Corinthians I - 1 కొరింథీయులకు 8 | View All

1. విగ్రహములకు బలిగా అర్పించినవాటి విషయము: మనమందరము జ్ఞానముగలవారమని యెరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును.

ఆ రోజుల్లో క్రైస్తవులకు ఈ విషయంలో కూడా అభిప్రాయ భేదాలుండేవి. విగ్రహాలకు అర్పించిన ఆహారాన్ని తినడం పర్వాలేదని కొందరు అన్నారు. అది తప్పని మరి కొందరు అన్నారు. ఈ సమస్యకు సంబంధించిన కొన్ని సత్యాలు అందరికీ తెలుసు. కానీ పౌలు ఈ చర్చను అంతకంటే ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాడు. తెలివికన్నా క్రైస్తవ ప్రేమ ముఖ్యమనీ ప్రేమ లోపించిన తెలివి హానికరమయ్యే అవకాశం ఉందనీ అంటున్నాడు. విశ్వాసుల ప్రవర్తనకు తగిన ఉత్తమమైన సూత్రాలను అతడు ఇక్కడ ఇస్తున్నాడు – ఇతర విశ్వాసులను ప్రేమతో చూడాలి, వారి అభివృద్ధికి సహాయపడాలి, వారికి హాని చేసే దేనినైనా మానుకోవాలి. తెలివి ఉన్న వ్యక్తిలో అది గర్వాన్ని, అహంకారాన్ని కలిగించవచ్చు. ప్రేమతో వ్యవహరించడం ఇతరులకు క్రైస్తవ జీవితంలో అభివృద్ధి కలిగిస్తుంది.

2. ఒకడు తనకేమైనను తెలియుననుకొని యుంటే, తాను తెలిసికొనవలసినట్టు ఇంకను ఏమియు తెలిసికొనినవాడు కాడు.

ఏ విషయం గురించైనా తెలుసుకోగలిగినదంతా ఎవరికీ తెలియదు. తనకున్న కొద్దిపాటి తెలివి గురించి గర్వించడం బుద్ధిహీనత. మనకు తెలిసినదెంత తక్కువో వినయంతో ఒప్పుకోవడమే తెలివి అనిపించుకుంటుంది.

3. ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైనవాడే.

దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండడం తెలివంతటికన్నా గొప్పది. అది స్వయంగా అత్యంత ఉన్నతమైన జ్ఞానం (1 కోరింథీయులకు 13:2; 1 యోహాను 4:7-8). తనను ప్రేమించేవారెవరో దేవునికి తెలుసు. తనకు చెందినవారుగా వారిని ఆయన గుర్తించి వారిని ఆమోదిస్తాడు (2 తిమోతికి 2:19; గలతియులకు 4:9 పోల్చి చూడండి).

4. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించినవాటిని తినుట విషయము : లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము.
ద్వితీయోపదేశకాండము 4:35, ద్వితీయోపదేశకాండము 4:39, ద్వితీయోపదేశకాండము 6:5

5. దేవతలన బడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు.

ఆకాశంలో, భూమి మీదా అనేకమంది దేవుళ్ళు, ప్రభువులు ఉన్నారని విగ్రహపూజ చేసేవారు అనుకుంటారు, కానీ క్రీస్తు విశ్వాసులకు నిజమైన దేవుడు, నిజమైన ప్రభువు ఆయనొక్కడే అని తెలుసు. 1 కోరింథీయులకు 10:20 లో కొందరు పూజించే దేవుళ్ళు, ప్రభువుల గురించి పౌలు ఏమి రాశాడో చూడండి.

6. ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.
మలాకీ 2:10

వ 4. ఒకే ప్రభువు ఉన్నాడు, ఆయన యేసుప్రభువు అనడంలో తండ్రి అయిన దేవుడు ప్రభువు కాదని అర్థం కాదు. యేసు స్వయంగా ఆయన్ను ప్రభువని పిలిచాడు – మత్తయి 11:25. అదే విధంగా ఒకే దేవుడు ఉన్నాడు, ఆయన పరమ తండ్రి అంటే యేసుక్రీస్తు దేవుడు కాడని అర్థం కాదు. దేవుడు బైబిలు రచయితలచేత ఆయన్ను దేవుడు అని రాయించాడు (యెషయా 9:6; యోహాను 1:1; అపో. కార్యములు 20:28; రోమీయులకు 9:5; ఫిలిప్పీయులకు 2:6; కొలొస్సయులకు 2:9; తీతుకు 2:13; హెబ్రీయులకు 1:3, హెబ్రీయులకు 1:8; 1 యోహాను 5:20). ఆయనద్వారా అన్నీ ఉనికిలోకి వచ్చాయని పౌలు రాస్తున్నాడు. ఇదే మాటలను రోమీయులకు 11:36 లో దేవుని విషయంలో ఉపయోగించాడు. నిజానికి యేసు ప్రభువని చెప్తే దేవుడని చెప్పినట్టే. లూకా 2:11; ఫిలిప్పీయులకు 2:6, ఫిలిప్పీయులకు 2:10-11 నోట్స్ చూడండి. అలాగైతే ఇద్దరు దేవుళ్ళున్నారా? ఎంతమాత్రం కాదు. దేవుడొక్కడే, ఒకే దైవత్వంలో ముగ్గురు వ్యక్తులున్నారు. త్రిత్వం గురించి నోట్స్ మత్తయి 3:16-17 చూడండి. ఒకే నిజ దేవుణ్ణి పౌలు అన్నిటికీ సృష్టికర్తగా వర్ణిస్తున్నాడని గమనించండి (ఆదికాండము 1:1; యెషయా 40:25-28). మనం వెతకవలసినది, ఆరాధించవలసినది ఆయన్నే వేరెవరినీ కాదు.

7. అయితే అందరియందు ఈజ్ఞానము లేదు. కొందరిదివరకు విగ్రహమును ఆరాధించినవారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి యియ్యబడినవని యెంచి భుజించుదురు;

విగ్రహం వట్టిదనీ, విగ్రహానికి అర్పించిన ఆహారం అన్ని ఆహారాల్లాంటిదే అనీ, ఏమీ అశుద్ధమైపోదనీ అందరికీ తెలియదు అంటున్నాడు పౌలు. ఎవరి ఇళ్ళల్లో వారు కూడా అలాంటి ఆహారాన్ని తినడం తప్పని కొందరు క్రైస్తవులు భావించారు. అలా తింటే వారి అంతర్వాణి వారిపై నేరం మోపింది. వివేచనాశక్తి లేని అంతర్వాణి అంటే ఒక విషయం నిజానికి పాపం కాకపోయినప్పటికీ అది పాపమనుకునేది. లేక ఒక విషయం పాపం అయి ఉన్నా అది పాపం కాదనుకునేది.

8. భోజనమునుబట్టి దేవుని యెదుట మనము మెప్పుపొందము; తినకపోయినందున మనకు తక్కువలేదు, తినినందున మనకు ఎక్కువలేదు.

కొరింతులో ఉన్న కొందరు ఇలా చెప్పేవారు. పౌలు దానికి అవునంటున్నాడు. కానీ తరువాతి వచనాల్లో ఇంతకన్నా ఉన్నతమైన ఆదర్శం మరో దాన్ని గురించి చెప్తున్నాడు.

9. అయినను మీకు కలిగియున్న యీస్వాతంత్ర్యమువలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండ చూచుకొనుడి.

1 కోరింథీయులకు 10:23-33; రోమీయులకు 14:14-23 పోల్చి చూడండి. విశ్వాసులకు ఎలాంటి ఆహారమైనా తినడానికీ, తినకపోవడానికీ స్వేచ్ఛ ఉంది. అయితే ఈ స్వేచ్ఛ కన్నా వారు పట్టించుకోవలసిన సంగతులు మరి కొన్ని ఉన్నాయి. తమను తాము తృప్తి పరచుకోవడం కంటే తోటి విశ్వాసులే వారికి ఎక్కువ ప్రీతికరం కావాలి.

10. ఏలయనగా జ్ఞానముగల నీవు విగ్రహాలయమందు భోజనపంక్తిని కూర్చుండగా ఒకడు చూచినయెడల, బలహీనమైన మన స్సాక్షిగల అతడు విగ్రహములకు బలి యియ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును గదా?

“సత్యం తెలిసిన మీరు”– వ 4. “విగ్రహాల”– విశ్వాసులెవరూ ఇలాంటి స్థలంలో ఏమీ తినకూడదని పౌలు చెప్పాడు (1 కోరింథీయులకు 10:19-20). అలా చెయ్యడం ఫర్వాలేదని ఇక్కడ చెప్పడం లేదని ఖచ్చితంగా అనుకోవచ్చు.

11. అందువలన ఎవనికొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమునుబట్టి నశించును.

ఆ బలహీన సోదరులకోసం చనిపోయేంతగా క్రీస్తు వారిని ప్రేమించాడు. బలవంతులైన విశ్వాసులు అలాంటి ఆహారం తినడం మానుకునేంతగా, లేదా బలహీనులకు హాని కలిగేలా ప్రవర్తించడం మానుకునేంతగా వారిని ప్రేమించకూడదా? “పాడై”– రోమీయులకు 14:15. అంటే అతడి ఆధ్యాత్మిక జీవితానికి దెబ్బ తగులుతుంది అని అర్థం. 2 థెస్సలొనీకయులకు 1:9 లో ఉన్నట్టుగా ప్రభు సన్నిధిలోనుంచి దూరమై అంతిమ నాశనం గురించి ఇది మాట్లాడ్డం లేదు (యోహాను 6:37-40; యోహాను 10:27-29; రోమీయులకు 5:9-10; రోమీయులకు 8:28-39).

12. ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను, మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయు వారగుచున్నారు.

ఒక విశ్వాసి పాపం చేయడానికి కారణమైనవారెవరైనా అతడు ఆ వ్యక్తికీ, క్రీస్తుకూ విరోధంగా పాపం చేస్తున్నాడు (అపో. కార్యములు 9:4; కీర్తనల గ్రంథము 51:4 పోల్చి చూడండి).

13. కాబట్టి భోజనపదార్థమువలన నా సహోదరునికి అభ్యంతరము కలిగినయెడల, నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేనెన్నటికిని మాంసము తినను.

ఆహారం విషయంలో మాత్రమే గాక అన్నిటిలోనూ పౌలు అనుసరించిన నియమం ఇదే. మనం కూడా దీన్ని అనుసరించాలి (1 కోరింథీయులకు 10:24, 1 కోరింథీయులకు 10:32-33). ఇది ప్రేమ నియమం. ప్రేమించవలసిన రీతిగా ప్రేమించేవారు ఇతరులకు మేలు కలిగేలా తమను కాదనుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.Shortcut Links
1 కోరింథీయులకు - 1 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |