“పరీక్ష”– గ్రీకు పదానికి దుష్ప్రేరేపణ అనే అర్థం కూడా ఉంది. అందరికీ వచ్చినట్టుగానే క్రీస్తు విశ్వాసులకు కూడా ఇలాంటివి వస్తాయి. కానీ ఇతరులకు లేని వాగ్దానం విశ్వాసులకు ఉంది. అది గొప్ప వాగ్దానం. విశ్వాసి ఎదిరించి నిలబడలేనంత ఆకర్షణ శక్తి, ప్రభావం గల దుష్ప్రేరేపణ గానీ పరీక్ష గానీ దేన్నీ వారికి కలగ నివ్వడు దేవుడు. దాని నుంచి తప్పించుకునే దారిని వారికి ప్రతిసారి తప్పకుండా కలిగిస్తాడు. ఆయన పూర్తిగా నమ్మదగినవాడు. అయితే ఆ దారిని మనం కోరాలి, దానికోసం చూడాలి. అలా కాని పక్షంలో ఆ దారి మనకు కనిపించకపోవచ్చు. మన ఎదుట ఉన్న పాపం మన కళ్ళకు ఇంపుగా, ఆకర్షణీయంగా కనిపించడంవల్ల ఆ దుష్ప్రేరేపణకు లొంగిపోవాలని గనుక మనం కోరితే, అలానే పడిపోయే ప్రమాదం ఉంది. ఎప్పుడైనా మనం పాపంలో పడితే మనం ఎదిరించలేనంత గొప్ప పరీక్ష మనకు రానిచ్చాడని దేవుణ్ణి తప్పుపట్టకూడదు. మత్తయి 6:13 కూడా చూడండి.