Corinthians I - 1 కొరింథీయులకు 15 | View All

2. మీరు దానిని అంగీకరించితిరి, దానియందే నిలిచియున్నారు. మీ విశ్వా సము వ్యర్థమైతేనే గాని, నేను ఏ ఉపదేశరూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్న యెడల ఆ సువార్తవలననే మీరు రక్షణపొందువారై యుందురు.

“నమ్మనివారైతే”– శుభవార్తపై, క్రీస్తుపై నమ్మకంలో నిలకడగా ఉండడమే ఆ నమ్మకం నిజమైనదనడానికి గుర్తు. కొలొస్సయులకు 1:23; హెబ్రీయులకు 3:5-6; హెబ్రీయులకు 10:38-39 చూడండి. చనిపోయినవారిని దేవుడు తిరిగి సజీవంగా లేపుతాడనే సత్యాన్ని కొరింతులో కొందరు నిరాకరిస్తున్నారు (వ 12). కానీ క్రీస్తు సజీవంగా లేవడం శుభవార్తకు ఆయువుపట్టు వంటిది. దీన్ని నిరాకరించేవారి నమ్మకం లోపం గలది (వ 14,17). “వట్టిగా” నమ్మడం అంటే తాము నమ్మినది ఏమిటో తెలియకుండా నమ్మడం, లేక ఆ నమ్మకానికి సరైన ఆధారమేమిటో అర్థం చేసుకోకుండా నమ్మడం కావచ్చు. లేదా, చివరివరకూ సాగిపోలేని నమ్మకం వ్యర్థమైనది, పనికిమాలినది, రక్షించలేని నమ్మకం అని అర్థం కావచ్చు. “పాపవిముక్తి”– దేవుడు క్రీస్తు శుభవార్తను ఇచ్చినది ఇందుకే (మార్కు 1:10, మార్కు 1:16; రోమీయులకు 1:16). దానికి లోబడితే విముక్తి, రక్షణ. లేకుంటే శాశ్వత శిక్ష (2 థెస్సలొనీకయులకు 1:8-9). దానికున్న అమితమైన ప్రాముఖ్యత తెలిసిన పౌలు కొరింతువారు (అందరూ కూడా) దీన్ని అర్థం చేసుకుని శుభవార్తను నమ్మాలని కోరాడు.

3. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను,
యెషయా 53:8-9

శుభవార్తలో నాలుగు అంశాలున్నాయి – క్రీస్తు మరణం, సమాధి చేయబడడం, సజీవంగా తిరిగి లేవడం, ఆ తరువాత తన శిష్యులకు కనిపించడం. క్రీస్తు మరణం మన పాపాల కోసమే – మత్తయి 26:28; యోహాను 1:29; రోమీయులకు 3:24-25; రోమీయులకు 4:25; 2 కోరింథీయులకు 5:21; గలతియులకు 1:4; హెబ్రీయులకు 1:3; హెబ్రీయులకు 9:28; హెబ్రీయులకు 10:12; 1 పేతురు 2:24; 1 పేతురు 3:18; ప్రకటన గ్రంథం 1:5. క్రీస్తు సిలువ మీద నిజంగా చనిపోలేదని చెప్పేవారెవరైనా దేవుడు మానవాళి పాపాలకోసం ఏర్పాటు చేసిన ఒకే ఒక అర్పణను నిరాకరిస్తున్నారన్నమాట. మనుషులు తమ పాపాలనుంచి విముక్తులయ్యేందుకు దేవుడు వారికి నియమించిన ఏకైక మార్గాన్నే త్రోసిపుచ్చుతున్నారన్నమాట. క్రీస్తు సమాధి చేయబడడం కూడా అతి ప్రాముఖ్యమైనదే. ఆయన చనిపోయాడనేందుకు అత్యంత అవసరమైన చివరి రుజువు అది (మత్తయి 27:57-66; మార్కు 15:42-46; యోహాను 19:38-40). క్రీస్తు సజీవంగా లేవడం అంటే ఆయన మృతదేహంలోకి ఆయన ఆత్మ తిరిగి ప్రవేశించి దాన్ని తిరిగి బ్రతికించి సమాధి నుంచి ఆ దేహం బయటికి వెళ్ళేలా చేయడం. ఇది కూడా గొప్ప ప్రాముఖ్యమైన సంగతే (వ 13,14,17,18; రోమీయులకు 4:25; మత్తయి 28:6). క్రీస్తు మరణం, మళ్ళీ బ్రతకడం రెండూ కూడా “లేఖనాల ప్రకారమే” (అంటే పాత ఒడంబడిక గ్రంథం ప్రకారమే) – మత్తయి 5:17; లూకా 24:25-27, లూకా 24:45-46 చూడండి. క్రీస్తు తన శిష్యులకు కనిపించడం అనేది కూడా అన్నిటికంటే ముఖ్యమైన విషయాల్లో ఒకటి. ఆయన సజీవంగా లేచాడనడానికి అది రుజువు. క్రీస్తు తిరిగి లేచాక కనిపించిన అన్ని సందర్భాలను పౌలు ఇక్కడ రాయలేదు. అలాంటి సందర్భాల కోసం మత్తయి 28:7 నోట్ చూడండి. “అంగీకరించిన”– గలతియులకు 1:11-12.

4. లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను.
కీర్తనల గ్రంథము 16:10, హోషేయ 6:2, యోనా 1:17

5. ఆయన కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని కనబడెను.

6. అటుపిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్కసమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటివరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి.

“అయిదు వందల”– ధర్మశాస్త్రం ప్రకారం ఒక సత్యం ఇద్దరు లేక ముగ్గురు సాక్షుల సహాయంతో స్థిరపడగలదు (ద్వితీయోపదేశకాండము 17:6; మత్తయి 18:16). క్రీస్తు మరణం నుంచి సజీవంగా లేచిన తరువాత ఆయన్ను చూచినవారు 500 మంది కంటే ఎక్కువమంది. లోకంలో ఇప్పటి వరకు జీవించినవారిలోకెల్లా ఉత్తములైనవారు కొందరు వీరిలో ఉన్నారు. ప్రాచీన చరిత్ర గ్రంథాల్లో రాసివున్న ఏ సంఘటన కంటే కూడా యేసుక్రీస్తు మరణం, సమాధి చేయబడడం, మళ్ళీ బ్రతకడం అనే వాస్తవాలకు చాలా ఎక్కువ సాక్ష్యాధారాలూ రుజువులూ ఉన్నాయి. “కన్ను మూశారు”– యోహాను 11:11-14.

7. తరువాత ఆయన యాకోబుకును, అటుతరువాత అపొస్తలుల కందరికిని కన బడెను.

“యాకోబు”– బహుశా ప్రభువు తమ్ముడని (అపో. కార్యములు 1:13-14), ఆ పేరు గల ఇద్దరు శిష్యుల్లో ఒకరు కాదని అనుకోవచ్చు.

8. అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను;

అపో. కార్యములు 9:3-7. “అకాలంగా”– తాను మొదటినుంచి క్రీస్తు రాయబారుల్లో, శిష్యుల్లో ఉన్నవాణ్ణి కాననీ, క్రీస్తు మరణం నుంచి సజీవంగా లేచిన సమయానికి ఇంకా పాపంలోనే ఉన్నాననీ, అసాధారణమైన రీతిలో క్రీస్తు రాయబారిని అయ్యాననీ పౌలు ఉద్దేశం.

9. ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువవాడను దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడనుకాను.

అపో. కార్యములు 8:3; అపో. కార్యములు 9:1-2; ఎఫెసీయులకు 3:9; 1 తిమోతికి 1:12-15. ఫిలిప్పీయులకు 2:3 లో తాను ఇతరులకు ఏమి చెప్పాడో దాన్ని చేసి చూపించడం పౌలుకు ఆనందమే.

10. అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయనకృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని.

తాను దేవుని సేవకుడుగా, క్రీస్తురాయబారిగా ఉండడం కేవలం దేవుడు చూపిన కరుణ అనీ వర్ణించశక్యం కాని కృప అనీ పౌలుకు బాగా తెలుసు (ఎఫెసీయులకు 3:7-8; 2 తిమోతికి 1:9; తీతుకు 3:3-4). అందరికంటే తాను ఎక్కువ కష్టించి పని చేశాననడంలో పౌలు తనలో పని చేసిన దేవుని కృపకే ఘనత కలిగించాడు గాని తనకు కాదు.

11. నేనైననేమి వారైననేమి, ఆలాగుననే మేము ప్రకటించుచున్నాము, ఆలాగుననే మీరును విశ్వసించితిరి.

పౌలు ప్రకటించిన శుభవార్త ఇతర రాయబారులు ప్రకటించినదే. పాపవిముక్తి మార్గం ఒక్కటే. వారందరూ ఈ ఒక్క మార్గాన్నే ఎరిగి బోధించారు.

12. క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరుమృతుల పునరుత్థానము లేదని యెట్లు చెప్పుచున్నారు?

కొరింతు క్రైస్తవులు కొందరు (సద్దూకయ్యుల్లాగా – అపో. కార్యములు 23:8) మృతదేహాలు తిరిగి బ్రతికి లేవడం అనేది లేదంటున్నారు. ఒకవేళ అలాంటిది గనుక నిజంగా లేకపోతే కొన్ని విచారకరమైన ఫలితాలు ఉంటాయని పౌలు అంటున్నాడు. అవేవంటే, క్రీస్తు కూడా అలా లేచి ఉండేవాడు కాదు (వ 13,16), క్రీస్తు రాయబారుల ఉపదేశాలు “వ్యర్థం”, అబద్ధం అయి ఉండేవి (వ 14,15), క్రైస్తవుల నమ్మకం కూడా “వ్యర్థమే” (వ 14,17), వారింకా తమ పాపాల్లోనే ఉండి ఉంటారు, శాశ్వతంగా నశించిన స్థితిలోనే ఉండి ఉంటారు (వ 17,18), అందరూ కూడా చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉండి ఉంటారు (వ 19). ఈ విధంగా పౌలు మనుషుల పాపవిముక్తికి క్రీస్తు సజీవంగా లేవడమన్నది ఎంత అవసరమో చూపిస్తున్నాడు. అది శుభవార్తకు ప్రాణం. దాన్ని నిరాకరించడం శుభవార్తను వక్రం చేయడమే. అది శుభవార్తలోనుండి దాని సత్యాన్ని, ప్రభావాన్ని దోచుకోవడంతో సమానమే.

13. మృతుల పునరుత్థానము లేనియెడల, క్రీస్తుకూడ లేపబడి యుండలేదు.

14. మరియక్రీస్తు లేపబడియుండనియెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే.

15. దేవుడు క్రీస్తును లేపెనని, ఆయననుగూర్చి మేము సాక్ష్యము చెప్పియున్నాము గదా? మృతులు లేపబడనియెడల దేవు డాయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము.

16. మృతులు లేపబడని యెడల క్రీస్తుకూడ లేపబడలేదు.

17. క్రీస్తు లేపబడని యెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే యున్నారు.

ఒకవేళ క్రీస్తు మరణించి తిరిగి సజీవంగా లేవలేదంటే మన పాపాల బరువుకు శిక్షలో పడి మునిగి పోయాడన్నమాట, ఆయన బలి కావడం దేవునికి అంగీకారం కాలేదన్నమాట, ఎవరికీ క్షమాపణ కలగలేదు, ఎవరూ నిర్దోషులుగా తీర్చబడలేదన్న మాట (రోమీయులకు 4:24-25). ఎవరూ నిర్దోషులుగా తీర్చబడలేదంటే పాపానికి శిక్షగా అందరూ శాశ్వతంగా నశించిపోయారన్న మాట.

18. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి.

19. ఈ జీవితకాలముమట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యు లందరి కంటె దౌర్భాగ్యులమై యుందుము.

క్రైస్తవుల ఆశాభావం అన్నది ఈ జీవితాన్ని అధిగమించి ఎంతో దూరానికి విస్తరించి ఉండాలి. రోమీయులకు 5:2-5; రోమీయులకు 8:23-25 చూడండి. మరణంనుంచి సజీవంగా లేవడమన్నదే లేకపోతే అలాంటి ఆశాభావం వ్యర్థమే. అలాంటప్పుడు క్రైస్తవులంతా భ్రమలో ఉన్నట్టు లెక్క. అంతా వారిని చూచి జాలిపడాలి. వారి కష్టాలు, విషమ పరీక్షలు, హింసలు అన్నీ (యోహాను 15:18-20; అపో. కార్యములు 14:22; 2 తిమోతికి 3:12) అనవసరంగా అనుభవించారన్నమాట.

20. ఇప్పుడైతే నిద్రించినవారిలో ప్రథమఫలముగా క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడు.

అయితే క్రీస్తువిశ్వాసులను చూచి ఎవరూ జాలిపడవలసిన పనిలేదు. ఎందుకు? ఎందుకంటే క్రీస్తు మరణించి సజీవంగా లేచాడన్నది వాస్తవం. దాని గురించి ఎలాంటి సందేహమూ లేదు. “ప్రథమ ఫలం”– రాబోయే కాలంలో ఉండబోయే అనేకమందికి ఆయన మొదటివాడు.

21. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను.
ఆదికాండము 3:17-19

రోమీయులకు 5:12-21. చనిపోయినవారు సజీవంగా తిరిగి లేవడం గురించి యోహాను 5:28-29; మొ।। చూడండి.

22. ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు.

23. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనవారు బ్రది కింపబడుదురు.

“క్రీస్తు ప్రజలకు”– యోహాను 6:37-40; యోహాను 17:6, యోహాను 17:10. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు అవిశ్వాసులు తిరిగి లేస్తారని పౌలు ఇక్కడ రాయలేదు. ఆ మాటకొస్తే విశ్వాసులూ అవిశ్వాసులూ అయిన మనుషులందరికీ అలాంటి సమయం ఒక్క సారే వస్తుందని అసలు ఎక్కడా పౌలు రాయలేదు. ప్రకటన గ్రంథం 20:5 పోల్చి చూడండి.

24. అటుతరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును.
దానియేలు 2:44

“ఆ తరువాత”– ఇలా అనువదించిన గ్రీకు పదానికి “వెంటనే” అనే అర్థం తీసుకోవాల్సిన అవసరం లేదు. “తరువాత కొంత కాలానికి” (ఎంత కాలమో సూచించకుండా) అనే అర్థం రావచ్చు (ఈ నోట్స్ రచయిత అభిప్రాయం ప్రకారం ఇక్కడ దీని అర్థం తప్పకుండా ఇదే). “అంతం”– వ 25ను బట్టి చూస్తే క్రీస్తు పరిపాలన అంతం అని దీని అర్థం. ఇప్పుడు క్రీస్తు పరలోకంలో ఉండి చేస్తున్న ప్రస్తుత పరిపాలనకు అంతం అని కొందరు పండితులు దీనికి అర్థం చెప్పారు. ఈ పరిపాలన అంటే అర్థం క్రీస్తు ఈ భూమిపై వెయ్యి సంవత్సరాలు రాజ్యం చేయడం అని ఈ నోట్స్ రచయిత నమ్మకం (ప్రకటన గ్రంథం 20:1-6 చూడండి). క్రీస్తు సమస్త ప్రభుత్వాన్ని, సమస్త అధికారాన్ని, సమస్త శక్తిని ఇంకా రద్దు చేయలేదన్నది స్పష్టమే. నిజానికి తన రెండో రాకడ వరకు ఆయన అలా చెయ్యడు. ప్రకటన గ్రంథం 19:11-16 చూడండి. ఇప్పుడు ఈ యుగాంతం వరకు మనుషుల రాజ్యాలు, ప్రభుత్వాలు, అధికారాలు కొనసాగుతాయి. వెయ్యేళ్ళు పరిపాలనప్పుడు క్రీస్తు వారిని నాశనం చేస్తాడు. “ఆ తరువాత” తాను పరిపాలించిన రాజ్యాన్ని తండ్రి అయిన దేవుని హస్తగతం చేస్తాడు.

25. ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను.
కీర్తనల గ్రంథము 110:1, యెషయా 32:1

“విరోధులందరినీ”– అంటే మనుషుల్లో విరోధులందరూ, సైతాను, దురాత్మలు, దయ్యాలు, మరణం కూడా అని అర్థం. తన ప్రజలను బాధించేవారందరూ, దేవుని పరిపాలనను ఎదిరించే వారందరూ, ఆయన రాజ్యాన్ని వ్యతిరేకించేవారందరూ అని అర్థం.

26. కడపట నశింపజేయబడు శత్రువు మరణము.

27. దేవుడు సమస్తమును క్రీస్తు పాదములక్రింద లోపరచియుంచెను. సమస్తమును లోపరచబడి యున్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచినవాడు తప్ప సమస్తమును లోపరచబడి యున్నదను సంగతి విశదమే.
కీర్తనల గ్రంథము 8:6

28. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడి నప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరచిన దేవునికి తానే లోబడును.

“వశమైన తరువాత”– యోహాను 14:28. యోహాను 5:19-23 నోట్స్ కూడా చూడండి. “సమస్తంలోనూ సమస్తం”– రోమీయులకు 11:36. “కుమారుడు”గురించి నోట్ మత్తయి 3:17; యోహాను 3:16; యోహాను 5:18-23.

29. ఇట్లు కానియెడల మృతులకొరకై బాప్తిస్మము పొందు వారేమి చేతురు? మృతులేమాత్రమును లేపబడనియెడల మృతులకొరకు వారు బాప్తిస్మము పొందనేల?

“చనిపోయినవారి కోసం బాప్తిసం”– అప్పట్లో దీని అర్థమేమిటో, దీన్ని ఎందుకు చేశారో ఇప్పుడు ఎవరికీ తెలియదు. బైబిల్లో మరెక్కడా దీన్ని గురించి ఒక్క మాట లేదు. పౌలు చనిపోయిన వారికోసం బాప్తిసం ఇవ్వలేదు. కొరింతువారు ఇలా చేశారని చెప్పలేదు. ఈ ఆచారాన్ని తాను మెచ్చుకుంటున్నానని కూడా చెప్పలేదు.

30. మరియు మేము గడియగడియకు ప్రాణభయముతో నుండనేల?

వ 19. మరణం తరువాత మంచి భవిష్యత్తు ఉంటుందన్న ఆశాభావమేమీ లేకపోతే ఈ జీవితాన్ని ఎంత బాగా అనుభవిస్తే అంత మంచిది అనుకోవడంలో ఏదో అర్థం ఉండవచ్చు. మరణం నుంచి సజీవంగా లేస్తానని పౌలుకు నిశ్చయంగా తెలుసు కాబట్టి శుభవార్త కోసం ప్రతిదినం అపాయాన్ని మరణాన్ని ఎదుర్కొనేందుకు అతడు సిద్ధమయ్యాడు. 2 కోరింథీయులకు 11:23-27 లో ఇలాంటి ప్రమాదాల జాబితా ఉంది. “ప్రతి రోజూ చావు నాకెదురౌతూ ఉంది” అంటే తనను హత మార్చగల హింసను అతడు ప్రతి రోజూ భరిస్తున్నాడన్న మాట.

31. సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తుయేసునందు మిమ్మునుగూర్చి నాకు కలిగియున్న అతిశయముతోడు నేను దినదినమును చనిపోవుచున్నాను అని చెప్పుదును.

32. మనుష్యరీతిగా, నేను ఎఫెసులో మృగములతో పోరాడినయెడల నాకు లాభమేమి? మృతులు లేపబడనియెడల రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము.
యెషయా 22:13, యెషయా 56:12

“క్రూర మృగాలతో”– పౌలు అక్షరాలా, లేదా సాదృశ్య రూపకంగా ఇలా చెప్పి ఉండవచ్చు. నిజంగా పౌలు క్రూర మృగాలతో పోరాడిన విషయం బైబిల్లో లేదు గాని ఎఫెసులో ఇతర ప్రమాదాలు కొన్నిటిని ఎదుర్కొన్నాడు – 2 కోరింథీయులకు 1:8 చూడండి. బహుశా క్రూర మృగాల్లాంటి దుర్మార్గులు తనను హింసిస్తున్న సంగతి గురించి చెప్తున్నాడు. కీర్తనల గ్రంథము 22:12-13; లూకా 13:32; అపో. కార్యములు 20:29 పోల్చి చూడండి.

33. మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.

స్నేహితులుగా ఉండతగని వారితో విశ్వాసులు స్నేహం చేయడంలో గొప్ప అపాయం ఉంది. ఈ వచనంలో “చెడు సహవాసం” అంటే చనిపోయినవారు సజీవంగా తిరిగి లేస్తారన్న సత్యాన్ని కాదనేవారు.

34. నీతిప్రవర్తనగలవారై మేల్కొని, పాపము చేయకుడి; దేవునిగూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకుసిగ్గు కలుగుటకై యిట్లు చెప్పుచున్నాను.

తప్పుడు ఉపదేశం తప్పుడు జీవిత విధానానికీ పాపానికీ దారి తీస్తుంది. చనిపోయినవారు సజీవంగా లేవడమనే సత్యాన్ని నిరాకరించడం కొరింతు క్రైస్తవుల్లో ఈ ఫలితాన్ని కలిగించింది.

35. అయితే మృతులేలాగు లేతురు? వారెట్టి శరీరముతో వత్తురని యొకడు అడుగును.

కొందరు క్రైస్తవులు అడిగిన కొన్ని ప్రశ్నలకు పౌలు ఇక్కడ జవాబిస్తున్నాడు. వారు అపనమ్మకంలో, బహుశా సజీవంగా లేవడమనే సత్యాన్ని హేళన చేస్తూ కూడా ఈ ప్రశ్నలు అడిగినట్టున్నారు. ఎందుకంటే పౌలు అలా అడిగినవాణ్ణి “తెలివితక్కువ వాడా” అంటున్నాడు గదా (వ 36). మానవ దేహం విత్తనం వంటిది (విశ్వాసుల దేహాల గురించి మాత్రమే పౌలు ఇక్కడ మాట్లాడుతున్నది). అది చనిపోయిన తరువాత ఇప్పుడు కనిపిస్తున్నదానికి పూర్తి భిన్నమైనదిగా మార్పు చెందుతుంది. వివిధ రకాలైన దేహాలు, వివిధ రకాలైన మహిమలు ఉన్నాయి. దేవుడు ఈ భౌతికమైనవాటిని తీసుకుని తన ఇష్టం వచ్చిన రీతిలో మార్చగలడు. విశ్వాసుల దేహాల విషయంలో కూడా అలా చేయగలడు, చేస్తాడు కూడా.

36. ఓ అవివేకీ, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రదికింపబడదు గదా.

37. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమగింజయైనను సరే, మరి ఏ గింజయైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుట లేదు.

38. అయితే దేవుడే తన చిత్తప్రకారము నీవు విత్తినదానికి శరీరము ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు.
ఆదికాండము 1:11

39. మనుష్య మాంసము వేరు, మృగమాంసము వేరు, పక్షి మాంసమువేరు, చేప మాంసము వేరు.

40. మరియు ఆకాశవస్తు రూపములు కలవు, భూవస్తురూపములు కలవు; ఆకాశ వస్తురూపముల మహిమ వేరు, భూవస్తురూపముల మహిమ వేరు.

41. నూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమవేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమనుబట్టి యొక నక్షత్రమునకును మరియొక సక్షత్రమునకును భేదముకలదు గదా

42. మృతుల పునరుత్థానమును ఆలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును;

వారు మరణం నుంచి లేచిన తరువాత విశ్వాసులకు మహిమ ప్రభావంతో కూడిన శరీరాలుంటాయి. అవి మరెన్నటికీ చావవు. అవి ఆధ్యాత్మిక జీవితానికి చక్కగా సరిపోయినవై ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే క్రీస్తు సజీవంగా లేచినప్పుడు ఆయనకున్న దేహంలాగా అవి ఉంటాయి (వ 49; ఫిలిప్పీయులకు 3:21; రోమీయులకు 8:29; 1 యోహాను 3:2; లూకా 24:31, లూకా 24:36, లూకా 24:51; యోహాను 20:19, యోహాను 20:26 చూడండి).

43. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును; బలహీనమైనదిగా విత్తబడి, బలమైనదిగా లేపబడును;

44. ప్రకృతిసంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతిసంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మసంబంధమైన శరీరముకూడ ఉన్నది.

45. ఇందు విషయమై ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయెనని వ్రాయబడియున్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయెను.
ఆదికాండము 2:7

ఆదికాండము 2:7. చివరి ఆదాము అంటే కొత్త రకం మనుషులకు నాయకుడు, ప్రతినిధి, పుట్టించేవాడు అయిన క్రీస్తు. ఆదాముకు జీవం ఉంది. క్రీస్తు జీవాన్ని ఇస్తాడు (యోహాను 5:21-27; యోహాను 11:25-26; యోహాను 14:6). “బ్రతికించే ఆత్మ” అంటే క్రీస్తుకు నిజమైన శరీరం లేదని కాదు (హెబ్రీయులకు 2:14 చూడండి). ఆయన మనిషిగా కాకముందు ఆత్మరూపి.

46. ఆత్మసంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతిసంబంధమైనదే మొదట కలిగినది; తరువాత ఆత్మసంబంధమైనది.

మొదటి ఆదాము ముందు వచ్చాడన్నమాట.

47. మొదటి మనుష్యుడు భూసంబంధియై మంటినుండి పుట్టిన వాడు, రెండవ మనుష్యుడు పరలోకమునుండి వచ్చినవాడు.
ఆదికాండము 2:7

48. మంటినుండి పుట్టినవాడెట్టివాడో మంటినుండి పుట్టినవారును అట్టివారే, పరలోకసంబంధి యెట్టివాడో పరలోకసంబంధులును అట్టి వారే.

మనుషులు ఆదాము నుంచి పొందినది చనిపోయి దుమ్ములో కలిసిపోయే శరీరాలు, పరలోక సంబంధులు క్రీస్తునుంచి అంతకన్నా శ్రేష్ఠమైనదాన్ని పొందుతారు. క్రీస్తు విశ్వాసులు “పరలోక సంబంధులు”– వారి జీవం అక్కడ ఉంది (ఎఫెసీయులకు 2:6; కొలొస్సయులకు 3:1-3), వారి ఆశాభావం అక్కడ ఉంది, వారి నాయకుడు అక్కడ ఉన్నాడు, వారి భవిష్యత్తు, వారి నివాసం, వారి పౌరసత్వం (ఫిలిప్పీయులకు 3:20) అన్నీ అక్కడే ఉన్నాయి. వారికి ఆ ప్రదేశంతో సన్నిహిత సంబంధం ఉంది.

49. మరియు మనము మంటినుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము పరలోకసంబంధిపోలికయు ధరింతుము.
ఆదికాండము 5:3

47-49 వచనాల్లో క్రీస్తును పరలోకంనుండి వచ్చినవాడని మూడు సార్లు అనడం గమనించండి. అంటే భూమికి రాకముందు ఆయన పరలోకంలో ఉన్న మనిషి అని కాదు, పరలోకంలో ఉన్నాడు అని అర్థం మాత్రమే ఇందులో ఉంది. “పోలిక”– వ 42-44.

50. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు; క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు.

ఇప్పుడు విశ్వాసులు దేవుని రాజ్యంలో ఉన్నారు (కొలొస్సయులకు 1:13). అయితే పౌలు దానిలో భాగం వారసత్వంగా పొందడం గురించి రాస్తున్నాడు. రోమీయులకు 8:17-23; ఎఫెసీయులకు 1:14; 1 పేతురు 1:4 చూడండి. ఈ మరణ శరీరాలతో దాన్లో భాగం పంచుకోలేము.

51. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్ప పాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము.

1 థెస్సలొనీకయులకు 4:13-18; యోహాను 14:3. విశ్వాసులంతా మరణించరు. క్రీస్తు వచ్చేనాటికి కొందరు జీవించే ఉంటారు. అప్పుడు వారు రెప్పపాటులో మార్పు చెందుతారు. “రహస్య సత్యం”– దేవుడే వెల్లడి చేసిన సత్యం, వేరే పద్ధతి ద్వారా మనుషులెవరూ తెలుసుకోలేని సత్యం.

52. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము.

“చివరి బూర”– మత్తయి 24:31; ప్రకటన గ్రంథం 11:15. మత్తయి, ప్రకటన పుస్తకాల్లోని ఆ వచనాల్లో చెప్పిన సంఘటనలు జరగకముందే విశ్వాసులు సజీవంగా లేపబడితే, మరి ఈ చివరి బూర మోగినప్పుడు వారికి అలా జరుగుతుందని పౌలు ఇక్కడ రాసిన మాట ఏమౌతుంది? ఈ అంశం గురించి 1 థెస్సలొనీకయులకు 4:17; ప్రకటన గ్రంథం 4:1; ప్రకటన గ్రంథం 7:9-14; ప్రకటన గ్రంథం 11:15; ప్రకటన గ్రంథం 14:16 నోట్స్ చూడండి.

53. క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసి యున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించు కొనవలసియున్నది.

వ 42-44,49.

54. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు,ఈ మర్త్య మైనది అమర్త్యతను ధరించు కొనినప్పుడు, విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును.
యెషయా 25:8

55. ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ?
హోషేయ 13:14

56. మరణపు ముల్లు పాపము; పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే.

మరణానికి స్వతహాగా విషపుకొండి లేదు. దాని కొండి పాపమే (రోమీయులకు 5:12; రోమీయులకు 6:23). పాపంలో చనిపోవడమంటే శాశ్వతంగా నశించిన స్థితిలో ఉండడమే. విశ్వాసుల పాపాన్ని తొలగించడం ద్వారా క్రీస్తు ఈ కొండిని తీసేశాడు. అందువల్ల వారికి మరణం అంటే క్రీస్తుతో జీవంలోకి దారితీసే ఒక తలుపు మాత్రమే (ఫిలిప్పీయులకు 1:21-23). “ధర్మశాస్త్రం”– మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం. అది మనందరినీ నేరస్తులుగా నిలబెడుతుంది (రోమీయులకు 3:19-20), అతిక్రమించడానికి దోహదం చేస్తుంది (రోమీయులకు 4:15), మన భ్రష్ట స్వభావాలు దానిపై తిరగబడి మరింత పాపం చేసేలా చేస్తుంది (రోమీయులకు 7:5-11). ఈ విధంగా అది “పాపానికి బలం”.

57. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక.

“విజయం”– పాపంమీదా, మరణంమీదా, మనకు శాశ్వతమైన హాని కలిగించే వాటన్నిటిమీదా (రోమీయులకు 8:37; 2 కోరింథీయులకు 2:14; 1 యోహాను 5:4). విశ్వాసులపై మరణానికి, పాపానికి విజయం ఉండదు. ఎందుకంటే వాటిపై క్రీస్తు గెలిచాడు. ఆ గెలుపును వారికీ పంచి ఇచ్చాడు. దీనంతటికీ రుజువు క్రీస్తు మరణం నుంచి సజీవంగా లేవడమే.

58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.
2 దినవృత్తాంతములు 15:7

“అందుచేత”– దేవుడు వెల్లడి చేసిన గొప్ప సత్యాలనూ సిద్ధాంతాలనూ నేర్పించాడు పౌలు. ఈ సత్యాలను మనుషులు తమ జీవితాల్లో పాటించి, వాటి మూలంగా మునుపటి కంటే మంచివారు కావాలనే పౌలు ఎప్పుడూ కోరాడు. రోమీయులకు 12:1; 2 కోరింథీయులకు 7:1; గలతియులకు 5:1; ఎఫెసీయులకు 4:1; కొలొస్సయులకు 3:5 పోల్చి చూడండి. “సుస్థిరంగా”– వ 1; 1 కోరింథీయులకు 16:13; 2 కోరింథీయులకు 1:24; గలతియులకు 5:1; ఎఫెసీయులకు 6:11, ఎఫెసీయులకు 6:13-14; కీర్తనల గ్రంథము 15:5; కీర్తనల గ్రంథము 16:8. “ప్రయాస వ్యర్థం కాదు”– వ 10; మత్తయి 21:28; మత్తయి 24:45-46; లూకా 19:11, లూకా 19:24; యోహాను 4:34-36; 2 కోరింథీయులకు 9:8; కొలొస్సయులకు 1:10; హెబ్రీయులకు 6:10; హెబ్రీయులకు 13:21; ప్రకటన గ్రంథం 22:12; ప్రసంగి 9:10. మన ప్రయాస వ్యర్థం కావడమంటూ ఎప్పుడూ జరగదు. ఎందుకంటే చనిపోయినా భవిష్యత్తులో సజీవంగా లేవడం అనేది ఉంటుంది. అప్పుడు ప్రతి వ్యక్తికీ తన ప్రయాసకు తగిన ప్రతిఫలం దొరుకుతుంది. కానీ వ్యర్థం కాని పనులేమిటో గమనించండి – “ప్రభువులో” ఉన్న ప్రయాస, ప్రభువు కోసమైన ప్రయాస. అంటే ప్రభువు యొక్క బలంతో ఆయన ఆదేశాల మేరకు చేసే ప్రభుసేవ.Shortcut Links
1 కోరింథీయులకు - 1 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |