుకున్న, తెలుసుకోగలిగిన వాటన్నిటికంటే కూడా క్రీస్తే అత్యున్నత జ్ఞానం (కొలొస్సయులకు 2:2-3, కొలొస్సయులకు 2:8-9). ఏ మాత్రం చదువులేని ఏ విశ్వాసి అయినా, అతి తక్కువ స్థితిలో ఉన్న ఏ విశ్వాసి అయినా క్రీస్తులేని ఏ మేధావి, జ్ఞాని, వేదాంతికన్నా నిజమైన జ్ఞానం గలవాడే. “నిర్దోషత్వం”– రోమీయులకు 3:21-26; రోమీయులకు 10:9-10; ఫిలిప్పీయులకు 3:9 నోట్స్ చూడండి. “పవిత్రత”– యోహాను 17:17-19; రోమీయులకు 1:1 నోట్స్ చూడండి. “విమోచన”– మత్తయి 20:28; కీర్తనల గ్రంథము 78:35 నోట్స్. విశ్వాసులకు స్వయంగా సహజంగా ఇవేవీ లేవు. ఇవన్నీ క్రీస్తులోనే వారికున్నాయి (ఎఫెసీయులకు 1:1, ఎఫెసీయులకు 1:4). “ప్రభువు”– యిర్మియా 9:24. కీర్తనల గ్రంథము 34:2; కీర్తనల గ్రంథము 44:8 పోల్చి చూడండి. యిర్మియా 9:24 లో హీబ్రూలో “యెహోవా” అని ఉంది. ఇక్కడ కొత్త ఒడంబడిక గ్రంథంలో ఇది క్రీస్తును సూచిస్తున్నది. క్రీస్తు యెహోవా దేవుని అవతారం. ఈ సత్యం నేర్పే ఇతర రిఫరెన్సులు లూకా 2:11 నోట్స్‌లో ఉన్నాయి.Shortcut Links
1 కోరింథీయులకు - 1 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |