Galatians - గలతీయులకు 3 | View All

1. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువవేయబడినవాడైనట్టుగా యేసు క్రీస్తు మీ కన్నులయెదుట ప్రదర్శింపబడెనుగదా!

క్రీస్తు కారణం లేకుండా చనిపోయాడనుకోవడం బుద్ధిహీనత. అయితే కపట బోధకులు ఈ క్రైస్తవులను సరిగ్గా అలాంటి తెలివితక్కువ అభిప్రాయంలోకి నడిపించజూశారు. క్రీస్తు కారణం లేకుండా చనిపోయాడని వారెన్నడూ చెప్పి ఉండేవారు కాదు గానీ క్రీస్తు మరణంతో బాటు ధర్మశాస్త్రాన్ని పాటించడం కూడా అవసరమేనని బోధించడంలో వారు ఆయన మరణం అనవసరమన్నట్టు చెప్తున్నారు. పౌలు వారికి శుభవార్త ప్రకటించినప్పుడు వారికి కళ్ళకు కట్టినట్టుగా చెప్పిన సత్యానికి కూడా అది పూర్తిగా వ్యతిరేకం.

2. ఇది మాత్రమే మీవలన తెలిసికొనగోరుచున్నాను; ధర్మశాస్త్ర సంబంధ క్రియలవలన ఆత్మను పొందితిరా లేక విశ్వాస ముతో వినుటవలన పొందితిరా?

తాను సత్యం ప్రకటించాడన్న దానికి రుజువుగా వారి అనుభవాన్ని కూడా వారు పరిశీలించాలని చెప్తున్నాడు పౌలు. అతడు ప్రకటించిన శుభవార్తను నమ్మినప్పుడు వారు దేవుని ఆత్మను పొందారు (గలతియులకు 4:6; ఎఫెసీయులకు 1:13; అపో. కార్యములు 10:44; రోమీయులకు 8:15 పోల్చి చూడండి). దేవుడు తన ఆత్మను వారిలో నివసించేందుకు అనుగ్రహించాడు. దేనివల్లా? వారు ధర్మశాస్త్రాన్ని పాటించే ప్రయత్నాలు చేస్తున్నందువల్ల కాదు, వారు క్రీస్తును నమ్మినందువల్లే. ఎవరూ ఇంతవరకు మతాచారాలను, విధులను, నియమాలను పాటించడం ద్వారా దేవుని ఆత్మను ఎన్నడూ పొందలేదు. అందరిలోనూ స్వభావ సిద్ధంగా దేవుని ఆత్మ ఉండదని గమనించండి. ఎవరైనా క్రీస్తులో నమ్మకం మూలంగానే ఆ ఆత్మను పొందాలి. యోహాను 14:17 చూడండి.

3. మీరింత అవివేకులైతిరా? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి, యిప్పుడు శరీ రానుసారముగా పరిపూర్ణులగుదురా?

వారు నమ్మినప్పుడు దేవుడు తన కృపవల్ల ఏమి చేశాడో దాన్ని అనుభవించారు. ఇప్పుడు స్వప్రయత్నం, ధర్మశాస్త్ర నియమాలు, ఆచారాలు తమను ముందుకు తీసుకువెళ్ళగలవు అనుకోవడం తెలివితక్కువతనం కాదా? మనం అలా అనుకోవడం కూడా అంతే కదా.

4. వ్యర్థముగానేయిన్ని కష్టములు అనుభవించితిరా? అది నిజముగా వ్యర్థ మగునా?

వారి గురించి అతడు సందేహపడుతున్నాడు. కపట బోధకుల ప్రయత్నాలు ఫలిస్తాయా? అక్కడి క్రైస్తవులు భిన్నమైన శుభవార్తను అంగీకరిస్తారా? ఒకవేళ వారి బాధలు వారికి సంపాదించి పెట్టిన ప్రతిఫలాన్ని వారు జారవిడుచుకుంటారా? వారి ప్రవర్తన అతనిలో సందేహాలు రేకెత్తించింది (గలతియులకు 4:11, గలతియులకు 4:20).

5. ఆత్మను మీకు అనుగ్రహించి, మీలో అద్భుత ములు చేయించువాడు ధర్మశాస్త్రసంబంధ క్రియలవలననా లేక విశ్వాసముతో వినుటవలననా చేయించుచున్నాడు?

వ 2లోని ప్రశ్ననే వేరే మాటల్లో తిరిగి వేస్తున్నాడు పౌలు. వారు కాస్త ఆలోచించి వారిలో సత్యం గురించి ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించి వారు విన్న అబద్ధ ఉపదేశాన్ని ఎదిరించాలని కోరుతున్నాడు.

6. అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా యెంచ బడెను.
ఆదికాండము 15:6

“అబ్రాహాము”– దేవుడు మనుషులను ధర్మశాస్త్ర క్రియలతో నిమిత్తం లేకుండా నమ్మకం మూలంగానే నిర్దోషులుగా తీరుస్తాడని లేఖనాల్లోనుంచి రుజువు చూపించడమే ఇక్కడ పౌలు ఉద్దేశం. “నిర్దోషత్వం”– ఆదికాండము 15:6; రోమీయులకు 4:3.

7. కాబట్టి విశ్వాససంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలిసికొనుడి.

రోమీయులకు 4:11-12, రోమీయులకు 4:16-17. “సంతానం” అంటే ఇక్కడ ఆధ్యాత్మిక సంతానం అని అర్థం.

8. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖ నము ముందుగా చూచినీయందు అన్యజనులందరును ఆశీర్వదింపబడుదురు అని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను.
ఆదికాండము 12:3, ఆదికాండము 18:18

9. కాబట్టి విశ్వాససంబంధులే విశ్వాసముగల అబ్రాహాముతో కూడ ఆశీర్వదింపబడుదురు.

మత నియమాలు, ఆచారాలు పాటించడం ద్వారా, దేవుడిచ్చాడని వారు భావించే శాసనాలకు లోబడి జీవించడానికి ప్రయత్నించడం ద్వారా దేవుని దీవెనలు సంపాదించుకోవచ్చునని అంతటా మనుషులు అనుకుంటారు. మోషే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా దేవుని దీవెనలు సంపాదించుకోవచ్చునని యూదుల గట్టి నమ్మకం. అవి నమ్మకం ద్వారానే గాని స్వప్రయత్నాల మూలంగా రావని పౌలు చెప్తున్నాడు. దీవెనలు, ధన్యత గురించి నోట్స్ ఆదికాండము 12:1-3; సంఖ్యాకాండము 6:23-27; ద్వితీయోపదేశకాండము 28:3-14; కీర్తనల గ్రంథము 1:1; కీర్తనల గ్రంథము 119:1; మత్తయి 5:3-12; అపో. కార్యములు 3:26; ఎఫెసీయులకు 1:3.

10. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు. ఎందుకనగాధర్మశాస్త్రగ్రంథమందు వ్రాయబడిన విధులన్నియుచేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.
ద్వితీయోపదేశకాండము 27:26

ద్వితీయోపదేశకాండము 27:26. దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ప్రయత్నించడం ద్వారా మనుషులు ఆశించిన దీవెనలు వారికి దొరకవు. అందుకు బదులు దేవుని శిక్షావిధి వారిపైకి వస్తుంది. ఇదెలా సాధ్యం? ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతిదాన్నీ పూర్తిగా, లోపం లేకుండా, ప్రతి క్షణమూ పాటించాలని ధర్మశాస్త్రం శాసిస్తున్నది. కానీ ఈ విధమైన విధేయత ఏ మనిషికీ సాధ్యం కాదు. నిర్గమకాండము 19:5-6, నిర్గమకాండము 19:8, నిర్గమకాండము 19:21-25 నోట్స్ చూడండి. ఫిలిప్పీయులకు 3:6 లో పౌలు “ధర్మశాస్త్రంలో ఉన్న నీతిన్యాయాల విషయంలో” తనపై ఎలాంటి నిందా లేదని చెప్పాడు. అయితే ధర్మశాస్త్రాన్ని మీరినవారిపై అది పంపించే శాపానికి అతడు కూడా లోనయ్యాడు. ఎందుకంటే అందులోని పదో ఆజ్ఞను పౌలు ఆచరించలేకపోయాడు (రోమీయులకు 7:7-14). దేవుని ధర్మశాస్త్రంలోని ఏ ఆజ్ఞనైనా ఎవరైనా మీరితే ఆ వ్యక్తి ధర్మశాస్త్రమంతటి విషయంలోనూ దోషి అవుతాడు (యాకోబు 2:10-11). అందువల్ల దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ప్రయత్నించడం ద్వారా దేవునితో సఖ్యపడదామని చూచిన ప్రతి వ్యక్తి మీదికీ తీర్పు, శిక్షావిధి వచ్చింది.

11. ధర్మశాస్త్రముచేత ఎవడును దేవునియెదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును.
హబక్కూకు 2:4

హబక్కూకు 2:4 క్రొత్త ఒడంబడిక గ్రంథంలో ఎత్తిరాసిన మూడు సందర్భాల్లో ఇదొకటి (రోమీయులకు 1:17; హెబ్రీయులకు 10:38). ఒక మనిషికి దేవునితో సరైన సంబంధం కలగాలంటే ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించాలన్న ప్రయత్నాల వల్ల అది సాధ్యం కాదు. నమ్మకం వల్లనే అది సాధ్యం.

12. ధర్మ శాస్త్రము విశ్వాససంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటివలననే జీవించును.
లేవీయకాండము 18:5

లేవీయకాండము 18:5. ధర్మశాస్త్రం, నమ్మకం రెండూ పూర్తిగా వేరువేరు సిద్ధాంతాలు, నియమాలు. నమ్మకం దేవునిపై ఆధారపడి ఉచితమైన ఈవిగా పాపవిముక్తి, శాశ్వత జీవాన్ని స్వీకరిస్తుంది. ధర్మశాస్త్రం చట్టాల ప్రకారం చేసేవాడే బ్రతుకుతాడని ధర్మశాస్త్రం చెప్తున్నది, గాని ఊరకే అందుకు ప్రయత్నించేవాడు గానీ ఆ ప్రకారం చేస్తున్నానని చెప్పేవాడు గానీ కాదు. ఏ ఒక్కరూ కూడా లోపం లేని విధంగా, ఎడతెరిపి లేకుండా వాటిని చేయరు కాబట్టి ధర్మశాస్త్రం మరణాన్ని, శిక్షను మాత్రమే తెస్తుంది (వ 10; రోమీయులకు 3:19-20).

13. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసమువలన మనకు లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసుద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రముయొక్క శాపమునుండి విమో చించెను;
ద్వితీయోపదేశకాండము 21:23

పాపులైన మనుషుల కోసం యేసుప్రభువు ఏమి చెయ్యడానికి సిద్ధమయ్యాడో చూడండి. మన స్థానం తాను తీసుకున్నాడు, మనం ఆజ్ఞను మీరినందువల్ల వచ్చిన శాపాన్ని తనపై వేసుకున్నాడు. ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనం చేసిన నేరాలకు ఆయన శిక్ష అనుభవించాడు. రోమీయులకు 5:6-8; 2 కోరింథీయులకు 5:21; 1 పేతురు 3:18 పోల్చి చూడండి. కీర్తనల గ్రంథము 78:35; మత్తయి 20:28 దగ్గర విమోచన గురించి నోట్స్ చూడండి. “మ్రాను”– ద్వితీయోపదేశకాండము 21:22-23. ఇస్రాయేల్ అధిపతులు మరణ శిక్షకు గురైన నేరస్థులను చెట్టుమ్రానుకు వేలాడదీసేవారు. వారి నేరాన్నీ, అవమానాన్నీ బహిరంగంగా ప్రదర్శించడమే దీని ఉద్దేశం. ఆ విధంగా మనం చేసిన నేరాలకు యేసు మరణించాడు. మన శిక్షను, అవమానాన్ని భరిస్తూ సిలువకు వ్రేలాడాడు (అపో. కార్యములు 5:30; అపో. కార్యములు 10:39; అపో. కార్యములు 13:29; 1 పేతురు 2:24 లో సిలువను మ్రాను అనడం చూడండి). అక్కడ వ్రేలాడవలసినది మనం.

14. ఇందునుగూర్చిమ్రానుమీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.

తన బాధల్లో ఆయన మన దీవెనల గురించి ఆలోచించాడు. ఆయనకు తాను శిక్షనుంచీ సిలువ మరణం నుంచీ తప్పించుకోవాలన్న కోరిక కంటే మనకు మేలు జరగాలన్న కోరికే ఎక్కువ తీవ్రంగా ఉండేది. ఇప్పుడు క్రీస్తులో విశ్వాసులంతా ధర్మశాస్త్రం శాపం నుంచి విముక్తులయ్యారు (రోమీయులకు 8:1). దేవుడు అబ్రాహాము ద్వారా వాగ్దానం చేసిన దీవెనలకు వారసులయ్యారు (వ 8,9). “ఆత్మను గురించిన వాగ్దానం”– లూకా 24:49; యోహాను 14:16-17; అపో. కార్యములు 1:4-5; అపో. కార్యములు 2:39. ఇక్కడి ఉపదేశాన్ని జాగ్రత్తగా గమనించండి. దేవుడిచ్చే ఈ దీవెనలు రావడం దేవుని ఆత్మను పొందినవారికే. దేవుని ఆత్మను మనం నమ్మకం ద్వారా పొందుతాము (వ 2,5; లూకా 11:13; ఎఫెసీయులకు 1:13). ఇదంతా వేరెవరివల్లా, దేనివల్లా కాదు, “క్రీస్తు యేసు” వల్లే జరిగేది.

15. సహోదరులారా, మనుష్యరీతిగా మాటలాడు చున్నాను; మనుష్యుడుచేసిన ఒడంబడికయైనను స్థిరపడిన తరువాత ఎవడును దాని కొట్టివేయడు, దానితో మరేమియు కలుపడు.

సాధారణంగా మనుషుల మధ్య ఒప్పందాలు ఇలా జరుగుతుంటాయి. ఒప్పందం జరిగిపోయిన తరువాత సంభవించేవి ఆ ఒప్పందాన్ని ఏమీ మార్చలేవు. అబ్రాహాముతో దేవుడు చేసిన ఒప్పందం విషయంలో కూడా ఇలానే ఉందని ఇక్కడ పౌలు ఉద్దేశం. ఒప్పందం జరిగాక కొన్ని శతాబ్దాల తరువాత వచ్చిన ధర్మశాస్త్రానికి దానిపై ఎలాంటి ప్రభావమూ లేదు.

16. అబ్రాహామునకును అతని సంతానము నకును వాగ్దానములు చేయబడెను; ఆయన అనేకులను గూర్చి అన్నట్టునీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టేనీ సంతానమునకును అనెను; ఆ
ఆదికాండము 12:7, ఆదికాండము 13:15, ఆదికాండము 17:7, ఆదికాండము 22:18, ఆదికాండము 24:7

ఆదికాండము 12:7; ఆదికాండము 13:15; ఆదికాండము 24:7. దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానాలకు క్రీస్తు వారసుడని పౌలు భావం. ఆయన అబ్రాహాము సంతానం (మత్తయి 1:1). క్రీస్తులో విశ్వాసులు క్రీస్తుతో జతగా ఉన్నారు, క్రీస్తుతో కూడా వారసులు కాబట్టే అబ్రాహాముకు వారసులు (వ 14,29; రోమీయులకు 4:13; రోమీయులకు 8:17).

17. నేను చెప్పునదేమనగానాలుగువందల ముప్పది సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము, వాగ్దానమును నిరర్థకము చేయునంతగా పూర్వమందు దేవునిచేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు.
నిర్గమకాండము 12:40

18. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రమూలముగా కలిగినయెడల ఇక వాగ్దానమూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రాహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహిం చెను.

నమ్మకం, ధర్మశాస్త్రం అనేవి భిన్నమైన సిద్ధాంతాలైనట్టే (వ 12), ధర్మశాస్త్రం, దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానాలూ కూడా వేరు వేరు. అబ్రాహాము ద్వారా మనుషులందరినీ దీవిస్తానని దేవుడు చేసిన వాగ్దానానికి ధర్మశాస్త్రంతో ఎలాంటి నిమిత్తమూ లేదు. దేవుడొక వాగ్దానాన్ని ఇచ్చాడంటే మనుషులు దాన్ని కేవలం నమ్మి సంతోషించాలి గానీ తాము ఆచారాలూ నియమాలూ పాటించడం ద్వారా దేవుణ్ణి ఆ వాగ్దానం నెరవేర్చేలా చేయడానికి ప్రయత్నించకూడదు. “వారసత్వం”– రోమీయులకు 4:13-14; 1 కోరింథీయులకు 3:22; మత్తయి 5:5; హెబ్రీయులకు 11:8-10; 1 పేతురు 1:4. క్రీస్తువిశ్వాసులకు భూమి ఆకాశం కూడా వారసత్వంగా ఉంటాయి. క్రీస్తుకు లభించే దానంతట్లోనూ వారికి భాగం ఉంటుంది. అన్నీ క్రీస్తుకే లభిస్తాయి (హెబ్రీయులకు 1:2).

19. ఆలాగైతే ధర్మశాస్త్ర మెందుకు? ఎవనికి ఆ వాగ్దా నము చేయబడెనో ఆ సంతానము వచ్చువరకు అది అతి క్రమములనుబట్టి దానికి తరువాత ఇయ్యబడెను; అది మధ్యవర్తిచేత దేవదూతల ద్వారా నియమింపబడెను.

ధర్మశాస్త్రం కింద ఉన్నవారికి అది శాపాన్ని తెచ్చింది. మనుషుల్ని దీవించాలనుకునే దేవుడు మరి ధర్మశాస్త్రాన్ని ఎందుకిచ్చాడు? రోమీయులకు 3:20; రోమీయులకు 4:15; రోమీయులకు 5:20; రోమీయులకు 7:7 చూడండి. పాపాన్ని బయట పెట్టేందుకూ, దాని తీరునూ దాని శక్తినీ వెల్లడి చేసేందుకూ దేవుడు ధర్మశాస్త్రాన్ని వాడుకున్నాడు. ఈ పద్ధతి ద్వారా మనుషులకు యేసు క్రీస్తు అవసరాన్ని వారికి తెలిసేలా చేస్తున్నాడు. క్రీస్తు మనకు అవసరమని గుర్తించడం, ఆయన్ను స్వీకరించడం అన్ని దీవెనల్లోకీ అత్యంత శ్రేష్ఠమైనది. “వచ్చేంత వరకే”– దేవుడు పాత ఒడంబడిక ధర్మశాస్త్రం ఏలుబడికి ఒక సమయాన్ని నియమించాడు. “సంతానం” (క్రీస్తు) వచ్చి మనుషులకు పాపవిముక్తిని సిద్ధం చేసేవరకే ధర్మశాస్త్రం ఏలేది. “దేవదూతలు”– హెబ్రీయులకు 2:2; అపో. కార్యములు 7:38, అపో. కార్యములు 7:53. ఎవరి ద్వారా ధర్మశాస్త్రం వచ్చిందో ఆ మధ్యవర్తి మోషే.

20. మధ్యవర్తి యొకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే.

దీనికి రాగల ఒక అభ్యంతరాన్ని పౌలు విశదపరుస్తున్నాడు – దేవుడొక్కడే గదా. అయితే అబ్రాహాముకు తన వాగ్దానం ఇచ్చి దానికి విరుద్ధమైన ధర్మశాస్త్రాన్ని తరువాత ఎందుకిచ్చాడు? ఇది అపార్థం అంటున్నాడు పౌలు. దీవెనలిస్తానన్న దేవుని వాగ్దానానికీ ధర్మశాస్త్రం వ్యతిరేకం కాదు. కానీ మనుషులు ధర్మశాస్త్రంపై ఆధారపడినంత కాలం దేవుని వాగ్దానాల నెరవేర్పు అసాధ్యం. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవం ఇవ్వడానికీ మనుషులను నిర్దోషులుగా తీర్చడానికీ ధర్మశాస్త్రానికి చేతగాదు (రోమీయులకు 7:14; రోమీయులకు 8:3 చూడండి).

21. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపచేయ శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడి యున్నయెడల వాస్తవముగా నీతిధర్మశాస్త్రమూలముగానే కలుగును గాని

22. యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించువారికి అనుగ్రహింపబడునట్లు, లేఖనము అందరిని పాపములో బంధించెను.

రోమీయులకు 3:19-24 పోల్చి చూడండి. ధర్మశాస్త్రం మనుషులపై నేరం మోపి, వారు స్వయంగా కోరుకున్న చెరసాలలో బంధించడం మాత్రమే చెయ్యగలదు. ఆ చెరసాల పాపమే. క్రీస్తు వచ్చి పాపవిముక్తిని సిద్ధం చేసి నమ్మకమనే మార్గాన్ని నేర్పించకముందు ధర్మశాస్త్రం చెరసాల అధికారి వంటిది. క్రీస్తుకు వేరుగా ఎంత ఉత్తములైనప్పటికీ ఈ జైల్లో ఉన్నవారే. దేవుని దృష్టిలో తన ఆజ్ఞలను మీరినవారు నేరస్థులే. శిక్షకోసం ఉంచబడ్డవారే. వారికి యేసు క్రీస్తు లేకుండా ఆధ్యాత్మిక స్వతంత్రత, విడుదల ఏమాత్రం కలగవు. ఎవరూ సొంత ప్రయత్నం వల్ల, సత్‌క్రియల వల్ల, ధర్మశాస్త్రాన్నీ మత నియమాలనూ ఆచారాలనూ పాటించడం వల్ల, వారు చేయగలిగిన మరి దేని వల్ల కూడా ఈ చెరసాల నుంచి తప్పించుకోలేరు. పాపవిముక్తి, విడుదల, ఆధ్యాత్మిక స్వతంత్రత, దేవుని శాశ్వత దీవెనలు దేవుడు నియమించిన మార్గం ద్వారా మాత్రమే కలుగుతాయి – అది క్రీస్తులో నమ్మకముంచడమనే మార్గం (వ 9,14,26; రోమీయులకు 1:16-17; రోమీయులకు 3:22, రోమీయులకు 3:28; యోహాను 3:16, యోహాను 3:36; యోహాను 5:24; ఎఫెసీయులకు 2:8-9).

23. విశ్వాసము వెల్లడికాకమునుపు, ఇక ముందుకు బయలు పరచబడబోవు విశ్వాసమవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతివిు.

24. కాబట్టి మనము విశ్వాసమూలమున నీతి మంతులమని తీర్చబడునట్లు క్రీస్తు నొద్దకు మనలను నడి పించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను.

ధర్మశాస్త్రం మనుషులకు పాపవిముక్తిని కలిగించడం అసాధ్యం గాని క్రీస్తుద్వారా కలిగే పాపవిముక్తి మార్గం వెల్లడయ్యేంత వరకూ వారిని క్రమశిక్షణలో ఉంచేందుకు దేవుడు దాన్ని వాడుకున్నాడు.

25. అయితే విశ్వాసము వెల్లడియాయెను గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము.

తనలో నమ్మకం ఉంచడమనే మార్గాన్ని క్రీస్తు తెలియజేసినప్పటినుంచి, పాపవిముక్తి కోసం మనుషులు ఆయనలో నమ్మకం పెట్టుకున్న తరువాత మోషే ధర్మశాస్త్రానికి వారిపై ఏ అధికారమూ లేదు (రోమీయులకు 6:14).

26. యేసుక్రీస్తునందు మీరందరు విశ్వాసమువలన దేవుని కుమారులై యున్నారు.

స్వభావసిద్ధంగా మనుషులు దేవుని సంతానం కాదు. అందరికీ సృష్టికర్త దేవుడే అయినప్పటికీ ఆయన మనుషులందరి ఆధ్యాత్మికమైన తండ్రి కాడు (యోహాను 8:44 పోల్చి చూడండి). క్రీస్తులో నమ్మకం ఉంచడం ద్వారా మాత్రమే మనుషులు దేవుని సంతానం కాగలుగుతారు – యోహాను 1:12-13.

27. క్రీస్తు లోనికి బాప్తిస్మముపొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు.

“క్రీస్తులోకి బాప్తిసం”– రోమీయులకు 6:3 నోట్స్ చూడండి. మనల్ని దేవుని పిల్లలుగా చేసేది నమ్మకమే (వ 26), నీటి బాప్తిసం కాదు. ఆత్మ సంబంధమైన లోపలి మార్పుకు నీటి బాప్తిసం ఒక బయటి చిహ్నం మాత్రమే. “క్రీస్తును ధరించుకొన్నారు”– అంటే విశ్వాసులు క్రీస్తులో దేవుని ఎదుట నిలుస్తున్నారు, ఆయన నీతిన్యాయాలను ధరించుకున్నారు. క్రీస్తు స్వయంగా దేవునికి ఎంత అంగీకారమో వారూ అంతే.

28. ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.

“ఒక్కటి”– 1 కోరింథీయులకు 12:13; యోహాను 17:20-23; కొలొస్సయులకు 3:11. క్రీస్తులో మనుషుల మధ్య దేవుడు ఎలాంటి తేడా చూపడు. వారి చరిత్ర, పుట్టుపూర్వోత్తరాలు, సాంఘిక హోదా, కులం మొదలైన వాటికి ఆయన దృష్టిలో ఎలాంటి విలువా లేదు. మనుషుల దృష్టిలో నిరుపేదలు, అతి హీనులు అయిన క్రీస్తువిశ్వాసులను దేవుడు అందరిలాగానే స్వీకరిస్తాడు. ఆయనకు గొప్ప విశ్వాసులు ఎంత అంగీకారమో వారూ అంత అంగీకారమే.

29. మీరు క్రీస్తు సంబంధులైతే3 ఆ పక్షమందు అబ్రాహాముయొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు.

వ 7,14,18.Shortcut Links
గలతియులకు - Galatians : 1 | 2 | 3 | 4 | 5 | 6 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |