12. మా అతిశయమేదనగా, లౌకిక జ్ఞానము ననుసరింపక, దేవుడనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటి మనియు, విశేషముగా మీయెడలను నడుచుకొంటిమనియు, మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే
పౌలు నిజాయితీని, యథార్థతను కొరింతులో కొందరు ప్రశ్నిస్తున్నారు (2 కోరింథీయులకు 13:3). అందువల్ల అతడీ మాటలు రాస్తున్నాడు. వారు తనను నమ్మడం ముఖ్యమైన సంగతి – తనకోసం కాదు, వారికోసమే. అతని “అతిశయం” తనను కాదు, తాను ప్రకటించిన శుభవార్తనూ తన రాయబారి పదవినీ సమర్థించుకోవడానికే. 2 కోరింథీయులకు 11:13 లో ఉన్న కపట బోధకులు ఈ లేఖ అంతటా కనిపిస్తూనే ఉన్నారు. వారు అబద్ధమైన శుభవార్తను ఒకదాన్ని తెచ్చారు. వారు దాన్ని సమర్థించుకోవాలంటే పౌలుకు వ్యతిరేకంగా మాట్లాడ్డం తప్పదు. నిజమైన శుభవార్తను సమర్థించాలంటే పౌలు వారి దాడులను ఎదుర్కొని తాను నిజంగా దేవుని సేవకుడనీ క్రీస్తు రాయబారి అనీ చూపించవలసి వచ్చింది. కొరింతువారికి పౌలు నిజమైనవాడుగా కనబడితే అతడు ప్రకటించే శుభవార్త నమ్మతగినదిగా కనబడుతుంది, లేకపోతే నమ్మతగనదిగా కనిపించవచ్చు. తన గురించి అతడు వారికి రాసినదంతా వారి మేలు కోసమే (2 కోరింథీయులకు 12:19). ఆ సమయంలో చూద్దామంటే వారికి క్రొత్త ఒడంబడిక గ్రంథం గానీ కనీసం ఒక్క శుభవార్త పుస్తకం గానీ అందుబాటులో లేదు.
“అతిశయం”– ఈ లేఖలో ఇది మరో ముఖ్యాంశం. పౌలు ఈ మాట వివిధ నామవాచకాల్లో క్రియా రూపాల్లో ఈ లేఖలో 31 సార్లు వాడాడు (గ్రీకులో). ఇక్కడ “అతిశయం” అని తర్జుమా చేసిన గ్రీకు పదం రోమ్ 5:2-3లో “ఉత్సాహం”గా కనిపిస్తున్నది. ఈ అతిశయం దేవునిలో ఒక పవిత్రమైన ఆనందం లాంటిది. పాపులు, అవిశ్వాసులైన మనుషులు డంబాలు కొట్టుకోవడం వంటిది కాదిది. వారేమో తమ బలం గురించి, తెలివితేటలు, సామర్థ్యం గురించి గొప్పలు చెప్పుకుంటారు. పౌలు అయితే దేవుణ్ణి గురించి, దేవుడు తనలో, తనతో చేసినదాన్ని గురించి గొప్పగా చెప్పుకున్నాడు. తనలో మంచిది ఏది ఉన్నా అది దేవునినుంచేననీ, దేవుని కృపవల్లే వచ్చిందనీ అతనికి బాగా తెలుసు – రోమీయులకు 7:18; 1 కోరింథీయులకు 1:29, 1 కోరింథీయులకు 1:31.