Corinthians II - 2 కొరింథీయులకు 1 | View All

1. దేవుని చిత్తమువలన క్రీస్తు యేసుయొక్క అపొస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును, కొరింథులో నున్న దేవుని సంఘమునకును, అకయయందంతటనున్న పరిశుద్ధులకందరికిని శుభమని చెప్పి వ్రాయునది.

రోమీయులకు 1:1; 1 కోరింథీయులకు 1:1. పౌలు నిజంగా క్రీస్తురాయబారి కాదని కొరింతులో ఉన్న కొందరు అతణ్ణి వ్యతిరేకించి వాదించారు. ఈ లేఖలో ఆ వివాదానికి పౌలు జవాబు చెప్పవలసివచ్చింది. “అకయ”– గ్రీసు దేశంలో కొరింతు ఉన్న ప్రాంతం. “తిమోతి”– వ 19; అపో. కార్యములు 16:1-3; 1 తిమోతికి 1:2.

2. మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక.

3. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తుతండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక.

ఈ లేఖలోని రెండు ముఖ్యాంశాలు ఇక్కడ కనిపిస్తున్నవి – “ఆదరణ”, కష్టాలు”. ఆదరణ అనే పదం వివిధ రూపాల్లో 17 సార్లు కనిపిస్తుంది. కష్టాలు, బాధలు మొదలైన పదాలుగా తర్జుమా చేసిన గ్రీకు పదాలు దాదాపు అదే సంఖ్యలో కనిపిస్తాయి. పౌలు తన కష్టాల గురించి తన గోడు వినిపించుకోవడం లేదు – దీనికి సరిగ్గా వ్యతిరేకంగా చేస్తున్నాడు (2 కోరింథీయులకు 6:10; 2 కోరింథీయులకు 7:4; 2 కోరింథీయులకు 12:10; రోమీయులకు 5:3). తన కష్టాలు, బాధలు తనకు మేలే చేస్తున్నాయని తెలుసుకున్నాడు. వాటి మూలంగా దేవుణ్ణి గురించి మరింత లోతైన అనుభవంలోకి అతడు రాగలిగాడు (వ 3,4) ఆ బాధలు పడడం మేలే అనిపించేంతగా క్రీస్తులోని తియ్యని ఆదరణను అతడు అనుభవించాడు (వ 5) దానిమూలంగా ఇతరులను మరింత బాగా ఓదార్చగలిగాడు (వ 4,6) దేవునిపై ఎక్కువగా ఆధారపడడం నేర్చుకున్నాడు (వ 9) రాబోయే శాశ్వత యుగాల్లో మరింత మహిమ కలగడానికి ఇప్పటి బాధలు దోహదం చేస్తున్నాయని మరింత స్పష్టంగా అర్థం చేసుకోగలిగాడు (2 కోరింథీయులకు 4:17) తన బాధల్లోనే వాటివల్ల కలిగే బలహీనతలోనే తనలోని దేవుని బలం అధికమౌతున్నట్టు గ్రహించాడు (2 కోరింథీయులకు 12:9-10) యోబు 3:20 నోట్ కూడా చూడండి. దేవుని స్వభావం గురించి పౌలు తన కష్టాలు, బాధల ద్వారా మరింత బాగా నేర్చుకున్న సత్యం ఇది. “కరుణామయుడు”– నిర్గమకాండము 34:6; కీర్తనల గ్రంథము 86:15; కీర్తనల గ్రంథము 103:13; కీర్తనల గ్రంథము 111:4; కీర్తనల గ్రంథము 145:8; విలాపవాక్యములు 3:22; మీకా 7:19; మత్తయి 9:36. “ఆదరణ”– కీర్తనల గ్రంథము 23:4; కీర్తనల గ్రంథము 119:50; యెషయా 40:1; యెషయా 61:2; యెషయా 66:13; 2 థెస్సలొనీకయులకు 2:16-17; హెబ్రీయులకు 6:18. దేవుని ఆత్మకు “ఆదరణకర్త” అనే పేరు ఈ గ్రీకు మూలపదం నుంచే వచ్చింది (యోహాను 14:16).

4. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవార మగునట్లు, ఆయన మాశ్రమ అంతటిలో మమ్మును ఆదరించు చున్నాడు.

“అన్నిటిలోనూ”– దేవుడు “అన్ని విధాలా” ఆదరణ కలిగించేవాడు. ఏ కష్టమైనా ఆయన ఆదరణ ఇస్తాడు. విశ్వాసులు ఓదార్పును నిరాకరిస్తే (మత్తయి 2:18 పోల్చి చూడండి) ఆ ఆదరణను అనుభవించకుండా ఉంటారు. కేవలం పౌలు కోసమనే దేవుడు అతణ్ణి ఆదరించలేదు, పౌలు ఇతరులను ఆదరించగలగాలని అలా చేశాడు (వ 6).

5. క్రీస్తుయొక్క శ్రమలు మాయందేలాగు విస్తరించుచున్నవో, ఆలాగే క్రీస్తుద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది.
కీర్తనల గ్రంథము 34:19, కీర్తనల గ్రంథము 94:19

“క్రీస్తు బాధలు”– రోమీయులకు 8:17; ఫిలిప్పీయులకు 1:29; ఫిలిప్పీయులకు 3:10; కొలొస్సయులకు 1:24. క్రీస్తు ఇతరుల కోసం బాధలు అనుభవించాడు. తన ప్రజల కోసం ఇంకా బాధల పాలవుతూనే ఉన్నాడు (అపో. కార్యములు 9:4-5). ఇతరులకోసం ఆయనతో కలిసి సంతోషంగా బాధలు అనుభవించేందుకు ఒప్పుకునేవారికి ఈ ఆదరణ ఏమిటో తెలుస్తుంది (యోహాను 16:33).

6. మేము శ్రమ పొందినను మీ ఆదరణకొరకును రక్షణకొరకును పొందుదుము; మేమాదరణ పొందినను మీ ఆదరణకొరకై పొందుదుము. ఈ ఆదరణ, మేముకూడ పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై యున్నది.

పౌలు జీవితమంతా ఇతరుల కోసం. అతడి బాధలు, అతడికి కలిగిన ఆదరణ రెండూ వారికోసమే (1 కోరింథీయులకు 9:19-23; 1 కోరింథీయులకు 10:24, 1 కోరింథీయులకు 10:33; 2 తిమోతికి 2:10). అతడి ఆదర్శాన్ని అనుసరించేవారు మాత్రమే దేవునినుంచి అతనికి కలిగిన ఆదరణంతా తమకు కలగాలని ఎదురుచూచే హక్కు ఉన్నవారు. బాధలవల్ల కలిగే ఫలితం సహనం – రోమీయులకు 5:3-5; యాకోబు 1:2-4; యాకోబు 5:11.

7. మీరు శ్రమలలో ఏలాగు పాలివారైయున్నారో, ఆలాగే ఆదరణలోను పాలివారైయున్నారని యెరుగుదుము గనుక మిమ్మునుగూర్చిన మా నిరీక్షణ స్థిరమైయున్నది.

కొరింతు విశ్వాసులు కూడా క్రీస్తు బాధల్లో పాలిభాగస్థులు. పౌలు హింసలకు గురి అయినంతగా కాకపోయినా వారు కూడా హింసలకు గురి అయ్యారు. క్రీస్తు బాధల్లో, ఆయన ప్రజల బాధల్లో పాలు పొందడానికి ఇష్టపడడమంటే క్రీస్తు ఇచ్చే ఆదరణ, ఆనందాలలో పాలు పొందడమే.

8. సహోదరులారా, ఆసియలో మాకు తటస్థించిన శ్రమనుగూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు; అదేదనగా మేము బ్రదుకుదుమను నమ్మకములేక యుండునట్లుగా, మా శక్తికి మించిన అత్యధిక భారమువలన క్రుంగిపోతివిు.

“ఆసియా”– అపో. కార్యములు 16:6; అపో. కార్యములు 18:19. ఎఫెసు ఆసియా రాష్ట్రంలో ప్రధాన నగరం. “భారం”– వ 10; 2 కోరింథీయులకు 4:8-9; 2 కోరింథీయులకు 6:9; 2 కోరింథీయులకు 11:23-29 పోల్చి చూడండి. అతనికెదురైన ప్రమాదాలు, కష్టాలు తనకు తానుగా తప్పించుకోలేనివి, జయించలేనివి.

9. మరియు మృతులను లేపు దేవునియందేగాని, మాయందే మేము నమ్మిక యుంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మామట్టుకు మాకు కలిగియుండెను.

“మరణం”– తనకు మరణ సమయం వచ్చిందని పౌలుకు అనిపించింది. అయితే ఇది కూడా అతని మేలుకే (రోమీయులకు 8:28). దేవునిపై అతడు ఆధారపడడం మరింత బాగా నేర్చుకున్నాడు. చనిపోయినవారిని తిరిగి లేపగలిగిన దేవుడు ఎంత భయానకమైన ప్రాణాపాయం వచ్చినా తనను కాపాడగలడని పౌలు గ్రహించాడు.

10. ఆయన అట్టి గొప్ప మరణమునుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మాకొరకు ప్రార్థనచేయుటవలన మీరు కూడ సహాయము చేయుచుండగా, ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయనయందు నిరీక్షణ గలవారమై యున్నాము.

ఇది అద్భుత రీతిగా ఊహించని విధంగా పౌలుకు విడుదల కలిగిన సందర్భమై ఉండాలి. ఇది భవిష్యత్తు గురించి అతనికి గొప్ప నిశ్చయతను ఇచ్చింది. 2 తిమోతికి 4:18 పోల్చి చూడండి. 1 సమూయేలు 17:34-37 కూడా చూడండి.

11. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా, మాకు కలిగిన కృపావరముకొరకు అనేకులచేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును.

వారు తగినరీతిగా జీవించకపోవడం చూచి పౌలు కొరింతు విశ్వాసులను మందలించవలసి వచ్చింది – 1 కోరింథీయులకు 3:1-4; 1 కోరింథీయులకు 5:1-2; 1 కోరింథీయులకు 6:1; మొ।।. అయినప్పటికీ వారి ప్రార్థనలను విలువైనవిగా ఎంచాడు పౌలు. అవి తనకు తోడ్పడతాయని ఖచ్చితంగా నమ్మాడు (ఫిలిప్పీయులకు 1:19; ఫిలేమోనుకు 1:22 పోల్చి చూడండి). బలహీనులు, తరచుగా పడిపోతూ ఉండే విశ్వాసుల ప్రార్థనలు కూడా దేవుని దగ్గర పూర్తిగా ప్రభావం లేనివి కావని దీన్ని బట్టి మనం నేర్చుకుందాం. దేవునికి కృతజ్ఞతలు అంతటా వెల్లివిరియాలని కూడా పౌలు కోరుతున్న విషయం గమనించండి (2 కోరింథీయులకు 4:15; 2 కోరింథీయులకు 9:11-13).

12. మా అతిశయమేదనగా, లౌకిక జ్ఞానము ననుసరింపక, దేవుడనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటి మనియు, విశేషముగా మీయెడలను నడుచుకొంటిమనియు, మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే

పౌలు నిజాయితీని, యథార్థతను కొరింతులో కొందరు ప్రశ్నిస్తున్నారు (2 కోరింథీయులకు 13:3). అందువల్ల అతడీ మాటలు రాస్తున్నాడు. వారు తనను నమ్మడం ముఖ్యమైన సంగతి – తనకోసం కాదు, వారికోసమే. అతని “అతిశయం” తనను కాదు, తాను ప్రకటించిన శుభవార్తనూ తన రాయబారి పదవినీ సమర్థించుకోవడానికే. 2 కోరింథీయులకు 11:13 లో ఉన్న కపట బోధకులు ఈ లేఖ అంతటా కనిపిస్తూనే ఉన్నారు. వారు అబద్ధమైన శుభవార్తను ఒకదాన్ని తెచ్చారు. వారు దాన్ని సమర్థించుకోవాలంటే పౌలుకు వ్యతిరేకంగా మాట్లాడ్డం తప్పదు. నిజమైన శుభవార్తను సమర్థించాలంటే పౌలు వారి దాడులను ఎదుర్కొని తాను నిజంగా దేవుని సేవకుడనీ క్రీస్తు రాయబారి అనీ చూపించవలసి వచ్చింది. కొరింతువారికి పౌలు నిజమైనవాడుగా కనబడితే అతడు ప్రకటించే శుభవార్త నమ్మతగినదిగా కనబడుతుంది, లేకపోతే నమ్మతగనదిగా కనిపించవచ్చు. తన గురించి అతడు వారికి రాసినదంతా వారి మేలు కోసమే (2 కోరింథీయులకు 12:19). ఆ సమయంలో చూద్దామంటే వారికి క్రొత్త ఒడంబడిక గ్రంథం గానీ కనీసం ఒక్క శుభవార్త పుస్తకం గానీ అందుబాటులో లేదు. “అతిశయం”– ఈ లేఖలో ఇది మరో ముఖ్యాంశం. పౌలు ఈ మాట వివిధ నామవాచకాల్లో క్రియా రూపాల్లో ఈ లేఖలో 31 సార్లు వాడాడు (గ్రీకులో). ఇక్కడ “అతిశయం” అని తర్జుమా చేసిన గ్రీకు పదం రోమ్ 5:2-3లో “ఉత్సాహం”గా కనిపిస్తున్నది. ఈ అతిశయం దేవునిలో ఒక పవిత్రమైన ఆనందం లాంటిది. పాపులు, అవిశ్వాసులైన మనుషులు డంబాలు కొట్టుకోవడం వంటిది కాదిది. వారేమో తమ బలం గురించి, తెలివితేటలు, సామర్థ్యం గురించి గొప్పలు చెప్పుకుంటారు. పౌలు అయితే దేవుణ్ణి గురించి, దేవుడు తనలో, తనతో చేసినదాన్ని గురించి గొప్పగా చెప్పుకున్నాడు. తనలో మంచిది ఏది ఉన్నా అది దేవునినుంచేననీ, దేవుని కృపవల్లే వచ్చిందనీ అతనికి బాగా తెలుసు – రోమీయులకు 7:18; 1 కోరింథీయులకు 1:29, 1 కోరింథీయులకు 1:31.

13. మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప, మరేవియు మీకు వ్రాయుట లేదు; కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాము.

14. మరియు మన ప్రభువైన యేసుయొక్క దినమందు మీరు మాకేలాగో, ఆలాగే మేము మీకును అతిశయకారణమై యుందుమని, మీరు కొంత మట్టుకు మమ్మును ఒప్పుకొనియున్నారు.

“రోజున”– ఆ దినాన వారు తనకు ఆనంద కారణం అవుతారని అతనికి దృఢ విశ్వాసం ఉంది. ఫిలిప్పీయులకు 4:1; 1 థెస్సలొనీకయులకు 2:19-20 పోల్చి చూడండి.

15. మరియు ఈ నమ్మికగలవాడనై మీకు రెండవ కృపావరము లభించునట్లు మొదట మీయొద్దకు వచ్చి,

పౌలు సత్యం చెప్తున్నాడన్న సంగతినీ, అతని యథార్థతనూ కొరింతువారు కొందరు సందేహించిన కారణం ఈ వచనాల్లో ఉంది. పౌలు జవాబు కూడా ఇక్కడ చూడవచ్చు. కొరింతుకు మరో సారి వెళ్ళాలని నిర్ణయించుకుని వారికి కూడా చెప్పాడు. కానీ కొన్ని మంచి కారణాల వల్ల తన నిర్ణయం మార్చుకున్నాడు. కాబట్టి పౌలు మాటల్లో నిలకడలేని వాడని అతని విరోధులు అన్నారు. ఇది అతడు ప్రకటించిన శుభవార్తను కూడా సందేహించడానికి కారణమని అన్నారు. ఆ శుభవార్త విషయం కూడా ఒకవేళ పౌలు మనసు మార్చుకుంటాడేమో అన్నారు. పౌలుకైతే తన పరువు మర్యాదలకన్నా శుభవార్త పరువు ముఖ్యం. అయితే ఈ రెండూ ముడిపడి ఉన్నాయి. అందువల్ల క్రీస్తుశుభవార్త కోసమని తన పేరుపై ఉన్న మచ్చ తొలగిపోవాలని పౌలు కోరిక. ఇందులో పౌలు క్రీస్తు సేవకులందరికీ ఆదర్శం. మన పేరుప్రతిష్ఠలు, క్రీస్తు పేరుప్రతిష్ఠలు ఏ విధంగా ముడిపడి ఉన్నాయో మనందరం గుర్తించాలి. ముందు ఆలోచించుకున్నది ఇది గానీ దీన్ని అతడు మార్చుకోవలసి వచ్చింది (1 కోరింథీయులకు 16:5-7 పోల్చి చూడండి). సరైన కారణం లేకుండా అస్తమానం అతడు తన మనస్సు మార్చుకుంటున్నట్టు వారు తలంచారు. పౌలు లోక సంబంధమైన రీతిలో తన కార్యక్రమాలు నిర్ణయించుకుంటాడని, చపలచిత్తుడని, చెప్పిన మాటమీద నిలబడేవాడు కాదనీ వారు అతని గురించి అనుకున్నారేమోనని అతని భయం.

16. మీ యొద్దనుండి మాసిదోనియకు వెళ్లి మాసిదోనియనుండి మరల మీయొద్దకు వచ్చి, మీచేత యూదయకు సాగనంప బడవలెనని ఉద్దేశించితిని.

17. కావున నేనీలాగు ఉద్దేశించి చపలచిత్తుడనుగా నడుచుకొంటినా? అవును అవునని చెప్పుచు, కాదు కాదనునట్టు ప్రవర్తింపవలెనని నా యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా?

18. దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనునట్టుగా ఉండలేదు.

వ 17లో ఉన్న ఆరోపణవంటి దాన్ని వారు నమ్మారేమో అని పౌలు శుభవార్త పక్షంగా కంగారుపడ్డాడు. అందువల్ల అది నిజం కాదని ఘంటాపథంగా వారికి చెప్తున్నాడు. తన సందేశం, ఉపదేశం ఎప్పుడూ స్థిరమైనవే, ఖాయమైనవే, “అవును” అనేవే. అతి ప్రాముఖ్యమైన ఆ విషయాల గురించి అతని మనసులో ఎలాంటి ఊగిసలాటలు, మార్పులు లేవు. తాను ప్రకటించిన క్రీస్తులో కూడా ఎలాంటి మార్పులు, ఊగిసలాటలు లేవని అతడు గట్టిగా చెప్పగలిగాడు. దేవుడు చేసిన ప్రతి వాగ్దానాన్నీ ఆయన క్రీస్తులో నెరవేరుస్తాడు.

19. మాచేత, అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతిచేతను, మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడై యుండలేదు గాని ఆయన అవుననువాడై యున్నాడు.

20. దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక మనద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయనవలన నిశ్చయములై యున్నవి.

21. మీతో కూడ క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే.

దేవుని శుభవార్త, దేవుని సత్యం విషయంలో విశ్వాసులంతా చలనం లేకుండా స్థిరంగా ఉండాలని పౌలుకు బాగా తెలుసు (1 కోరింథీయులకు 15:58; 1 కోరింథీయులకు 16:13). దేవుడు మాత్రమే వారినలా చేయగలడు (రోమీయులకు 16:25; 1 పేతురు 5:10). “అభిషేకించి”– నన్ను అభిషేకించి అనడం లేదు పౌలు, “మనలను” అంటున్నాడు. విశ్వాసులందరినీ దేవుడు అభిషేకించాడు – 1 యోహాను 2:20, 1 యోహాను 2:27. వారిని తన ఆత్మతో అభిషేకించి ఇతర మనుషులకు వేరుగా, యాజుల రాజ్యంగా ఉంచుతాడు (ప్రకటన గ్రంథం 1:6. అభిషేకం గురించి నోట్ మత్తయి 1:1 చూడండి. లూకా 4:18; అపో. కార్యములు 10:38 పోల్చి చూడండి).

22. ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి యున్నాడు.

“ముద్ర వేసి”– ఎఫెసీయులకు 1:13; ఎఫెసీయులకు 4:30; 2 థెస్సలొనీకయులకు 2:13. ఈ ముద్ర దేవుని ఆత్మ. విశ్వాసులు దేవుని ప్రత్యేకమైన సొత్తుగా ఉన్నారని ఆయన సన్నిధి సూచిస్తున్నది (1 కోరింథీయులకు 6:19-20; రోమీయులకు 8:9; యోహాను 17:6, యోహాను 17:10). “హామీగా”– 2 కోరింథీయులకు 5:5; ఎఫెసీయులకు 1:14 చూడండి. విశ్వాసులకు దేవుడు తన ఆత్మను ఇవ్వడం అంటే తాను వాగ్దానం చేసిన వారసత్వాన్ని కూడా ఇస్తానని హామీ ఇవ్వడం (రోమీయులకు 8:17, రోమీయులకు 8:23; 1 పేతురు 1:4). వారి అంతిమ విముక్తికి దేవుడు వారికిచ్చిన జామీను అన్నమాట. దేవుని ఆత్మ మనలో ఉన్నాడన్నది ఎంత ఖాయమో మనందరం కూడా ఎన్నడూ నశించమన్నదీ అంతే ఖాయం. యోహాను 6:37-40; యోహాను 10:27-29; యోహాను 17:11-12; రోమీయులకు 5:9-10; రోమీయులకు 8:28-39.

23. మీయందు కనికరము కలిగినందున నేను మరల కొరింథునకు రాలేదు. నా ప్రాణముతోడు ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను.

పౌలు ఎంత గంబీరంగా మాట్లాడుతున్నాడో చూడండి. క్రీస్తు శుభవార్త పరువు మర్యాదలను కాపాడడమే అతని ముఖ్య శ్రద్ధ. ఇక్కడ తాను వారిదగ్గరికి వెళ్ళదలచిన విషయంలో తన మనస్సు ఎందుకు మార్చుకోవలసి వచ్చిందో కారణం ఇస్తున్నాడు. ఇచ్చిన మాటంటే తనకు లెక్క లేక కాదు. వారంటే అతనికెంతో శ్రద్ధ గనుక. 2 కోరింథీయులకు 2:1-4 కూడా చూడండి. కొరింతులో ఉన్న సంఘం ఎంత హీనమైన స్థితిలో ఉందంటే తాను గనుక వస్తే వారికీ తనకూ కూడా బాధ, విచారం కలగడం ఖాయం. వారికి ఇలా జరగడం పౌలుకు ఇష్టం లేదు. 1 కోరింథీయులకు 4:21 చూడండి.

24. మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని యీలాగు చెప్పుటలేదు గాని మీ ఆనందమునకు సహకారులమై యున్నాము; విశ్వాసముచేతనే మీరు నిలుకడగా ఉన్నారు.

తనను వారు అపార్థం చేసుకోకూడదని పౌలు కోరిక. అతడు వారిని శాసించగల నిరంకుశుడు కాదు. వారిని నిలబెట్టినది వారి సొంత నమ్మకమే, వారిపై తాను చేయగలిగిన ఏ అధికారమూ కాదు (2 కోరింథీయులకు 13:10). 1 పేతురు 5:3 పోల్చి చూడండి.Shortcut Links
2 కోరింథీయులకు - 2 Corinthians : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |